20, ఫిబ్రవరి 2014, గురువారం

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

పరగు విశ్వ మనంతము , భ్రమణ రూప

చలన చాలన సంవృత్త శక్తి మయము

అందుగల కోట్ల గ్రహ తారకాది చయము

కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు


                                                                                
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత

యైన బోధ పడుట లేదు , తాను శక్తి

మంతు డెట్లగు? విశ్వనియంత కన్న

నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు



భార్య బిడ్డలు తాను – ఈమాత్ర మైన

చిన్న సంసార బాధ్యతే చేత గాని

మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని

విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?



ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,

పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు

బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన

తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?




ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు

దాతనే మరచు కృతఘ్నతా విధాన

భావనలు గల్గు మానవా! పతన మవకు

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

13, ఫిబ్రవరి 2014, గురువారం

.... కేవలం కాముకులు .

సృష్టి స్థితి లయ కారకుడై

విశ్య మంతటను వ్యాపించి యున్న

జగన్నాధుడైన

ఆ పరమేశ్వరుడు  - విశ్వ ప్రేమికుడు .


పరమేశ్వర సృష్టి యైన

విశ్వాంతరాళంలో

కొంత భాగమైన మనభూమిపై

జీవించే సమస్త జీవరాశి

కాధార భూతుడైన

కర్మ సాక్షి

శ్రీ సూర్య నారాయణుడు -  జీవ ప్రేమికుడు .


భూమిపై విస్తరించిన

సమస్త జల తరు గిర్యాది వనరుల ద్వారా

జీవాన్ని పొదివి పట్టుకొని కాపాడు

ప్రకృతి మాత  - పృధివీ ప్రేమికురాలు .


ఆయాయి కాలాలలో అవతరించి

పుడమి జనుల నుద్బోధించి

మానవ జాతికి మార్గ నిర్దేశం చేసి

సజీవంగా మానవ జాతి హృన్మందిరాలలో

కొలువున్న ప్రవక్తలు  - మానవ ప్రేమికులు .


సృష్టి ధర్మాచరిత

సహ జీవన మాధుర్యం నుండి

బిడ్డలను కని , పెంచి ,

అవ్యాజానురాగాన్ని పంచే

తలి దండ్రులు  - సంతాన ప్రేమికులు .


మానవులను

పశుత్వం నుండి వేరు చేసి

విజ్ఞానాన్నందించే

ఉపాథ్యాయ గురువులు - శిష్య ప్రేమికులు .


మానవ జాతి సుఖజీవనం కోరి

జీవిత మంతా

ప్రయోగ శాలల కంకితమై

క్రొత్త క్రొత్త ఆవిష్కరణల నందించే

సైంటిస్టులు  - మానవ మనుగడ ప్రేమికులు .


శారీరక , మానసిక దయనీయ స్థితిలో

తమ వద్దకు వచ్చిన

రోగులకు

స్వాస్థ్యాన్నందించే

వైద్య నారాయణులు - మానవారోగ్య ప్రేమికులు .


అడుగడుగున మానవ హితమే

మహోన్నతాశయంగా

జీవన యానం సాగించే

సాహితీ మూర్తులు ,

కళాకారులు ,

కార్మికులు

నిరంతర - జన హిత ప్రేమికులు .


కానీ , -----

పరమేశ్వరుణ్ణి కూడా

అసంబధ్ధ కర్మ క్రతువుల లోకి లాగి

జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని

అజ్ఞానాన్ని బోధించే అంధ విశ్వాసులు –


పరమేశ్వర నిబధ్ధమై

నిర్దుష్టమై

నిర్దిష్ట గమనంలో సాగే

విశ్వాంతరాళ

జ్యోతిశ్చక్రానికి

వక్ర భాష్యాన్ని కట్టి

పరతత్త్వంలోనే

చెడు వెదికే కార్తాంతికులు  -


నిరంతరం జన జీవనంలో ఉన్నామని
జనాన్ని భ్రమింప జేస్తూ
ప్రజా సేవలో తరిస్తున్నామని భ్రమింపజేసుకుంటూ
స్వార్థం తప్ప
జనహిత మెరుగని

నీతిబాహ్యులైన

యావత్ రాజకీయ నేతలు  -


పడుచు ప్రాయపు

ప్రలోభాల నధిగమించు

బలిమి లేక

మోహావేశాలకు

బానిసలై

పెడత్రోవ పట్టి

బాధ్యతలను విస్మరించే

యువతీ యువకులు  -


వీళ్ళంతా , -----

ఎప్పటికీ

ప్రేమికులు కాలేరు .


కేవలం

కాముకులు .




31, జనవరి 2014, శుక్రవారం

ఆకాశం గగనం శూన్యం



ఆకాశం గగనం శూన్యం
అవనియే సర్వస్వం
ఐనా ,       
సున్నాగాడు'
అంతా తన గొప్పేనంటాడు  
మగాడు గనుక -
ఈ రత్నగర్భ సర్వస్వ
తానాడుది గనుక ఉపేక్షిస్తుంది -
కానీ ,
ఆ మొద్దబ్బాయికి
ఊపిరులూదిందీ ,
హృదయ స్పందన నేర్పిందీ ,
మూర్తిమత్వాన్ని సమకూర్చిందీ ,
చైతన్య పరచిందీ ,
ప్రేమించడం నేర్పిందీ ,
పరిపూర్ణతను ప్రసాదించిందీ ,
ముక్తి మార్గాన్ని చూపించిందీ ,
తుదకు -
మోక్షమిచ్చేదీ
ఈ అపురూప అనుగాగ దేవతే మరి !
 నీలిగే నింగి కోణంగీ !
అసలు సంగతిదీ -
అన్నీ సమకూర్చేక
అందలం ఎక్కడం అందగించదు
ఆకాశ తలం పైకెక్కిన ఆ కళ్ళను
కాస్త అవనికి దించు
అంతా అర్థమౌతుంది
ఈ నేల బాల తన సత్తా చూపిందంటే
నీ కస్తిత్వమే ఉండదు మరి !  

13, జనవరి 2014, సోమవారం

ఏది సంక్రాంతి ? పల్లెల నెచట కలదు ?



కదలి రావమ్మ! మకర సంక్రమణ లక్ష్మి! 
నేల తల్లి నోదార్చి కన్నీరు తుడువ
చూడ రావమ్మ పుట్టింటి వాడ వాడ
గోడు గోడున నేడ్చు మా గోడు వినగ 


ఎట్టు లెటులో పంట పండించి , నూర్చు
పట్టున - నురిమి వానలు వరద లగుచు
నోటికాడి కూడు నెగదన్ను కొని పోవ
నేది సంక్రాంతి ? పల్లెల నెచట కలదు ?

 
పల్లె వీడి ప్రజలు బ్రతుకు భారము మ్రోయ
పట్టణాల బాట పట్టిరి, మరి
పల్లె పట్లు వీడి బయలెల్లె సంక్రాంతి
వచ్చి చూడు నీదు వైభవమ్ము

 
పిలిచి పిలిచి పెట్టు పిండి వంటల యూసు
లేవి? యెటకు బోయె నీవి గుణము ?
ఆకసమ్ము నెక్కె నవనికి దిగి రావు 
ధరలు ,  తమకు లేని ధర్మ మేల ?

 
గంగి రెడ్లు లేవు , పొంగళ్ళ పస లేదు
చెంగట హరిదాసు చిందు లేదు
సాంప్ర దాయ కవుల జాడ్యమందున దప్ప
సంకు రాత్రి చిన్నె సడులు లేవు .

 
పిలుపు లేకనె పెద్దలు , పేరటాండ్రు
అదిగొ వచ్చిరి యవనికి ,  నిదిగొ! మీకు
ఆశ దీరదు, మీబిడ్డ లరువు లంది
కరవు దీర బెట్టంగలే  రరుగు డింక