21, ఫిబ్రవరి 2017, మంగళవారం

నా ' తెలుగు ' వర్థిల్లాలి .

చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                                             ****************
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                                                   ****************
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                                                     ****************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .

11 కామెంట్‌లు:



  1. హౌ క్యూట్ టపా యిది గదా !
    పెక్యూ లియరు తెలుగోళ్ళు పెద్దచదువుల
    న్నైక్యూ లన్గాంచి తమ య
    నూక్య మగు తెలుగును మరిచి నోడిరి యిలనౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నిజమే. కొన్ని పదాలని తెలుగీకరించకుండా ఉండటమే మెరుగు. బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. అతి చాదస్తం కటికి దరిద్రం అని సామెత.
    నిత్యం వ్యవాహారికంలో ఉన్నమాటల్ని తెలుగు చేసి వికృతి చేయకండి బాబూ అంటే కోపాలొచ్చేస్తున్నాయి. మొన్ననొక చోట సోఫా కి అనువాదం కావాలంటే ఈ పదాలని ఇలాగే వాడుకుంటే బాగుంటుందంటే కోపాలొచ్చేసేయండి. అమ్మని అరటి పండుని మమ్మీ,బనానా అంటే బాగుంటుందా చెప్పండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది ఏభాషా పదమైనా వస్తువైనట్లైతే తెలుగులో విరివిగా వాడుతున్నప్పుడు మన పదజాలంలో కలిపేసి వాడుకోవడం
      ఎంతో సౌకర్యం . కానీ , తెనిగించి(తెనిగించరు . సంస్కృతీకరిస్తారు)
      క్రొత్త పదం సృష్టించామనుకునే దురద మన పండితుల కెక్కుడు లెండి .
      ధన్యవాదములు .

      తొలగించండి
  4. సామెత తప్పు చెప్పేనండీ! మన్నించండి. అతి సుకుమారం కటికి దరిద్రం

    రిప్లయితొలగించండి

  5. అరవం వాడు మొళి ( ఆ ழி అరవానికే సొంతం) అన్నాడు
    ఆంగ్లేయుడు మదర్ టంగ్ అన్నాడు)

    తెలుగు వాడు సంస్కృత పదమైన భాషను అరువు తెచ్చుకున్నాడు!

    భాషను తెలుగులో ఏమందురు ?



    భాషకు సరిపడు తెలుగు పదము లేదు
    యుత్సవము లేల యన్నరో యున్న తెలుపు
    డచ్చ తెనుగున భాషకు ఢంక బేర్చి
    జరుప తగు దినోత్సవముల చక్క గాను

    జిలేబి
    నారదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండితుల నడుగ వలసిన
      దండి వివర మొనసి నాకు తాటించుట యే
      లండీ ! తగునేమండీ !
      నిండు మనసు బెట్టి చూడు ! నిఝమో ? కాదో ?

      అరువు దెచ్చు కొనక నాడిన భాషేది ?
      వాడు కైన మాట వేడు కగును ,
      ' భాష 'తెనుగు జేసి భాదించ పని లేదు
      అమ్మఘారు ! తవరి కన్ని దెలుసు .

      తొలగించండి