25, మార్చి 2016, శుక్రవారం

మీరూ మరో పద్యం కట్ట కూడదూ !




పళ్ళు చూడ    నోట నీళ్ళూరు చున్నవి
కళ్ళు తిప్ప లేని    కాంక్ష కలుగు ,
నేల తల్లి మనకు   కాలాను గుణముగా
తినుట కిచ్చె     ఋణము తీర్చుటెట్లు ?









23, మార్చి 2016, బుధవారం

బృందావనమున .....



భూమీ తలమును  రంగుల
ఆమని ముంచెత్తె , చివురుటాకులెరుపులో
పామిన శ్యామలమయ్యెను ,
ఏమని వర్ణించ వచ్చు నీ వని  యమునన్ .

నిండుగా పూచి  పొగడ  వన్నియలు వోవ
దరిసి నాధుని కైసేయ దండ గ్రుచ్చి
మురిసి రాధిక మాధవుముందు నిల్చి
గుండెలకు గుండెలానించి దండ గూర్చె .

మోదుగ పూగుత్తిని గన
మాధవునికి రాధమీద మనసు దవిలి , బిం
బాధరి మోవికి వంశీ
మాధుర్యపు కేళి పంచి మరులొలికించెన్ .

బృందావనమున గోపీ
బృందముతో కృష్ణు డాడె , బింబాధరులున్
బందీలై మాధవునికి
సంధించిరి సరస మధుర  సరి సమరమ్ముల్ .

ఇది వసంత హేల , యిల కెన్నిరంగులో
ప్రకృతి కన్య పూచి పరవశించె ,
ఇందు బ్రతుకు మనిషి కెందుకో  ప్రకృతితో
పాలు పంచు కొనుట పడుట లేదు .  

2, మార్చి 2016, బుధవారం

కోమల జల స్రోతస్విని గ్రామీణ తెలుంగు .....



'తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు'
పండితులను గూర్చి పద్య  మిదియ ?
అన్ని మకె దెలియునన్న యహంకార
సలు విడరు వేమ!  సిసలు మాట .

పిడికెడు మంది ప్రబుధ్ధులు
పడి పడి తలలూచు కొఱక పద్యపుశోభల్ ?
నడయాడ వలద , తెలుగుల
నడివీధుల , నాల్గుదెసల నాట్యపు హేలల్ .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
బ్లాగు తనదటంచు పలికి , యొకడు
తెలుగు గ్రామీణుల తేట పదాలున్న
పద్యము ప్రకటించ  వద్దనియెను .

తనది తులసి వనము , తాకరాదనెనొక్క
యాచకుండు , భజన మేచకుండు
వారు వీరు జేరి వర్థిల్ల జేతురా ?
స్వార్థపరులు తెలుగుభాష నకట !

మహితాత్ములు పూర్వకవులు
మహనీయ గుణాలవాల మాన్యులు , వీరో ?
బహు నీచ మనో లాలస
మహితాత్ములు విడువరెపుడు మాలిన్యములన్ .

కోమల జల స్రోతస్విని
గ్రామీణ తెలుంగు , సదరు లలిత పదాలన్
ధీమమ్మున వెలయించిరి
వేమన్నయు అన్నమయ్య వేడుక కల్గన్ .