29, జూన్ 2014, ఆదివారం

సాయి నాధ్ మహా రాజుకు జయము జయము



భక్తికి నిలయమై పరిఢవిల్లిన భూమి
జ్ఞానాగ్ని రగిలిన కర్మ భూమి
గురు బోధనామృత ఝరులు పారిన భూమి
తత్త్వ వేత్తల యరుదైన భూమి
పరమ హంసల దివ్య పాదముద్రల భూమి
పావన నదుల సంపదల భూమి
వివిధ సంస్కృతులతో వెల్గులీనెడు భూమి
భిన్న మతాల సంపన్న భూమి

అట్టి భారత భూమిపై పుట్టిన ఘను
లెందరో కలరు , వారిలో మంది కొఱకు
బ్రతికి మార్గ దర్శకుడైన పరమ గురుడు
సాయి నాధ్ మహా రాజుకు జయము జయము

ముక్కోటి దేవతల్  భూదేవతల చేత
బందియై చీకటి మందిరాల
వెల వెల బోవగా వెలసె సాయిగ సర్వ  
దేవతా సత్తాక దివ్య మూర్తి
ముక్కోటి దైవాల కొక్కటే రూపమై
అరుదైన దైవమై యవతరించె
సాయి కృష్ణా యన్న, సాయి రామా యన్న
సాయీశ్వరా యన్న కాయు ప్రభుడు

సాయి రారా యని పిలువ చేయి సాచి
అందుకొని అండగా నిల్చు నతడు గాక
ఇంక వేరెవ్వరయ్య ధ్యానించి కొలువ
సర్వమూ సాయి మయము విశ్వాసమున్న

తర తమ భేదాలు తారసిల్ల వచట
తరియింతు రతని పాదాలు తాకి
కుల మత భేదాల కుమ్ములాటలు లేవు
ప్రణుతింతు రతని హారతులు పాడి
ఆగమ శాస్త్రాల అడ్డు గోడలు లేవు
పరవసింతు రతని భక్తి యందు
ఆదరించుటె కాని  చీదరింపులు లేవు
అరుదేర నతని మందిరము లందు

అతడె శ్రీ సాయి ప్రభు డరుదైన గురువు
తాకి తలిచేటి దైవమ్ము దరికి గాక
తొలుగు దూరము దూర మంచలుగు వారి
పంచ చేరంగ వెఱ్ఱులా ప్రజలు నేడు .

17, జూన్ 2014, మంగళవారం

తెలుగు నేలకూ తెలుగు పద్యానికీ అనుబంధం



పద్యము లన్న నాంధ్రులకు ప్రాణము  ,  పద్యము తెల్గువారి  వై
విధ్య వచో విధాయక ప్రవృత్తి  , నిరక్షర కుక్షియైన  తా
పద్యము జెప్పిగాని తన పల్కు ముగించడు ,  తెల్గు నేలకున్
పద్యముకున్ గలట్టి యనుబంధము లిట్టివి , చూడ ముచ్చటౌ .

మూటలు గట్టి పద్యముల ప్రోవులు వోసిరి -  పల్లెటూళ్ళ 
తేటల తెల్గు మాటలను - తిక్కన పోతన వేమనాదు  లా
మాటలు నేటికిన్ గడు సమాదరణీయములై తెలుంగులో
పాటల యందు పద్యముల పట్టుల వాడుట జూడమే యిటన్ .

చదువుట తోనె భావములు చప్పున దోచగ – పద్యమాలికన్
బొదిగిన రామణీయకపు పొల్పులు దెల్పగ  తల్లి భాషకే
చదురులు గల్గు గాన  - సహజమ్మగు తెల్గు పదాల సొంపులన్
మదికి లయించి వ్రాయు గరిమల్ గల పద్యము లింపు గూర్చెడిన్ .

పద్యమందు , పల్లె పట్టులందు , అచటి
మనుజులందు , వారి మాటలందు ,
అందు తేనెలూరు ఆప్యాయతల తెల్గు
దనములందు తియ్యదనము కలదు .

పట్టణ వాసనలంటని
మట్టిన్ మన పలుకుబళ్ళు మనుచున్నవి – ఆ
పుట్టతెనుగు తేనె పలుకు
పట్టి పిడిచి పద్యమందు వాడగ వలయున్ .

15, జూన్ 2014, ఆదివారం

నేల ముక్కలైనా - జాతి యొక్కటే



తెలుగు రాజు లేలి  తెలగాణ మైనది
ఆంధ్ర రాజు లేలి  ఆంధ్ర యయ్యె
రాయ లేలు బడిని  రాయల సీమయ్యె
తల్లి భాష  తెలుగె  తర తరాల

తెలుగులు ప్రాదేశికముగ
తెలగాణా , ఆంధ్ర , సీమ దిశలందున్నన్
తెలుగొకటే భాష గనుక
కలకాలము కలిసి బ్రతుకగా వీలయ్యెన్

నిన్న నేడు గాదు – నేల యున్నంతకు
తెలుగుజాతి  యొకటె -  తిరుగు లేదు
రాజకీయ మెన్ని రంగులు మార్చినా
భాష చాలు మనల పట్టి యుంచ

తెలుగు జాతి మధ్య ద్వేషాగ్ని రగిలించి
గద్దె లెక్కి నారు , కాంక్ష దీరె
ఇంక ఇప్పుడైన ఇక్కడా అక్కడా
సఖ్య మొనరనిండు  జాతి మధ్య

దొరలు రెండు చోట్ల  కరవాలములు దూసి
మాట మాట పెరిగి మనుట కంటె
ఒద్దిక నిరు దెసల వృధ్ధి చేయగ బూని
అన్నిట సహకార మంద మేలు   

13, జూన్ 2014, శుక్రవారం

తెలుగు జాతి ప్రారబ్ధం ?



రెండయ్యె జాతి , రాష్ట్రాల్
రెండయ్యెను , ముఖ్య మంత్రు లిరువురు వచ్చెన్
మెండయ్యె రాజకీయపు
దండుగ పదవులు – ప్రజలకు దారేది యికన్

బంగారు తెలంగాణా
రంగుల కల జూపి రొకరు  రాత్రికి రాత్రే
చెంగట గల సీమాంధ్రను
హంగుగ స్వర్ణాంధ్ర జేతు నంచొక రనియెన్

ఎల్ ని నో – ను దెలిపి  యేడాది పొడుగునా
వాన మట్ట గించు వార్త లొచ్చె
ఉన్న తీరు లైన ఉండునో ఊడునో 
కరువు కాటకాల కాటు పడునొ

రాజకీయ మెన్ని రంగులు మారినా
రోజు కూలి దొరికి రోజు గడచి
రేయి పగలు పడిన రెక్కల కష్టము
వ్యర్ధమవక యున్న నదియె చాలు

బియ్యము యాభై దాటెను
సయ్యంటూ కంది పప్పు సౌ దాటి చనెన్
పొయ్యి పయికి పొయి కిందికి
చెయ్యొక్కటి దప్ప లేవు చెలియకు వండన్

తెలగాణులు ఆంధ్రోళ్లని
తెలుంగు వారని యరవలు తిట్టుట లరయన్
తెలుంగులో , ఆంధ్రోళ్ళో
తెలియక యేపీ జనమ్ము తిక మక పడియెన్