16, సెప్టెంబర్ 2015, బుధవారం

దైవం లేని దెక్కడ ?


 
మానవ జీవనావసరాలలో జ్ఞానానికి తొలి ప్రాధాన్యతనిచ్చి జ్ఞానాన్ని దైవంగా భావించడం జరిగింది .

అందుకు ప్రతీకగా సరస్వతీ _ బ్రహ్మల మూర్తులను రూపొందించుకొని అర్చించినారు .

పాడి పంటలు  మొదలైన సర్వ సంపదలనూ ఆరాధనా భావంతో కొలిచి అందుకు ప్రతీకగా  లక్ష్మీ _ విష్ణు

మూర్తులను రూపొందించుకొని అర్చిస్తున్నారు . సృష్టికి మూలమైన స్త్రీ పురుష తత్త్వపు పవిత్రతకు

ప్రతీకగా లింగ రూపంలో పార్వతీ పరమేశ్వర మూర్తులను రూపొందించుకొని అభిషేకిస్తున్నారు .  

మానవ మనుగడకు ఆధారభూతాలైన భూమినీ , నీటినీ , నిప్పునూ , గాలినీ గౌరవించి

వాటికి ప్రతీకలుగా దేవతా మూర్తులను రూపొందించి కొలుస్తున్నారు .

తలపెట్టిన కార్యంలో విజయం సిధ్ధించాలంటే అవసరమైనది బుధ్ధి కుశలత . బుధ్ధి కుశలత

ద్వారా విజయం సిధ్ధించడమనే భావనకు ప్రతీకగా గణేష్ మూర్తిని రూపొందించి ప్రార్థిస్తున్నారు .

నదులను పుణ్యతీర్థాలుగా , పర్వతాలను పుణ్యక్షేత్రాలుగా , అడవులను వనదేవతలుగా ,

ప్రకృతిని ప్రకృతి మాతగా  _  ఇలా విశ్లేషిస్తూ పోతే  ,  భారతీయ తాత్వికతలో చెట్టూ , పుట్టా ,

జంతువూ , పక్షీ   _  ప్రతిదీ మానవ మనుగడకు అవసరమై  తద్వారా  పూజార్హమై కొలవ బడుతున్నవి .

ఇలా , మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ  _  అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం

కావచ్చు . మరి , భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ  ?    

 

         ఐతే _ జ్ఞానం , సంపద , కార్య సిధ్ధి  మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం

బంధమైన అవగాహన , పట్టుదల , కృషి  మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి . కృషిని వదిలి , దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయ మాటల వల్ల , మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు .

మౌఢ్యాన్ని వీడిన  చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య , జ్ఞాన , ఆనంద పరవశులౌతారు .  

 

           ఇక , యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాల

లోని మానవ సమాజాలను చైతన్య పరచి , అండగా నిలిచి ఆరాధ్యులైనారు . కృతజ్ఞతగా ఆయా

మహాను భావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి , పూజించడం , వారి జయంతులను

పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం .

ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే , శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుధ్ధుడు , సాయి మహరాజ్  , క్రీస్తు , మహమ్మదు _

ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు .

             ఇంకా , ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుం

టున్నారు . మరి , భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ ?  దైవం లేనిదెక్కడ ?  మలిన మస్తిష్కాలలో తప్ప .  

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

మాతృపిండం దదామ్యహం


 

గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ

నొప్పిని ప్రియముగా నోర్చుకొనును

అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో

నొదుగంగ గుండెల కదుము కొనును

ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక

మురిపాన చన్నిచ్చి పరవశించు

బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ

బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

 

అలుపెరుంగక రాత్రింబవలు భరించి

బిడ్డలే లోకముగ జీవించు" అమ్మ " _

బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,

బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

 

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి

పూని చాకిరి చేయలేని నాడు

బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు

చేరి సహాయము కోరు నాడు

ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు

వైద్యావసరము కావలయునాడు

మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో

కలగుండు పడు కష్ట మొలుకు నాడు 

 

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి

కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత

గాక పోయిన బాధ్యతగా దలంచి

జాలి చూపించ గలర ?  కాస్తంత యైన 

 

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర

ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు

కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి  

ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?

 

 

 

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

...... వరలు గురులకు పాదాభి వందనములు


బ్రతుక లేనోడురా బడిపంతు లను మాట
నాటి యొజ్జదనపు గీటు రాయి
బ్రతుక నేర్చిన వాడు  బడిపంతు లను మాట
నేటి దుర్నీతికి నిలువుటద్ద
మపుడు పేదరికాన  మ్రగ్గు చుండియు గూడ
వృత్తి ధర్మము దప్ప వేరెరుగరు
మంచి జీతాలతో మించి జీవించుచున్
వేర్వేరు పనులందె వేడ్క యిపుడు
 
ఘన ముపాథ్యాయ వృత్తి  ,  ఆ గౌర వాని
కెవ్వ రర్హత పొంది దీపింతురో  
హానుభావులై  ,  వృత్తి ధర్మాను సరణి
వరలు   గురులకు  పాదాభి వందనములు .   
 

వచ్చు చున్నాడు కన్నుల భాగ్యమనగ

 

శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
చెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత హరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు
 
తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .
 

 
 
 
 
 
 
 
 
 
 
 



 

28, ఆగస్టు 2015, శుక్రవారం

తీరు మార్చు కున్న తెలుగు బ్లాగుల పూదోట


చిరు హాస్యముల జల్లు  సేద దీర్చెడు చోట

వికటాట్ట హాసాలు   వీను లదిరె

సంస్కార విలసిత  చర్చ లుండెడు చోట

రచ్చలు రావిళ్ళు వచ్చి చేరె

పులకించి  రచనల  ప్రోత్సహించెడు చోట

తిలకించు వారేరి ?   తీరు మారె

కుల గజ్జి , ప్రాంతీయ కొట్లాటతో నిండి

తెలుగు సౌహార్దాలు  నలిగి పోయె

 

వెరసి పిడికెడు గొంతుకల్  వెరపు దక్కి

తెలుగు బ్లాగుల పూదోట తెంచి పోసి

మించి  తాజెడ్డ కోతి ... సామెత  చరించ

నిన్న మొన్నటి సౌరులు  నేడు కనవు .   

16, ఆగస్టు 2015, ఆదివారం

చేయ దగినవి చేసిన చెరుపు దప్పు


బాధ్యతల్ నేర్పరు పలువురు పేరెంట్సు

అమెరికా ఉద్యోగ బ్రమలు దప్ప

సబ్జెక్టు రుబ్బించు  చదువు కార్ఖానాలు

విలువలు నేర్పవు కలలనైన

ఎటు చూచినా మద్యమేరులై పారించు

ప్రభుతకు ట్యాక్సులే పరమ ముదము

అందు బాటున గల వశ్లీల సైటులు

నెట్టులు నెట్టులు నెట్టు నిండ

 

తల్లి దండ్రులు , స్కూళ్ళు   బాధ్యత వహించి

నవ సమాజము , ప్రభుతలు యువత కొఱకు

చేయ దగినవి చేసిన చెరుపు దప్పు

రేపటి సమాజ ముత్తమ రూపు దాల్చు.  

10, ఆగస్టు 2015, సోమవారం

తస్మై శ్రీ గురవే నమః 2


అది 1971 జూలై 29 .

సమయం సాయంత్రం నాలుగ్గంటలు .

జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ గది .

కుర్చీలో తథేక ధ్యానంతో పనిలో నిమగ్నమైన

ఒక ప్రసన్న గంభీర మూర్తి .

గుమ్మంలో ఇరవైయ్యేళ్ళ నూనూగు మీసాల

కుర్రాడు , రాజారావు చేతిలో ఎప్పాయింట్ మెంట్

ఆర్డర్ తో

మే ఐ కమిన్ సార్

ప్రిన్స్పల్ సార్ తల కూడా పైకెత్తలేదు

కాస్తంత బిగ్గరగా మళ్ళీ మే ఐ కమిన్ సార్

ఈసారి సారు తల పైకెత్తేడు , ప్రశ్నార్థకంగా

నమస్తే సార్ , విష్ చేసి రాజారావు ఎప్పాయింట్ మెంట్

లెటరు టేబిల్ మీదుంచేడు

మాకూ వచ్చింది , ఏం చదువుకున్నావ్

చెప్పేడు రాజారావు

ఎక్కడ

చెప్పేడు

ఓహో , తమరు అక్కడి సరుకా

.......... మౌనం

సబ్జెక్టేమైనా వచ్చా

.......... మళ్ళీ మౌనం

ఒకటి , రెండు , మూడు .....సబ్జెక్టుకు సంబందించిన

ప్రశ్నలు , శర పరంపరలుగా

ధాటిగా రాజారావు సమాధానాలు

ప్రిన్స్ పాల్ గారిలోని చులకన భావం కొంత తగ్గినట్లని

పిస్తోంది . ముఖం కాస్తంత ప్రసన్నంగా మారింది .

కాస్త సరుకుందనీ , పనికొస్తాడనీ భావించి నట్లుంది

అదే , ఆనాటి పెద్దల గొప్ప గుణం .

చిటికెలో పాలూ , నీళ్ళూ వేరు చేసేస్తారు

          ----------------

కాలింగ్ బెల్ మోగింది , అటెండర్ వచ్చాడు

సీనియర్ అసిస్టెంట్ ని పిలవమని ఆర్డర్

సీనియర్ అసిస్టెంట్ హాజరు

ఎప్పాయింట్ మెంట్ ఆర్డరిచ్చి  , రాజారావును జాయిన్

చేస్కోవలసిందిగా ఉత్తర్వు  

సీనియర్ అసిస్టెంట్ రాజారావును ఆఫీస్ రూం లోకి తీసుకెళ్ళేడు

మీ ఒరిజినల్స్ ఇవ్వండి

సార్ , ఈనెలలోనే రిజల్ట్సొచ్చాయి , ఒరిజినల్స్ త్వరలోనే అందజేస్తాను

సీనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ రూంలోకెళ్లేడు , రాజారావు ఫాలో అయ్యాడు .

విషయం ప్రిన్సిపల్ కు విన్నవించ బడింది .

అలాగా , పర్లేదులే , జాయిన్ చేసుకోండి . యూనివర్సిటీకి

నేను రాసి తెప్పిస్తానులే .

సీనియర్ అసిస్టెంట్ మారు మాటాడకుండా జాయిన్ చేసుకున్నాడు

సదరు జూనియర్ కళాసాల అనుబంధ ఉన్నత పాఠశాలలో

రాజారావు ఉపాథ్యాయ వృత్తి మొదలయ్యింది .

             -------------

అప్పటి విద్యాలయాల మహోపాథ్యాయుల , ప్రథానోపాధ్యాయుల

వ్యక్తిత్వాలు మహోన్నతాలు . వారి నిర్వహణ సామర్థ్యం అద్భుతం .

వాళ్ళు రాగ ద్వేషాల కతీతులు . ఎవ్వరిలో ఏచిన్న సుగుణం కన్పించినా

మెచ్చుకుని ప్రోత్సహించే ఆ తత్త్వం ఇప్పటి వాళ్లలో మచ్చుకుకూడా కన్పించదు .

సమర్థతను గుర్తించడం , నిబధ్ధతకు పెద్ద పీట వెయ్యడం , తద్వారా

సంస్థను ముందుకు తీసుకెళ్లడం అప్పటి వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య .

ఇప్పుడు భజన పరులకు ప్రాధాన్యతనిస్తూ , సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు .

                   ---------------

రాజారావుకు మొదట్నుంచీ అలాంటి మహోన్నత మూర్తుల సాహచర్యం ,

మార్గదర్సనం లభించింది . ఉపాథ్యాయ వృత్తిలో నిబధ్ధత , సబ్జెక్ట్ లో ప్రావీణ్యత

అలవడ్డవి . ప్రధానోపాధ్యాయులుగా సక్సెస్ సాధించడానికి బాటలు పడ్డవి .

తస్మై శ్రీ గురవే నమః   

 

 

 

  

 

  

 

31, జులై 2015, శుక్రవారం

ఏకాదశ సూత్రాలు

శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము

సర్వ దు:ఖ హరము సర్వ శుభము

నీదు దర్శనమ్ము నిత్య కళ్యాణమ్ము

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


 తనర నెవరి కైన ద్వారకా మాయిని

జేరి నంత శాంతి చేరు వగును

అరయ నార్తు డైన నిరుపేద కైనను

శ్రీని వాస సాయి !శిరిడ రాజ !



పరమ పురుష ! నీవు భౌతిక దేహమ్ము

వీడి వర సమాధి కూడి ఉన్న

నాడు సైత మవని నప్రమత్తుండవే

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


నీదు భక్త జనుల నిత్య రక్షణ భార

మొనసి వర సమాధి ముఖమునుండె

మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !


శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన

పలికి మాటలాడు ప్రభుడ వీవు

శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


 నిన్నాశ్ర యించు వారిని

పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా

పన్నుడి వై రక్షించు ట

నెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !


 నీయందు దృష్టి నిలుపుచు

పాయక నినుకొలుచు నట్టి భక్త జనుల పై

శ్రీయుత నీకటాక్ష శ్రీ ల

మేయము గా బరపుచుందు మేలుర సాయీ !


సత్య మెరుగ లేక సంసార బంధాల

జిక్కి బాధలొందు జీవజనుల

బరువు మోయ నీవు ప్ర త్య క్ష మౌదువు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


ఎవరు గాని నిన్ను నెద నిండ భావించి

నీసహాయము కొర కాస పడిన

తక్షణాన నీవు తగ నాదు కొందువు

శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !


 శ్రీ భాగ్య నిధులు గూడుచు


నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ

యే భక్తుని గృహ మైనను

శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !



సర్వ కార్య ధర్మ నిర్వహణ లన్నియు

శ్రీసమాధినుండె జేతు ననుచు

మాట ఇచ్చి మమ్ము మన్నించినావురా

శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !