5, జూన్ 2012, మంగళవారం

సింహావలోకనం ..... వెంకట రాజారావు . లక్కాకుల


    ఈ సుదీర్ఘ జీవన యాన కాల గమనంలో 61 వసంతాలు పూర్తయినవి . ఈ రోజే అరవై రెండో పడి లోకి అడుగిడడం . అందుకే వెనక్కు తిరిగి సింహావలోకనం చేసు కోవడం .

     శైశవంలో , బాల్యంలో , యవ్వనంలో , నడి వయస్సులో ..... ఏర్పడిన సమస్యలూ – వాటిని అధిగమించడంలో జీవితం నేర్పిన పాఠాలూ – అనుభవాల తో జీవితం పండి పోయింది .  

      కుటుంబ జీవనం , లోటు పాట్లూ , భార్యా-బిడ్డలూ , వాళ్ళ బాధ్యతలూ – వ్యక్తిగత బాధ్యతగా తప్పని సరి .

      ఇక పోతే , ఆర్థిక యిబ్బందులకు తల యొగ్గి ఎంపిక చేసుకొన్నప్పటికీ , ఉపాధ్యాయ వృత్తి ద్వారా – లభించిన సామాజిక సేవా మార్గం లో - నేను పొందిన ఆనందం అనిర్వచనీయం .

       తొలి నుండీ చివరిదాకా – నాకు తోడు నిలిచి , నన్ను నడిపించిన – నాలోని నిబధ్ధత , సామాజిక దృక్పథం – వృత్తిలో సాధ్యమైనంతవరకు నన్ను సఫలీకృతుణ్ణి చేసినవి .

       గ్రామీణ నేపథ్యంలో సాగిన వృత్తి నిర్వహణ వల్ల – కేవలం పాఠశాల నిర్వహణ , బోధనలకే పరిమితం కాలేదు .

       ఒక నిర్దిష్ఠ కార్యక్రమాన్ని రూపొందించుకొని –

       పాఠశాల ముగిసిన తర్వాత మా ఉపాథ్యాయ సిబ్బందిని తోడు తీసుకొని , రోజుకొక ఆవాస ప్రాంతాన్ని సందర్శించడం , విద్యార్థుల – తల్లిదండ్రుల స్థితి గతులను విచారించడం చేసేవాడిని .

        తద్వారా విద్యార్థి పరిస్థితులు నాకే కాకుండా , మా ఉపాధ్యాయులకు కూడా అవగతమయ్యేవి . విద్యార్థి గైర్హాజరీకి గానీ , అధ్యయనంలో వెనక బాటు తనానికి గానీ  అసలు కారణం తెలిసి పొయ్యేది .

        విద్యార్థికి అవసరమైన సహాయ సహకారాన్నందించి  , సాధ్యమైనంత వరకు అసలు సమస్యను పరిష్కరించ గలిగే వాళ్ళము .

        గ్రామీణ విద్యా వ్యవస్థలో మరొక దురన్యాయం ఉంది . తల్లి దండ్రుల ఆదాయ వనరులు తక్కువ .

        కొడుకూ , కూతురూ – ఇద్దరూ స్థానిక ప్రభుత్వ విద్యాలయాలలో – 10 లేదా ఇంటర్ వరకూ విద్య పూర్తి చేస్తారు .

        పై చదువులకు కేవలం మగ పిల్ల వాడినే కొనసాగిస్తారు . అధ్యయనంలో ఎంత బాగా ముందున్నా – ఆడపిల్ల చదువు – కొనసాగించరు . ఆర్థిక ఇబ్బందులే బలమైన కారణ మైనప్పటికీ , సామాజిక కారణాలు కూడా లేక పోలేదు .

        ఈ అంశం నన్ను ఎక్కువగా బాధించేది . వాళ్ళ యిళ్ళకు వెళ్ళి సాధ్యమైనంతవరకు నచ్చచెప్పడం , పరిష్కారాన్ని సూచించడం , మార్గదర్శనం చేయడం , సహాయ సహకారాలందించడం చేసేవాడిని .

         ఈ విషయంలో ప్రభుత్వాలు అందించే తోడ్పాటు చాలడం లేదు . అందులో చిత్తశుధ్ధి కొరవడుతోంది .

         చదువులో ముందుండే గ్రామీణ విద్యార్థుల విషయంలో – అందునా ఆడ పిల్లల విద్య విషయంలో – ఇప్పుడు కూడా – సహాయ సహకారాలందిస్తూ , సరయిన మార్గ దర్శనం చేస్తూ – అందులో ఉండే ఆత్మ సంతృప్తిని అనుభ విస్తూ ఉండడం – ఆనందంగా ఉంది .   

15, మే 2012, మంగళవారం

విద్యాసదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత .....

                విద్యా సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత గణనీయమైన ప్రాధాన్యత సంత రించు కొని ఉంది . జాతీయాదాయం లో అధిక శాతం విద్యా సదుపాయాల కోసంఖర్చు చేసే ప్రభుత్వాలు విజ్ఞ త గల ప్రభుత్వాలు .
                విద్యా వనరులు ఎక్కువగా ఉన్న దేశాల లోని ప్రజలు ఎక్కువ శాతం
విద్యా వంతులౌ తారు . విద్యా వంతులున్న సమాజం లోని ప్రజలు తమ సమస్య లకు
తామే చక్కని పరిష్కారాలు చూసుకో గల్గుతారు . అలాంటి దేశాలు అభి వృధ్ధి
పధంలో దూసుకు పోతాయి . ఆ దేశాల లోని ప్రభుత్వాలకు అవినీతి , ఆశ్రిత పక్ష
పాతం , లంచగొండితనాల మీద పోరాడ వలసిన అవసరం ఉండదు . అక్కడ ఉగ్రవాదం ,
వేర్పాటువాదం , హత్యలు , దోపిడీలు, అంటురోగాల వ్యాప్తి – అనే సమస్య
లుండవు . ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి . వ్యవసాయ , పారిశ్రామిక
ఉత్పత్తులు పెరుగు తాయి. జాతీయాదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తుంది .
ఇదంతా విద్యవల్ల ఏర్పడే బహుళ ప్రయోజనం .
               మరి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తిస్తున్నాయి ?
. " విద్యాశాఖ పద్దు క్రింద ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం . ఖర్చు తప్ప
ఈశాఖ లో ఆదాయం కంపించడం లేదు " – అని గతంలో ఒక మంత్రి మహోదయులు
సెలవిచ్చారంటే మన ప్రభుత్వాలను నడిపే ప్రబుధ్ధులు ఎంతటి విద్యాసక్తి
గలవారో , వారిలోగల ప్రజాసేవాభావం ఏపాటిదో , ఎంత తల్లకిందులుగా
కార్యమగ్నమై ఉందో కీర్తించ వలసిందే .
               దేశ ప్రజలంతా విద్యా వంతులైతే డబ్బు తీసుకొని ఓటెయ్యరు
కదా ! సారా పొట్లాలనూ , బిర్యానీ పొట్లాలనూ దరి దాపుల్లోకి రానియ్యరు కదా !
. విద్యా వంతు లైన ప్రజల పై ప్రలోభాలు పనిచెయ్యవు . వారికేమి కావాలో చేయ
గల్గినప్రభుత్వాలనే నిక్కచ్చిగా ఎన్నుకొంటారు . రౌడీ రాజ కీయాలకూ , గూండా
ప్రభుత్వాలకూ చెల్లు చీటీ పడుతుంది మరి .
              నూటికినూరుశాతం విద్యా వంత మైన సమాజం ఏర్పడడానికి ప్రభుత్వ పరంగా
ఏమేమి చేయాలి ?
              కనీసం ఇంటర్ మీడియట్ స్థాయి వరకు ఒకే ఒక ప్రభుత్వ సెక్టార్ లోనే
విద్యాలయాలు నిర్వహింప బడాలి . విద్యాలయాలు రెసిడెన్షియల్ విధానంలో సకల
సదుపాయాలు కల్గిన " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులు " గా తీర్చి దిద్ద బడాలి .
              అంటే పిల్లవాడు నర్సరీ లో " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులో
"అడుగుపెడితే ఇక ఇంటితో , తల్లి దండ్రు ల తో సంబంధం లేకుండా – అక్కడే
పెరిగి పెద్దవాడై విద్యాబుధ్ధులతో ఇంటర్ పూర్తిచేసుకొని మంచి మూర్తిమత్వం
రూపుదిద్దుకొనిప్రయోజకుడైబయటిప్రపంచములోకిరావాలి.                                                                                                                                                                  దీనికోసం తల్లిదండ్రులనుండి ఒక్కరూపాయి కూడా వసూలుచేయరాదు . పేద ధనిక తేడాలుందరాదు .
               పెద్ద పంచాయితీ లైతే ఒకటి , చిన్న పంచాయితీలు రెండు మూడింటికి కలిపి
ఒకటి చొప్పున – జనాభా ప్రాతి పదికన – ఏర్పాటుచేయ వచ్చు .                                                 ఖర్చువిషయానికి వస్తే విద్యా శాఖలో ఒక్కో ఊళ్లో – మెయిన్ స్కూలు, హెచ్ సి, జి
సి, నాన్ ఫార్మల్, హైస్కూలు, ఆర్ బీ సీ, ఎయిడెడ్, ఇంకా ఇంకా అనేకానేక
దండుగ మారి దుకాణాలన్నీమూసేసి ఆనిధులను విని యోగించవచ్చు .
              సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ మొదలైన అవినీతిమయ హాస్టల్ల అవసరం ఉండదు .
ఇప్పుడు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాలయాల అవసరంలేదు ,
              విద్యా శాఖ నంతా ఒక కొలిక్కితెచ్చి ప్రభుత్వాలు పిల్లల నందర్నీ దత్తత
తీసుకొని ఇంటర్ వరకూ చదివించే బాధ్యత తీసుకొంటే – అటు తర్వాత ఏర్పడ బోయే
సమాజాన్ని ఊహించుకొంటే ఎంత ఆనందం కల్గుతుందో గదా !

14, మే 2012, సోమవారం

తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు !

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

10, మే 2012, గురువారం

ఏది సత్యం ? ఏదసత్యం ? (పాఠశాల కథలు)

ప్రియమైన విద్యార్థులారా !

సైన్సులో మీకు సూర్యుడు – శక్తి పాఠం ఉంది కదా ! మీ సైన్సు టీచరు సూర్య గోళాన్ని గురించి ఏమి చెబుతాడు ? వాయువుల తో మండే గోళమని కదా ! మరి తెలుగు పాఠాన్ని బోధిస్తూ మీ తెలుగు టీచర్ ఏమి చెబుతాడు? సూర్యనారాయణుడనీ , దేవుడనీ కదా !

అంటే మీ పాఠశాలలో ఒకే అంశానికి రెండు విరుధ్ధ భావనలు బోధించి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తున్నారన్నమాట ! ఇందులో ఏది నిజమో పరిశీలించండి . శాస్త్రీయంగా నిరూపింప బడేదే సత్యం . శాస్త్రీయంగా నిరూపించ లేనిది అసత్యమే కదా మరి ! పాఠశాలలో అసత్యాలు బోధించడం సముచితమేనా ?

సూర్యుడు కేవలం వాయువులతో నిండి నిరంతరం మండే వాయుగోళం . ఇది శాస్త్రీయంగా నిరూపించ బడింది. ఇది సత్యం . సూర్యున్ని భగవంతుడుగా చిత్రీకరించే కథలన్నీ అసత్యాలు .....

--- ఇలా అనర్గళంగా సాగిపోతూ ఉంది ఆనాటి పాఠశాల సమావేశంలో ఒక మేథావి ఉపన్యాసం .ఆ మేథావి ఆనాటి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన విశిష్ట ఉపన్యాసకులు . మీదు మిక్కిలి హేతువాది . సదరు ఉపన్యాసకులు మంచి స్ఫురద్రూపి . మంచి వాగ్ధాటితో ,చతురోక్తులతో విద్యార్థులను ఆకట్టుకొని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు .

ఇంతలో ఆపాఠశాల తెలుగు టీచర్ వేదిక మీదకు వచ్చి , తనకూ సదరు అంశం మీద మాటాడ్డానికి అవకాశం ఇవ్వవలసినదిగా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్మాష్టరు గారిని కోరినాడు .

ప్రధానోపాధ్యాయుని సంశయాన్ని గమనించిన హేతువాది తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ఆపి , తెలుగు టీచర్ను మాటాడ వలసినదిగా కోరినాడు . సమావేశ వేదిక కాస్తా చర్చావేదికగా మారింది .

వేదిక మీదకు వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల లో కొంత మందిని లేపి వారి తల్లి దండ్రుల పేర్లు చెప్పవలసినదిగా కోరినాడు . వారు చెప్పినారు. మీరు మీ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు? “ టీచరు ప్రశ్న

అమ్మా – అనీ , నానా – అనీ పిల్లల సమాధానం

పేర్లతో పిలవరా ? టీచరు

తప్పుకదండీ ! “ పిల్లలు

ప్రియమైన విద్యార్థులారా! తల్లిదండ్రుల మీదా , గురువుల మీదా , పెద్దల మీదా మనకుండే గౌరవం వల్ల మనం వాళ్లను పేర్లతో సంబోధించడం తప్పుగా భావిస్తున్నాము .

సూర్యుడు మండే గోళం మాత్రమే కాదు . సూర్యుడు భూమిమీది సర్వజీవ రాశికీ శక్తి ప్రదాత . సూర్యగోళం నుండి వెలువడే అనంతమైన శక్తి వల్లనే ఈ భూమిమీది సర్వ జీవ రాశీ మనుగడ సాగిస్తోంది . సూర్యకిరణాలు భూమికి చేరని నాడు భూమిపై జీవరాశి నశిస్తుంది . ఇది కూడా శాస్త్రీయ మైన అంశమే .

మన మనుగడ కు నిరంతరం శక్తిని ప్రసాదించే సూర్యుణ్ణి గౌరవించి , దైవంగా భావించి , ఆరాధించడం ఎంత మాత్రమూ తప్పు కాదు . మానవ జాతి మనుగడకు దోహద కారులైన ఏ అంశాలనైనా గౌరవించి దైవంగా భావించి, ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ –సంప్రదాయాల లో ఉన్న గొప్పదనం .భారతీయ సంస్కృతి మానవజాతి ఉన్నతికి ప్రతీక .

ఇలాగే నేల . నేలంటే మన్నేకదా ! నేలే మనకు ఆధారం . ఇందులోనే మనం ఆహారాన్ని పండించు కొంటున్నాం . అందరికీ అన్నం పెట్టే నేలను తల్లీ అనడం తప్పా? అనక పోవడం తప్పా ?

నీరు , గాలి . ప్రకృతి – ఇలా మన మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా గౌరవించాలి .

అందుకే సూర్యణ్ణి సూర్యభగవానుడనీ , నేలను నేలతల్లిగా , ప్రకృతిని ప్రకృతి మాతగా మనం గౌరవించడం –ఆరాధించడం నేర్చుకున్నాము . గౌరవించక పోవడం తప్పు . ఆరాధించక పోవడం నేరం . అనాదిగా మనకు సంక్రమించిన ఈ సంప్రదాయాన్ని వదులుకోవద్దు . అని ముగించినాడు . కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మారు మ్రోగింది . పాపం హేతువాది ఎటు వెళ్ళేడో మరి !


5, మే 2012, శనివారం

సౌఖ్యములు లేవు - దు:ఖముల జల్లె గాని .....

తనదు పరమాత్మ తత్త్వంబు తనర - ప్రేమ ,

సత్యము , సహనమ్ము , యెరుక , సాత్వికతలు

పుట్టుకకు తోడిచ్చి బంపె నీ పుడమి దనుక -

ఆ పరాత్పరు డెంత దయా మయుండు !



పుడమి పై బడు టాదిగా బుధ్ధి వొడమె

శత్రు లార్గురి స్నేహ పాశముల బడగ ,

కరిగె పరమాత్మ తత్త్వంబు , సురిగి పోయె

మనిషి దిగజారి , మనుగడ మారి పోయె !



సౌఖ్యములు లేవు - దు:ఖముల జల్లె గాని ,

దైవ తత్త్వంబు వీడిన తనబ్రతుకున -

మనిషి మనిషిని ద్వేషించ జనుట మొదలు

అన్ని యవ లక్షణాలున్ను ఆవహించె



"కోరికల మీద నత్యాశ కూడి మనుటె

దు:ఖ కారణంబ" ని చెప్పి , తొలగు విథము

మనకు నేర్పిరి , యైనను మాను టెట్లు ?

మనుజ తత్త్వంబు గొప్పగా మారు టెట్లు ?



తానె విఙ్ఞాన ఖని యంచు తనకు తానె

గొప్పలకు బోవు మనిషి కీ తిప్ప లేల ?

తిన్న దరుగక యెగిరి గంతేయ నేల ?

తడువ తడువకు చతికిల బడగ నేల ?



మనిషి మనుగడ వందేళ్ళ మాత్ర నిడివి

జరయు బాల్యంబు బోవ నికరము దేల్చ

అల్ప మాయుష్షు , దీనికే , నంత యహమ ?

మృతులు జీవించు నవని లో బ్రతుకు మనది



పుట్టి నది యాదిగా చని పోవు వరకు

తెలిసియే సమస్యల కొని తెచ్చు కొనును

సతము వాటి పరిష్కార గతుల యందె

బ్రతుకు పండించుకొని చావు పాల బడును




16, ఏప్రిల్ 2012, సోమవారం

“ ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు “


ఇల్లు తెగనమ్మి కూతురి పెళ్ళి జేసి

మురిసిపోదురు తలిదండ్రి , ముందు ముందు

భద్రతేలేని కూతురి భవిత గనరు ,

మధ్యతరగతి మన కుటుంబముల వారు



తనయ కార్థిక స్వావలంబన తదుపరి

మాత్రమే పెండ్లి ప్రస్థానమై యొనరిన

భద్రతలు గల్గు మహిళకు , భార్య మీద

మగని కధికార తీవ్రత మట్టు కొనును



ఆర్ధిక స్వావ లంబిత యైన యతివ

మగ డభద్రతా భావ మందు పడును

తాను వేషాలు వేసిన తగిన శాస్తి

జరుగు నను భయ మతనిలో పెరుగు చుండు



దిగువ , ఉన్నత తరగతి స్త్రీల లోని

స్వ స్వతంత్రతా భావ జాల మందు

గలుగు కిటుకిదే , యిచట మగనికి లేదు

మధ్యతరగతి మగనికిమల్లె యహము



తల్లి దండ్రికి కూతురి పెళ్ళి మీద

దృష్టి మారి , ఆమె భవిత తీరు మీద

దృష్ట పెట్టిన నాడు ఈ తీరు మారు

ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు


31, మార్చి 2012, శనివారం

తెలుగు బ్లాగర్లకు .....పండుగ శుభాకాంక్షలు


రామ జన్మ వలన భూమి పావనమయ్యె

భరత భూమి చరిత ప్రణుతి కెక్కె

రామ నామ జప విరాజిత వివశయై

భరత ఖండమెల్ల పరవశించె



పురుషు లందు పుణ్య పురుషుండు రాముడే

పరమ సాధ్వి సీత భార్య యన్న

తమ్ము డన్న ఘనుడు తా లక్ష్మణుడు కదా !

భాగ్య శాలి హనుమ బంటనంగ



రామ నామ మెచట రంజిల్లి మ్రోగునో

హనుమ యచట నిలిచి యాడు చుండు

హనుమ యుండు చోట నభయమ్ము కొండంత

పృథివి యచట కడు సుభిక్ష మగును



రాజ్య పాలనమున ప్రజా రంజకుడయి

ప్రజల పాలించె శ్రీ రామ రాజ్య మనగ

పుడమి నూరూర గుడి గట్టి పూజ లంద

రాము డొక్కడు దప్ప ఏరాజు గలడు ?



భారత జాతికి పండుగ

శ్రీరామ జయంతి నాడు , చెప్పెద మిగులన్

నోరార శుభాకాంక్షలు

కోరి తెలుగు బ్లాగరులకు కూరిమి తోడన్




30, మార్చి 2012, శుక్రవారం

చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును


స్వార్థమే రూపు దాల్చిన జనుల వల్ల

జాతి నిర్వీర్య మయ్యె - హింస , యవినీతి ,

దోపిడీ , మోస మేదియు పాప మనక

డబ్బు కోసమే బ్రతుకు బడాయి యయ్యె



ఇట్టి దయనీయ స్థితిని దాటించు దారి

మనకు చదువొక్కటే – కాని , మంచి లేని

స్వార్థమును నేర్పు నేటి యీ చదువు కాదు

విలువ లను నేర్పు చదువులు వెలయ వలయు



స్కూలు వ్యాపార సంస్థయై సోలు చుండ

సత్ప్రవర్తన నేర్పని చదువు లుండ

విలువ లెరుగని టీచర్లు విధుల నుండ

భావి పౌరుల బ్రతుకులు బాగు పడున ?



సత్య ధర్మాది యున్నత సద్గుణముల

విలువలను నేర్పు పాఠ్యాంశముల చదువులు ,

ధర్మ నిష్ఠత గల్గు విద్యాలయములు ,

మంచి టీచర్లు గల్గిన మార్పు వచ్చు



చదువు పూర్తయి విద్యార్థి - సత్య ధర్మ

వర్తనా మూర్తి మత్వ సంవాసియై , త

నంత విధులలో సౌశీల్యవంతుడై , స

మాజ హితుడై సతత సమ్మాన్యు డగును



చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును

చదువు సాంఘిక న్యాయాన్ని చక్కజేయు

చదువె సమ సమాజ సంస్థాప శక్తి

చదువె సంస్కరణ దిశా విజయ పథమ్ము




22, మార్చి 2012, గురువారం

తెలుగుబ్లాగుల తోటలో.....బ్లాగరు పూమొల్క లార !


పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన

రచయితలు క్రొత్తవారు   తారస పడంగ

జూచితిమి గాని నేడహో !   చూడచక్క

నైన   రచయిత లెందరో గాన నయ్యె



తెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి

వ్రాయు  బ్లాగరు పూమొల్క లార !  మీ ర

చనల సౌగంధి కాలతో తెనుగు దోట

నేడదిగొ !  గుభాళించి పన్నీరు చిలికె 



ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,

కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి

వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,

బ్లాగు భారతి తెలుగున పరవశించె



ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు

తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి

యొకట స్పందించు భావుకత గలదు

రచయితల కుండ దగ్గ వీ లక్షణములె



ఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి

కోరి గొంతెత్తి పాడు చున్నారు ,  చేరి

అందరికి శుభాకాంక్ష లంద జేతు

నందనోగాది   కానంద మంద గోరి  






18, మార్చి 2012, ఆదివారం

దిన దినాభి వృధ్ధి గను .....


తల్లి దండ్రి మనోల్లాస తన్మయత్వ

తాత్వికత నుండి జన్మించి ధరణి బడిన

మనిషి   తన ప్రమేయమె లేక , జనన మాది

తెచ్చుకొన్న లక్షణముల  దిరుగు చుండు



తర తరాల నాటివి , తల్లి-దండ్రి ద్వార

రూపు , లలవాట్లు , బుధ్ధులు , రోగములును

సర్వము క్రమాను గతముగా సంక్రమించి

మనుట విధిరాత , ప్రారబ్ధ మనిరి , యైన -



పెండ్లియై నీవు నీభార్య ప్రేమ మీర

బిడ్డలను గని  ఇవి   సంక్రమింప జేయ

న్యాయమా ?  సర్వ శుభ లక్షణాన్వితులుగ

పుట్టి జీవింప జేయగా బోలు గాని  



తర తరాల నుండి తరలి , దరికి జేరి

మిమ్ము బాధించు అట్టి దైన్యమ్ము మార్చి ,

మిమ్ములను మీరు తీర్చి , మీ బిడ్డ బ్రతుకు

దిద్దుకొనుట మీ చేతిలోదే , తలంప



మంచి యలవాట్లు , దైహిక – మానసికపు

సంతసము గూర్చు నారోగ్య సత్యములను ,

కోరికల మీద సంతృప్తి కూడి ,  కనిన

సంతు , శుభ లక్షణోపేత జనిత మగును



  రూపు , లలవాట్లు , బుధ్దులు , రోగములును

సర్వమును సంతతిని కూడి సంక్రమించు

ననెడు సత్యాన్ని మరువని జనుల జాతి

దిన దినాభివృధ్ధి గను ,  సందియము లేదు






7, మార్చి 2012, బుధవారం

కలడె ? శ్రీకృష్ణ దేవ రాయలను బోలు తెలుగు భాషాభిమాని

తమిళ కన్నడ దేశ ధరణీ తలమ్ముల
తెలుగును వెలయించి దీప్తి కెక్కె
దేశ భాషల యందు తెలుగు లెస్సని పల్కి
భాషాభి మాన ప్రాభవము జూపె
అష్ట దిగ్గజముల నౌదల నెక్కించి
తెలుగు కవితకు పందిరులు బెట్టె
మణిపూస నాముక్త మాల్యద రచియించి
దీటైన కవిరాజ తేజ మొదవె

కలడె శ్రీకృష్ణ దేవ రాయలను బోలు
తెలుగు భాషాభి మాని యీ తెలుగు నేల ?
తెలుగు నేలంగ మరల రా దిగుము భువికి
మంగళారతు లిడుదు తెలుంగు రాయ !