26, జనవరి 2016, మంగళవారం

నీళ్ళు కూడ కొన వలసిన బ్రతుకులు .....




ఆనాటి నేతలు ప్రాణాలకు తెగించి  
ఉద్యమాలందు ముందురికినారు
ఆనాటి కవివరుల్ వేనోళ్ల నినదించి
ప్రజలను చైతన్య పరచినారు
ఆనాటి యువత వీరాధి వీరత్వ ము
రకలెత్త నిలిచి పోరాడినారు
ఆనాటి మహిళలు మేని యాభరణాల
నొలిచిచ్చి అండగా నిలిచినారు

మొనసి ధన మాన ప్రాణముల్ తృణము గాగ
నెంచి స్వాతంత్ర్య సమరాణ నిల్చి నారు
భరత మాతృ శృంఖలముల సరము త్రెంచి
స్వేచ్చ , స్వాతంత్ర్య ఫలముల నిచ్చి నారు .

గాంధి విలువలు , జవహరు గారి స్ఫూర్తి ,
పరగ సర్దారు ధీరత్వ పటిమ  _ నిలిచి 
భారతావని కీర్తి వైభవము గాంచు
నంచు నూహింప బడియె , గానది చివరకు,

స్వార్థములు దప్ప జనహిత పరత లేని 
నిండు వ్యాపార వేత్తలు నేత లైరి
ఈన గాచి నక్కల పాలయిన విధముగ
పాలకుల జేరె స్వాతంత్ర్య ఫలము లెల్ల .

విద్య , వైద్యాలె కాదు _ భావింప నీళ్ళు
కూడ కొన వలసిన బ్రతుకులుగ మార్చి
సొంత వ్యాపార సామ్రాజ్య మెంత గొప్ప
గా జరుపుకొను చుంటిరో గద ! ప్రభువులు .


21, జనవరి 2016, గురువారం

తులసి వనాలా ..... ?



కోమల జల స్రోతస్విని
గ్రామీణ తెలుంగు , సదరు లలిత పదాలన్
ధీమమ్మున వెలయించిరి
వేమన్నయు అన్నమయ్య వేడుక కల్గన్ .

పిడికెడు మంది ప్రబుధ్ధులు
పడి పడి తలలూచు కొఱక పద్యపుశోభల్ ?
నడయాడ వలద , తెలుగుల
నడివీధుల , నాల్గుదెసల నాట్యపు హేలల్ .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
బ్లాగు తనదటంచు పలికి , యొకడు
తెలుగు గ్రామీణుల తేట పదాలున్న
పద్యము ప్రకటించ  వద్దనియెను .

తనది తులసి వనము , తాకరాదనెనొక్క
యాచకుండు , భజన మేచకుండు
వారు వీరు జేరి వర్థిల్ల జేతురా ?
స్వార్థపరులు తెలుగుభాష నకట !

మహితాత్ములు పూర్వకవులు
మహనీయ గుణాలవాల మాన్యులు , వీరో ?
బహు నీచ మనో లాలస
మహితాత్ములు విడువరెపుడు మాలిన్యములన్ .

15, జనవరి 2016, శుక్రవారం

ఆనాటి పెద్ద పండుగ ....



భూమి హేమంత ఋతు రాజ్ఞి ప్రేమ బంధ
నాలు వీడి , సూర్యుని కవోష్ణ రుచిర పరి
ష్వంగ సుఖము కోరంగ ప్రయాణ మిద్ది ,
పుడమికి మకర సంక్రాంతి పుణ్యదినము .

గతము కళ్ళ ముందు కదిలాడు చున్నది ,
నిన్న జరిగినట్లు నేటికిన్ని ,
పెద్ద పండుగన్న పెద్దపండుగె మరి ,
పొంగు పొంగలి హృదయంగమమ్ము .

అన్నదమ్ముళ్ళు , భార్యలు , అమ్మ నాన్న ,
పిల్లలు , ముసలోళ్లు మరియు పెళ్ళికాని
తమ్ములును చిన్నచెల్లెల్లు , తడవ తడవ
కలిసి జీవించు చుట్టపక్కాలు గలుగ ,

నిండు పెద్ద కుటుంబాలు , పండుగలకు
తడిసి మోపెడు ఖర్చులు , దారి లేదు ,
తలకొక జతైన బట్టలు తప్పని సరి ,
పిండి వంటలు మస్తుగా నుండవలయు .

భూమిని నమ్మిన రోజులు ,
రామునిపై నమ్మకమున రాజిలు రోజుల్ ,
తామింత దిని ఘనమ్ముగ
ప్రేమమ్మున నొకరికింత పెట్టెడు రోజుల్ .

31, డిసెంబర్ 2015, గురువారం

క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె

క్రీస్తు శకము నందు ప్రస్తుత మ్మింకొక్క
క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె ,
మనిషి బ్రతుకు నందు  మార్పులేవైపుకో ?
మంచివైపు కగున  ఇంచుకైన ?

భూమికావల నెక్కడో పుడమి బోలు
పుడమి కోసము గాలించు బుధులు !  ‘ సగము
కూటి కేడ్చెద రిచట ‘  ఆకొన్న జనుల
గూర్చి బాగోగు లరయరా ?  కొంచమేని .

గతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
మయ్యె గాని  , సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె  అన్నింట మాన్యత గద !

తెలుగు రాష్ట్రాలు రెండయ్యె , చెలగి యందు
ఒకటి స్వర్ణాంధ్ర యయ్యె , ఇంకొకటి యిదిగొ !
కనుడు! బంగారు మయమయ్యె , కరువు బట్టి
రైతు చచ్చెను మృత్యు కోరలకు జిక్కి .

ధరవరలు పెరిగి బతుకు దారుణమయి
సగటు జీవులు కడగండ్ల బొగులుచుండ ,
పట్ట వేలిన వారికి ప్రజల పాట్లు
ఏటి కేడాది మారిన నేమి యొరుగు ?