6, నవంబర్ 2015, శుక్రవారం

రామ ! రఘురామ ! శ్రీరామ ! రామ ! రామ !









ఈరేడు లోకాల నేకపత్నీవ్రత
మొక్క రామునికిగా కొండులేదు
ఒక్కటే మాటగ నొక్కటే శరముగ
నొక్కరాముండుగా కొండులేరు
ధర్మంబు దప్పని ధరణీశు డిలలోన
నొక్కరాముండుగా కొండులేరు
రక్షించు విభులలో రాణకెక్కిన యతం
డొక్కరాముండుగా కొండులేరు

నామజపమాత్ర తరియింప నాశ్రయ మిడ
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు
పల్లె పల్లెన గుడులలో భజనలంద
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు .


రాముడేలిన రామరాజ్యమందంతట
నెల మూడు వానలు నిలిచి కురిసె
రాముడేలిన రామరాజ్యమందంతట
ధర్మంబు నాల్గు పాదాల నడిచె  
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రకృతి సుభిక్షమై పరవశించె
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రజలలో సుఖ శాంతి పరిఢవిల్లె

నాడు రాముడే రక్షణ , నేడు రామ
నామ మా రాముకంటె కనంగ శత స
హస్ర మెక్కుడై నిల్చి , మహా మహిత ప్ర
భావ శీలమై రక్షించు భక్త జనుల .


శ్రీరామ పట్టాభి షేక చిత్తర్వుతో
యిళ్ళలో జేరెద రిచటి జనులు
తొలుదొల్త శ్రీరామతో మొదుల్ బెట్టక
యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
నిద్రకు జారుట నియతి యిచట
రామనామమ్ములు రంజిల్ల భజియించి
మంచాలు దిగుదురు మనుజులిచట

మరణ శయ్యను గూడరామా యనుటను
మాట గోల్పోవు చున్నను మరువ రిచట
యిచటి జన జీవనమున మమేకమయ్యె
రామనామమ్ము శ్రీరామ రామ రామ .


3, నవంబర్ 2015, మంగళవారం

" సాయి " _ దేవుడా ? కాదన్న చర్చ యేల ?




శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
             హితబోధ చేసిన హితు డితండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి
            తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ
            మాదుకొను కరుణామయు డితండు
 
సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు –  తమ మనసార కోరి
చరణములు తాకి తరియింత్రు సకల జనులు
శరణు శరణంచు వేడి   ప్రశాంతి బొంద .
                                                                   *****                                                      

 
చాలిక వద్దండి  చాలయెక్కువయింది

గురుస్థాన స్థితులకు కూడని పని

కోటాను కోట్ల భక్తుల మనోభావాల

హననకు దిగకండి  ఆర్తి రగులు

అసలిదేమి ఘనత ?  పస గలదేని _ ప్ర

జా సమస్యలు లేవ ? చక్క దిద్ద

చదువు చెప్పించండి  సంస్థలు నెలకొల్పి

వైద్య మందించండి ఉద్యమించి

పేద వాళ్ళకీరెండె లాభించుగాని
 

" సాయి " _ దేవుడా ? కాదన్న చర్చ కాదు

అసలిదేమి రగడ ? ఆపరా ? యికైన

భరత సంస్కృతి కాదిది పరము లార !

               *****

పాద పూజకుగాని , ప్రవచనాలకుగాని

కానుక లడిగెనా కాంక్షదీర ?

రజిత సింహాసన రాజ భోగాలలో

మనసార తేలెనా తనివి దీర ?

తలకు గెడ్డాలకు తలలోని తలపుకు

నల్ల రంగలదెనా యుల్లమలర ?

ఏసీ గదులు కార్లు వాస యానాలకు

తనివార వాడెనా మనసుదీర ?
 

తిరిగి నాలుగిళ్ళు తెచ్చి భిక్షాన్నంబు

అనుచరులకుబెట్టి యపుడు తినెను

చిరుగుబొంత కట్టి సిరులిచ్చె జనులకు

సాయితోడ మీకు సామ్య మేల ?

 

23, అక్టోబర్ 2015, శుక్రవారం

ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు !


సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,

ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే , 

ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,

విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,

పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,

లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే , 

మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే , 

పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే , 

మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,

స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,

ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే , 

రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే , 

అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే ,

రచయితలూ, కవులూ, కళాకారులూ సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,

మెరుగైన జీవనం కోసం

మేలైన సమాజం ఏర్పడితే ...... ,
ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు !

 

 

22, అక్టోబర్ 2015, గురువారం

తెలుగు సురధామ అమరావతీ లలామ


గౌతమ బుధ్ధుని  కలల కళారూప

కృష్ణవేణీ ఝరీ కీర్తి రూప


రమణీయ ప్రకృత్యావరణ వసుంధర రూప

ఫల సస్య శోభిత బాగ్య రూప

రాజాధి రాజ విరాజమాన నిరూప

బహు చరిత్ర ప్రభా భాస రూప

దేవాధి దేవ దేదీప్య భాస్వద్రూప

పావన క్షేత్ర ప్రభావ రూప


రూప లీలా మనోజ్ఞశ్రీ రూప విభవ

బహు విధారామ రామ   సౌభాగ్య సీమ

తెలుగు సురధామ  అమరావతీ లలామ

ప్రగతి పథగామ  నవ్యాంధ్ర భాగ్య ధామ .


 

15, అక్టోబర్ 2015, గురువారం

నేడు అబ్దుల్ కలాం జయంతి





కలగనండి , కల సాకారమగు దాక
జయశీలురై కృషి సల్పుడనియె
ఆలోచనారీతు లందరివలె గాక
క్రొత్తగా నుండుట కోరుకొనియె
బలమైన సంకల్ప ప్రతిక్రియ యొక్కటే
గెలుపు దారులు వెదికించు ననియె
స్తబ్థత విడనాడి చైతన్యమొందిన
ఫలితాలు వెన్నంటి వచ్చుననియె
 
ప్రతి పలుకులోను మార్గదర్శనము చూపి
దేశప్రగతికి బాటలు వేసినట్టి
దార్శనికుడు ' కలాం మహితాత్ముడ ' రయ
ప్రజలు మెచ్చిన ' భారత రత్న ' మితడు .
 
 











 

3, అక్టోబర్ 2015, శనివారం

మృతులు జీవింతు రీ భూమి మీద మరల




గిరి , తరు , ఝరీ పరీత ప్రకృతిమయ మయి ,
కడు మనోఙ్ఞమై , సూర్య సంకాశ మైన       
పుడమి యందాలు వీక్షించు పుణ్య మరసి
మనకు కన్నుల నొసగెను మాధవుండు
 
సకల జగతిని వీక్షించు శక్తి గలిగి
చూచి గుర్తించు ఙ్ఞాన విస్ఫూర్తి గలిగి
తనర ప్రాణుల కానంద దాయకమయి
గ్రాలు సర్వేంద్రియ ప్రధానాలు – “ కళ్ళు

పుట్టు గ్రుడ్డులే గాక , యీ పుడమి మీద
పలు ప్రమాదాలు , రోగాల బడుట వలన
కళ్లు  గోల్పోయి అంధులై గనలు వారు
కటిక చీకటిన్ బ్రతుకుట గాంచి కూడ ....
 
మార్గ ముండియు  చైతన్య మబ్బకునికి
మరణ శయ్యకు జేరిన మనుజ వరుల
కళ్ళు మరణించు చున్నవి గాని ,   పూని
నేత్ర దానమ్ము జేసిన     నిలుచును గద !
 
మనిషి మరణించినను ,   కళ్ళు బ్రతికి ,     మరొక
మనుజునకు   చూపొసగి ,    అట్టి మనిషి వలన
మరల లోకాన్ని గనును ,  “ సమ్మతి యొసంగ ,
మానవత్వము వెల్లువై మహి వెలుగును .
 
ముందు చూపున్న మనుజులు పుణ్య ఫలము
నమ్మి ,  నేత్ర దానమ్మియ్య సమ్మతించి  ,
అంధులకు చూపు నొసగుదు  రమరు లయ్యు ,
మృతులు జీవింతు రీ భూమి మీద మరల .

 

 

 

 

 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓం నమో శ్రీ సాయి నాధాయ



తలకు గట్టిన గుడ్డ  యిలకు రక్షగ నిల్చి

తరగని ప్రేమకు తావిడంగ

నిడు పాటి నుదుటిపై  నెలకొన్న తేజమ్ము

చేతులు జోడించు చిత్తమొసగ

అర్థ నిమీలితమై  యలౌకిక తపో

మగ్నమౌ కన్నులు మనసు దోచ

మంగళాకరములౌ మహనీయ పాదముల్

తాకి కళ్ళద్దుకో తలపు దోప

సాయి నాధుండు ద్వారకా మాయి వెలసి

సకల ప్రాణుల తోడుగా సాక్షి యగుచు

వాడ వాడల కొలువుండి వరదు డగుట

పుడమి భారతి చేసిన పుణ్య ఫలము .



శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ


             హితబోధ చేసిన హితు డితండు

రెండు రూపాయల దండి దక్షిణ గొని

             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు

రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి

            తాననుభవించిన త్యాగ మూర్తి

' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ

            మాదుకొను కరుణామయు డితండు


సర్వ దేవతా సత్తాక సద్గురుండు

సాయి నాధుని  శరణంచు శరణు వేడి

చరణములు తాకి తరియింత్రు సకల జనులు

శరణు శరణంచు వేడితి సాయి !   రార .