1, జులై 2015, బుధవారం

వైద్యో నారాయణో హరీ .....


          నేడు  డాక్టర్స్ డే . గురువునూ , వైద్యుణ్ణీ దైవంగా భావించే కర్మభూమి మనది . వైద్యో నారాయణో హరి :   అని కదా ఆర్యోక్తి . అందువల్ల డాక్టర్లందరికీ పాదాభి వందనాలు .
          పూర్వం విద్యా- వైద్యం రెండూ సామాజిక అత్యావశ్యకాలుగా గుర్తించి సంస్థలూ , దాతలూ , ప్రభువులూ ఉదారంగా అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందించేవారు . నేడు మన కర్మ కొద్దీ మనచేత ఎన్నుకొన్న మన ప్రజా ప్రభుత్వాలు మాత్రం విద్యనూ , వైద్యాన్నీ వ్యాపార వస్తువులుగా మార్చి ఖరీదయిన అవసరాలుగా చేశారు .
           ఇక అసలు విషయాని కొస్తే -----
నాకు చాలా రోజులుగా ఎడమవైపున కడుపులో మంటగా ఉంటుండేది . ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఎండోస్కోప్ చేయించి అల్సర్లేవీ లేవన్నారు . ఒక డాక్టరు మాత్రం ఎండోస్కోప్ లో కనిపించక పోయినా పెప్టిక్ అల్సర్ ఉంది
మీకు అని ఒక కోర్సు మందులు రాయడం , వాడడం , ఉపశమించడం జరిగింది .
            మళ్ళీ ఈమధ్య కని పించే సరికి  - హైదరాబాదులో ఉన్నాంకదా అని – మహానగరంలో పేరొందిన
ఏకైక పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చూపించి బాధనుండి పూర్తిగా విముక్తి పొందాలని ఆశ పడ్డాను .
            ఖాళీ కడుపుతో ఒకరోజు ఉదయాన్నే ఆరింటికి హాస్పిటల్ చేరుకున్నాను . అప్పటికే రిజిష్ట్రేషన్ కౌంటర్
వద్ద చాలా మంది గుమి గూడి ఉన్నారు . ఫీజు చెల్లించి నేనూ రిజిష్టర్ చేయించు కున్నాను . హాల్లో వెయిట్ చేయమన్నారు . తొమ్మిది కావస్తోంది . హాస్పిటలంతా హడావిడి మొదులైంది . సందర్శకులతో , సిబ్బందితో క్రిక్కిరిసి
సికిందరాబాదు రైల్వే ష్టేషన్ లా కనువిందు చేస్తోంది .
           ఈలోగా హాల్లో ఉన్న మైక్ లోంచి చెకింగ్ బ్లాకు లోకి ఆహ్వానిస్తూ కొన్నిపేర్లు ఎనౌన్స్ చేశారు . నాపేరు కూడా ఉండడం గమనించి వెళ్ళాను . ఒక్కో చిన్న చిన్న కేబిన్ లోకి ఒక్కొక్కర్ని పంపించారు . చెకప్ డాక్టర్ రావడంతో
నేను నా గోడు వెళ్ళబోసుకోవడం మొదలెట్టాను . ఆయన విటున్నాడో లేదో నాకయితే అర్థం కాలేదు . చిట్టీ మీద
రాసుకుంటూ పోతున్నాడు . అంతా ఒక్కనిమిషంలో అయిపోయింది . ఆ చీటీ నాకిచ్చి క్యాష్ కౌంటర్ కెళ్లమన్నాడు .
            కౌంటర్లో బిల్ వేసి రు.7900 – కట్టమన్నారు . నేనంత పైకం తీసుకెళ్ళ లేదు . కార్డుంది . తీసిచ్చాను .
పైకం జమ చేసుకుని , ఎండోస్కోపీ యూనిట్ కెళ్ళమన్నారు . ఎండోస్కోపీ తదుపరి , బ్లడ్ శాంపిల్ యూనిట్ ,
అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది . ఇంకా కొలనో స్కోప్ మిగిలే ఉంది . అప్పటి వరకూ
ఏమీ తిన లేదు , తాగలేదు . ఖాళీ కడుపే . ఓరి దేవుడా ఏమిటీ ఖర్మ అనుకుంటూ కొలనోస్కోప్ కోసం విచారించాను .
             హాస్పిటల్ మందుల షాపు చూపించి కొలనోస్కోప్ కిట్ కొని తెమ్మన్నారు . మంచినీళ్లు లీటర్ బాటిళ్ళు
రెండు కొనమన్నారు . కిట్ లోని టాబ్లెట్ మింగించినారు . ఒక్కొ లీటర్ లో రెండు పొట్లాల పౌడర్ కలిపి అరగంటకోసారి
తాగమన్నారు . అరగంట తర్వాత మోషన్స్ మొదులౌతాయి . పది పన్నెడు సార్లు మోషన్స్ తరువాత రండి . సెకండ్ ఫ్లోర్ లో కెళ్లండి . అంతా అర్థమౌతుంది . సాయంత్రం ఐదు తర్వాత కిందికి రండి అన్నారు .
            అన్నీ సిధ్ధం చేసుకుని సెకండ్ ఫ్లోర్ చేరే సరికి మిత్రులు ఆడా మగా చాలా మందే ఉన్నారు . నేనూ వారితో చేరి నరకంలో విహరించాల్సి వచ్చింది ఐదు వరకూ .
            కొలనో స్కోపీ యూనిట్ లోకి వెళ్లి టెస్ట్ పూర్తి చేసుకుని బయట పడే టప్పటికి ఏడయ్యింది .
రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే సరికి ఎనిమిదయ్యింది . అన్నీ నార్మల్ రిపోర్ట్స్ .
            పది పన్నెండు మందిని ఒక్కో డాక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళారు . డాక్టర్ సహాయకుడు మాఫైళ్ళు
తీసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కర్నీ డాక్టర్ వద్దకు పంపిస్తున్నాడు .
            నేను వెళ్ళే సరికి డాక్టర్ ఫోనులో మాట్లాడు తున్నాడు . నేను వెళ్ళి నిలబడ్డా . ఉలుకూ పలుకూ లేదు .
నిలబడే ఓపికలేదు . వయసా అరవై మూడు . రోజంతా ఉపవాసం . పైగా కొలనోస్కోప్ ప్రిపరేషన్ కోసం పది పన్నెండు సార్లు .......
            ఫోను సంభాషణ పూర్తయినట్లుంది . ఫైలందుకుని డాక్టర్ ఏదో రాస్తున్నట్లనిపించి , నేను నాగోడు
వెళ్ళబోసుకుంటున్నాను . వింటున్నట్లు లేదు . విన్నట్లు లేదని మళ్ళా మొదలెట్టేను . మందులు రాశాను కదా  అన్నాడు , ఇక వెళ్లమన్నట్లు చూచి . బెల్ కొట్టేడు , ఇంకొకర్ని పంపమని .
           తీరా ఏమి రాశాడా అని చూస్తే , పది మందుల పేర్లు టైప్ చేసిన ఒక స్లిప్ నా ఫైల్లో అంటించి ఉంది .
పేర్లకు ముందున్న బాక్స్ లలో ఈయన గారు సింపుల్ గా టిక్కులు కొట్టేడు . నాకేమనిపించిందంటే అసిస్టెంట్
మందుల స్లిప్పంటించడం , డాక్టర్ టిక్కులు కొట్టడం తప్ప వీళ్లకే అధికారాలూ లేవేమో అని .
           అంటే ఈ పేరు మోసిన హాస్పిటల్లోకి అడుగిడితే మనంచెప్పేది అస్సలు వినరు . అక్కడున్న దాదాపు
అన్ని టెస్టులూ వాయించేస్తారు . మందుల చీటీలు ముందే అంటించి మందులు అమ్మేసుకుంటారన్నమాట .
           ఏమిటో అంతా మాయాజాలం . మరి రోగం కుదిరిందా అంటే , కుదిరితే ఈ సోదంతా ఎందుకూ .
జాలంలో చిక్కుకుంటే గాని తత్త్వం బోధపడదు కదా !
                          వైద్యో నారాయణో ‘ హరీ ‘   -  అని సరిపుచ్చుకుందాం .  
  


    

10, మే 2015, ఆదివారం

అమ్మా , నీవీబిడ్డలకు బరువిప్పుడు !?


                కూతురికి అమ్మంటే ఇష్టం . కొడుక్కీ అమ్మంటే ఇష్టమే .

                కొడలికీ అమ్మంటే ఇష్టం . అత్తమ్మంటేనే అయిష్టం . 

                అత్తమ్మకూ కూతురంటేనే ఇష్టం .  కోడలంటేనే కష్టం .

                కొడుక్కి అమ్మంటే ఇష్టమే . ఐనా తనిష్టం ఇక్కడ మార్చుకొంటాడు .

                అల్లుడికీ అమ్మంటే ఇష్టమే . కానీ తనిష్టాన్ని ఏమార్చుకొంటాడు .

                లోపమెక్కడుందో అమ్మకీ తెలుసు , అమ్మలైన కూతుర్లకీ , కోడళ్ల కీ తెలుసు . అందరికీ తెలుసు .

                ఐనా “చదరంగం” ఆగడం లేదు .

                అందుకే అమ్మ తనింట్లోనే పనిమనిషిగా మారి పోయింది .  

  

    ఆహా ! ఈరోజు ఎంత సుదినం !  అంతర్జాతీయ మాతృపూజాదినోత్సవం .అమ్మప్రేమను పొగిడి పొగిడి  అలిసి పోయిన దినం . అమ్మప్రేమనంతా కళ్లకద్దుకొని కలాల్లోనూ , గళాల్లోనూ జార్చుకొని  , పేర్చుకొని  - టీవీ చానల్లూ , పేపర్లూ , బ్లాగుల నిండా చేర్చుకొని

అమ్మనూ , అమ్మప్రేమనూ ఆకాశాని కెత్తేశాం .అమ్మతనం  అజరామరమై అలరారుతోంది . ఇంకేం కావాలి అమ్మకు  ?



                అమ్మలందరూ యశోదమ్మలే . ప్రతి అమ్మకూ తన బిడ్డడు బంగారమే . బిడ్డల పొరపాట్లు నిరంతరం సమర్థిస్తూనే  ఉంటుంది అమ్మప్రేమ . తన బిడ్డ అమాయకుడనీ , ఇతరులు చెడగొడుతున్నారనీ ఆమె భావన . బిడ్డల చేత అతి సులభంగా మోసగించబడే ఈ అభాగ్యజీవిని - అదే – అమ్మ ను  బిడ్డలు అవలీలగా నమ్మించేస్తుంటారు .                



                ఫాపం ! అమ్మ !

                కొడుక్కూ , కోడలికీ , వాళ్ల పిల్లలకీ – ఊడిగం చేసే అమ్మ .

                తిట్లతో పాటు వాళ్లు పడేసే పట్టెడన్నంకోసం బ్రతుకీడుస్తోంది అమ్మ .

                ఒక్కడే కొడు కైతే   చావో రేవో వాడింట్లోనే .

                నలుగురైతే! ఆ యమ్మకు అగచాట్లే .

                ఆస్తి పంచుకున్నట్లు అమ్మనూ భాగాలేసుకొంటారు

                పట్టెడన్నం కోసం నలుగురింటా చాకిరీ తప్పదు .

                 

       కని పెంచిన  బిడ్డల కోసం అష్టకష్టాలు పడిన అమ్మకు ప్రతిఫలం ? మలిసంధ్య మనుగడ దుర్భరం .


31, మార్చి 2015, మంగళవారం

ఈ జాతరలకు తెర పడేదెన్నడు ?

సీను : ssc ఎగ్జామ్ సెంటర్ .....
                         చీఫ్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్లకు రూమ్ ఎలాట్ మెంట్ చేస్తున్నాడు .
రూమ్ నంబర్లు రాసిన చిట్లు రోల్ చేసి ఒక డబ్బాలో వేశాడు . ఒక్కో ఇన్విజిలేటర్ ఒక్కో చిట్టీ
తీస్తున్నారు . చిట్టీ ఓపెన్ చేసి  అలాట్ మెంట్ రిజిస్టర్లో ఇన్విజిలేటర్ నేమ్ ప్రక్కన రూమ్ నంబర్ వేసి
సంతకం తీసుకున్నాడు . ఎగ్జామ్ ఫైల్స్ తీసేసుకుని ఇన్విజిలేటర్లు రూములకు వెళ్ళిపోయారు .
                           హాల్ టికెట్ వెరిఫికేషన్లూ , అట్టెండెన్స్ షీట్లలో సంతకాలు తీసుకోవడాలూ ,
ఆన్సర్ షీట్ల పంపకాలూ పూర్తయినట్లుంది . సెకండ్ బెల్ కొట్టీ కొట్టంగనే డిపార్ట్ మెంటల్ ఆఫీసర్
రూముల్లో క్వశ్చన్ పేపర్లు పంపిణీ చేశాడు . థర్డు బెల్ తో పిల్లల చేతుల్లోకి చేరాయి . పిల్లలంతా
క్వశ్చన్ రీడింగ్ లో బిజీగాఉన్నారు .
                          చీఫ్ కు ఒక విషయం అర్థంకావడంలేదు . రూం నంబర్ టూ కు మొన్నా ,
నిన్నా , నేడూ వరుసగా ఒకే ఇన్పిజిలేటర్ ఎలాట్ కావడం ఎలా సాధ్యం ? ఇందులో ఏదో మతలబుంది .
అది అర్థంకావడానికి ఎంతో సేపు పట్టలేదు . రూం నంబర్ టూ మీద నిఘా ఉంచాడు .
                           అది మండల కేంద్రం . ఆ సెంటర్లో రెండు మూడు ప్రైవేటు స్కూల్ల పిల్లలు రాస్తున్నారు .
ఆయా స్కూళ్ళు మండల్ ఫస్ట్ కోసం పోటీ పడుతున్నవి .  అందులో భాగంగా అనేక మాల్ ప్రాక్టీసెస్
ప్లాన్ చేస్తున్నట్టున్నారు . రూం నంబర్ టూలో ఒక పిల్లాడు ఈపోటీలో ఉన్నాడు .వాడిని మండల్ ఫస్ట్
తీసుక రావడానికి ఈ మాల్ ప్రాక్టీసంతా . ఆ ఇన్విజిలేటర్ ప్రతి రోజూ రూం నంబర్ టూ స్లిప్ సేకరిస్తున్నాడు
లాటరీలో పచ్చిన వాళ్ళ నుండి . కొందరితో అతడు కుమ్మక్కయ్యాడు . రెండు రోజులీ తంతు జరిగింది .
మూడో రోజు దొరికి పొయ్యాడు . అతన్ని చీఫ్ రిలీవ్ చేసేశాడు . ఇలాంటి సిత్రాలెన్నో , ఎన్నెన్నో ఈ ఎగ్జామ్స్ లో .
                                        *****
సర్ ,
అడిషనల్  ?
నో సర్ , చిన్న డౌటుంది _ రూంకెల్లి వెరిఫై చేసుకొస్తాను .
ఏవిటీ ! అలా కూడా రాస్తారా , ఎగ్జామ్సు ? నో నో.......
                *****
అదో కార్పొరేట్ హైస్కూల్ క్యాంపస్ . ssc సెల్ఫ్ సెంటర్ .
అంటే ఇక్కడ జంబ్లింగ్ లుండవు . కేవలం సదరు హైస్కూల్ పిల్లలే పరిక్ష రాస్తారు .
చీఫ్ సూపరింటెండెంట్ , డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ , ఇన్విజిలేటర్లు వగైరా సిబ్బంది
మొత్తం ఆ హైస్కూలు యాజమాన్యం పంపిన లిస్టు ప్రకారమే ఎప్పాయింట్
అవుతారనేది బహిరంగ రహస్యం . సదరు సిబ్బంది భారీగా నజరానాలు పుచ్చుకుని
సదరు యాజమాన్యం సేవాభాగ్యంలో తరిస్తారనేది వేరేగా ఉట్టంకించ పనిలేదు .
ఎగ్జామ్ హాల్లో పిల్లాడి కేదయినా డౌటొస్తే పక్కనే హాష్టల్ రూములో కెల్లి క్లియర్ చేసుకుని
వచ్చి మరీ రాయొచ్చన్నమాట . ఇదీ  కొన్నిచోట్ల  సెల్ఫ్ సెంటర్ల తంతు .
        పాపం , మన ఇన్విజిలేటరు కీ అనుభవం కొత్త . తప్పు చేయడానికి మనసొప్ప లేదు .
దరిమిలా , పనికిరాడని రిలీవ్ చేసేశారు .
                             *****
             ఇంకా అనేక చిత్ర విచిత్రాలుగా వింతలూ , విశేషాలతో విరాజిల్లుతున్న
ఈ ఎగ్జామ్స్ ప్రహసనం అవసరమా ?
పరీక్షల లక్ష్యం _ విద్యార్థి ఏడాది పొడవునా ఆర్జించిన విఙ్ఞానాన్ని మదింపు వేయడం .
కానీ , ఈ లక్ష్యం పెడ త్రోవలు పట్టింది . దీనికందరూ బాధ్యులే .
             ఇలాచేస్తే బాగుణ్ణు ! ? .  ssc లెవల్ వరకూ ఇంటర్నల్ అసెస్ మెంట్ చాలు .
ఇంటర్ తదుపరి ప్రతి అడ్మిషనుకూ ఎమ్ సెట్ మోడల్  లో టెస్ట్ నిర్వహించి , డిగ్రీలో - ( అది సాధారణ డిగ్రీ
కానీ , ఇంజనీరింగ్ , మెడికల్ కానీ , మరేదైనా కానీ ) _ అడ్మిషనిస్తే సరిపోతుంది .
ఈ చిత్ర విచిత్ర పరీక్షల జాతరలకు తెర పడుతుంది .

21, మార్చి 2015, శనివారం

ఉగాది పంచాంగం

ఉగాది పర్వదినం నేడు . అందరికీ శుభాకాంక్షలు .
ఔత్తరాహికులకు ఫాల్గుణ బహుళ పాడ్యమి సంవత్సరాది .
హోలీ తర్వాతి రోజు .
దాక్షిణాత్యులకు చైత్ర శుధ్ధ పాడ్యమి సంవత్సరాది .
పదిహేను రోజులు తేడా .
ఆరోజు వాళ్ళు మామిడి పూత తింటారు .
ఈరోజు మనం వేప పూత తింటాం .
          *****
భారతీయులకు సంవత్సరాది అంటే ఋతు ప్రారంభం .
ఋతువులు వసంతంతో మొదులవుతాయి .
ఒక సంవత్సర కాలానికి
కాలానుగుణ మార్పులు మొదలయ్యే
మొదటి రోజు ఇది .
ఆహ్లాదం , ఎండలు , వానలు , మంచు , చలి , ఆకు రాలడం _
ప్రతి రెణ్ణెళ్ళకూ ఒక మార్పు
కథ మళ్ళీ మొదటికి .
              *****
వసంతం వచ్చేసిందనీ
ప్రకృతి పరువాలు పరుచుకుని
పుడమి అందాల హరివిల్లయ్యిందనీ
కవి కోకిలలు కావ్యగానం చేస్తున్నారు .
              *****
రాజ్యాధిపతి శని యనీ
మంత్రీ _ సేనాపతీ రెండు పోష్టులూ కుజుడు తీసేసుకున్నాడనీ
ఫలితం ఆందోళనకరమనీ
వర్షాలు పడవనీ
పంటలు పండవనీ
రోగాలు విజృంభిస్తాయనీ
ప్రజలు నానా యాతనలు పడతారనీ
రాజ్యాధిపతులు యుధ్ధాలలో మునిగితేలుతారనీ
కార్తాంతికులు పంచాంగ శ్రవణాలు పెట్టి మరీ
వాయించేస్తున్నారు .
            *****
భారతీయ సమాజంలో ఈప్రిడిక్షన్స్ ని
ముందస్తు హెచ్చరికలుగా భావించడం
సంప్రదాయంగా వస్తూవుంది .
అనంత విశ్వంలో మన సూర్య కుటుంబం లాంటి వ్యవస్తలు
కోటానుకోట్లు .
సూర్య కేంద్రకంగా వేర్వేరు కక్ష్యలలో
సూర్యాకర్షక ప్రభావానికి లోనై గ్రహాలూ, ఉపగ్రహాలూ
సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి .
వాటి కక్ష్యలలో గానీ , గతులలో గానీ మార్పుండదు .
             *****
భూమి మీది వాతావరణ మార్పులకు
భూమి చుట్టూ వేలాది మైళ్ళ పర్యంతం
వ్యాపించి ఉన్న వాతావరణమే కారణం .
కాలానుగుణ మార్పులను ప్రసాదిస్తూ
భూమి మీద ప్రాణికోటి జీవనయానానికి
దోహదం చేస్తూ ఉందీ వాతావరణ ఫలకం .
ఇది సహజం .
కానీ ,
మానవుని దురాశ ప్రకృతిని పాడు చేసి రక్షణ కవచాన్ని
నిర్వీర్యం చేస్తున్నది . అందువల్ల వాతావరణంలో
అసహజ పరిస్తితులు లెత్తుతున్నాయని సైంటిస్టులు
హెచ్చరిస్తున్నారు .
              *****
సరే ,
కాసేపు సిధ్ధాంతులు చెప్పేదే నిజమనుకుందాం .
మరి , ఆ విపరీత పరిణామాలు ఎదుర్కోవడానికి
ప్రభుత్వాలూ , ప్రజలూ సన్నధ్ధమౌతారా ?
ప్రభుత్వాధినేతలకు ప్రజాసేవ చేసే తీరుబాటెక్కడుంది ? 

8, మార్చి 2015, ఆదివారం

ఏ పదముల నిను బొగడను ఇంతీ ?


అనురాగపు మనోజ్ఞతల అపురూపమా !

నట్టింటను నడయాడే నయన మనోహరమా !

అమ్మా నాన్నల నోముల కమృత ఫలమా !

పరాశక్తి ప్రతిరూపపు ప్రకృతి వరమా !


ఏ పదముల నిను బొగడను ఇంతీ !

ఇల వెలసిన అమృత పూర్ణ స్రవంతీ !

నీవు లేక మగ జాతికి నిలువ నీడ లేదు

నీవల్లే పురుషార్థపు పుణ్య ఫలము పొందు


నీ కడుపున ప్రభవించుటె నిజమని తెలియని మూర్ఖుడు

నీ నీడనె బ్రతుకు నీడ్చునిత్యాహంకారుడు


అజ్ఞానపు టంథకార పురుషాహంకారం

‘ అమృతమయి ’ జ్ఞానజ్యోతి

అండతోనె దూరం


ప్రతి మహిళా ‘ పరాశక్తి ‘.

ప్రపంచాన్ని నడిపించే

ప్రతిభా పాటవ శక్తుల

ప్రభావాల ప్రతిరూపం


ప్రతి తల్లీ తన తనయుడు

థర్మ నిరతు డవ్వాలని

ప్రతిన బూని శాసిస్తే

థర్మ పతితు డయ్యేనా ? ? ?

_ అమృత మయులైన 
మాతృ మూర్తులందరికీ 
మహిళాదినోత్సవ
శుభాకాంక్షలు  _

25, ఫిబ్రవరి 2015, బుధవారం

తెలుగేలా ? ఆంగ్లభాష తియ్యగనుండన్

' చిన్నూ , ఇంద బనానా తిను '
' మామ్ , నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి '
' నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే? '
' ఓకే ,  మామ్ '
' దట్స్ గుడ్ '
                    *********
' హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏ విచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ..... '
' హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
'ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా ' అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ ' తెలుగేలా ఆంగ్లభాష తియ్యగ నుండన్ ' _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు . '
                    ***********
' హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ' ఈతరం ఇల్లాలు ' సీరియల్ , మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ . '
                        *************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .

18, ఫిబ్రవరి 2015, బుధవారం

కొందరివాడుకాదు అందరివాడు

కొందరివాడుకాదు అందరివాడు
పురాణాలలో అందుబాటులో ఉండే
అందరివాడెవడైనా ఉన్నాడా అంటే
అతడితడే , ఆదిదేవుడు , అందరివాడు
పరస్థలాలనుండి తరలివచ్చి
మనుషుల్ని
దేవతలుగా, రాక్షసులుగా విభజించి
తామే దేపతలుగా  చెప్పుకుని 
స్థానికులను దక్షిణాదికి తరిమేసిన
మేథావి పరాసుల కుత్సితానికడ్డునిలిచి
పరాజితులకండగా నిలబడ్డ _ అందరివాడు
దేవతలుగా చెప్పుకునే వాళ్ళ
సాంప్రదాయక  రొటీన్ షోడశోపచారాలకంటే
దేవభాషగా  చెప్పబడే
వినియోగంలో లేని మాటల మంత్రాలకంటే
గ్రామీణుల అభిషేకాల స్వఛ్చతలకూ
హరోంహర నాద ఘోషలకూ
పులకించే - అందరి వాడు
చితాభస్మమే శ్రీకరంగా
పురుషుడూ ప్రకృతీ ఒక్కటై కనిపించే - అందరివాడు
ఉత్తరాదికి కైలాసవాసిగా
దక్షిణాదికి దయావారాశిగా - అందరివాడు
మాటలు చెప్పి మాయచేసి
కష్టాన్ని కాజేసే సోమరుల తరఫున కాదు -
కష్టించి పనిచేసే కష్టజీవుల తరఫున
మోసం చేసేవాళ్ళ తరఫున కాదు -
మోసగింపబడిన వాళ్ళ తరఫున
అణగద్రొక్కే వాళ్ళ తరఫున కాదు -
అణగారిన వాళ్ళ తరఫున
అసామాన్యుల తరఫున కాదు -
అతి సామాన్యుల తరఫున
అండగా నిలిచే - అందరి వాడు
పేదా గొప్పా తేడా లేకుండా
ప్రతి భక్తుడూ
నిరభ్యంతరంగా
నేరుగా లోనికెళ్ళి
తాకి దణ్ణం పెట్టుకో వీలున్న - అందరి వాడు
అతడే ఆది దేవుడు
హర  హర మహాదేవ -  శంభో శంకర
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

14, జనవరి 2015, బుధవారం

వద్దు పందేలు – జూదాల వంక బోకు



పంట పండింది , అప్పుల బాధ తప్పె
చేరె వర్షాశనంబు రాజిల్లె పల్లె
కష్టమున తోడు నిల్చిన కార్మికులకు ,
పసులకు కృతజ్ఞతలు దెల్పు పండుగ యిది .

బళ్ళు ధాన్యంపు బస్తాల పసిడి మోసి
బారులుగ డొంక దారుల పల్లె లలరె
తర తరాలుగ భారత ధాత్రికి మన
తెలుగు నేలయె తిండి గింజల కొటారు .

తెలుగు వారికి వ్యవసాయ మలఘు వృత్తి
పాడి పసువులు , కోళ్ళనుబంధ యొనరు
పసువుల నలంకరించి యింపలరు మనకు
కోళ్ళ హింసించు పందేల కోర్కెలేల ?

ఆరు గాలాలు కష్టించి యధిగమించి
పంట పండించి నట్టి ఓ భాగ్య శాలి !
మాయగాళ్లకు చిక్కకు మాట వినుము
వద్దు పందేలు – జూదాల వంక బోకు .

ఉత్తరాయణ పుణ్య లోకోత్తర దిశ
వైపుగా భూగ్రహము – సూర్య భ్రమణ మరుగు
మార్పు మకర సంక్రాంతి – క్షేమంకరుడయి
సూర్య నారాయణు డిలకు శోభ గూర్చు .  

----- సంక్రాంతి శుభాకాంక్షలతో

31, డిసెంబర్ 2014, బుధవారం

శుభ కామనలు



అనంత విశ్వమే క్రమపధ్దతిలో నడుస్తోంది
విశ్వాంతరాళంలోని నక్షత్ర , గ్రహాది సకలమూ
క్రమపధ్ధతిలో నడుస్తోంది .
అందులోని భూమి కూడా క్రమపధ్ధతిలో నడుస్తోంది .
భూమిపైన వసంతాది ఋతువులూ ,
కాలాలూ క్రమపధ్ధతిలో నడుస్తున్నవి .
భూమ్మీది పశువులూ , పక్షులూ కూడా క్రమపధ్ధతిలో
జీవనం సాగిస్తున్నవి .
కాని ,
మనిషి మాత్రం
అహంకార జ్ఞానం పెరిగి ,
తెలివి ముదిరి ,
క్రమపధ్దతిని గాలికొదిలేశాడు .
నీతినియమాలు నీళ్లకొదిలేశాడు .
దైవాన్ని స్వార్ధం కోసం
మతాన్ని హింస కోసం
ధర్మాన్ని పాపం కోసం
సత్యాన్ని బొంకు కోసం
వాడుకుంటున్నాడు .

కాలం మార్పు తెస్తుందంటారు .
ఈ క్రొత్త సంవత్సరమైనా
ఈ ‘ మేధావి ‘ లోని
గతి తప్పిన ‘ వికృత ‘ మతిని
మారుస్తుందేమో చూద్దాం .
శుభ కామనలు 2015 కు .

23, అక్టోబర్ 2014, గురువారం

దీపావళి శుభాకాంక్షలు




అందరి జీవితా లారోగ్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !

అందరి జీవితా లైశ్వర్య దీపాల
వెలుగులతో నిండి విరియు గాత !

అందరి జీవితా లందున పరిపూర్ణ
విజయాల వెలుగులు విరియు గాత !

అందరి జీవితా లందు భద్రత కల్గి
వెలుగుల రక్షణ విరియు గాత !

మంత్ర తంత్రాలు జ్యోతిష్య మాది  వృత్తు
లు గొని , అంధ విశ్వాసములు రగిలించు
బుధుల దుర్మార్గ మికనైన పోవు గాత !
విశ్వ కళ్యాణ ధీధితుల్ వెలయు గాత  !