5, ఏప్రిల్ 2017, బుధవారం

రాముడే రాజుగా ... రక్షగా .....(గేయం)

రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా

ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతయె సతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/

దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని /రాముడే/

అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/

రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లె లోకాన /రాముడే/

తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు /రాముడే/

పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ/రాముడే/


వెంకయ్య స్వామి శతకం -- 8

మలిన మంట నట్టి మహనీయు లెవరైన
గలర ఘను లటన్న  నిలను సాయి ,
నీవు దప్ప లేరు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 61

దాయ లార్గురు తమ దరి జేరగా లేరు
గనుకనె పరమాత్మ కళలు మిమ్ము
జేరెను మహితాత్మ చిరముగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 62

స్వచ్చ తములు మీరు  స్థావర జంగముల్
మీ యనుఙ్ఞ మేర మీర లేవు
మీకు సాధ్య పడని మేరలా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 63

శ్రీ శరీర సహిత శివ మూర్తులై యుండ
చేరి కొలిచి నట్టి తీరు కంటె
జన సముద్ర మిపుడు ఘనమయ్యె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 64

నాడు మీరు జూపి నట్టి యద్భుతముల
కంటె నేడు జనులు కనుల ముందె
కోరి తీర్చు కొనుట కొల్లలు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 65

సకల కర్మ లందు సంసారి  ధర్మమ్ము
తప్పకున్న గొప్ప , తగ నదేమి
గొప్ప గాదు రుషికి , చెప్పితి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 66

దారి తప్ప కుండ  దారాన్ని తెగకుండ
చూచు కొనుడు నేను కాచు కుందు
మిమ్ము విడువ నంటి , మేలయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 67

లాభ మందె మనసు లయబెట్టి చూడొద్దు
పాప మందు కూడ భాగ మొదవు 
టరసి చూడు మంటి వయ్యరో ! వెంకయ్య
స్వామి శరణు నీదు చరణములకు .   -- 68

 పొసగ వేరొకరిని పొమ్మను కంటెను
మనమె తప్పు కొనుట మంచి దనుచు
మంచి జెప్పి నావు , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .  -- 69

గొఱ్ఱె లుండు వేలు గుంపులో మనగొఱ్ఱె
కాలు పట్టి తెచ్చు ఘనత కలదు ,
రండు రక్ష నిత్తు , రమ్మంటి వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 70

4, ఏప్రిల్ 2017, మంగళవారం

వెంకయ్య స్వామి శతకం -- 7

పదవ చూపు నాది పరికింప తగులుకో
పోవు చూపిదంచు పుణ్యమూర్తి !
నుడివి తీవు శక్తి గడియించి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 51

ఆకలి గొని వచ్చి యడిగిన వారికి
పట్టె డన్న మిచ్చి పంపు డనుట
నిన్ను గుర్తు దెచ్చు నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 52

గౌరవించి పిలువు మేరి నైనను , ఒరే
యనకు పాప మంటి వయ్య దేవ !
నీదు తత్త్వ మిదియె , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 53

పాడు బుధ్ధి జూపి పావలా కాజేయ
పది వరాలు నీవి వదులు నంటి
వక్షరాల నిజము , రక్షకా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 54

మనిషి యందె దాగి మన తప్పు లొప్పులు
లెక్క జూచు చుందు రెలమి సాక్షు
లనుచు నెరుక పరచి తయ్య శ్రీ వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 55

కార్య ఫలము దెలియగా వచ్చు వారికి
వ్రాసి ముందె  ఫలము  వేసి ముద్ర
ముట్ట జెప్పినావు ముదమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 56

మోకు తుంట లొకట ముంతొక్క చేతిలో
యేటి పాయ మీది కేగి సాగి
మంట జేయు చుండు మహనీయ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 57

అర్బుదాలు కోటు లన  రామ రత్నాలు
మణులన జలయఙ్ఞ మహిత తపము
పంచితి వరుమాన ఫలములు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 58

అరయ నెవరి నైన అయ్యా యనుటయే
యిష్ట మంటి వయ్య , హితుడు వీవు
మానవాళి కంత , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 59

మనుజ కర్మ బాప మహి లోన జన్మించి
తపము జేసి తయ్య  దైవ మూర్తి  !
కొల్వ నిన్ను  కర్మ  కూలును  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 60

3, ఏప్రిల్ 2017, సోమవారం

వెంకయ్య స్వామి శతకం -- 6

నీదు పాద ధూళి నిండిన నేలలు
పావనాలు  పుణ్య పథము లయ్య  ,
వర సుభిక్ష మగుచు వర్థిల్లు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 41

పొసగ గొలగమూడి పుణ్యాల పంటయై
దేవ భూమి యయ్యె  దివ్య మూర్తి !
నీవు వెలయ బట్టి , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 42

కూడి తిరుగ నీవు  కుల్లూరు , రాజుపా
ళ్యమ్ము జనులు వృద్ధి యైరి , దేశ
దేశ ములను పేరు దెచ్చిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 43

పెన్న బద్దె వోలు పేరు ప్రఖ్యాతులు
పెనసె నయ్య నీదు పేరు తోడ 
దాని నిన్ను గలిపి తలుతురు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 44

వరలును కలువాయి , బ్రాహ్మణ పల్లెయు
నరయ నీవు తిరిగి నంత వట్టు
దినము దినము నెంత ఘనమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 45

నిన్ను నమ్ము వారు  నీమాట విను వారు
బాగు పడిరి మిగుల  పరమ పురుష !
వినక చెడిన వారు వెర్రులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 46

నీ సమాధి చేరి  నీకు నివేదించి
చేయు పనికి నీవు సాయ మొనర
జేతు వనఘ ! నతులు జేతుము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 47

తలచి నిన్నడుగగ కలలోన పొడసూపి
అవును గాదను సన్న లరయ జేసి
సూచన లిడు టెంత శోభయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 48

బాల్య మందు నిన్ను  పరి పరి దర్శించి
దీవెనలను బడసి తేజమొప్ప
ఖ్యాతి గాంచి నాను  , ఘనుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 49

వచన మందు  నీదు వర చరితము వ్రాసి
మ్రొక్కు దీర్చి నాను మక్కువముగ
ముక్తి నిమ్ము కష్ట ముల నుండి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 50

2, ఏప్రిల్ 2017, ఆదివారం

వెంకయ్య స్వామి శతకం -- 5

కోరి శిష్యు డయ్యె నారాయణ స్వామి
నీదు తోడు దిరిగి నీడ యగుచు
ఘనత దాల్చె నీవు కరుణించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .  -- 31

చనవు మీర  నిన్ను చలమయ్య నాయుడు
కొలిచి నిలిచినాడు కూడి మాడి
అతడిదే యదృష్ట మన నొప్పు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 32

దయకు పాత్రు డయ్యె జయరామ రాజు తా
వచ్చి నీదు తోడ వాస మందు
వరము బొంది నాడు , వరదుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 33

రోజు కూలి యర్థ రూపాయి కొరగాని
కఱ్ఱి దేవుడయ్య ఘనత గాంచె
నీ కటాక్ష సిధ్ధి యే కదా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 34

పిలుపు వచ్చి రాగ  వెంటనే పెద్దయ్య
చేరి నీతొ దిరుగు చేరువయ్యె
నింత పుణ్య ఫలము సొంతమై , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 35

వెలయ చివర దాక  తులశమ్మ నిను గొల్చి
పుణ్య ఫలము బొందె  ,  ఫూజనీయ
సుకృత ఫలిత మిదియె ,  సులభుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 36

నీకు  సహచరించి నిన్గొల్చి తిరిగిరి
యెంద రెందరొ జను లంద రెంత
పూర్వ జన్మ లందు పుణ్యులో ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 37

తండ్రి పెంచలయ్య  తల్లియై పిచ్చమ్మ
కన్న కడుపు లెన్ని పున్నెములకు
ప్రోవులైరొ కొలువ బోలునా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 38

నతులు నిన్ను గన్న నాగులేటూరుకు
ధన్య యయ్యె తాను ధరణి తల్లి
తల్లి పేరు నిలిచె స్థాయిగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 39

నీవు పాద మిడిన నేలలు , నీళ్లును
కొండ లడవు లున్ను కోన లున్ను
పావన మయి యొప్పు , భగవాను వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 40

1, ఏప్రిల్ 2017, శనివారం

వెంకయ్య స్వామి శతకం -- 4

కోటి తీర్థ శివుని కోవెల వెలుపల
నీవు పెంచి నట్టి నిడివి మఱ్ఱి
నీకు సాక్షి యగుచు నిలిచేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 21

తనర బావి లోకి తలక్రిందు వ్రేలాడ
కాళ్లు వేప కొమ్మ కాన్చి పెనచి
తపము జేసి తంట , ధన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 22

ఆకు లోని యన్న మన్ని వైపుల నెట్టి
మధ్య లోది తిని , సమ సమముగ
భూతములకు బెట్టు పుణ్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 23

నీరు త్రాగు టేమి నీమమ్మొ , యేటిలో
మూతి ముంచి త్రాగు ముచ్చటేల !
తెలియ దింత దనుక , దేవుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  24

రాళ్ళు మాకు జూడ  , రత్నాల రాశుల
తీరు బద్దె వోలు తిప్ప నీకు 
తీరు చూడ చూపు తీక్ష్ణము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  25

యేటి చూపు కలదు నీటి పాయల యందు
కొండ చూపు కలదు కొండ లందు
అడవి చూపులు గల వడవుల , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    --  26

నడిమి నీట నాది నారాయ నుడివంట
జలధి మీద నడక సాగె నంట
అపర కళల భగవ దవతార ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 27

గొలగమూడి క్షేత్ర స్థలము మొత్తమ్మింక
రెండు వంద లేళ్ళు నిండి నాక
తిరుపతి యగు నంటి వరయగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 28

పడును క్షేత్ర మందు బంగారు గని యని
యంటి వయ్య  , ఋజువు కంటి మిపుడె ,
పసిడి పండు చుండె పచ్చగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 29

నిండి జనుల తోడ నిత్య కళ్యాణమై
పచ్చ తోరణముల పండు వగుచు
గొలగమూడి నేడు వెలిగేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .   -- 30



31, మార్చి 2017, శుక్రవారం

వెంకయ్య స్వామి శతకం -- 3


చేరి గొలగమూడి  సారించి నిలిచిన
హృదయ పద్మ మందు ముదము గలుగు
గొలగమూడి క్షేత్ర నిలయుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 11

గొలగమూడి చనుచు  గొంతెత్తి పాడుచు
వచ్చు భక్త జనుల  పాద ధూళి
తాకినా జనులకు ధన్యతే , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 12

జబ్బు చేసి నిన్ను శరణు వేడంగనే
బాగు జేసి వారి బాధ నంత
నీవు తీసుకొనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 13

నీకు దగ్గరైన  నిన్గొల్చు భక్తుల
స్వప్న మందు శేష శయను డగుచు
దర్శనమ్ము నిచ్చి దయజూచు వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 14

నేల లోపలైన , నింగిలో నైనను
నీరు , నిప్పు , గాలి  నియతి లోను
చూపు బరుప గలవు శోధింప  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 15

తగులు కొనుచు పోవు దశమాన చూపులో
ప్రకృతి శక్తి నాపు ప్రతిభ గలదు ,
నీదు నాత్మ శక్తి నెరుగము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 16

కురియు మన్న కురియు కోరిన , నాగుమం
చన్న నాగు వర్ష మద్భుత మిది  ,
నిన్ను మీర గలద ? నేరదు  , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 17

తల్లి దండ్రి నీవు  దైవమ్ము నీవంచు
నమ్మి బ్రతుకు వారి నరసి నీవు
నీడ యగుచు వెనుక నిలుతువు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      --  18

పొసగ గుండ మేసి పోగొట్టి నావంట
బాధ లెగయు  నింటి బాధలెల్ల ,
బరువు మ్రోయ నీవె ప్రభుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     --  19

పెన్న బద్దె వోలు  పెన్న పాయ పయిన
నీళ్ళ మీద మంట నెగడ జేసి
యజ్ఞ ఫలమొ సగిన యతివయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     --  20
             ----- వెంకట రాజారావు . లక్కాకుల

30, మార్చి 2017, గురువారం

వెంకయ్య స్వామి శతకం -- 2

  భగవాన్
గొలగమూడి వెంకయ్య స్వామి
-------------------------------------
బ్రతికి నంత వట్టు పరమాత్మ కళలతో
బ్రతికి ప్రజల కొఱకు పాటు పడితి ,
జనులు దేవు డనుచు వినుతించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .       -- 1

దేహ ధారి యగుచు దీపించు నానాడు
వర సమాథి యందు వరలు నేడు
నిన్ను నమ్మినాము , నిలుమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 2

వ్రేలి ముద్ర వేసి వెచ్చించి  తపమును
చీటి వ్రాసి యిచ్చి  శ్రీలు  కలుగ
మాకు తోడయితివి , మాన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు  నీదు చరణములకు  .    -- 3

జబ్బు చేసి నపుడు  సాగి పై పంచతో
విసిరి , దారములను  వేసి  మెడను
బాగు చేసినావు పరమాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 4

పేద ప్రజల గాచు పెన్నిధి నీవయ్య
ఆరు లక్ష చూపు లందు జూచి
ఆదుకొమ్ము మమ్ము , చేదుకో , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 5

బ్రతుకు బరువు మ్రోయ  గతి నీవె యని పూని
వచ్చి కొలుచు వారి వరదు డగుచు
గొలగమూడి లోన కొలువైన వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 6

గొలగమూడి జేరి కోవెల దర్శించి
నీ సమాథి తాకి నిన్ను దలచి
మ్రొక్కు కున్న తీరు మ్రొక్కులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .      -- 7

అన్నదాన సత్ర మందున కూర్చుండి
భోజనమ్ము తిన్న పుణ్య జనుల
తృప్తి కొలువ లేము , ఆప్తుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 8

గొలగమూడి యాత్ర తలచుట తోడనే
అడ్డు దొలగి క్షేత్ర మరుగు వరకు
క్షేమ మరసి గాచు శ్రీలుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .    -- 9

నోరు దెరిచి ఆదినారాయణా ! యన్న
పిలుపు విన్న వెంట ప్రియము గూర్చ
నీవు వత్తు వనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు .     -- 10

29, మార్చి 2017, బుధవారం

తెలుగు వారికందరికీ ' హేవిళంబి ' శుభాకాంక్షలు .

వానలు తగినంత పడి పాడి పంటలు
తగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !

' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .

వెంకయ్య స్వామి శతకం -- 1

                 

 భగవాన్
       శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి
          ఆరాధన రూప పద్య శతకం            
                ( పరిచయము -- 1)
                   ----------------
         నేటి కాలంలో ఏ మలినమూ అంటని
మహాను భావులరుదు .అలాంటిమహనీయులలో
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకరు .
          శ్రీ స్వామి నెల్లూరు జిల్లా , నాగులేటూరు గ్రామంలోవ్యవసాయకుటుంబంలోజన్మించినాడు .
బాల్యంలో వ్యవసాయం పనులు చేసే వాడు .
ఇరవై యేళ్ళ వయసులో ఊరొదిలి పెన్నానది లో
నూ , పెన్నకిరువైపుల గ్రామాలలోనూ తిరుగుచుం
డేవాడు .
         తనలోకంలో తానుండేవాడు . తదనంతర
కాలంలో తదేక ధ్యానంలో తంబూర మీటుతూ
తన కనువైన స్థలంలో గడిపే వాడు .  క్రమంగా
ఆప్రాంత ప్రజలు వెంకయ్య స్వామిగా గుర్తించి
గౌరవించడం ప్రారంభ మయ్యింది .
          ఆయన ఏది చెబితే అది జరిగేది . రోగగ్ర
స్తులకు మంత్రించి నయం చేసేవాడు . ఎవ్వరినీ
ఏదీ అడిగేవాడు కాదు . పిలిచి అన్నం పెట్టేవారు .
స్వామిని బాల్యమాది నేనెరుగుదును . మా గ్రా
మం కుల్లూరికి ప్రక్కన రాజుపాళెంలోనూ , కాస్త
దూరంలోని పెన్నబద్వేలు లోనూ ఎక్కువ గడిపే
వాడు . చాల నిరాడంబర జీవితం గడిపి నాడు .
            అర్థ ముతక చొక్కా ముతక పంచ ఆయన ఆస్తి . పైపంచ చుట్ట చుట్టి ప్రక్కన పెట్టు
కుని దానితో విసిరి మంత్రించి జబ్బులు నయం
చేసేవాడు . తినడం భిక్షాన్నమే .             కార్యార్థమై వచ్చి అడిగిన వాళ్ళకు చీటీ వ్రాయించి వ్రేలిముద్రలేసిఇచ్చేవాడు .ఆయనమాట విన్న
వాళ్ళంతాబాగుపడ్డారు .వినకచెడినవాళ్ళూఉన్నా రు .
              దాదాపు ఎనభై యేళ్ళదాకా బ్రతికి జ
నుల చేత భగవానుడిగా పూజింపబడి , చివరి
దశలో గొలగమూడి గ్రామంలో సమాధియైనాడు .
ఆ సమాథియే శ్రీస్వామి దేవాలయంగా , గొలగ
మూడి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నవి .
              ఈక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగార
మై వారి కోరికలు తీరుతూ భక్తజన సందోహంగా
మారింది . నేనెరిగిన వెంకయ్య స్వామి జీవిత
చరిత్రను ఉన్నదున్నట్లుగా పూర్వం ' భగవాన్ శ్రీ
శ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి సత్య ప్రమాణ దివ్య చరితము ' గా వ్రాయడం జరిగింది .
              స్వచ్చమైన జీవితం గడిపి జనులతో
మమేకమై ఆత్మశక్తితో జనుల బాధలను తొలగిం
చిన ఆ నిరాడంబరుడు నా కారాథ్యుడు .
             చిన్న చిన్న ఆటవెలది పద్యాలతో ఆ స్వా
మి మహనీయ తత్త్వాన్ని ఆరాధిస్తూ శతకం వ్రా
యడం జరిగింది .
                ----- వెంకట రాజారావు . లక్కాకుల
              

28, మార్చి 2017, మంగళవారం

తెలుగుగాది .....

అల్లదే టీవీలొ అడ్డ నామాలోళ్ళు
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ

హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది  పర్వదిన మ్మిల మీదికి దిగి .

అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .

మా కుల్లూరు -- 8

మా కుల్లూరు
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు  కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస

ములు కనంగను  ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని  మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .

27, మార్చి 2017, సోమవారం

మా కుల్లూరు -- 7

మా కుల్లూరు
----------------

దేశ మంతట ప్రతి యూర దేవి పూజ
మాకు మాత్ర మాయుధ పూజ శ్రీకరముగ
యుధ్ధ విద్యలు నేర్చన యూరు గనుక
నేటికిని దశరాకు రాణించు చుండు .

రామ లక్ష్మణులు మా రాచ బిడ్డలు ధను
ర్బాణాలు దాల్చి వీర్యమ్ము మెరయ
అష్టమి తిథియందు నరయ నల్లేనుంగు
నెక్కి యూరేగుదు రక్కజముగ
ఆనాటి యుభయ మహా ప్రదాత ఘనుడు
గంగాధరం గారు  గాఢ భక్తి
జ్వాజ్వల్య మానమై జైకొట్ట జనములు
జరిపింతు రెలమి పూజ లొనరించి

రేయి రేయంత యును పగలే యనంగ
దీప కాంతులతో , భజంత్రీల - తప్పె
ట్ల ఘన రావము చెలంగ , రంగ రంగ
వైభవము లొప్ప నూరంత వరలు చుండు .

21, మార్చి 2017, మంగళవారం

ఇది వసంత హేల .....




భూమీ తలమును  రంగుల
ఆమని ముంచెత్తె , చివురుటాకులెరుపులో
పామిన శ్యామలమయ్యెను ,
ఏమని వర్ణించ వచ్చు నీ వని  యమునన్ .

నిండుగా పూచి  పొగడ  వన్నియలు వోవ
దరిసి నాధుని కైసేయ దండ గ్రుచ్చి
మురిసి రాధిక మాధవుముందు నిల్చి
గుండెలకు గుండెలానించి దండ గూర్చె .

మోదుగ పూగుత్తిని గన
మాధవునికి రాధమీద మనసు దవిలి , బిం
బాధరి మోవికి వంశీ
మాధుర్యపు కేళి పంచి మరులొలికించెన్ .

బృందావనమున గోపీ
బృందముతో కృష్ణు డాడె , బింబాధరులున్
బందీలై మాధవునికి
సంధించిరి సరస మధుర  సరి సమరమ్ముల్ .

ఇది వసంత హేల , యిల కెన్నిరంగులో
ప్రకృతి కన్య పూచి పరవశించె ,
ఇందు బ్రతుకు మనిషి కెందుకో  ప్రకృతితో
పాలు పంచు కొనుట పడుట లేదు . 

14, మార్చి 2017, మంగళవారం

మా కుల్లూరు - 6

మా కుల్లూరు
***********
ఇందు నందున రాముని మందిరాలు
ఊరి కుత్తర దక్షిణ పూరు లందు
రెండు గల వెందుకో ? వితర్కించి చూడ
తెలిసె నొక గుట్టు , చెప్పెద తెలిసి నంత .

కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండి రని మొదట వచించి యుంటిని దెలియన్ .

యుధ్ధ విద్యల నేర్పించ నుధ్ధతులను
గురువులను దెచ్చి విద్యల గరపు వారు
సాము గరిడీలు నేర్పగా సగము సగము
పంచుకొనిరిట్లు పురమును పట్టు కొరకు .

నల్లంగు వాళ్ళ బడియని
అల్లాగునె వెంకయబడి యని పేర్లరయన్
యెల్లన్ విద్యల నేర్చిరి
కుల్లూరున పిల్ల లెల్ల కోవిదు లవగా .

బడులు గుడులౌను దశరాకు , ప్రభలు గట్టి
రామ లక్ష్మణ సీత విగ్రహము లొనర
దీర్చి , పురవీథులందున జేర్చి , యచట
సాము గరిడీలు ద్రిప్పుట నీమ మిచట .

పిల్లలకు తాము నేర్పిన విద్యలెల్ల
సాము గరిడీలతోటి విస్మయము గదుర
తనరి జేయంగ విద్యా ప్రదర్శనముల
ఊరు ఊరంత ఉర్రూత లూగు చుండు .

యుధ్ధ విద్యలు కొలువైన యూరు గనుక
సైన్యమున రౌతులై యున్న చదురు గనుక
సాము గరిడీల పోటీలు సాగు చుండు
ముచ్చ టొకనాడు కుల్లూరు పురము గనెను .

రాజ్యములు కోటలును సైన్య రావడులును
పోయె , నిరుగడ బడులు రూపులను మాసి
రామ మందిరా లయ్యెను , రామణీయ
కముగ దశరా మహోత్సవ కాంతు లొనరె .

నాకు దెలిసియు దశరాకు నవమి నాడు
కత్తి కర్రల పోటీలు గలవు , విజయ
మందిన వారికి తగు బహుమతులు గూడ
ఇచ్చు ముచ్చట జూచితి నిచట నేను .

దశరా యుత్సవము లనిన
దశ దిశలకు పేరు గాంచి తా కుల్లూరిన్
విశదంబుగ నేనుగుపై
ప్రశస్తముగ రామచంద్ర ప్రభు డూరేగున్ .

కుల్లూరి బలిజ వంశము
విల్లమ్ములు దాల్చి యుధ్ధ విద్యల నేర్చెన్ ,
బల్లేలు పటాకత్తులు
మొల్లమ్ముగ నింట నింట మూల్గుచు నుండెన్ .

మా కుల్లూరు - 5

మా కుల్లూరు
***********
అచ్యుత స్వామి గుడిప్రక్క నప్పు డెపుడొ
ఎవరు నిర్మించిరో గాని యెరుక పడదు
చెన్న కేశవ గుడి చాల శిధిలమయ్యె
విగ్రహము కూడ లేదు , పోవిడిచి రటులె .

బలిజలకు చెన్న కేశవు డెలమి కొలుచు
దైవమై గ్రాలు గాన ప్రాధాన్య మెరిగి
పూని గంగాధరం గారు భుజము మోపి
తలచి నిర్మించె క్రొత్తగా ధార్మి కుండు .

దేవ దేవుండు దేవేరు లీవిథముగ
దివ్య మంగళ మూర్తులై తీరి నిలువ
నెంత పుణ్యంబు జేశామొ యిచట బుట్టి
చెన్న కేశవ స్వామికి సేవ చేయ .

మా కుల్లూరు - 4

మా కుల్లూరు
***********
శ్రీ భూ దేవేరులతో
వైభవముగ నచ్యుతప్ప వరదుడు వెలుగున్
శోభాయమానముగ , నీ
ప్రాభవ మే యూర గనము , వైష్ణవ మూర్తిన్ .

ఎప్పుడు నిర్మించిరొ ! ఆ
చొప్పులు దెలియంగ రావు , శుభ గోపురమున్
ఒప్పుగ నిర్మించె ఘనుడు
గొప్పగ నీ గుడికి తోట గురుమూర్తి యనన్ .

ఎంద రెందరొ భక్తులీ మందిరాన్ని
పూని జీర్ణోధ్ధరణ జేసి , పుణ్య ఫలము
నందినా రచ్యుతుని మనోఙ్ఞ నయన లస
దృక్కులు బడి తడిసి వినుతింప బడిరి .

వారిలో మాయూరి ప్రముఖులు మాదాసు
గంగాధరం గారు కడు ప్రధములు ,
దరిమడ్గు కామయ్య తలకెత్తుకొని కార్య
భారమ్ము వహియించె భక్తి గదుర ,
నాటి దేవాదాయ మేటి కమీషనర్
అనుమతు లిచ్చిరి , ఘనులు , వారు
మా యూరి యల్లుడు , మహిత యశులు , బాల
సుబ్రహ మణ్యము శుభ ప్రథముగ

దీని పూజాదికములకు పూని , పెను శి
లేశుడు తగు వెచ్చము లిడు , నింక నొకరు
అందె చెన్నప్ప శెట్ఠిగా రందు కొంత
ట్రస్టు రూపాన ఖర్చుకు వ్రాసి నారు .




13, మార్చి 2017, సోమవారం

మా కుల్లూరు - 3

మా కుల్లూరు
***********
అచ్యుత స్వామి మా కండ దండగ నిల్చె
శ్రీదేవి భూదేవి చేరి కొలువ
వక్షస్థలముపైన వరలక్ష్మి నివసింప
నిలువెల్ల తోమాల నిలిచి మెరయ
శంఖ చక్రాలతో శార్ఙ గదాదండ
భూషణాలంకృత మూర్తి యగుచు
గరుడుండు పాదాల కడ కొలువుండగా
మోహనాకారమ్ము ముద్దులొలుక

ఆరడుగులు మించి నిలిచి , చేర వచ్చి
మ్రొక్కు కున్నట్టి భక్తుల మ్రొక్కు దీర్చ
మహిత రమణీయ దివ్య ధామమ్ము నందు
కొలువు దీరెను కుల్లూరు నిలయు డగుచు .

మా కుల్లూరు 2

మా కుల్లూరు
***********
విజయ నగర రాజ్యములో
మజరా మా కుల్లూరు గ్రామ మద్భుత రీతిన్
అజరామరమై వెలిగెను
ప్రజలెల్లరు కలిసి మెలిసి బ్రతికిరి ఘనతన్ .

కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండిరట , విజయనగర నియుక్తాధిపతై -

కొండమురుసు ప్రభువు కుల్లూరు నిర్మించె
చెరువు ప్రక్క సకల శ్రీకరముగ
కొలని ప్రక్క నున్న కొల్లూరు , కుల్లూరు
గాగ మారె కాల క్రమము లోన .

12, మార్చి 2017, ఆదివారం

మా కుల్లూరు - 1

మా కుల్లూరు
***********
మా కుల్లూరు పురాధి దేవత సదా మాక్షేమ ముల్గోరుచున్
రాకాచంద్ర మనోఙ్ఞ ధీధితులతో రాజిల్లు పోలేరు తా
పోకార్చున్ కడ గండ్లు రోగములు రేపున్ మాపు మా యూరికిన్
చేకూర్చున్ మహనీయ శోభనములన్ చెన్నొంద రక్షించుచున్ .

ఉత్తరాన పెన్న , ఊరికి పడమట
చెరువు , చెరువు వెనుక ధరణి ధరము ,
దక్షిణాన చేలు , దర్శింప దూరాన
పెనుశిలేశు డుండు పెన్నిధి వలె .

నాల్గు దిశల బలము నైసర్గి కమ్ముగా
కలిసి వచ్చి వాస్తు ఘనత దాల్చి
చదువులందు సిరులు సంపదలందున
చుట్టు పట్ల ప్రజల స్తుతులు బొందె .

సువిశాలమైన వీథులు
నవవిథ కులాలవాళ్ళు నవ్యత లొలుకన్
ప్రవిమల ప్రశాంత ప్రకృతిని
రవి కిరణము వోలె వెల్గు రాజస ఠీవిన్ .

10, మార్చి 2017, శుక్రవారం

పద్యం - పరమార్థం

                           పద్యం - పరమార్థం
                            *************        
                 
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .


8, మార్చి 2017, బుధవారం

తల్లీ ! వందనము .....

ఇల్లు పిల్లల బాధ్యతల్ యెల్ల వేళ ,
ఇప్పుడో , వీటితో పాటు యింతులు మరి
పట్టి రుద్యోగ భాద్యతల్ , భారతీయ
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

మగనికిని పిల్ల లత్త మామలకు జేసి
 మరల నుద్యోగ భాద్యతల్ , మగుడ ' నిల్లు-
పిల్ల '  లిదె ' తనలోక ' , మీతల్లి పనులు
వేకువన లేవ నేరాత్రి వేళొ తీరు .

ప్రొద్దెక్కి నిద్ర లేచును
తద్దయు లేటైనదంచు తద్ధిమి తకతోం
ఒద్దిక లేదేనాడును
బుద్ధి యెపుడు గలుగు నిట్టి పురుషుడికమ్మా !

ఆఫీసు నుండి యింటికి
సాఫీగా రాడు సారు , చాల పనులహో !
తాపీగా పదకుండుకు
పాపలు నిదురోయినాక , పరుగున వచ్చున్ .

ఇట్టి మగవాళ్ళ నదుపులో బెట్ట , దిన ది
నమ్ము పోరాడి సంసార నౌక నొడ్డు
జేర్చు నోరిమికి సలాము జేతు మమ్మ !
తల్లి ! మాకు ' నీవే ' కల్ప వల్లి వమ్మ !

2, మార్చి 2017, గురువారం

కేవలం కాముకులు .....

సృష్టి స్థితి లయ కారకుడై
విశ్య మంతటను వ్యాపించి యున్న
జగన్నాధుడైన
ఆ పరమేశ్వరుడు  - విశ్వ ప్రేమికుడు .
పరమేశ్వర సృష్టి యైన
విశ్వాంతరాళంలో
కొంత భాగమైన మనభూమిపై
జీవించే సమస్త జీవరాశి
కాధార భూతుడైన
కర్మ సాక్షి
శ్రీ సూర్య నారాయణుడు -  జీవ ప్రేమికుడు .
భూమిపై విస్తరించిన
సమస్త జల తరు గిర్యాది వనరుల ద్వారా
జీవాన్ని పొదివి పట్టుకొని కాపాడు
ప్రకృతి మాత  - పృధివీ ప్రేమికురాలు .
ఆయాయి కాలాలలో అవతరించి
పుడమి జనుల నుద్బోధించి
మానవ జాతికి మార్గ నిర్దేశం చేసి
సజీవంగా మానవ జాతి హృన్మందిరాలలో
కొలువున్న ప్రవక్తలు  - మానవ ప్రేమికులు .
సృష్టి ధర్మాచరిత
సహ జీవన మాధుర్యం నుండి
బిడ్డలను కని , పెంచి ,
అవ్యాజానురాగాన్ని పంచే
తలి దండ్రులు  - సంతాన ప్రేమికులు .
మానవులను
పశుత్వం నుండి వేరు చేసి
విజ్ఞానాన్నందించే
ఉపాథ్యాయ గురువులు - శిష్య ప్రేమికులు .
మానవ జాతి సుఖజీవనం కోరి
జీవిత మంతా
ప్రయోగ శాలల కంకితమై
క్రొత్త క్రొత్త ఆవిష్కరణల నందించే
సైంటిస్టులు  - మానవ మనుగడ ప్రేమికులు .
శారీరక , మానసిక దయనీయ స్థితిలో
తమ వద్దకు వచ్చిన
రోగులకు
స్వాస్థ్యాన్నందించే
వైద్య నారాయణులు - మానవారోగ్య ప్రేమికులు .
అడుగడుగున మానవ హితమే
మహోన్నతాశయంగా
జీవన యానం సాగించే
సాహితీ మూర్తులు ,
కళాకారులు ,
కార్మికులు ,
నిరంతర - జన హిత ప్రేమికులు .
కానీ , -----
పరమేశ్వరుణ్ణి కూడా
అసంబధ్ధ కర్మ క్రతువుల లోకి లాగి
జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని
అజ్ఞానాన్ని బోధించే అంధ విశ్వాసులు –
పరమేశ్వర నిబధ్ధమై
నిర్దుష్టమై
నిర్దిష్ట గమనంలో సాగే
విశ్వాంతరాళ
జ్యోతిశ్చక్రానికి
వక్ర భాష్యాన్ని కట్టి
పరతత్త్వంలోనే
చెడు వెదికే కార్తాంతికులు  -
నిరంతరం జన జీవనంలో ఉన్నామని
జనాన్ని భ్రమింప జేస్తూ
ప్రజా సేవలో తరిస్తున్నామని భ్రమింపజేసుకుంటూ
స్వార్థం తప్ప
జనహిత మెరుగని
నీతిబాహ్యులైన
యావత్ రాజకీయ నేతలు  -
పడుచు ప్రాయపు
ప్రలోభాల నధిగమించు
బలిమి లేక
మోహావేశాలకు
బానిసలై
పెడత్రోవ పట్టి
బాధ్యతలను విస్మరించే
యువతీ యువకులు  -
వీళ్ళంతా , -----
ఎప్పటికీ
ప్రేమికులు కాలేరు .
కేవలం
కాముకులు .


24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

హర హర మహదేవ ! శంభో శంకర !




ఒల్లంత బూడిద వల్లకాడే యిల్లు
పాము లాభరణాలు భయద రూపు
ఏనుగు తోల్గట్టి యెద్దెక్కి తిరుగుటల్
దేవాధి దేవు డీ తీరు వెలుగు
ఢమరుక నినదాలు ప్రమదుల యరుపులు
శివమెత్తి యాడుటల్ చేష్టితములు
అంగాంగములు లేవు లింగమే రూపము
స్థాణువైనను పేరు జంగమయ్య

తల్లి ! పార్వతీ ! యిట్టి భూతాల మృడుని
మొదలు తుదియును లేని యీ భూత నాధు
నెట్లు భరియించినావు నీకేడ దొరికె ?
విష్ణు బ్రహ్మలు వెర్రులై వెదికి రేల ?


21, ఫిబ్రవరి 2017, మంగళవారం

నా ' తెలుగు ' వర్థిల్లాలి .

చిన్నూ ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు ఆపిల్ కావాలి
నాన్నా డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                                             ****************
హలో బావ గారూ ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూనువ్వటోయ్ అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీఈ భోషాణంతో నేను పడ్లేనుఒక ఊరోపరి కానీ హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా మా శివుడు నిన్నకు నిన్న తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                                                   ****************
హలో వదినా ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే అదే ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూతనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే సూర్య టీవీ కొన్నాడా సూర్య మదర్  ఒప్పుకుందా అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                                                     ****************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు రోడ్డు లాగే కంప్యూటర్ టీవీ ఇంటర్ నెట్ ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి సంస్కృతీకరించి అంతర్జాలాలూ మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .