16, ఆగస్టు 2014, శనివారం

రాధా మాధవం

ఎందుకో ఆ పున్నమి చంద్రుని కంత విచ్చుబాటు , 
వొళ్లు తెలియనంతగా పరవశిస్తున్నాడు .                                                                  
ఏమా మలయ సమీర మంద గమన మదం ,
పూదోటల పరిమళాలతో దొంతర దొంతరలుగా,
యేటి నీటి తుంపరలు వెదజల్లు చున్నాడు .
ఎంత నిగారింపు ఈ తట సైకతానికి ,
పసిడి మిసిమి మిస మిసల హొయలు పోతోంది .
              -----------
కతమేమిటో కళ్లకు కట్టినట్లు కనబడుతూనే ఉంది ,
కలువ కనుల అలల కళల జల వాహినికి .
కను కలువలు విచ్చి మరీ చూస్తోంది ,                                                                      
కాసేపైనా రెప్పలార్పకుండా .
               -----------
ఆ యమునా తట సైకత శయనంలో
పున్నమి వెన్నెల జిలుగు వెలుగులలో
ఆ ప్రణయిని
ఎంత సేపట్నించి
తన్మయత్వంతో
ఆ సమ్మోహన రూపసిని చూస్తోందో
ఆ చూపులు అనిమేషాలై
అమృతత్వాన్ని సంతరించుకున్నట్లున్నవి .
              ----------
ఎంత సేపు ఆ లీలా మానుష
మనోహర రూపాన్ని చూస్తోందో
ఆ ప్రేమ మయి
మంత్ర ముగ్ధ చిత్తరువై కన్పిస్తోంది .
ఆ నవ మోహనాంగి
ఆ మోహనాకారుని
పరిష్వంగం కోసం
పరితపిస్తున్నట్లు కన్పిస్తోంది .
నుదురు ముద్దాడింది
కనురెప్పలకు పెదాలద్దింది
చిరునగవు చికురాన్ని చుంబించింది
అధరాలకు అధరాల మధువు లందించింది
గళసీమకు కరకమలాలు కీలించింది
ఎద శయ్యపై సేదతీరింది
          ----------
ఒకరి కొకరుగా
ఇద్దరొకరుగా
ఒకే ఒకరుగా
ఆ రూపం సమ్మోహనం
ఆ తేజం మనోహరం
ఆ వదనం మధురం
ఆ నయనం మధురం
ఆ హసితం మధురం
ఆ ప్రేమ మధురాతి మధురం .
అదే రాధా మాధవం .
జగతికి -
అదే తొలి ప్రేమ కావ్యం .
       -----------
ఆ ప్రేమ కావ్య సాక్షిగా
ఆ యమునా శ్రోతస్విని
ఆనంద డోలికలలో ఊగుతూ
నిరంతరాయంగా
కొనసాగుతూనే ఉంది .


15, ఆగస్టు 2014, శుక్రవారం

కృష్ణ రారా చిన్ని కృష్ణ రారా

కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా   || కృష్ణ రారా ||

తర తరాల తల్లి ప్రేమ   త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ    కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ రారా ||

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను
మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     || కృష్ణ రారా ||

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు   || కృష్ణ రారా ||

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున    తినిపించిరి గోపాలురు         || కృష్ణ రారా ||

తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న                  ||  కృష్ణ రారా  ||

3, ఆగస్టు 2014, ఆదివారం

స్నేహ శీలురైన తెలుగు బ్లాగర్లందరికీ స్నేహాంజలులు

తెలుగు వలె తియ్యనిది
వెలుగు వలె జిలుగైనది
తెలుపు వలె స్వఛ్ఛమైనది
నలుపు వలె నమ్మకమైనది
చెలువము వలె దరి చేర్చేది
వలపు వలె వదిలి పోనిది
కలువ వలె కన్ను గీటేది
కొలను వలె కలలు పూచేది
పలుకు వలె ప్రేమ చిలుకరించేది
పిలుపు వలె ప్రియమైనది
పులుపు వలె ఊరించేది
ఉలుకు వలె ఉడికించేది
చెలియ వలె వెచ్చనిది
చెలిమ వలె చల్లనిది
అలుపు వలె సొలపనిది
సొలుపు వలె సలపనిది
కొలువు వలె విలువైనది
నెలవు వలె సుళువైనది
మొలక వలె మోసు లెత్తేది
తలపు వలె తరగనిది
కలిమి వలె కన్నుమొరగనిది
కలకాలం కలిసుండేది
ఇంకేమున్నది
ఒక్క స్నేహం తప్ప 
స్నేహ శీలురైన
తెలుగు బ్లాగర్లందరికీ
చెలిమి దివసాన
సుజన-సృజన
స్నేహాంజలులు . 

31, జులై 2014, గురువారం

పాద పూజ

ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే
పరమేశ్వరున కిడు పాద పూజ
ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే
పాలిచ్చు తల్లికి పాద పూజ
సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే
భాషా మతల్లికి పాద పూజ
తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే
పంతులు గారికి పాద పూజ 

గ్రాంధికము వీడి  గ్రామీణ కమ్మదనపు 
తెలుగు నుడికారముల సొగసులు కుదిర్చి 
పద్యములు కవితలు వ్రాసి పాడుకొనుటె 
పండితా !  తెల్గు తల్లికి పాద పూజ . 


గ్రామీణ సర్కారీ బడుల ఘనత

సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
చేతి నిండ రియలెస్టేటు వల్ల
పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
విద్యానిధులు బొక్కు విధుల వల్ల
పాఠశాలల బాగు పట్టదు నేతకు
కార్పొరేటు బడుల కలిమి వల్ల
బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
జీవన పోరాట స్థితుల వల్ల

వెరసి - సర్కారు బడులలో వెలయు చదువు
చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన
తీరు తెన్నుల భాసించు తీరు చూడ
చదువు మృగ్యము చదువుల సుదతి సాక్షి .

కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు
తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె
చదువు సర్కారు బడులలో చక్కనైన
కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు .

28, జులై 2014, సోమవారం

తస్మై శ్రీ గురవే నమ:

ఎనిమిదో తరగతి గదిలో పిల్లాడి ఏడ్పులూ , పెడబొబ్బలు .
ప్రక్క గదిలోని నేను                                                                                                     
పాఠం ఆపి , వరండాలోకి వచ్చి , కిటికీ లోంచి చూశాను .
ఒక పిల్లాడు నేలమీద దొర్లుతూ పెడ బొబ్బలు పెడ్తున్నాడు .
మా స్కూల్లో పిల్లలు కూర్చుందుకు ఏరూముకూ బల్లలు లేవు .
టీచర్ వాడ్ని కాళ్ళతో తంతున్నాడు .
నేను వేగంగా గది గుమ్మం లోకి చేరుకున్నాను .
సార్ , అంటూ బిగ్గరగా గద్దించాను .
నన్ను ఊహించని అతడు సడన్ గా నావైపు తిరిగేడు .
రండిలా , అని మళ్ళీ గద్దించాను .
వచ్చాడు .
' ఏమిటి మీరు చేస్తున్నది?'
' హోంవర్కు చేయలేదు పైగా ఎదురు మాట్లాడు తున్నాడు సార్ '
' అయితే?'
' అయితే ఏమిటి , దండించ నక్కరలేదా '
' దండించడమంటే పిళ్లాడ్ని కాళ్ళతో తన్నడమా '
నా స్వరంలో గౌరవం మారింది .
సంబోధనలో ఏకవచనం ప్రవేశించింది .
' ఎవరిచ్చారు నీకీ అధికారం'
' నీవసలు టీచరువేనా '
' టీచరు సంగతి సరే , నీవసలు మనిషివేనా '
నాకోపం తారా స్థాయికి చేరింది .
అక్కడ్నుంచి వెళ్ళి పొయ్యాడు .
అతడు చాలా జూనియర్ .
                   -----
      ఈ సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత  నా వద్దకు వచ్చాడు .
సారీ చెప్పాడు .
పిల్లలను కొట్టడం నేరమనీ , కార్పోరల్ పనిష్మెంట్ నిషేధించ బడిందనీ ,
ఒక్క ప్రధానోపాధ్యాయునికి మాత్రమే కేన్తో అరచేతిపై మాత్రమే రెండు
చిన్న దెబ్బలు వేసే అధికారముందనీ , అదీ ప్రవర్తనకు సంబందించి
మాత్రమే ననీ వివరించి ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించ వద్దని చెప్పాను .
సదరు టీచర్ తదాదిగా నన్ను రోల్ మోడల్ గా తీసుకున్నాడు . మంచి
టీచర్ గా పేరు గడించాడు .
                     -----
విద్యా సంస్థలలోనూ , వైద్యశాలలలోనూ పని చేసే సిబ్బందికి ఉండవలసిన  
మొదటి లక్షణం ఓర్పు . పురుషుల కంటే మహిళలకు ఓర్పు అధికం అంటారు .
అందు వల్లనే నేమో పూర్వం ఈ రెండింటిలోనూ ఎక్కవగా తీసుకునే వారు .
అసలీ టీచర్లు పిల్లల విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు ? పిల్లల విషయంలో
కక్ష – అనే పదానికే ఆస్కారం లేదు కదా . అల్లరి చేయడం బాల్య చాపల్యం
కిందికి వస్తుంది . నిజమే , పిల్లలు విసిగిస్తారు . అంతమాత్రాన , వాళ్ళు
పిల్లలు అనే విచక్షణ కోల్పోతే ఎలా ఈ టీచర్లు ?
ఆకట్టుకునే బోధనా చాతుర్యం , బోధనానుభవం ఉన్న ఉపాధ్యాయుణ్ణి
విద్యార్ధులు అమితంగా ఇష్ట పడుతారు . ఆ సార్ క్లాస్ రూంకు వస్తున్నాడంటే
విద్యార్థుల ఉత్సాహం పురి విప్పి నాట్యం చేస్తుంది .
తరగతి గది లోకి వస్తూనే , పాఠ్యాంశానికి సంబంధం న్నా , లేకున్నా
ఒక క్రొత్త విషయాన్ని తీసుకొచ్చి ఆసక్తి కరంగా వినిపించి పిల్లల మస్తిష్కాలను
తన బోధన వైపు మళ్ళించు కుంటాడు , మంచి ఉపాధ్యాయుడు . అతని బోధన
ఆసాంతం జీవ కళ ఉట్టి పడుతూ కొన సాగుతుంది . ఉపాధ్యాయునిలోని ఈ
సామర్ధ్యం అతన్ని విద్యార్ధులకు దగ్గరగా చేర్చి , ఒజ్జలలో మణిపూసగా
నిలుపుతుంది . ఉపాధ్యాయునిలో దాగి ఒక సహజ నటుడుండాలి .
అవసరమైనప్పుడు ఆడాలి , పాడాలి . ఉపాధ్యాయుడు ఒక సజీవ విజ్ఞాన
సర్వస్వం కావాలి . ఇతనికి తెలియని విషయమంటూ లేదని అనిపించుకోవాలి .
ఉపాధ్యాయునికి సునిసిత పరిశీలనా జ్ఞానముండాలి . డే టు డే క్రొత్త విషయాలను
నేర్చుకుంటూ అప్ డేటెడ్ గా ఉండాలి . ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్ధి .
                      -----
అన్నింటి కంటే , పిల్లల యెడ ప్రేమ దయ ఉండాలి . నిరంతరం విద్యార్ధులకు
మార్గదర్శనం చేస్తూ ఉండాలి . క్లాస్ రూంలో పిల్లాడి వెనుకబాటు తనానికి
ఒక్కొక్కప్పుడు అతని కుటుంబ స్థితి గతులు , పరిసరాలు కారణంకావచ్చు .
వాడి స్థితి గతులతో నాకేమిటి అనుకునే వాడసలు ఉపాధ్యాయుడే కాదు .
దయామయుడైన ఉపాధ్యాయుడు దండించడం మాని , కారణాన్ని అన్వేషిస్తాడు .
సమస్యను సాధ్యమైనంతలో చక్కజేసి విద్యార్ధిని అధ్యయనోన్ముఖున్ని చేస్తాడు .
ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తులకంటే భిన్నమైనది . అందుకే,అత్యున్నత స్థాయికి
చేరుకున్నాక కూడా తనకు చదువు చెప్పిన టీచరుకు నమస్కరిస్తాడు విద్యార్థి .
ఈ గౌరవం సమాజంలో ఒక్క ఉపాధ్యాయుడికే లభిస్తుంది.మరి దాన్నికాపాడుకో
వాలంటే నిబధ్ధత ఉండాలిగా .



24, జులై 2014, గురువారం

'కష్టే ఫలే కబుర్లు' - ఒక చిన్న ప్రశంస

ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
అక్షర రూప హృద్యంగమమ్ము
ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
స్పందించి వ్రాసిన బడుగు బొమ్మ
ఒకచో మనోల్లాస చకిత జీవన చిత్ర
రమణీయ భావనా రస విశేష
మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
ర్శనము శాయంగల ప్రతిభ లున్న

అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
నియతి 'కష్టే ఫలే'  బ్లాగు నిర్వహించు
హితుడు 'భాస్కర శర్మ' మాకిష్టు -డరయ
బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు

వట్టి కబురులు గావు - చేవ గల జీవి
తానుభవ సత్యములు – నేటి మానవులకు
మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
రూపు దాల్చిన శర్మగారూ !  నమస్సు .


19, జులై 2014, శనివారం

నా ప్రియమైన తండ్రీ , సదా నీకు కృతజ్ఞుడను .

హే భగవన్ !
నిన్ను వెతుక్కుంటూ
ద్వాదశ శైవక్షేత్రాలూ
నూటొక్క తిరుపతులూ
కొండలూ కోనేరులూ
ఇక్కడా అక్కడా
ఎక్కడెక్కడో తిరిగా
అక్కడంతా
గుళ్ళూ గోపురాలూ
రాళ్ళూ రప్పలూ
వాటికి హారతులు పడుతూ
అఢ్డ నామాలూ నిలువు నామాలూ
వాళ్ళ అభిజాత్యాలూ
అహంకారాలూ
పటాటోపాలూ
బ్రతుక నేర్చిన తనాలూ తప్ప
ప్చ్ , నీవు కనిపిస్తేగా
     ----- 
వేద,వేదాంగ,వేదాంత వేద్యుడవనీ
పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయనీ
ప్రబంధాలు ప్రస్తుతిస్తున్నాయనీ
సారస్వతమంతా వెతికా
అక్కడంతా
ఒకదానికొకటి పొంతన లేని
నిన్ను నిరూపించడానికి
చేసిన వ్యర్ధ ప్రయత్నాలు
అర్థం పర్థంలేని మెట్ట వేదాంతాలు
జటిలమైన బ్రహ్మ పదార్ధాలు
అక్కడా నీవు కనిపిస్తేగా
        -----
మాలో కొందరు మూర్ఖులు
మేమే దేవతల మన్నప్పుడు
మేము మానవాతీతుల మన్నప్పుడు
మాలో కొందరు దురహంకారులు
మేమే అధికుల మన్నప్పుడు
మేము అధిపుల మన్నప్పుడు
మాలో కొందరు దుర్మదాంధులు
అంతరాలు సృష్టించినప్పుడు
మనుషుల్ని మనుషులుగా చూడనప్పుడు
మాలో కొందరు స్వార్ధ మేధావులు
నీ పేరు మీద దుర్మార్గాలకు పాల్పడు తున్నప్పుడు
నీ ఉనికి ప్రశ్నార్ధకమై
ఆఁ , దేవుడనేవాడుంటేగా ,
అన్పించింది
        -----
అయినా ,
సకల చరాచర జగత్తునూ
సమదృష్టితో కటాక్షిస్తున్న
ఓ జగధాధార సచ్చిదానంద రూపా ,
నేను నిన్ను నమ్ముతున్నాను
నీవున్నావని -
చినుకు రాలినప్పుడు
మొలక మొలిచినప్పుడు
పువ్వు విచ్చినప్పుడు
పరిమళం గుభాళించినప్పుడు
పంట పండినప్పుడు
ఫలాలు చేతి కందినప్పుడు
కష్టాలు గట్టెక్కినప్పుడు
కామితాలీరేడినప్పుడు
స్వాస్త్యం చేకూరినప్పుడు
ఆనందాన్ననుభవించినప్పుడు
ప్రకృతి ధర్మం భాసిస్తున్నప్పుడు
జీవం ఉనికి ఉట్టిపడు తున్నప్పుడు
ఇంకా , అనేకానేకాలుగా -
నీ సాక్షాత్కారం వీక్షిస్తూనే ఉన్నా
హే భగవన్ !
నా ప్రియమైన తండ్రీ ,
నీకు సదా కృతజ్ఞుడను .



17, జులై 2014, గురువారం

కృతజ్ఞులమై ఉందాం - ఋణం తీర్చుకుందాం

వాన చినుకు నేల తాకింది
నేల తల్లి పరవశించింది
తల్లి కడుపులో దాగిన విత్తనం
విత్తనంలో దాగిన జీవం
జీవంలో కదలిక
కార్యోన్ముఖమైంది
కదలిన జీవం
శక్తిమంతమైంది
నేనున్నానంటూ
నేలను చీల్చుకొని
మొలక
మోము పైకెత్తింది
సగర్వంగా
ఆకసంవైపు చూచింది
చివురులై
ఆకులై
రెమ్మలై
కొమ్మలై
మొగ్గలై
పూవులై
పిందెలై
ఫలాలై .....
అద్భుతం
ఆవిష్కరించింది
ప్రకృతి ధర్మం
కర్తవ్యం నిర్వహించింది
ఆ చినుకూ
ఈ నేలా
ఈ ప్రకృతీ
ఆ ప్రకృతి ధర్మం
మనల్ని
వీడకుండు గాక !
ఆ చినుకుకూ
ఈ నేలకూ
ఈ ప్రకృతికీ
ఆ ప్రకృతి ధర్మానికీ
మనం కృతజ్ఞులమై ఉందాం
అంజలి ఘటిద్దాం
ఋణం తీర్చుకుందాం .