10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

కూసింత పొగిడింత

మాకు పెద్ద దిక్కు  మహిత మేథో రాశి
పేరు తెలవ దైన పేర్మి గలదు
కలము పేరు గలదు వెలయు జిలేబిగా
అప్పు డపుడు వొగుడు దమ్మ ప్రాపు .

పెద్దల వల్ల కొంత తన పెద్దరికమ్ము  తదీయ పోడుముల్
పెద్ద తనాలు బాధ్యతలు పేరులు పెన్నిధి  సింగపూరునం
దుధ్ధతులున్ విదేశముల టూరుల - వన్నియు పర్సనల్ - ఇవే
మొద్దు - మహోన్నతంపు తన మూర్తియె మాకు సదా స్తవాంశముల్ .

ఆంగ్లాన్ని తెలుగున కలవోకగా చేర్చి
మాటల పేటల్లు మహిత శక్తి
ప్రాచీన నూతన ప్రముఖ సాహిత్యాల
వైధుష్యమున్న సంపన్న శక్తి
పద్యాలు వ్రాయుటే ప్రతిభయం చనువార్కి
పట్టు బట్టి జవాబు బలుకు శక్తి
వంకర బుధులకు పుంఖాను పుంఖాలు
బిట్టుగా వాతలు బెట్టు శక్తి

ఎదిరి నొడ్డి పోరాడు ప్రావీణ్య శక్తి
ప్రతిభ లన్నియు నొక్కచో పరిఢ విల్లు
విధుషి  ' మామి ' ని వినుతించి విశద పరచు
విధిగ ' కూసింత వొగిడింత ' యిది ముదముగ .

27, జనవరి 2017, శుక్రవారం

శ్రీ శ్రీనివాసా శ్రీవేంకటేశా .....

శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా
ఇలవేల్పు నీవయ్య  ఇందిరా రమణా

కలియుగ దైవమై ఘనవైభవముతోడ
తిరుమల గిరులపై తిరముగా నిలిచావు /శ్రీశ్రీని/

దివ్య మంగళ మూర్తి దేదీప్యమానమై
భక్త కోటికి కనుల పండుగై వెలిశావు /శ్రీశ్రీని/

నిత్య కళ్యాణాలు పచ్చతోరణ ప్రభలు
అనుదినోత్సవములు అరుదైన సేవలు /శ్రీశ్రీని/

కోరిన జనులకు కొంగు బంగారమై
వరముల గుప్పించు వరదాన గుణశీల/శ్రీశ్రీని/

26, జనవరి 2017, గురువారం

రిపబ్లిక్ డే ఆకాంక్ష .....

సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,

ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే , 

ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,

విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,

పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,

లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే , 

మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే , 

పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే , 

మానసిక-శారీరక దుర్బలులను వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,

స్త్రీలనూ పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,

ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే , 

రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే , 

అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే ,

రచయితలూ, కవులూ, కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,

మెరుగైన జీవనం కోసం
ఆరోజొస్తే ఎంత బావుణ్ణు !

22, జనవరి 2017, ఆదివారం

రాముడే రాజుగా రక్షగా .....

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతయె సతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/

దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని /రాముడే/

అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/

రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లె లోకాన /రాముడే/

తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు /రాముడే/

పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ/రాముడే/

20, జనవరి 2017, శుక్రవారం

శిరిడిలో నొకసారి .....

శిరిడిలో నొకసారి  కురిసిన జడివాన
పెను తుఫానుగ మారె ,  జనులుజడిసి
ద్వారకా మాయిని  దరిసి సాయినిజేరి
రా  యన ' నిలు ' మని యాఙ్ఞ యిడెను ,
ఆగె వర్షము , ... ధుని యగ్నియు నొకపరి
పైకప్పు నంటెను , పరమ యోగి
తగ్గుమని యనగ తలయొగ్గె నగ్నియు
సాయి యోగివరుడు   సకల ప్రకృతి ,

పంచభూతాల శాసించు ప్రభలు గలిగి
ప్రకృతి భీభత్సముల నదుపాఙ్ఞ చేసి
ప్రాణులను కాచి రక్షించు ప్రభువయి జన
నతులు నుతు లందుకొంచు నున్నాడు భువిని .

సాయి సద్గురు సన్యాసి  సకల ప్రాణి
లోక విహితైషి  యోగి  ఆలోక మాత్ర
పంచభూతాల నదుపులో నుంచ గల్గు
ఖండయోగ సాధకుడు  బ్రహ్మాండ విదుడు .

కాళ్ళు చేతులు మొండెము కంఠము - లను
తుండెములు జేసి ఘనముగా ఖండయోగ
మొప్ప మరల నతికించి యెప్నటి వలె
సాధనము చేసె శ్రీసాయి సద్గురుండు .

కడుపు లోని పేగు లొడపున వెడలించి
బైట శుధ్ధి జేయు  పరమ యోగి
యోగ సాధన ఫల ముర్వి హితము కోరి
ధారవోసి  -  సాయి దైవమయ్యె .

కష్టముల నాడు తోడుగా కదలి వచ్చి
ఆపదలు బాపు  ఆ పరమాత్మ వోలె
ప్రజల పక్షాన నిలిచిన పరమ గురుని
దైవమని కొలుతురు సదా ధర్మ విదులు .


19, జనవరి 2017, గురువారం

తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా
గొప్పదనమిది భరత ఖండమందనాదిగా/తప్పేమి/
 
అవ్యయుని రూపాన నారాథ్యులై వెల్గు
దివ్య పురుషులు లేని దిక్కొకటి గలదా /తప్పేమి/
 
తీరు తీరుల గలరు దివ్యప్రభావులు
యెల్లెడల మనుజుల వెన్నంటి కాపాడగా /తప్పేమి/
 
కరుణాంతరంగు నీశ్వరుని దర్శింప
పంతమేటికి ఆ భాగవతులా సేవలో /తప్పేమి/
 
అరుదైన పరమాత్మసురుచిరా మూర్తిని
అరసి కొలువందగును ఆరాధ్యులందెలమితో /తప్పమి/

ఇందిరా రమణునీ హిమశైలజానాధునీ
ఇనకులేశునిగాని ఘనశ్యామునీగాని/తప్పేమి/
 
తిరుమలేశునిగాని శిరిడిసాయినీగాని
పరమాత్మ రూపాల పరిపరి దర్శించగా/తప్పేమి/

16, జనవరి 2017, సోమవారం

శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము .....

శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/

ఇలలోన కలలోన నెలవు నెలవులలోన
పలుకులో పాటలో పరమాత్మవూ నీవె

నీవు లేనీ చోటు నింగిలో నేలలో
నెలవులే లేవురా శ్రీసాయి రాజా !/ఇల/

పుడమిపై మొలకెత్తి పొలుపుగా వికసించు
రంగు రంగుల పూల రంగులోనూ నీవె /ఇల/

పిందెలై కాయలై ప్రియమార పండిన
మధుర ఫలముల లోని మధువులూ నీవే/ఇల/

జల జలా ప్రవహించు జలరాశియూ నీవె
తళ తళా మెరయు గిరి శిఖరమూ నీవె/ఇల/

వెలుగులు విరజిమ్ము విశ్వాంతరాళాన
వెలుగువై నీవుండ వెరపేమిరా మాకు/ఇల/

దారి నీవేయని దరిజేరినామురా
దారి జూపించి మా దిక్కుగా నిలుమురా/ఇల/

శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/

శ్రీమంగళాకార ! చేరి కొలుతుము నిన్ను
శ్రీచిద్విలాసా ! సిరులివ్వరా మాకు  /ఇల/


15, జనవరి 2017, ఆదివారం

ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా !

విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

నిన్ను నమ్మిన వాళ్ళు నిజ జీవితాలలో
ఎదురైన కష్టాల నెదిరి గట్టెక్కుదురు      /విని/

కల్మషము లేని నీ కరుణా కటాక్షాల
తడిసిన యెల్లరు తరియించ గలరు     /విని/

చేతులు జోడించి నీ చెంత జేరిన వాళ్ళ
భద్రతల బాధ్యతలు భరియింతువీవు     /విని/

 మది మందిరములలో నిను నిలిపి నిశ్చింత
నెమ్మది హాయిగా నిదుర వోదుమురా     /విని/


14, జనవరి 2017, శనివారం

బాదరాయణ సంబంధం - కథ కమామిషు .....

కోరి ప్రేమించి పెండ్లాడి క్రొత్త జంట
పురము వీడ్వడి వేరు కాపురము బెట్టె
నంతలో చుక్కతెగి పడ్డ యట్లు దిగిరి
బండి గట్టుక వచ్చిన బంధు జనులు

వరుని వైపున వారని వధువు తలచె
వధువు వైపున వారని వరుడు తలచె
వస్తు చయముల సమకూర్చ వరుని వంతు
వండి వార్చంగ వడ్డించ వనిత వంతు

ఇష్ట మైనట్టి వన్ని వండించు కొనుచు
తినుచు త్రాగుచు బంధువుల్ దిరుగు చుండ
తీరికే లేదు పాపము తినగ ద్రావ
కూడి తలపోయ నింకేడ? క్రొత్త జంట

తిష్ట వేసిన బంధుల తీరు జూచి
చేరి తమలోన జంట చర్చించు కొనగ
తమకు వారికి నెట్టి బంధమ్ము లేమి
యెరిగి యడిగిరి , వారు జంకేమి లేక

‘ అయ్యొ! మా బండి చక్రాల కొయ్య గాని
అట్టె మీయింటి ముందున్న చెట్టు గాని
బదరికా వృక్ష సంబంధ మగుట, మనము
బాదరాయణ సంబంధ బంధువులము ‘

అనిరి, నివ్వెర పోయిరి వినిన జంట ,
పరగ నేబంధములు లేని బంధమునకు
చేరి యీమాట భూమి ప్రసిధ్ది గాంచె
బాదరాయణ సంబంధ బంధ మనుట
(బదరికా వృక్షము = రేగు చెట్టు)

------వెంకట రాజారావు .లక్కాకుల

చలికోర్వలేను రమ్మని .....

చలికోర్వలేను రమ్మని
చెలి పుడమి బిలువ కవోష్ణ శ్రీకరములతో
వలపు పరిష్వంగ సుఖము
వెలయించగ నినుడు భువికి విజయము చేసెన్ .

సుజన సృజన బ్లాగు  నిజ శుభాకాంక్షలు
బ్లాగు వీక్షకులకు  పాఠకులకు
మహిత పర్వ మందు మకర సంక్రమణ వి
శేష కాల సకల సిరులు గురియ .

5, జనవరి 2017, గురువారం

ముదిమి పైకొన్న .....

ముదిమి పైకొన్న  రోగాలు ముసురు కొనును
జరయు రుజయును తగ ననుజన్ములనగ
తగని చాపల్య మొకవైపు తగులు వడును
పరగ వృధ్ధాప్య మింకొక బాల్య మనగ .

ఆరు పదులు దాటు నాహార్య మిది , సగటు
శక్తి గోలుపడు విషాధ ఛాయ
నడువ భారమంత నడుము మోకాళ్ళపై
పడి భరించ రాని బాధ మోయ .

తినగ నభిలాషయే గాని  తిన్న దరుగ
దదియునుంగాక మాంద్య రోగాతిశయము
షుగరు బీపీలు వెనువెంట చుట్టు ముట్టి
బ్రతికి నన్నాళ్ళు వెన్నంటి వెతలు బెట్టు .

చెప్పినదె చెప్పి  విసుగు వచ్చేంత వరకు
కొడుకులును కోడలులు మూసుకో యటంచు
కసరు నందాక తన వీరగాథ లాప
బోడు ముసలా డిదంతయు ముదిమి వింత .

వయసులో కనరాని దైవమ్ము వచ్చి
చింతనకు చేరు తన శక్తి చెడిన పిదప
తనువు  తనవారు  తనమాట వినరు గాన
దైవమైనను నాలించు తన నటంచు .

1, జనవరి 2017, ఆదివారం

2017 క్రొత్త సంవత్సరంలో .....

కరుణించి ప్రకృతి సకాల వర్షాలతో
మెండుగా పంటలు పండుగాత !

సిరి సంపదలతో శ్రీమంతులై జనుల్
జీవన సౌఖ్యాల చేరువగుత !

ఆరోగ్య సౌభాగ్య మందరి దరిజేరి
ఆనంద పరవశు లగును గాత !

దైవ చింతనలతో ధార్మిక గార్హస్థ్య
బాథ్యతాయుతములు ప్రబలు గాత !

ప్రకృతి భీభత్సములు లేక , పాలక జన
పాలనా పీడనలు , యుధ్ధ భయము లేక
శాంతి చేకూరు గాత ప్రజలకు - మించి
రెండు వేల పదేడు మేలెంచు గాత !

3, డిసెంబర్ 2016, శనివారం

నీతిమంత పాలనా ప్రతిభ .....

శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ
ప్రభవించి నడిచిన భరత భూమి
వేదాది వాజ్ఞ్మయ విజ్ఞాన వీచికల్
పరిమళించిన పుణ్య భరత భూమి
బౌధ్ధాది మతముల వర బోధనామృత
ఫలములు మెక్కిన భరత భూమి
గాంధీ మహాత్ముని ఖడ్గమయి అహింస
దొరల చెండాడిన భరత భూమి

ఘనత వేనోళ్ళ బొగడంగ కనుల యెదుట
రాజకీయ రంగమున విరాజమాన
దక్షతలు గలట్టి మన ప్రధాని నీతి
మంత పాలనా ప్రతిభ రవ్వంత చాలు .




1, నవంబర్ 2016, మంగళవారం

ఏ మహితాత్ముని .....

ఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
చిరునామగా విలసిల్లు చుండు
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక  శోభిల్లు చుండు
ఏ మూర్తిని స్పృశించి యిరవొందు నానంద
పారవశ్యము వీలు పడుచు నుండు
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ  నలరు చుంద్రు

ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ,
కోర్కెలీరేడు  , కష్టాలు కోలుపరుచు
నాతడే సాయి - జనులలో నమ్మక మిది ,
నమ్మకమె దైవమయి నిల్చు  వమ్ము గాదు .

18, అక్టోబర్ 2016, మంగళవారం

ఏ వ్రేలు పట్టి .....

ఏ వ్రేలు పట్టి తా నిలను నడిపించెనో
ఆ వ్రేలు తన కూత మగునొ లేదొ
ఏ బాల్యమునకు తా నింత ఙ్ఞాన మిడెనొ
ఆబాల్య మండయై ఆదు కొనున
ఏ తీగె సాగుట కెండు కట్టెయి నిల్చి
పెంచిన పొదరిల్లు ప్రియ మొసగున
కౌలు రైతిట వచ్చి  నిలువు కట్టెకు నీడ
నొనర నిచ్చున  పెద్ద మనసు గదుర

షష్టి సప్తతియు నశీతి చని  సహస్ర
పున్నములు జూచె నీ వృధ్ధ మూర్తి , యితని
సాదుకుందురొ లేదొ , ఈ స్వాదు ఫలము
రాలు నందాక బిడ్డలు మేలు దలచి .

16, అక్టోబర్ 2016, ఆదివారం

స్తవనీయ మైన హైందవము నాది

ధర్మంబు దప్పని  దశరథ సుతు డేలి
స్తవనీయ మైన  హైందవము నాది
శ్రీకృష్ణ పరమాత్మ  చెప్పిన గీతతో
స్తవనీయ మైన  హైందవము నాది
వాల్మీకి వ్యాసుల  వర పురాణాలతో
స్తవనీయ మైన  హైందవము నాది
జైన బౌధ్ధాది సంస్థల కలయికలతో
స్తవనీయ మైన  హైందవము నాది

శంకరులు సాయి పరమహంసాది  గురు ప
రంపరల బోధనలతో  విరాజ మాన
మై , మహోన్నత సంస్కృతీ మహిత ఘనత
దాల్చి , స్తవనీయ మైన  హైందవము నాది .

కలగనండి .....


కలగనండి , కల సాకారమగు వరకు
జయశీలురై కృషి సల్పుడనియె
ఆలోచనారీతు లందరివలె గాక
క్రొత్తగా నుండుట కోరుకొనియె
బలమైన సంకల్ప ప్రతిక్రియ యొక్కటే
గెలుపు దారులు వెదికించు ననియె
స్తబ్థత విడనాడి చైతన్యమొందిన
ఫలితాలు వెన్నంటి వచ్చుననియె

ప్రతి పలుకులోను మార్గదర్శనము చూపి
దేశప్రగతికి బాటలు వేసినట్టి
దార్శనికుడు ' కలాం' మహితాత్ముడు , నిజ
మైన 'భారత రత్న' , మహా మహుండు .

13, అక్టోబర్ 2016, గురువారం

అమ్మకు విన్నపం .....


మంచేదో తెలుసు
అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు
చెడేదో తెలుసు
అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు
మోస మనీ తెలుసు
అయినా నివారించడానికి తగిన నిబధ్ధత లేదు
స్వార్థ మనీ తెలుసు
అయినా విడనాడడానికి తగిన మానసిక సంసిధ్ధత లేదు
బ్రమ యనీ తెలుసు
అయినా బైట పడడానికి తగిన ధైర్యం లేదు
హింస అనీ తెలుసు
అయినా పరిహరించడానికి తగిన సౌమనస్యం లేదు
అన్యాయమనీ తెలుసు
అయినా ఎదిరించడానికి తగిన న్యాయ శీలత లేదు
దుర్మార్గ మనీ తెలుసు
అయినా వదిలి పెట్టడానికి తగిన సౌశీల్యం లేదు
అజ్ఞాన మనీ తెలుసు
అయినా జ్ఞానం వైపు పయనించడానికి తగిన సంస్కారం అలవడడం లేదు
       తర తరాల మానవ మేథస్సు పండించిన
       వేదాలు , ఉపనిషత్తులు, పురాణాలు , ఇతిహాసాలు , శాస్త్రాలూ –
       తదితర విజ్ఞాన(?)భాండాగార మంతా
       తెలుసు కోడానికేనా ?
       ఆచరించడానికి కాదా ?
          మనిషిని మనిషిగా గౌరవించడానికి కాదా?
          జ్ఞానం స్వార్ధానికి ఉపయోగించుకోవడానికేనా?
          మనిషిని బ్రమల్లో ముంచి మేధావులు - వాళ్ళ పబ్బం గడుపుకోవడానికా?
     
          మంచీ – చెడూ తేడా తెలుసున్న మేధో వర్గం చెడు వైపే మొగ్గు తున్నదెందుకని ?
అమ్మా !  దుర్గమ్మ తల్లీ !
‘ విజయ దుర్గ ‘ వైన నిన్ను
తర తరాలుగా కొలుస్తున్న మా ‘ బుధ్ధి ‘ కి
‘ చెడును ఎదిరించే పోరాట పటిమనూ ,
మంచిని ఆచరించ గల ‘    ‘ సత్తానూ ‘ ప్రసాదించు తల్లీ !
       


11, అక్టోబర్ 2016, మంగళవారం

అమ్మ సందేశం .....

చెడుపై కడదాకా యీ
పుడమిని పోరాడి దుర్గ  పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .

చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .

ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని  దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .

మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్

అమ్మ చెప్పినదిది , నమ్మి  తనంతగా
నెవడు పూని  సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి  చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు  వచ్చి దుర్గ .

10, అక్టోబర్ 2016, సోమవారం

ఎవ్వార లీవిశ్వ .....

ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి  తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

9, అక్టోబర్ 2016, ఆదివారం

వర పరంజ్యోతి దుర్గమ్మ

కరుణా తరంగిత  కమనీయ దృక్కుల
చల్లంగ జూచెడి తల్లి దుర్గ
అమృతాంతరంగిత  విమల వాత్సల్యాల
దగ్గర దీసెడి తల్లి దుర్గ
వరదాభ యామృత కర సహస్రాలతో
అడిగిన విచ్చెడి మ్మ దుర్గ
కోటి సూర్య ప్రభలు కూడిన డెందాన
తమిదీర దీవించు తల్లి దుర్గ

కష్ట నష్టాది జీవితాంకములుగాని
భయ దరిద్రాది బాదర బంది గాని
ప్రజల దరిజేర కుండ దుర్గమయి నిల్చి
కాచి కాపాడు తల్లి మా కనక దుర్గ .


 మిరుమిట్లు గొలిపెడి  మెరుగు బంగారంపు
పచ్చని తనుచాయ బరగు తల్లి !
ముమ్మూర్తులకు , వారి మువ్వురు సతులకు
మూలపుటమ్మయి గ్రాలు తల్లి !
అమ్మ తనమ్ము బ్రంహ్మాండమ్ము నిండి  వె
లుంగ వాత్సల్యమ్ము లొలుకు తల్లి !
జీవ కోటికి మహా జీవనానందమై
అనురాగములు పంచు అమృత వల్లి !

 అమ్మ ! అమ్మల కమ్మ! మాయమ్మ! దుర్గ !
బిడ్డలను కాచి  రక్షించు ప్రేమ మూర్తి !
వర పరంజ్యోతి! దుర్గమ్మ!  వదలనమ్మ
పాద పద్మాలు - పట్టిన పట్టు వదల . 

8, అక్టోబర్ 2016, శనివారం

వాగ్దేవి ! శారదా ! వందనములు .

నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లే తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించే తల్లి !
పరదేవతా ! మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

22, సెప్టెంబర్ 2016, గురువారం

జయము జయము శిరిడి సాయికి


సాయి మందిరాలు  సమతకు నిలయాలు
కులము మతము లచట నిలువ రావు  ,
మూర్తి పాద పద్మ ములు తాకి  పులకించు
ఫలము పొంది రిచట భక్తులెల్ల  .

సాయిని  'తన'వాడని 'ప్రతి
సాయి ప్రభుని గొల్చు వాడు ' సతతము తలచున్  ,
సాయియు 'ప్రతి భక్తుని' తన
చేయారగ 'దరికి' దీసి చెలువము జూపున్  .

సకల దేవతలను  సాయి రూపున జూచి
భజన చేయు విథము ప్రబలె నిపుడు  ,
సాయి మందిరాలు సకల దేవతలకు
పూజలందు క్షేత్ర ములయి వెలిగె .

మందిరాన వెలయు మహిమాన్వితామూర్తి
పాద పూజ చేసి పరవశించు
భాగ్య మిచట దొరుకు  ,  భక్తుల కింకేమి
కావలయును  ? శాంతి గన్న పిదప  !

సాయి మాకు ప్రభువు - సన్మార్గ దర్శియై
మమ్ము నడిపి బ్రతుకు మనుపు చుండె  ,
అండ నిలిచి పలికి  అభయ హస్తమ్మిచ్చి
కష్ట కాలమందు కాయుచుండె  .

5, సెప్టెంబర్ 2016, సోమవారం

కొలిచిన వారికి కొండంత వేలుపై .....

కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కామ్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి

మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు  సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుని  తొలిపూజ చేసి కొలుతు .

25, ఆగస్టు 2016, గురువారం

వలచిన రాధికా .....

వలచిన రాధికా లలన కౌగిట జిక్కి
ప్రియమార నిలిచిన ప్రేమ రాశి
కొలిచిన రుక్మిణీ చెలువ భక్తికి జిక్కి
హృదయాన కొలువైన మథుర వాసి
తలచిన గోపికా చెలుల రక్తికి జిక్కి
వశమైన యనురాగ వత్సలుండు
పిలిచిన దీనుల పిలుపు శక్తికి జిక్కి
పరుగున కాపాడు కరి వరదుడు

మంచి చెడులందు జీవించు మానవులకు
మార్గ నిర్దేశ మొనరించి , మంచి వైపు
నడుపు గీతోపదేశ మొనర్చు గురుని
కృష్ణు నర్చింతు కడగంటి కృపలు బరుప .