16, ఏప్రిల్ 2012, సోమవారం

“ ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు “


ఇల్లు తెగనమ్మి కూతురి పెళ్ళి జేసి

మురిసిపోదురు తలిదండ్రి , ముందు ముందు

భద్రతేలేని కూతురి భవిత గనరు ,

మధ్యతరగతి మన కుటుంబముల వారు



తనయ కార్థిక స్వావలంబన తదుపరి

మాత్రమే పెండ్లి ప్రస్థానమై యొనరిన

భద్రతలు గల్గు మహిళకు , భార్య మీద

మగని కధికార తీవ్రత మట్టు కొనును



ఆర్ధిక స్వావ లంబిత యైన యతివ

మగ డభద్రతా భావ మందు పడును

తాను వేషాలు వేసిన తగిన శాస్తి

జరుగు నను భయ మతనిలో పెరుగు చుండు



దిగువ , ఉన్నత తరగతి స్త్రీల లోని

స్వ స్వతంత్రతా భావ జాల మందు

గలుగు కిటుకిదే , యిచట మగనికి లేదు

మధ్యతరగతి మగనికిమల్లె యహము



తల్లి దండ్రికి కూతురి పెళ్ళి మీద

దృష్టి మారి , ఆమె భవిత తీరు మీద

దృష్ట పెట్టిన నాడు ఈ తీరు మారు

ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు


31, మార్చి 2012, శనివారం

తెలుగు బ్లాగర్లకు .....పండుగ శుభాకాంక్షలు


రామ జన్మ వలన భూమి పావనమయ్యె

భరత భూమి చరిత ప్రణుతి కెక్కె

రామ నామ జప విరాజిత వివశయై

భరత ఖండమెల్ల పరవశించె



పురుషు లందు పుణ్య పురుషుండు రాముడే

పరమ సాధ్వి సీత భార్య యన్న

తమ్ము డన్న ఘనుడు తా లక్ష్మణుడు కదా !

భాగ్య శాలి హనుమ బంటనంగ



రామ నామ మెచట రంజిల్లి మ్రోగునో

హనుమ యచట నిలిచి యాడు చుండు

హనుమ యుండు చోట నభయమ్ము కొండంత

పృథివి యచట కడు సుభిక్ష మగును



రాజ్య పాలనమున ప్రజా రంజకుడయి

ప్రజల పాలించె శ్రీ రామ రాజ్య మనగ

పుడమి నూరూర గుడి గట్టి పూజ లంద

రాము డొక్కడు దప్ప ఏరాజు గలడు ?



భారత జాతికి పండుగ

శ్రీరామ జయంతి నాడు , చెప్పెద మిగులన్

నోరార శుభాకాంక్షలు

కోరి తెలుగు బ్లాగరులకు కూరిమి తోడన్




30, మార్చి 2012, శుక్రవారం

చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును


స్వార్థమే రూపు దాల్చిన జనుల వల్ల

జాతి నిర్వీర్య మయ్యె - హింస , యవినీతి ,

దోపిడీ , మోస మేదియు పాప మనక

డబ్బు కోసమే బ్రతుకు బడాయి యయ్యె



ఇట్టి దయనీయ స్థితిని దాటించు దారి

మనకు చదువొక్కటే – కాని , మంచి లేని

స్వార్థమును నేర్పు నేటి యీ చదువు కాదు

విలువ లను నేర్పు చదువులు వెలయ వలయు



స్కూలు వ్యాపార సంస్థయై సోలు చుండ

సత్ప్రవర్తన నేర్పని చదువు లుండ

విలువ లెరుగని టీచర్లు విధుల నుండ

భావి పౌరుల బ్రతుకులు బాగు పడున ?



సత్య ధర్మాది యున్నత సద్గుణముల

విలువలను నేర్పు పాఠ్యాంశముల చదువులు ,

ధర్మ నిష్ఠత గల్గు విద్యాలయములు ,

మంచి టీచర్లు గల్గిన మార్పు వచ్చు



చదువు పూర్తయి విద్యార్థి - సత్య ధర్మ

వర్తనా మూర్తి మత్వ సంవాసియై , త

నంత విధులలో సౌశీల్యవంతుడై , స

మాజ హితుడై సతత సమ్మాన్యు డగును



చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును

చదువు సాంఘిక న్యాయాన్ని చక్కజేయు

చదువె సమ సమాజ సంస్థాప శక్తి

చదువె సంస్కరణ దిశా విజయ పథమ్ము




22, మార్చి 2012, గురువారం

తెలుగుబ్లాగుల తోటలో.....బ్లాగరు పూమొల్క లార !


పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన

రచయితలు క్రొత్తవారు   తారస పడంగ

జూచితిమి గాని నేడహో !   చూడచక్క

నైన   రచయిత లెందరో గాన నయ్యె



తెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి

వ్రాయు  బ్లాగరు పూమొల్క లార !  మీ ర

చనల సౌగంధి కాలతో తెనుగు దోట

నేడదిగొ !  గుభాళించి పన్నీరు చిలికె 



ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,

కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి

వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,

బ్లాగు భారతి తెలుగున పరవశించె



ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు

తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి

యొకట స్పందించు భావుకత గలదు

రచయితల కుండ దగ్గ వీ లక్షణములె



ఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి

కోరి గొంతెత్తి పాడు చున్నారు ,  చేరి

అందరికి శుభాకాంక్ష లంద జేతు

నందనోగాది   కానంద మంద గోరి  






18, మార్చి 2012, ఆదివారం

దిన దినాభి వృధ్ధి గను .....


తల్లి దండ్రి మనోల్లాస తన్మయత్వ

తాత్వికత నుండి జన్మించి ధరణి బడిన

మనిషి   తన ప్రమేయమె లేక , జనన మాది

తెచ్చుకొన్న లక్షణముల  దిరుగు చుండు



తర తరాల నాటివి , తల్లి-దండ్రి ద్వార

రూపు , లలవాట్లు , బుధ్ధులు , రోగములును

సర్వము క్రమాను గతముగా సంక్రమించి

మనుట విధిరాత , ప్రారబ్ధ మనిరి , యైన -



పెండ్లియై నీవు నీభార్య ప్రేమ మీర

బిడ్డలను గని  ఇవి   సంక్రమింప జేయ

న్యాయమా ?  సర్వ శుభ లక్షణాన్వితులుగ

పుట్టి జీవింప జేయగా బోలు గాని  



తర తరాల నుండి తరలి , దరికి జేరి

మిమ్ము బాధించు అట్టి దైన్యమ్ము మార్చి ,

మిమ్ములను మీరు తీర్చి , మీ బిడ్డ బ్రతుకు

దిద్దుకొనుట మీ చేతిలోదే , తలంప



మంచి యలవాట్లు , దైహిక – మానసికపు

సంతసము గూర్చు నారోగ్య సత్యములను ,

కోరికల మీద సంతృప్తి కూడి ,  కనిన

సంతు , శుభ లక్షణోపేత జనిత మగును



  రూపు , లలవాట్లు , బుధ్దులు , రోగములును

సర్వమును సంతతిని కూడి సంక్రమించు

ననెడు సత్యాన్ని మరువని జనుల జాతి

దిన దినాభివృధ్ధి గను ,  సందియము లేదు






7, మార్చి 2012, బుధవారం

కలడె ? శ్రీకృష్ణ దేవ రాయలను బోలు తెలుగు భాషాభిమాని

తమిళ కన్నడ దేశ ధరణీ తలమ్ముల
తెలుగును వెలయించి దీప్తి కెక్కె
దేశ భాషల యందు తెలుగు లెస్సని పల్కి
భాషాభి మాన ప్రాభవము జూపె
అష్ట దిగ్గజముల నౌదల నెక్కించి
తెలుగు కవితకు పందిరులు బెట్టె
మణిపూస నాముక్త మాల్యద రచియించి
దీటైన కవిరాజ తేజ మొదవె

కలడె శ్రీకృష్ణ దేవ రాయలను బోలు
తెలుగు భాషాభి మాని యీ తెలుగు నేల ?
తెలుగు నేలంగ మరల రా దిగుము భువికి
మంగళారతు లిడుదు తెలుంగు రాయ !

30, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణలు


 పలికి చేసి చూచి కొలిచి యలరు

నోరార భజన , విధ్యను
సారముగా షోడశోపచారములన్ శ్రీ
ద్వారక మాయిన్ సాయిన్
కోరి పలికి చేసి చూచి కొలిచి యలరుదున్

శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్

రాకేందు వదన వీవన
శ్రీకృష్ణున కిచ్చె - సిరి ,కుచేలుడు నెమ్మిన్
వీక గనంగ బరాత్పరు
డేకముగా వీచె - చెలిమి యెంత మధురమో !

కారు కూతలు కూయ  సంస్కర్త యగును

1'నేత కవినీతి భ్రాత ,సన్నిహిత హితులు
కారుకూతలు '- కూయ సంస్కర్త యగున
టంచు భావించు ,వేది కేదైన గాని
చట్ట సభ నేని దిట్టంగ జంక డరయ
2.
ఘనులు నేతలు పేదల కడుపు గొట్టి
దేశ సంపద దోచి వీధెక్కి తీరి
కారు కూతలు కూయ , సంస్కర్త యగును
'
ఓటు 'వజ్రాయుధమ్మయి వ్రేటు వేసి

సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు

శుభకర' మృత సంజీవని '
ని భవు డొసంగి ,నిజ శుక్ర నిర్గతు జేయన్
నభమెక్కి ,మనకు శుభ మి
చ్చు ,భాసుర హితమ్ము గోరు శుక్రు డెపుడు తాన్

సమరమునే కోరినాడు శాంతిని బొందన్

సమరమె శాంతికి భూమిక
సమరమ్మే దుర్మతులను సమయింపగ శ్రీ
రమణుండు కురుక్షేత్రపు
సమరమునే కోరినాడు శాంతిని బొందన్

తునికి సాయ పడుము కనుము సుఖము

పేద గొప్ప యన్న భేద మెరుగదు నీ
చివరి దాక నిలిచి శ్రీలు గురియు
చెలిమి గొప్ప దనము తెలుసు కోరా స్నేహి
తునికి సాయ పడుము కనుము సుఖము








29, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణలు


దండనము కాదు కాదది  పండు వయ్యె
విధి పరీక్షకు నిలబడి విమలు డగుము
దండనము కాదు కాదది - పండు వయ్యె
డు భవిత ,తొలగు కష్టాలు, శుభము కలుగు
దేవ దేవుండు కరుణించి దిక్కు నిలుచు 
'అమవస నాటి రాత్రి యొక యంగన చూచెను చంద్ర కాంతులన్'
సుమశరు డేచ బ్రేయసి వసుంధర చేరెను మోహనాంగు నా
గమ పరి రక్షకున్ హరిని కౌస్తుభ రత్న శుభోజ్జ్వలాంగు సం
భ్రమ మతి మేన వెన్నెలల భ్రాంతులు నిండగ కాంక్షితాక్షులన్
'
అమవస నాటి రాత్రి యొక యంగన చూచెను చంద్ర కాంతులన్'
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
తనయుడే లోకముగ వాని తరుణి బిడ్డ
లను దరికి దీసి యింటిల్ల పనులు జేసి
తల్లి తనరారు - రుజను ,వార్ధక్య మందు
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?  
మద్యము సేవించు వాడు - మాన్యుడు జగతిన్
తధ్యము రోగస్థు డగును
మద్యము సేవించు వాడు - మాన్యుడు జగతిన్
మద్యమునకు దూరముగా
హృద్యముగా బ్రతుకు , ధన్యు డేయుగ మందున్  
గంగ మునిగి పోయె గంగ లోన
మంగళ కరమైన మాహేశ్వరుని శిర
స్సంగ పావన సుర గంగ భరత
భూమివరము తొలగిపోయె నఘము మును
గంగ మునిగి పోయె గంగ లోన
విష గుళిక యయ్యె గీతా వివేక రసము
కృష్ణ భక్తి జగతి నిండి , గీత విశ్వ
వ్యాప్త మై తనరార గా వచ్చె నీర్ష్య
అరయ కుత్సి తాలు దొలగ నౌష దీయ
విష గుళిక యయ్యె(యగును)గీతా వివేక రసము
భామిని పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్
కామాది షట్క విముఖత
లోమిన మునియయ్యు విధికి నోడి పతితుడై
తామసమున సురవేశ్యా
భామిని పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్




సమస్యాపూరణలు


ఏడడుగుల బంధమౌర ! యేటికి బంపెన్
పాడు బడె నేమికాలమొ !
కోడళ్ళును కొడుకు లేచ కుములుచు ముదిమిన్
తోడుగ ముసలిది నడువగ
నేడడుగుల బంధమౌర ! యేటికి బంపెన్
విజయశ్రీ కలిత గీత ! వేవేల నుతుల్
విజయోస్తు !భరత జననీ !
విజయ రహస్య యుత యోగ ! విజయోస్తు సదా !
విజయోపదేశ బహువిధ
విజయశ్రీ కలిత గీత ! వేవేల నుతుల్
గీత మార్చును మనుజుల గీత నెపుడు                                                                                         విధి లిఖిత మై ,యతీతమై కదలు నుదుటి
రాత మార్చంగ నెవ్వరి చేత గాదు
ఐన,తెలిసి యందలి యోగ మాచ రించ 
గీత మార్చును మనుజుల గీత నెపుడు
చల్లగ గాపాడు గీత సకల సుజనులన్
తల్లియు దండ్రియు వలె , దగ
నుల్లము రంజిల్ల బల్కు నొజ్జయు బలె , శ్రీ
యల్లా మాలిక్ వలె గడు
చల్లగ గాపాడు గీత సకల సుజనులన్
కవి గౌరవ మెల్ల  కావ్యగానము చెరచెన్
స్తవనీయ మిచటి భారత
కవి గౌరవ మెల్ల - కావ్యగానము చెరచెన్
రవి యస్తమయం బెరుగని
సువిశాల బ్రిటీషు తంత్ర శోభలు సురగన్
పదుగు రాడు మాట పాడి గాదు
తెలుగు నేల పైన తీరైన పల్లెల
పూల తోట లందు పూచి ,జనులు
పలుకు తెలుగు మాట పండితు లొల్లరు
పదుగు రాడు మాట పాడి గాదు