15, అక్టోబర్ 2015, గురువారం

నేడు అబ్దుల్ కలాం జయంతి





కలగనండి , కల సాకారమగు దాక
జయశీలురై కృషి సల్పుడనియె
ఆలోచనారీతు లందరివలె గాక
క్రొత్తగా నుండుట కోరుకొనియె
బలమైన సంకల్ప ప్రతిక్రియ యొక్కటే
గెలుపు దారులు వెదికించు ననియె
స్తబ్థత విడనాడి చైతన్యమొందిన
ఫలితాలు వెన్నంటి వచ్చుననియె
 
ప్రతి పలుకులోను మార్గదర్శనము చూపి
దేశప్రగతికి బాటలు వేసినట్టి
దార్శనికుడు ' కలాం మహితాత్ముడ ' రయ
ప్రజలు మెచ్చిన ' భారత రత్న ' మితడు .
 
 











 

3, అక్టోబర్ 2015, శనివారం

మృతులు జీవింతు రీ భూమి మీద మరల




గిరి , తరు , ఝరీ పరీత ప్రకృతిమయ మయి ,
కడు మనోఙ్ఞమై , సూర్య సంకాశ మైన       
పుడమి యందాలు వీక్షించు పుణ్య మరసి
మనకు కన్నుల నొసగెను మాధవుండు
 
సకల జగతిని వీక్షించు శక్తి గలిగి
చూచి గుర్తించు ఙ్ఞాన విస్ఫూర్తి గలిగి
తనర ప్రాణుల కానంద దాయకమయి
గ్రాలు సర్వేంద్రియ ప్రధానాలు – “ కళ్ళు

పుట్టు గ్రుడ్డులే గాక , యీ పుడమి మీద
పలు ప్రమాదాలు , రోగాల బడుట వలన
కళ్లు  గోల్పోయి అంధులై గనలు వారు
కటిక చీకటిన్ బ్రతుకుట గాంచి కూడ ....
 
మార్గ ముండియు  చైతన్య మబ్బకునికి
మరణ శయ్యకు జేరిన మనుజ వరుల
కళ్ళు మరణించు చున్నవి గాని ,   పూని
నేత్ర దానమ్ము జేసిన     నిలుచును గద !
 
మనిషి మరణించినను ,   కళ్ళు బ్రతికి ,     మరొక
మనుజునకు   చూపొసగి ,    అట్టి మనిషి వలన
మరల లోకాన్ని గనును ,  “ సమ్మతి యొసంగ ,
మానవత్వము వెల్లువై మహి వెలుగును .
 
ముందు చూపున్న మనుజులు పుణ్య ఫలము
నమ్మి ,  నేత్ర దానమ్మియ్య సమ్మతించి  ,
అంధులకు చూపు నొసగుదు  రమరు లయ్యు ,
మృతులు జీవింతు రీ భూమి మీద మరల .

 

 

 

 

 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓం నమో శ్రీ సాయి నాధాయ



తలకు గట్టిన గుడ్డ  యిలకు రక్షగ నిల్చి

తరగని ప్రేమకు తావిడంగ

నిడు పాటి నుదుటిపై  నెలకొన్న తేజమ్ము

చేతులు జోడించు చిత్తమొసగ

అర్థ నిమీలితమై  యలౌకిక తపో

మగ్నమౌ కన్నులు మనసు దోచ

మంగళాకరములౌ మహనీయ పాదముల్

తాకి కళ్ళద్దుకో తలపు దోప

సాయి నాధుండు ద్వారకా మాయి వెలసి

సకల ప్రాణుల తోడుగా సాక్షి యగుచు

వాడ వాడల కొలువుండి వరదు డగుట

పుడమి భారతి చేసిన పుణ్య ఫలము .



శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ


             హితబోధ చేసిన హితు డితండు

రెండు రూపాయల దండి దక్షిణ గొని

             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు

రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి

            తాననుభవించిన త్యాగ మూర్తి

' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ

            మాదుకొను కరుణామయు డితండు


సర్వ దేవతా సత్తాక సద్గురుండు

సాయి నాధుని  శరణంచు శరణు వేడి

చరణములు తాకి తరియింత్రు సకల జనులు

శరణు శరణంచు వేడితి సాయి !   రార .

                                                                  


 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 





 

26, సెప్టెంబర్ 2015, శనివారం

ఏవేవో యుపద్రవములు రావచ్చు .....


చంద్ర గ్రహము   భూమి శక్తికి లోబడి

కక్ష్యయందు దిరుగు   గడచి రాదు

భూమి దరికి  వచ్చిపోవుటల్ సహజమే

దాని కక్ష్యలోని దారి యదియె

 

వెరపేల ?  చంద్రుడీగతి

వరభూమికి డగ్గరించి వచ్చు భ్రమణముల్

చిరపరిచితమే _ జ్యోతిష

వరులారా !  కీడటంచు పలుకగనేలా ?

 

చంద్రశక్తి  భూమిశక్తిలో నారవ

వంతుకూడలేదు   వగచనేల ?

పుడమిచుట్టుదిరుగు  భౌమ్యోపగ్రహమైన

చంద్రగ్రహము జూచి   జడువనేల ?

 

ఏవేవో యుపద్రవములు

రావచ్చునటంచు నిట్టి రాయిడి పెట్టే

ఏవంవిధ జ్యోతిష్యము

భావింపగ   వీరి తీరు భాదించు కడున్

 

బోడిగుండుకు మోకాల్కి  ముడిభిగించి

ముచ్చటలుజెప్పు జ్యోతిష్య  మూర్తులార

ఇంకనైన నసత్యాల వంకబోక

జనహితమ్ము కోరి  ఘన ప్రశంశ గొనుడు

 

విశ్వమంతయు నియతమమై విశదమైన

క్రమము పాటించు చుండ   బుధ్దిమతులు  తమ

బుధ్ధి పాటవమును  వక్రపోకడలకు

వాడు చుండుట న్యాయమా ?  వలదు వలదు.  

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

హే మహాత్మ ! రాథికాశ్యామ ! మీ ప్రేమ రాగమయము

 
 
 
 
 
 
 
దూరాన చంద్రుండు దొంగ చూపులు చూచి
కొలనిలో వెన్నెల  చిలుకు చుండ
రాయంచ మిథునము  రాస క్రీడలు మాని
చకిత లోచనులయి  సాక్ష్యమివ్వ
కొమ్మ కొమ్మన పూలు కమ్మని పరిమళ
సౌహార్థములు వెదజల్లు చుండ
రాధిక కురులు  కరాన దువ్వుచు  తథే
కపరత  కృష్ణుండు  కనగ నయ్యె
 
అద్దమున  రాథ  కృష్ణుని ముద్దు మోము
గాంచు చున్నది ,  తన మోము గాదు ,  చూడ
నెంత గట్టిదో బంధమ్ము ,   హే మహాత్మ !
రాథికా శ్యామ !  మీ ప్రేమ  రాగ మయము .
 
 
 
 
 
 
 
 
 

16, సెప్టెంబర్ 2015, బుధవారం

దైవం లేని దెక్కడ ?


 
మానవ జీవనావసరాలలో జ్ఞానానికి తొలి ప్రాధాన్యతనిచ్చి జ్ఞానాన్ని దైవంగా భావించడం జరిగింది .

అందుకు ప్రతీకగా సరస్వతీ _ బ్రహ్మల మూర్తులను రూపొందించుకొని అర్చించినారు .

పాడి పంటలు  మొదలైన సర్వ సంపదలనూ ఆరాధనా భావంతో కొలిచి అందుకు ప్రతీకగా  లక్ష్మీ _ విష్ణు

మూర్తులను రూపొందించుకొని అర్చిస్తున్నారు . సృష్టికి మూలమైన స్త్రీ పురుష తత్త్వపు పవిత్రతకు

ప్రతీకగా లింగ రూపంలో పార్వతీ పరమేశ్వర మూర్తులను రూపొందించుకొని అభిషేకిస్తున్నారు .  

మానవ మనుగడకు ఆధారభూతాలైన భూమినీ , నీటినీ , నిప్పునూ , గాలినీ గౌరవించి

వాటికి ప్రతీకలుగా దేవతా మూర్తులను రూపొందించి కొలుస్తున్నారు .

తలపెట్టిన కార్యంలో విజయం సిధ్ధించాలంటే అవసరమైనది బుధ్ధి కుశలత . బుధ్ధి కుశలత

ద్వారా విజయం సిధ్ధించడమనే భావనకు ప్రతీకగా గణేష్ మూర్తిని రూపొందించి ప్రార్థిస్తున్నారు .

నదులను పుణ్యతీర్థాలుగా , పర్వతాలను పుణ్యక్షేత్రాలుగా , అడవులను వనదేవతలుగా ,

ప్రకృతిని ప్రకృతి మాతగా  _  ఇలా విశ్లేషిస్తూ పోతే  ,  భారతీయ తాత్వికతలో చెట్టూ , పుట్టా ,

జంతువూ , పక్షీ   _  ప్రతిదీ మానవ మనుగడకు అవసరమై  తద్వారా  పూజార్హమై కొలవ బడుతున్నవి .

ఇలా , మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ  _  అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం

కావచ్చు . మరి , భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ  ?    

 

         ఐతే _ జ్ఞానం , సంపద , కార్య సిధ్ధి  మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం

బంధమైన అవగాహన , పట్టుదల , కృషి  మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి . కృషిని వదిలి , దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయ మాటల వల్ల , మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు .

మౌఢ్యాన్ని వీడిన  చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య , జ్ఞాన , ఆనంద పరవశులౌతారు .  

 

           ఇక , యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాల

లోని మానవ సమాజాలను చైతన్య పరచి , అండగా నిలిచి ఆరాధ్యులైనారు . కృతజ్ఞతగా ఆయా

మహాను భావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి , పూజించడం , వారి జయంతులను

పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం .

ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే , శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుధ్ధుడు , సాయి మహరాజ్  , క్రీస్తు , మహమ్మదు _

ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు .

             ఇంకా , ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుం

టున్నారు . మరి , భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ ?  దైవం లేనిదెక్కడ ?  మలిన మస్తిష్కాలలో తప్ప .  

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

మాతృపిండం దదామ్యహం


 

గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ

నొప్పిని ప్రియముగా నోర్చుకొనును

అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో

నొదుగంగ గుండెల కదుము కొనును

ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక

మురిపాన చన్నిచ్చి పరవశించు

బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ

బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

 

అలుపెరుంగక రాత్రింబవలు భరించి

బిడ్డలే లోకముగ జీవించు" అమ్మ " _

బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,

బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

 

వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి

పూని చాకిరి చేయలేని నాడు

బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు

చేరి సహాయము కోరు నాడు

ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు

వైద్యావసరము కావలయునాడు

మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో

కలగుండు పడు కష్ట మొలుకు నాడు 

 

అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి

కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత

గాక పోయిన బాధ్యతగా దలంచి

జాలి చూపించ గలర ?  కాస్తంత యైన 

 

" మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర

ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు

కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి  

ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?