నెత్తికి చేయి సేర్చి తరుణీ ! యిటు వానను దోగ నేటికో ?
చిత్తము వేదనన్ గుదిసి , చిత్తజు వేటుకు జిక్కి , సొక్కిన
ట్లిత్తరి గాన నయ్యెడిని , ఇంతటి చక్కదనాలు నీటిలో
గత్తర బిత్తరల్ దడిసి , గ్రక్కె సెగల్ , వగకాడె శత్రువా ?
నెత్తికి చేయి సేర్చి తరుణీ ! యిటు వానను దోగ నేటికో ?
చిత్తము వేదనన్ గుదిసి , చిత్తజు వేటుకు జిక్కి , సొక్కిన
ట్లిత్తరి గాన నయ్యెడిని , ఇంతటి చక్కదనాలు నీటిలో
గత్తర బిత్తరల్ దడిసి , గ్రక్కె సెగల్ , వగకాడె శత్రువా ?
తిరువాభరణములు దీసి పక్కనబెట్టి
ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి
పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి
లలితంపు రొమ్ము తల మొలజుట్టి
తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి
శిరసాది పచ్చ కప్పురము నలది
కన మల్లె పూవల్లె కన్నుల కింపైన
స్వామికి పునుగు జవ్వాది పట్టి
శుక్రవారాలు అలవేలు శోభనవతి
మగని కైసేసె , నెన్ని జన్మాల ఫలమొ !
దివ్యమంగళ వేంకట దేవదేవు
మోము వీక్షించు కొనరండు , పుణ్యఫలము 🙏
అంతరంగ మధురిమ
------------------
పుట్టితి గొప్పవంశమున , బూనితి జ్ఞానము , మంచిమార్గమున్
బట్టితి , నొజ్జనైతి , విలువల్ గల జీవనయాన మొందితిన్
గట్టిగ శిష్యకోటికి వికాస మొసంగితి నేర్చినంతలో
నెట్టి యవాంఛనీయ పను లేమియు జేసి యెరుంగ నెన్నడున్ .
చేసితి ధర్మకార్యములు , సేవలు పూనిక నున్నయంతలో
వ్రాసితి వెంకయార్యు నిజ వాస చరిత్రము గద్యమందునన్
వ్రాసితి సాయినాధు ననవద్య మహత్వము పద్యమందునన్
వ్రాసితి పద్యమందు విలువల్ గల వెంకయ స్వామి సూక్తులన్ .
కోరిన దైవకార్యముల గూడి వసించితి , నూరిలోని పో
లేరు మహేశ్వరిన్ , పరిమళించిన భక్తి ప్రపత్తులొప్పగా
నేరిచినంత వట్టు , యను నిత్యము గొల్చి , తదేక సేవలో
తీరుగ నిర్వదేండ్లు గడి దేరి తరించితి , నింత యేటికిన్
ఎన్నడొ యెన్బదేండ్ల తరి , నేర్పడ గట్టిన , చిన్న దేవళం
బెన్నగ గచ్చులూడి , దురపిల్లి , విభూతి నశించి , జీర్ణమై
చన్న యెడన్ , గలంగుచు విచారణ జేసి , మహోజ్జ్వలమ్ముగా
కన్నులు కాంతులీను గుడి గట్ట దలంచితి నెంతయున్ గడున్ .
ఎంతగ పూర్వ జన్మముల నెట్టివి పుణ్యఫలంబు లున్నవో ,
చింతన సేయుటే తడవు , చేరిరి పుణ్యులు , చేరె డబ్బు , యా
వంతయు క్లేశముల్ వొడమ , వద్భుతమే యిది , భూరి యాలయం
బెంతయు శోభలన్ మెరయ , నింద్ర నిభా భవనంబె యేర్పడెన్ .
ఇంత కన్న నే యదృష్టము కోరేది ?
జన్మసఫల మయ్యె , చాలు చాలు ,
పరగ నింత యిచ్చె పరమాత్మ కృష్ణుండు
వందనాలు నీకు పరమ పురుష !
బ్లాగు పెద్దలు , మిత్రులు , బహు విదురులు
ఘన శుభాకాంక్ష లందుకోండి , నవ వత్స
రాన , ఆంగ్లమా ? తెలుగుదా ? లోన సంశ
యాలు మాని , నేడె వసుధ యంత మొదలు .
పండుగ , ' గ్రెగేరియన్ కే
లండరు ' జనవరి ఒకటి , ఇలా వచ్చేసెన్ ,
నిండు ప్రపంచములో ని
ట్లుండగ , మనకొక ' యుగాది ' యు , కలదు , ఐనన్
ఆంగ్ల సంవత్సరాదిగా అనుచునె , దిన
దినము దీనినే గణనకు తీసు కొనుచు ,
మనది వేరను భావన మనుగడ విడి ,
తప్ప దిందున కొనసాగ , దారి లేదు .
ఆయు రారోగ్య భాగ్యాలు , నభ్యుదయము
అష్టవిథ సంపదలు , విజయాలు కలుగు
గావుత ! పరమాత్మ దయను ఘనులు ! మీకు
క్రొత్త సంవత్సరాన మా కూర్మి నతులు 🙏 .
భవ జలధి దాటు మార్గము , బహు సుబోధ
ముగ నుడివి , జగతిని విమోహ బంధ
ముక్త మొనరించె కృష్ణయ్య , పుణ్యభాగు ,
డా జగద్గురు గీతా జయంతి నేడు .
దేశమంటే
---------------
దేశమంటే మనుషులోయ్
అన్నాడు గురజాడ
ఆ మనుషులందున్న నికృష్టుల
చెప్పగా మరచెన్
పూర్వ మెపుడో పుణ్యపురుషులు
పుట్టినారట పూజనీయులు
నేడు పుట్టిరి నీతి బాహ్యులు
భూమి భారముగా
పుట్టి ప్రజాజీవిత మందు మనగా
పూని తహతహలాడు వారే
మంచి యన్నది మాయమైనది
రాజకీయములో
కోరి కూర్చుని తినుటె యెరిగిరి
కాయకష్టము సేయు వారలు
కరవు పుడమిని , వెగటు గల్గును
నేటి మనుషులలో
తేలికగ అనృతము లాడుటలె
మోసమును నమ్మి బతుకుటలే
ఎట్ల సంపాదించినది గా దెంత యన్నదె
మిన్నయందురు
దేశమంటే మట్టిగాదోయ్
దేశమంటే మనుషులోయ్
ఈ పనికిరాని మనుషులోయ్
ఇంత ఘన దరిద్రులోయ్
పద్మసంభవదేవి బాహుబంధమ్ముల
నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి ,
సత్యా వసంతుని సరస సల్లాపాల
ప్రణయ గాధల చెలువార తనిసి ,
రాధికా రమణి చేరంగ రాసక్రీడ
సలిపిన మధుర ప్రసంగము విని ,
బృందావన విహార ప్రియసమాగమ
వినుత రస పిపాస విథము దెలిసి ,
విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు ,
చేరి , వసుదేవ సుతుని , నోరార , పాడి ,
ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద
రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .
కృష్ణ పరబ్రహ్మ కెరగి ప్రార్థింతు , గాని ,
కనికరించ డదేమిటో కరివరదుడు !
కానివాడిన ? ఇంతగా కఠిన వైఖ
రి గొన , ఔనులే , నేనేమి ప్రియ సఖుడన ?
ఏ పాదములను సేవించ నిశ్చింతగా
జనుల జీవితములు సాగిపోవు
ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ
ర్మమ్ము నిల్ప నవతరణము దాల్చె
ఏ పాదముల స్పర్శ ఈ భరత యవనిన్
పరమ పావనగాగ విరియ జేసె
ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు
నిరతము మునులు ధ్యానించి గనిరి
అట్టి పరమాత్మ పాదము లందు , పూని
మనసు నిల్పితి నీ జన్మ మందు , నడుగొ !
గోపికా రాస కేళీ కలాప లలిత
సుందరాకారుడై కనువిందు గొలుపు .
ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని ,
పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ
గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల
ధూళి దూసరితమయి దులకిసపడ .
మేనమామ శత్రువయి యేమేమొ చేసె
తనను చంపించ , తలిరాకు తనమునందె
గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని ,
యేరికైనను నిట్టి రాయిడులు గలవె !
ఆల గాచెను , మన్నుల రాల విపిన
తలములన్ , యెండ లనక , వాన లన కకట !
అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల
నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి .
రాచపుటక బుట్టె , మధుర రస విరాజ
మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ
నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన ,
గొల్ల లిండుల గోరాడె , గోస బడియె .
రాధతో గూడి , యమునా తటీ , ధరాది
తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ
జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ?
తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను .
కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి
ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు ,
పూని గాంధారి శపియించె , మునిగె నీట
ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి .
ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె ,
తాను పరమాత్మ యయ్యును , ధరణి పూని
ధర్మమును నిల్ప అవతారధారి యైన
కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము !
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పండితోత్కర్షకు పట్టువడ డితండు
సదమల భక్తి పాశమున గాని ,
రాజ రాజోన్నత రాజసములకు గాదు
తులసీ దళానికి తూగు నితడు ,
భోగ లాలస భాగ్య పూజనములకు గాదు
పేదింటి పూవులు ప్రియ మితనికి ,
మహిత మహామంత్ర మాహాత్మ్యముల గాదు
తనను సమర్పించ తనియు నితడు ,
కృష్ణు డితడు , సనాతన విష్ణు డితడు ,
వాసుదేవుడితడు , భక్త వరదు డితడు ,
తనను నమ్మిన వారికి , త్రాత యితడు ,
నెమ్మి , యెదలోన కొలువయ్యె , నమ్మి కొలుతు .
చిన్నప్పటి కన్నయ్యను ,
కన్నప్పుడు యెంత ముద్దుగారేనో , హా !
పన్నుగ యౌవన శ్యాముడు ,
కన్నుల కపురూప , అందగాడనిపించెన్ .
ఎన్నంగా మధ్యవయసు
నున్నప్పుడు , రాజనీతినోమి , చతురుడై
యెన్నని పార్శ్యాలు , హరివి ,
సన్నుత పరమాత్మయే , విశాల జగతికిన్ .
క్రోధ ముపసంహరించి , పరోపకార
సంయమము బూని , ధరణిపై సకల ప్రాణి
మేలు దలచుము , కరుణతో , కాల పురుష !
నే డుగాదిని నిన్ను నే వేడు 🙏 కొందు .
పదపడి పసిడికి , మణులను
పొదిగిన విధమున , పదములు ,భువన మనోఙ్ఞా !
గదిసి , ప్రతి శ్లోక మొక , ని
గధిత మణి మనోఙ్ఞహార కధనంబు గదే !
ఏమా సంస్కృత పద బం
ధామృత రసధుని ? ముకుంద ! తర్జుమ సేయన్
ధీమంబగు భాష గనము
భూమిని సంస్కృతము దప్ప , పుణ్య గురువరా !
శ్రుతి పేయ , మధుర శబ్దము ,
లతి లలిత , శుభగ , మనోఙ్ఞమయి , సంగీతా
మృతము కురిపించె , వంశీ
జతయై , గీతా స్రవంతి , సంగీత ప్రియా !
వినునతడు , చెప్పు నతడును
ఘను లయితే గాని , గీత , కాదు గ్రహింపన్
విను మిద్దరు, తమ వలె , భా
షను , యుద్దండులుగ , కృష్ణ ! సాధించ వలెన్ .
కన్ను లానంద భాష్పముల్ గ్రమ్మె , నీదు
దివ్యమంగళ మూర్తి దేదీప్యమాన
మయి గనంగ , రామా ! కమల దళాక్ష !
జన్మ ధన్యత గాంచెను , జన జగతికి .
అదిగో ! అయోధ్య రాముడు ,
గదిసి మందిరములో , సుఖాసీనుడవన్
ముదితంబగు సమయము , స
మ్ముదితం సయ్యెన్ , నమోస్తు 🙏 మోహన రామా !
రాముని యవతారము , ఈ
భూమికి రక్షా కవచము , పూని వెలిసె , సం
క్షేమము లొసగగ , భారత
భూమి , నయోధ్యను , పున్నెపు ప్రోవై .
స్పందించుచు చెట్టుమధ్య భానుండుండెన్ ,
ఎందుకు మ్రోడయె భూజము ?!
ఎందున ఖర్మ సరిలేదొ , ఇటు తగులవడున్ .
ఐదేళ్ళప్పటి రాముని ,
మోదపు చిరునవ్వురూపు , మోహనమై , ఆ
పాద శిఖము , జనముల కా
మోదంబై నిలిచె , నెంత ముగ్ధత్వంబో !