24, జులై 2014, గురువారం

'కష్టే ఫలే కబుర్లు' - ఒక చిన్న ప్రశంస

ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
అక్షర రూప హృద్యంగమమ్ము
ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
స్పందించి వ్రాసిన బడుగు బొమ్మ
ఒకచో మనోల్లాస చకిత జీవన చిత్ర
రమణీయ భావనా రస విశేష
మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
ర్శనము శాయంగల ప్రతిభ లున్న

అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
నియతి 'కష్టే ఫలే'  బ్లాగు నిర్వహించు
హితుడు 'భాస్కర శర్మ' మాకిష్టు -డరయ
బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు

వట్టి కబురులు గావు - చేవ గల జీవి
తానుభవ సత్యములు – నేటి మానవులకు
మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
రూపు దాల్చిన శర్మగారూ నమస్సు .


19, జులై 2014, శనివారం

నా ప్రియమైన తండ్రీ , సదా నీకు కృతజ్ఞుడను .

హే భగవన్ !
నిన్ను వెతుక్కుంటూ
ద్వాదశ శైవక్షేత్రాలూ
నూటొక్క తిరుపతులూ
కొండలూ కోనేరులూ
ఇక్కడా అక్కడా
ఎక్కడెక్కడో తిరిగా
అక్కడంతా
గుళ్ళూ గోపురాలూ
రాళ్ళూ రప్పలూ
వాటికి హారతులు పడుతూ
అఢ్డ నామాలూ నిలువు నామాలూ
వాళ్ళ అభిజాత్యాలూ
అహంకారాలూ
పటాటోపాలూ
బ్రతుక నేర్చిన తనాలూ తప్ప
ప్చ్ , నీవు కనిపిస్తేగా
     ----- 
వేద,వేదాంగ,వేదాంత వేద్యుడవనీ
పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయనీ
ప్రబంధాలు ప్రస్తుతిస్తున్నాయనీ
సారస్వతమంతా వెతికా
అక్కడంతా
ఒకదానికొకటి పొంతన లేని
నిన్ను నిరూపించడానికి
చేసిన వ్యర్ధ ప్రయత్నాలు
అర్థం పర్థంలేని మెట్ట వేదాంతాలు
జటిలమైన బ్రహ్మ పదార్ధాలు
అక్కడా నీవు కనిపిస్తేగా
        -----
మాలో కొందరు మూర్ఖులు
మేమే దేవతల మన్నప్పుడు
మేము మానవాతీతుల మన్నప్పుడు
మాలో కొందరు దురహంకారులు
మేమే అధికుల మన్నప్పుడు
మేము అధిపుల మన్నప్పుడు
మాలో కొందరు దుర్మదాంధులు
అంతరాలు సృష్టించినప్పుడు
మనుషుల్ని మనుషులుగా చూడనప్పుడు
మాలో కొందరు స్వార్ధ మేధావులు
నీ పేరు మీద దుర్మార్గాలకు పాల్పడు తున్నప్పుడు
నీ ఉనికి ప్రశ్నార్ధకమై
ఆఁ , దేవుడనేవాడుంటేగా ,
అన్పించింది
        -----
అయినా ,
సకల చరాచర జగత్తునూ
సమదృష్టితో కటాక్షిస్తున్న
ఓ జగధాధార సచ్చిదానంద రూపా ,
నేను నిన్ను నమ్ముతున్నాను
నీవున్నావని -
చినుకు రాలినప్పుడు
మొలక మొలిచినప్పుడు
పువ్వు విచ్చినప్పుడు
పరిమళం గుభాళించినప్పుడు
పంట పండినప్పుడు
ఫలాలు చేతి కందినప్పుడు
కష్టాలు గట్టెక్కినప్పుడు
కామితాలీరేడినప్పుడు
స్వాస్త్యం చేకూరినప్పుడు
ఆనందాన్ననుభవించినప్పుడు
ప్రకృతి ధర్మం భాసిస్తున్నప్పుడు
జీవం ఉనికి ఉట్టిపడు తున్నప్పుడు
ఇంకా , అనేకానేకాలుగా -
నీ సాక్షాత్కారం వీక్షిస్తూనే ఉన్నా
హే భగవన్ !
నా ప్రియమైన తండ్రీ ,
నీకు సదా కృతజ్ఞుడను .



17, జులై 2014, గురువారం

కృతజ్ఞులమై ఉందాం - ఋణం తీర్చుకుందాం

వాన చినుకు నేల తాకింది
నేల తల్లి పరవశించింది
తల్లి కడుపులో దాగిన విత్తనం
విత్తనంలో దాగిన జీవం
జీవంలో కదలిక
కార్యోన్ముఖమైంది
కదలిన జీవం
శక్తిమంతమైంది
నేనున్నానంటూ
నేలను చీల్చుకొని
మొలక
మోము పైకెత్తింది
సగర్వంగా
ఆకసంవైపు చూచింది
చివురులై
ఆకులై
రెమ్మలై
కొమ్మలై
మొగ్గలై
పూవులై
పిందెలై
ఫలాలై .....
అద్భుతం
ఆవిష్కరించింది
ప్రకృతి ధర్మం
కర్తవ్యం నిర్వహించింది
ఆ చినుకూ
ఈ నేలా
ఈ ప్రకృతీ
ఆ ప్రకృతి ధర్మం
మనల్ని
వీడకుండు గాక !
ఆ చినుకుకూ
ఈ నేలకూ
ఈ ప్రకృతికీ
ఆ ప్రకృతి ధర్మానికీ
మనం కృతజ్ఞులమై ఉందాం
అంజలి ఘటిద్దాం
ఋణం తీర్చుకుందాం .



11, జులై 2014, శుక్రవారం

శ్రీసాయి నాధుని గురు చరణాలకు .....




శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
             హితబోధ చేసిన హితు డతండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి
            తాననుభవించిన త్యాగ శీలి
సాయి  కాపాడ  రారా  యన్న తక్షణ
            మాదుకొను కరుణామయు డతండు

సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు – శరణంచు శరణు వేడి
చరణములు తాకి తరియింత్రు జనులు – శరణు
శరణు గురు పౌర్ణమీ శుభంకర దినమున .

          ప్రపంచానికి మార్గ దర్శనం చేసిన మహాను భావులందరూ గురువులే .
ఈ గురు పరంపరలో వ్యాస భగవానుని పేర గురు పౌర్ణమి జరుపుకోవడం
ఆనవాయితీ . ఈ గురు పౌర్ణమి పర్వ దినాన్ని తాను జీవించినంత కాలమూ
శ్రీ శిరిడి సాయి బాబా వేడుకగా జరిపించేవారు . ఆయన సమాధి చేరిన తదుపరి
శ్రీ సాయి నాధుని మందిరాలలో గురుపౌర్ణమి వేడుకల సంబరాలు ఘనంగా
జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది .  

ప్రతి యొక్కరు సాయి తనకు
హితుడని భావించు సాన్ని హిత్యము చూడన్
అతడు మన గుండె నిండా
సతతము కొలువుండు టెల్ల సత్యమె యందున్ .

ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ  జై .

5, జులై 2014, శనివారం

లోకోత్తర పురుషు లందరూ లోకారాధ్యులే



మానవుని దృష్టి పరిమితం .
మానవుని మేథస్సు పరిమితం .
మానవుని శక్తి పరిమితం .
మానవుని జీవితం పరిమితం .

అందుకే తన శక్తి  కంటే అపరిమిత శక్తి వైపు ఊహ మొదలైంది .
ఊహ నుండి శోథన మొదలైంది .
ఫలితంగా భగవద్భావన మొదలైంది .
తన కంటే శక్తి సంపన్నులైన లోకోత్తర పురుషుల ఆరాథన మొదలైంది .
ఈ భూమి పై జన్మించిన ఆ లోకోత్తరులే-
మానవ జాతి నుథ్థరించిన మహాను భావులైనందున –
వారే భగవంతుని ప్రతిరూపాలుగా భావింప బడినారు .

వారి లోకోత్తర జీవితాలు పరిసమాప్తమైనా –
వారి నామ సంకీర్తనల , పూజనల , ఆరాథనల ద్వారా –
తమ జీవితాలు సాఫీగా సాగుతా యనే అపరిమిత విశ్వాసం ఏర్పడింది .

ప్రబలమైన ఈనమ్మకం వల్లనే –
లోకోత్తర పురుషులంతా లోకారాథ్యులైనారు .
మతమేదైనా మహిమాన్వితులైనారు .
వారు చూపిన త్రోవలు జీవన మార్గాలైనవి .
సత్యం , థర్మం , ప్రేమ , దయ , అహింస , పరోపకారం –
అన్ని మతాలలో ప్రతిపాదింప బడి –
సందేశాలై మానవాళికి సర్వదా ఆచరణీయాంశాలైనవి .

వివిథ దేశాలలో , వివిథ కాలాలలో అవతరించి –
మానవాళి మనుగడకు దిశా నిర్దేశం చేసి , ఉథ్థరించిన –
జీసస్ , మహమ్మదు , కృష్ణుడు , రాముడు , బుథ్థుడు , శిరిడి సాయి  మొదలైన
లోకోత్తరులు సర్వదా లోకారాధ్యులు . 
వారి జయంతులు మానవాళికందరికీ పర్వదినాలు .
ఆయా దినాలలో  ఆయా మతస్థులు ఆనందంగా –
పండుగ సంబరాలు జరుపు కుంటున్నారు .

ఐతే ,
లోకోత్తర పురుషులంతా –
మతాతీతంగా –
మానవ జాతి కంతటికీ ఆరాథ్యులు .
మానవ జాతి నుథ్థరించిన  మహాను భావులందరి యెడల –
కృతజ్ఞతలు తెలుపు కుందాం .
ప్రతి మహానుభావుని జయంతినీ స్మరించు కుందాం .
లోకారాథ్యు లందరికీ ప్రణామా లర్పిద్దాం .
మానవులంతా ఒకటేనని చాటుదాం . 

కుల , మత , దేశ , కాల – సంకుచిత తత్త్వాలతో
జాతి సమైక్యతను నిర్వీర్యం చేయడానికి
ఎత్తుగడలు రచించే మహానుభావుల యెడల
అప్రమత్తులమౌదాం .






 

3, జులై 2014, గురువారం

THE LADDER (ఇది ఒక నిచ్చెన గారి అంతరంగం )



                నమస్తే సార్ !” అంటూ వచ్చి నేల చూపులు చూస్తూ నిలబడ్డారు, పది పన్నెండు మంది యెడ పిల్లలు .
అంతా పదిహేడు పద్దెనిమిదేళ్ళ వయసులో ఉన్న యువకులు .
ఏమిట్రా ఇలా వచ్చారు, అంతా కులాసాయేనా     ప్రేమగా పలుకరించాడు హెడ్మాష్టరు సారు .
                 అది మే నెల . స్కూళ్లకూ , కాలేజీలకూ వేసవి సెలవలు . ఐనా , పాఠశాల ప్రధానోపాధ్యాయుడూ , గుమాస్తా , అటెండరూ రోజూ వచ్చి , టపాలు చూచుకుని , వాటికి సమాధానాలు పంపడం , అవసరమైన పిల్లలకు టీసీలు ,
స్టడీ సర్టిఫికేట్లూ వగైరాలు ఇవ్వడం , అటెస్టేషన్లు చేసి పంపడం చేస్తుంటారు .
               వచ్చిన పిల్లలంతా ఆవూరి వాళ్లే . అందులో కొంత మంది అదే స్కూల్లో పది దాకా చదువుకొన్న వాళ్ళే .
తమ వద్ద చదువుకున్నవాళ్లు మళ్ళీ కనిపించి పలకరించి నమస్కరిస్తే , అదేమిటో ఈ టీచర్లు ఏనుగు నెక్కేస్తారు .
ఇదీ వొక రకమైన బలహీనతే నేమో !
           ఆ రామానాయుడు గారబ్బాయి చూచావూ , మనోహర్ , ఇప్పుడు జిల్లా కలెక్టరు , నేనే వాడికి మేద్స్ నేర్పించింది .
           ఇలా పదే పదే చెప్పుకుని మరీ మురిసి పోతుంటారీ బడుగు జీవులు . తనమీదనుంచి మెట్లెక్కి ఎందరో పైపైకి  పోతున్నా , ఇసుమంతైనా అసూయ పడడు సరికదా , పైపెచ్చు వాళ్లను చూచి మురిసి పోతూ , నేలపైనే
ఉంటాడు , నిచ్చెన లాగా .  ఎంత వెర్రిబాగులోడో కదా !
          సార్ వచ్చే ఆది వారం ఫ్రెండ్లీ మేచుందండీ , మీరు పర్మిషనిస్తే , మన గ్రౌండ్ లో  ప్రాక్టీస్ చేసుకుందాం అన్నారు
అబ్బాయిలు మొహాలు దీనంగా పెట్టి , అయ్యగారి విషయం తెలుసు కాబట్టి , అనుమతిస్తాడో లోదో అనే
అనుమానంతో .
           సెలవులేగా , ఏం ఫర్లేదు , ప్రాక్టీసు చేసుకోండి నిక్షేపంగా అని ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించి
యోగ క్షేమాలు విచారించాడు పెద్దయ్యవారు .
ఏరా ఆనంద్ ఏం చేస్తున్నావ్
బీటెక్ ఫస్టియర్ సార్
తులసీ నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా బీటెక్ ఫస్టియర్ సార్ అదే కాలేజీలో
నువ్వురా కాశీ
నేను మెడిసిన్ లో జాయినయ్యాన్ సార్
విశ్వేశ్వర్
టీటీసీలో చేరా సార్
         మిగతా వాళ్లు ఏమి చేస్తున్నదీ తెలుసు కాబట్టి ప్రశ్నించ లేదు వాళ్లను . వాళ్ళను అలా చూచి నప్పుడల్లా సారుకి
కొంచెం బాధ .
విశ్వేశ్వర్ బ్రామ్మడు , ఆనంద్ కూడా ఉన్నత వర్గాలకు చెందిన వాడు .
తులసీ , కాశీ ఉద్యోగస్తుల పిల్లలు . ఎస్సీ వర్గం .
రవి , నరిసింహులు , శీను , మరియన్న , పెంచలయ్య వగైరాలు మిగిల వాళ్ళు .
రవి , నరిసింహులు , మరియన్న , పెంచలయ్య ఎస్సీ వర్గం . శీను వగైరాలు బీసీ వర్గం .
వీళ్ల వరకూ సదరు హైస్కూల్లోనే పది వరకు చదివి , ముగించి కూలి పనుల కెల్తున్నారు .
ఫ్రెండ్సంతా కలుసు కోవడంతో సరదాగా క్రికెట్ మాచ్ పెట్టుకున్నారు . పిల్లలంతా గ్రౌండ్ లో కెళ్లారు .
           సారు మాత్రం ఆలోచనలో పడ్డాడు ..........
ఇంజనీర్లూ , ఢాక్టర్లూ కాలేక పోయినా – వీళ్ళు కూడా కనీసం చిన్న చిన్న ఉద్యోగాల్లో నైనా స్థిరపడి ఉంటే
తరతరాలుగా ఈ కూలి బతుకులు తప్పేవిగా .
         కానీ పాపం వీళ్ళకు రిజర్వేషన్ లున్నా వాటి ఫలాలు అనుభవించే అవకాశాలు అస్సలు లేవు గదా .
రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవితాలు . కాస్త వయస్సు కొచ్చారంటే కూలి కెల్లాల్సిందే , కడుపు నింపు
కోడానికి . ఇంకెక్కడి రిజర్వేషన్లు . ఇలా సాగుతోంది , నిచ్చెన గారి అంతరంగం .........
          దలిత వర్గాల రిజర్వేషన్ ఫలాలు , ఆ వర్గాలలో కొందరికే పరిమిత మౌతున్నవి . ఆర్థికంగా నిలదొక్కుకొని
ఉండడం వల్ల , తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల పిల్లలకు అన్ని అవకాశాలూ కలిసి
వచ్చి , ఉన్నత చదువులలో గానీ , ఉద్యోగాలలో గానీ  వీళ్లే రిజర్వోషన్ల ఫలాలు అంది పుచ్చుకో గల్గుతున్నారు .
ఉద్యోగాలలో స్థిరపడి , ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల పిల్లలతో , కూలి నాలి చేసుకుంటూ పూట గడుపు
కునే వారి పిల్లలు చదువులో పోటీపడి రిజర్వేషన్ ఫలాలు పొంద గలగడం సాధ్యమయ్యే పనేనా .
           ఆర్థికంగా వెసులుబాటు లేక , దిన దినం బతుకు పోరాటంలో మ్రగ్గి పోతున్న గ్రామీణ భారతం లోని
తొంబై శాతం పైగా ధళితులు తరతరాలుగా కూలి బతుకులు బతక వలసిందేనా . వీళ్ళకు రాజ్యాంగ పరంగా
సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలు అంది పుచ్చు కునే మార్గమే లేదా .
        ఉంది . ఒకసారి రిజర్వేషన్ పరంగా ఉద్యోగం పొందిన కుటుంబాన్ని , రిజర్వేషన్ పరిధి నుంచి ఎలిమినేట్
చేసి , జనరల్ పరిధిలోకి మార్చాలి . ఇలా , ప్రభుత్వ , ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్లద్వారా
లబ్ధి పొందిన కుటుంబాలను మళ్లీ రజర్వేషన్ కోటాలోకి ప్రవేసించనీయరాదు . రిజర్వుడు స్థానాలలో
పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పధ్ధతి అమలు చేయాలి .
     ఇలా చేస్తే , అందరికీ వాటంతట అవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి . అందరూ ఆర్ధికంగా నిల
దొక్కుకుంటారు . ఆర్ధికంగా నిల దొక్కుకున్న కుటుంబాలు సామాజికంగా అభి వృధ్ది చెందుతాయనటంలో
సందేహంలేదు .
          .......... ఇలా సాగిపోతోంది , ఆ పెద్ద సారు మస్తిష్కంలో ఆలోచనా తరంగాలు . ఐనా ఈ నిచ్చెన గారికి
ఎంతసేపటికీ సమాజాన్ని గురించిన ఆలోచనే గాని , అందులో పది శాతమైనా , సొంత కుటుంబం
గురించి ఆలోచన చేయ గలిగితే , ఈ నిచ్చెన నేల మీదే ఉండదు గదా . ఏమిటో ! ఈ వెర్రి బాగుల వాళ్లంతా ఇంతే నేమో!