13, మే 2016, శుక్రవారం

మన ఘన పాప భరిత చరిత



చింపిరి జుట్టుకు చీకుగుడ్డను జుట్టి
కనుగుంట్ల ప్రాణాలు మినుకు చుండ
కడుపు డొక్కంటుక కనలుచుండ , నడుము
చుట్టూత ముదుక కచ్చుడము దోపి
మొల మ్రోకు కొక ప్రక్క  ముంత వ్రేలాడంగ
చీపు రింకొక ప్రక్క జీరలాడ
భూస్వామి చెప్పులు భుజముపై వ్రేలాడ
దిసకాళ్ళు తోళ్ళూడ దిగిచి నడువ

కుల వివక్ష కస్పృశ్యతా విలయ తాండ
వంపు రోగములకు బలిపశువులగుచు ,
మనిషులుగ నాడు తమను తా మరచి బ్రతుకు
బడుగులే సాక్షిగా పాప  భరిత చరిత .

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

నవ వసంతోదయము .....



ఎండలకు తెల్గు నేలంత మండుచుండె ,
నీళ్ళు దొరకక పల్లె కన్నీళ్ళు బెట్టె ,
ప్రాణి కోటికి బ్రతుకు దుర్భరము గాగ ,
నవ వసంతోదయమును వర్ణణలు జేయ ,

ప్రకృతి యాహ్లాదకత కనుపట్టె వీర్కి ,
గండు కోయిల కూతలు , ఘన మయూర
నాట్య హేలలు దప్ప జనాల బ్రతుకు
దుర్భరతలు కన్పట్టవు దుర్ముఖులకు .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
కవులకు కనులెదుట కాన రాదు ,
ఆకసమ్ము కెగిరి అందాల మబ్బుల
ఊహ లందు మనుదు రుర్వి వీడి .

చూతు రంట కవులు  సూరీడు కననట్టి
చోటు కూడ జ్ఞాన సూర్యు లగుట ,
ఎట్ట యెదుట గల్గు ఘట్టాలు కష్టాలు
కనరు కళ్లు లేని ఘనులు వీరు .

సాంప్రదాయమ్ము వీడరీ సచ్చరితులు  
పండితులు తలలూచుటే పనిగ వ్రాయు
దారులను వీడి ప్రజల చైతన్య పరచు
మార్గ మెంచుకొను టెపుడొ? మారుటెపుడొ ?

  





7, ఏప్రిల్ 2016, గురువారం

పంచాంగ శ్రవణం



ముందుగా  సుముఖి   నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .
                     *************
సంవత్సరాధిపతి శని .
ఫలితం , అనుకూల వర్షాలుండవట . పంటలు పండవట .
జనాలు రోగ , చోర , అగ్ని , క్షామ భయాలతో కష్టాలు పడతారట .
ఇదేమి పంచాంగ శ్రవణం ?
ఎత్తుకుంటూనే మొత్తుకోళ్ళు .
సూర్య కుటుంబంలో శని గ్రహం ఆరోది . భూమికి  నూటయిరవై కోట్ల              
కి.మీ అత్యంత సుదూర కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహం .
చుట్టూ తెల్లటి మంచు వలయాలతో సౌరకుటుంబంలోనే అందమైన గ్రహం.
ఈ శనిగ్రహానికి సంవత్సరాధిపత్యం అంటగట్టి ,
భూమిపై ప్రతికూల పరిస్థితులకు భాద్యత వహింపజేయడం
సమంజసమేనా ?
అందమైన శనిగ్రహానికి నలుపు పులిమి జనాలలో విపరీత ప్రభావాలకు
కారణంగా భ్రమింపజేసి , పాప పంకిలమంటగట్టడం భావ్యమేనా ?
                  **************
రాజ్యాధిపతి శుక్రుడు .
ఫలితం , విస్తారంగా వర్షాలూ , సమృధ్ధిగా పంటలూ .
పైన చెప్పబడిన ఫలితానికిది అవరోధం .
శుక్రగ్రహం సౌరకుటుంబంలో రెండో గ్రహం .
భూమికి  నాలుగు కోట్ల కి.మీ దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది .
ఇది 400 డిగ్రీల సెంటిగ్రేడ్  పైగా అత్యంత వేడిమి గల గ్రహం .                                                       భూమికంటే పరిమాణంలో చిన్నది .
శుక్ర గ్రహానికి రాజ్యాధిపత్యం వల్లనే మనభూమ్మీద వర్షాలు కురిస్తే ,
పంటలు సమృధ్ధిగా పండితే , ప్రతియేడూ ఈ గ్రహానికే రాజ్యాధి పత్య
మిచ్చేద్దాం . పోయేదేముంది . ఈ లెక్కలన్నీ ఊహాజనితాలే కదా .
                 ****************
ఇక , బుధుడు మంత్రి స్థానంలో నియమితుడయ్యాడు .
ఫలితం , భూమిమీద సుఖ శాంతులు నెలకొల్పుతాడు . మంచిదే కదా .
బుధగ్రహం సౌరకుటుంబంలో సూర్యగోళానికి అత్యంత సమీపంలో ఉంది .
సౌరకుటుంబంలోనే అతి చిన్నగ్రహం . మొదటి గ్రహం .
భూమికి తొమ్మిది కోట్ల కి. మీ దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది .
నిరంతర సౌరవీచికల కారణంగా విస్ఫోటనాలతో అల్లకల్లోలంగా ఉంటుంది .
దీని ప్రభావం భూమ్మీద పడితే సుఖ , శాంతులెలా ప్రాప్తిస్తాయో మరి .
                    ****************
సేనాధిపతికుజుడు                                                                                                               ఫలితం ఫ్రపంచమంతా యుధ్ధాలతో తన్నుకు చస్తారట . కుజగ్రహమంటేనే                                             జనాలు జడుసుకునేట్లు భావజాలాన్ని
వృధ్ధి చేశారు . కుజ దోష నివారణార్థం ఎన్నెన్ని కర్మకాండలో . మరి
భూమి మొత్తానికి దోషనివారణకేమి చేస్తారో . కర్మ క్రతువులకు పూను
కోండి మరి . బిజినెస్ బాగా జరుగుతుంది .
కుజగ్రహం సౌరకుటుంబంలో నాలుగో గ్రహం . భూమికి ఎనిమిది కోట్ల కి.మీ
దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూఉంది . ఇది భూమిని పోలిన గ్రహం .
దీనిపై రెండు కోట్ల సంవత్సరాల పూర్వం జీవం మనుగడ సాగించినట్లు శాస్త్ర
జ్ఞులు భావిస్తున్నారు . మనం భవిష్యత్తులో నివసించడానికి అవకాశం ఉండే
గ్రహం సౌరకుటుంబములో ఇదొక్కటే . సమీప భవిష్యత్తులో మనకు నీడ
నిచ్చే ఈ కుజ గ్రహాన్ని పాప పంకిలం చేసేశారు .
                   *****************
రసాధిపత్యం చంద్రుడికి దక్కింది .
ఫలితం...... పాలు , నెయ్యి , నూనె , తేనె సమృధ్ధి . చంద్ర గ్రహానికీ జనాల మనో
భావాలకూ లింకు పట్టేశారు . చంధ్రబలం , తారాబలమంటూ కథలల్లేశారు .
చంద్రుడు భూమికి ఉపగ్రహం . 
భూమికి ప్రదక్షిణం చేస్తూ , భూమినంటిపెట్టుకుని , భూమితో పాటుగా సూర్యుని చుట్టూ
పరిభ్రమిస్తూ ఉంది . ఈ ఉపగ్రహం మన సూర్యనక్షత్రానికే 15 కోట్ల కి.మీ దూరంలో
ఉంటే , ఇక, అనంత దూరాలలో ఉండే నక్షత్ర రాసులకు అధిపతి ఎట్లయ్యాడో ?
ఈ ఉపగ్రహం మన భూమి చుట్టూ 27రోజులకొక సారి ప్రదక్షిణం చేస్తూ , అంతే
వేగంతో తిరుగు తుండడంవల్ల మనకు ఎప్పుడూ ఒకేవైపు కన్పిస్తూ ఉంటుంది .
అనాదిగా భూమిమీది జనాలకు కాలగణణకు తోడ్పడుతూ ఉంది .
భూమి ప్రభావానికి లోనై భ్రమించే ఈ ఉపగ్రహానికి జ్యోతిష్యంలో ఎంత గొప్పదనం
కట్టబెట్టేశారో చెప్పనలవికాదు .   
                                **************************                                                                                   ఇంకా , చెబితే శానా ఉంది , ఈదుర్ముఖుల పంచాంగం .
                        
ఇరవ్వేడు నక్షత్రాలూ , పండ్రెండు రాశులూ , రాశి ఫలాలూ , రాశి చక్రాలూ , ఈ
గోలంతా ఊహాజనితం . విశ్వాంతరాళాన్ని అసంబధ్ధంగా విభజించి చేసిన మాయా గణితం .
విశ్వ విజ్ఞానం ఇంతగా వెల్లివిరియని రోజుల్లో , కొంతమంది జిజ్ఞాసువులు                                        తమకందుబాటులో,  ఉన్న పరిమిత పరికరాల సాయంతో, విశ్వంవైపు దృష్టి
సారించినారు . ఫలితంగా , విశ్వరహస్యాలు కొన్ని ఛేధించినారు . ఆధునిక
ఆవిష్కరణలకు వారు వేసిన బాటలే తొలి అడుగులు . ఆ మహానుభావులు
చిరస్మరణీయులు .
కానీ , ఆ జ్ఞానాన్ని  మేధావుల ముద్ర వేసుకున్న కొందరు స్వార్ధపరులు                                              ఇలాంటి అనృతాలకు వాడి , అసంబధ్ధాలు సృష్టించి ,
మనిషి జన్మకు ముడిపెట్టి , జాతకచక్రాలు కట్టి , జనాలను బ్రమలలో
ముంచి , ముందుగానే జరగబొయ్యేది తెలుసుకోచ్చనే ఆశ చూపి ,
దోష నివారణ కర్మ కాండలు సూచించి , ప్రేరేపించి  వ్యాపార మయం చేశారు .
ఇది దుర్మార్గం కాదా ? దీన్ని ప్రశ్నించవద్దా ?  మేధావులు జనాల్ని బ్రమల్లో
ముంచుతారా ?  జ్ఞానంవైపు నడిపిస్తారా ?