26, ఆగస్టు 2018, ఆదివారం

ఒక్క ధర్మజుడే బొందితో ..... ఏల ?


తనకన్న తెలివిడి తనమున్న వారలు
లేరను యహముచే చేర డొకడు
తనకన్న సొగసైన ఘనులు లేరను నహం
కారము కనుగ్రప్పి చేర డొకడు
మగ లైదుగురి లోన మగువ ' కింద్ర సుతుడె '
' మక్కువ ' లోపమై చిక్కె నొకతె
విలు విద్యలో తన చెలువమ్ముపై నున్న
అతిశయ మొకనికి అడ్డు నిల్చె

మరణ వేదన పడుచున్న మనుజు జూచి
పరగ నానంద పడుటచే పడియె నొకడు
తుదకు ధర్మజుం డొక్కడే ముదము తోడ
బొందితో స్వర్గమును జేరె పూజ్యు డగుచు .

25, ఆగస్టు 2018, శనివారం

అర్జునుడు ' కర్రి 'యా ? .....


కౌరవ్య రాజన్య గౌరవంబులు తెల్పు
కుంతియు , శక్రుండు గూడ తెలుపు
తెల్లని తనుచాయ తెఱగెఱిగించు నా
అర్జున నామథేయమ్ము తెలుపు
అరదంబు తెలుపట , హయములున్ తెలుపట
విల్లును శంఖంబు విథము తెలుపు
కపట మొల్లని యుధ్ధ కౌశలమ్ములు తెల్పు
విజయ పరంపరా వితతి తెలుపు

ఓజ నింతటి తెలుపు మారాజు తాను
' కర్రి ' యయి గాను పించును , కాదొ ? యవునొ ?
కాద ? అర్జున నామంబు ఘనత యేమి ?
అవున ! కర్రియై గన్పించు ఖర్మ యేల ?


18, ఆగస్టు 2018, శనివారం

' సన్నిధి ' భాస్కరన్నతో నేను .....

' సన్నిధి ' భాస్కరన్నతో నేను
---------------------------------
గలగలా సెలయేటి గండశిలల మీద
జలజలా పారు సలిలము వోలె
ముగ్ధ మోహన కృష్ణు మోవి మురళి వీడు
అతులిత మధుర సంగతుల వోలె
శ్రీగంధ పరిమళశ్రీలు మోసుక వచ్చి
కుతి దీర్చు మలయ మారుతము వోలె
కడగండ్ల పాలయి కనలు మనుజునికి
తగవైన సఖుని యోదార్పు  వోలె

పరమ భాగవతుడగు మా ' భాస్కరన్న '
అమృత ధారలు కురిపించు యమరగంగ ,
మృదుల స్రోతస్విని గతి , తనదు ప్రవచన
ధారలు కురియు , జనులు తాదాత్మ్య మొంద .

16, ఆగస్టు 2018, గురువారం

నా శ్రీమతి స్మృత్యర్థం .....

ఈరోజు నా భార్య లక్కాకుల సుభాషిణమ్మ
స్మృత్యర్థం కుల్లూరు జూనియర్ కాలేజి లో
మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు
ఆనందంగా ఉంది .

8, జులై 2018, ఆదివారం

కుల్లూరు హైస్కూల్ లో పురస్కారాలు

కుల్లూరు హైస్కూల్ లో ఈరోజు SSC స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు ....
నగదు పురస్కారాలు , మరియు రోలింగ్ షీల్డులు
బహూకరించడం జరిగింది .
1 . శ్రీ దరిమడుగు . జగదీష్( USA) తన తాత శ్రీ దరిమడుగు . కామయ్య మరియు నానమ్మ వసంతమ్మ గార్ల జ్ఞాపకార్థం ....
బాలురలో ఫస్ట్ K.GURUSAI SAKETH  కు
పదివేలు నగదు రోలింగ్ షీల్డు
బాలికలలో ఫష్ట్ N.NAVYA కు పదివేలు నగదు
రోలింగ్ షీల్డు బహూకరించారు .
2 . శ్రీమతి లక్కాకుల . రత్నమ్మ గారు తన భర్త
శ్రీ లక్కాకుల . వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం
SSC స్కూల్ ఫస్ట్ K .GURUSAI SAKETH కు
పదివేల నగదు పురస్కారం అందజేశారు .
3 . శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు
తన భార్య  శ్రీమతి లక్కాకుల . సుభాషిణమ్మ గారి
జ్ఞాపకార్థం  SSC స్కూల్ ఫస్ట్ K.GURUSAI SAKETH కు పదివేల నగదు పురస్కారాన్ని
అందజేశారు .
ఈ కార్యక్రమంలో శ్రీమతి మాదాసు .నళినమ్మ గారు ,
 MEO , HM , ఉపాధ్యాయులు , గ్రామపెద్దలు , విద్యార్థులు , తలిదండ్రులు పాల్గొన్నారు .

14, జూన్ 2018, గురువారం

సంఘటితం కండి - 2


తెలుగుల సాంస్కృతీ విభవ దీప్తులు - కాపుల శౌర్య విక్రమో
జ్జ్వల ఘన కీర్తి జన్యములు - సంగర రంగము నందుగాని , శ్రీ
విలసిత కాంతిమత్ విపణి వీధుల యందున గాని , వేష భా
షల లలితేందిరా కళల చాయల గాని , చరిత్ర గాంచినన్ .

కుజన రాజన్యుల కుత్తుకల్ గోసిరి
రాయల సంగ్రామ రాజియందు
మణి మయ భూషణ వణిజులై వెలిగిరి
దేశ దేశాల సందీప్తి మెరయ
వేష భాషల కీర్తి వెలుగొంద నిలిపిరి
సాంస్కృతీ వైభవోజ్జ్వలత గదుర
పేద సాదల కింత పెట్టిరి కడుపార
దాన దయా గుణ జ్ఞాను లగుట

శౌర్య విక్రమ ధిషణాది చతురతలును ,
వేష భాషలు , సంస్కృతీ విభవములును
కాపు వర్గాల పెన్నిథుల్ , కలసి రండు ,
సంగరము సేయ , ఎన్నిక రంగ మందు .


13, జూన్ 2018, బుధవారం

' సంఘటితం కండి '


తెలగలు , వొంటరుల్ , బలిజ ధీరులు , కాపులు తెల్గు నేలపై
గలరు విశేష సంఖ్యల , సకాలములో తమ శక్తి జూపి , ఈ
మలినపు రాజకీయమును మట్టున బెట్ట మహోగ్ర మూర్తులై
తెలుగు ధరాతలమ్ము నినదింపగ సంఘటితమ్ము కావలెన్ .

ఇతరుల కాళ్ళవద్ద యసలేల పడుండగ ? , రోష శౌర్య సం
వృతమతులై , స్వయం జ్వలిత వేగ సుసంఘటి తాంతరాత్మతా
స్తుతిమతులై , వినూత్న గతి , వంచకులన్ దిగద్రొబ్బి , భ్రాతలై
సతతము రాష్ట్ర పాలనకు సందడి సేయుడు రాజ్యకాంక్షతో .

ఇదె సమయమ్ము - కాపు విజయేందిర ఆంధ్రప్రదేశ రాష్ట్రమం
దుదయము నొందు దాక , పునరున్నతి బొందెడు దాక , కృష్ణరా
య ధరణి నాధు ప్రాభవ మహా మహనీయత లొప్పు దాక ,  సం
విధ సముదైక్య సంఘటిత వేదిక గావలె కాపు వర్గముల్ .



5, జూన్ 2018, మంగళవారం

పుట్టిన రోజిదియని .....(జూన్ 5 నాజన్మదినం)

ఎందుకు జనించితినొ స్వామి ! యెవ్వియును ఘ
నతలు లేవు , కనీసము వెతలు లేని
బతుకు బతికితినా యన్న  - వెతుక నట్టి
బాట సుతరాము కనరాదు  భాగ్య ధాత !

పుట్టినరో జిదియని యి
ప్పట్టున క్యాలండరు నను పదె పదె గాసిం
బెట్టుచు హసించె , స్వామీ !
పుట్టువునకు సార్థకత్వ పూర్ణత లేమిన్ .

ఒజ్జదన మొక కొంత మేలుజ్జగించి
కాస్త యూరట దొరికెను కమల నయన !
మండు టెండన బడి వచ్చు మనిషి కొకట
చల్ల దొరికిన వడువున జలజనాభ !

ఎంద రీ భూమి బుట్టి సాధించిరి , పురు
షార్థములు , సంశయమె , యైన , నంద రిటువ
లె వగతుర ? సందియమె స్వామి ! , చివరిమజిలి
యైన భయద రహితమై శాయంగ రాద !

అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
కడవ బెట్టంగ నావయై గానుపించు
జరను రుజలను దాటంగ , పరమ పురుష !



21, మే 2018, సోమవారం

మాకుల్లూరు - నా గురించి


బలిజను నేను , పుట్టువున పావని గంగకు తమ్ముడన్ , మహా
బలితలకెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుండ , స్వ
స్థలమది కుల్లురీ పురము , సంపదలందున విద్యలందు భూ
తలమున సాటిలేని ఘనతల్ గల యూరిని బుట్టితిన్ కడున్ .

కాపులలో విశిష్టతలు గల్గిన శూరుల జాతి మాది , మా
ప్రాపున ప్రాభవమ్మొడిసి పట్టెను రాయల రాజ్యలక్ష్మి , మా
చూపుల తీక్ష్ణతల్ దవిలి శోభలు గోల్పడె శత్రురాజ్యముల్ ,
భూపతులై తెలుంగు వర భూముల నేలిరి మాకులీనులున్ .

సదమల ప్రాకృతీ విభవ చైత్ర రమా రమణీయ శోభలన్
బొదివిన చెట్లు , కొండలును , పూర్ణజలాన్వితమైన చెర్వులున్ ,
నదియు , ననేక గుళ్ళు , విపినమ్ములు , స్వచ్చపు మానసమ్ములున్ ,
చదువులు , శౌర్యముల్ గదిసి చక్కని తల్లి మదీయ గ్రామమే .

చదివితి తెల్గు నాంగ్లమును సంస్కృతమున్నొక కొంత , యిష్టమై
మదికి లయించు నొజ్జదనమందున ముప్పది యెన్మిదేండ్లుగా
బ్రదికితి , లక్షలాదికి నవారిగ జీవన మార్గ సత్యముల్
విదిత మొనర్ఛి ధన్యతల వెల్గుల గాంచితి , నింత యేటికిన్ .

ఆస్తికుండనె గాని యసదు నించుకయేని
గ్రుడ్డిగా నమ్మిన గురుతు లేదు
దైవ నిందలు సేయ తలపు బారదుగాని
తాంత్రిక క్రతువులు తగులు పడవు
విశ్వంబు నియతమై విభ్రమించు నటుల
సత్య ధర్మ నియతి చాల ప్రియము
ద్వేషంబు మోసంబు వేషంబు లెరుగను
తప్పుడు పథములు తగవు మదికి

తానె గొప్పటంచు తగ విఱ్ఱవీగెడు
త్రాష్టు డన్న నాకు తగని మంట
ఒప్పు గాంచ లేక తప్పులే వెదికెడు
వెధవ లన్న పడదు బుధులలోన .

చరమ జీవితమ్ము పరమాత్మ సేవనా
నంద మగ్న సత్య సదమలముగ
గడిపి గొలగమూడి కరుణామయుడు స్వామి
వెంకయార్యు జేర వేడ్క గలదు .

1, ఫిబ్రవరి 2018, గురువారం

అతిమనోహరులైన యశోదాకృష్ణులు





తల్లితో కన్నయ్య తనియు మురిపెమ్ములు
ముగ్గులో చిత్రించు ముదితలార !
ఆనాటి గోపికా మీనాక్షులాయేమి ?
కమలాక్షు కండ్లకు కట్టినారు
ముగ్ధ మోహనరూపు ముద్దుగారెడు , చూడ
కనుగవ చాలదు కాంతలార !
రూప లావణ్యాలు రూపించి చిత్రించి
రమణీయతలకు హారతి పడితిరి

అతి మనోహరమైన యీ ప్రతిమ జూచి ,
కన్ను లానంద పరవశ గతిని జేరి ,
భాష్పములు గ్రమ్మె  , తపమన్న భాగ్యమన్న
తమదె , యేరీతి వొగుడుదు ? తరుణులార !

22, జనవరి 2018, సోమవారం

నేడు వసంతపంచమి - అమ్మకు వందనం


నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

21, జనవరి 2018, ఆదివారం

పద్యమూ - పద్యకవులూ వర్థిల్లాలి

' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .

మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీరంగ మెత్తుము తనను దలచి .

ఎంత రమణీయ మీ పూల పుంత !  మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల దీర్చి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు దెచ్చినారు .

కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .

కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !

తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు  రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !

15, జనవరి 2018, సోమవారం

నమో సూర్యనారాయణా


చలికి గిజ గిజలాడు చంచల పుడమిని
తన కవోష్ణ కిరణ బాహులను పొదివి ర
మించు సూర్యనారాయణు మించు ప్రేమ
కథకు మకర సంక్రమణ సాక్ష్యమ్ము సుమ్ము .

ఉత్తరాయణ పుణ్య భానూర్థ్వ కిరణ
జనిత జీవమ్ములంది ప్రజ్జ్వలత పొంది
భూమిపై జీవజాలమ్ము స్ఫూర్తి నొందు
శుభ సమయ సంక్రమణ మిది , శోభనమ్ము .

14, జనవరి 2018, ఆదివారం

నిన్న శనివారం యాదాద్రి నరసింహుని దర్శన భాగ్యం లభించింది

చేరి భీకరమైన సింహ ముఖమ్మున
దంష్ట్రల కోరలు దడలు పుట్ట
గట్టు గట్టంతయు గడడగడ వణకంగ
అరుపుల రౌద్రంబు లురులు చుండ
రక్కసు నుఱము చీల్చ నురికిన నల్ల
పారి చారలు గట్టి జారుచుండ
ఉగ్రత తగ్గించ నుదధి కన్యక చేరి
తొడమీది కెక్కి చేతులు మొగిడ్చ

కాస్త శాంతించి  యాదాద్రి గట్టు మీద
రక్షగా నిల్చి  జగములు గ్రాల  కాచు
లక్ష్మి నరసింహు దర్శించి ప్రణతు లిడితి
నిన్న శనివార మనుభూతి యెన్న తరమె !

7, జనవరి 2018, ఆదివారం

పరమేశ్వర విభూతి

సృష్టి స్థితి లయల నెవడు
స్పష్టముగా గోచరించు పరమేశ్వరుడై ,
నిష్టగ తపించి ఋషులం
తిష్టముగా నెవని గూర్చి తెలిసి తనిసిరో .

శక్తి యతని రూపు , సకల జగతి యతని
చిద్విలాసమ్ము , ప్రేమ భాసించు టతని
తత్త్వ , మతడు విరాట్ సత్య ధర్మ రతుడు ,
దర్శనీయుండు జగతి యంతటను నతడు

అతని సృష్ఠి  కడుమనోఙ్ఞ , మడుగడుగున
నత డగుపడు నన్నింట తా నద్భుతముగ ,
ప్రతి చరాచర రూపమ్ము నతని దివ్య
చేతనా ప్రభావిత వికసిత సుమమ్మె

మొనసి జీవన సంద్రాన మునిగి పోవు
నావ నొడ్డుకు లాగ లేనపుడు మనకు
తోడుగా నిల్చి కాపాడు వాడె యతడు
కష్టములు తీరి నంతనే కనము గాని .....

శక్తి యతని రూపు , సకల జగతి యతని
చిద్విలాసమ్ము , ప్రేమ భాసించు టతని
తత్త్వ , మతడు విరాట్ సత్య ధర్మ రతుడు ,
దర్శనీయుండు జగతి యంతటను నతడు





1, జనవరి 2018, సోమవారం

ఆకాంక్ష

భారతీయతకును పద్దెనిమిదికిని
విడని బంధమేదొ వినగ నగును
ధర్మ రక్ష కొఱకు తరచుగా నీసంఖ్య
తారస పడె నాటి తరము లందు .

నేడు పద్దెనిమిది నియతమై వచ్చెను
చెలగి ధర్మ రక్ష చేయు కొఱకొ
చెడును గెలుచి మంచి చేరువై జనులెల్ల
భద్ర మైన బ్రతుకు బ్రతుకు కొఱకొ .

గడచిన వత్సర మంతయు
కడగండ్లను బడిరి జనులు ఘనుల వలన , ఆ
చిడి ముడి పాట్లిక ముందున
విడిపోవునొ , కొత్త పాట్లు విడుదల యగునో ?

పాలకులు ప్రజల పక్షము
మేలు దలచి తగు విథము సమీక్షలతో చ
ట్టాలొనరించి హితమ్ముగ
పాలించుచు ప్రజల మెప్పు బడయంగ నగున్

ముంద టేడాది వలె గాక , ముదము గూర్చ
నవ వసంతము మన భూమి నవతరించి
సకల జనముల , సంతోష సమధికముగ ,
జీవ నానంద పథముల జేర్చు గాత !

16, డిసెంబర్ 2017, శనివారం

తెలుగు పద్యం

తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు

కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు

15, డిసెంబర్ 2017, శుక్రవారం

తెలుగు పద్య సఖియ .....

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్

*****

తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె

*****

పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో

*****

తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల

*****

తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

23, నవంబర్ 2017, గురువారం

బిడ్డల్ని కనడానికి మంచి రోజులు .....

Courtesy
ఆంధ్రజ్యోతి
ఇరు వర్గాలు – రెండుపంచాంగాలు  
------------------------------------------                                                                                                                       తిథి , నక్షత్రాల ప్రవేశ విషయంలోవాదోప వాదాలు - సామరస్యం కొరవడిన అతిశయాలు -
సందర్భమా - ఆందోళన కరం      
అసలు విషయంలోకి వద్దాం . ఆ రోజు వైద్యం కోసం మా ఆవిడని హాస్పిటల్
కు తీసుకెళ్ళడం జరిగింది . అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .
రిసెప్షన్ హాల్లో నలుగురైదుగురు ఆడవాళ్ళూ , నలుగురైదుగురు మగవాళ్ళూ
పంచాంగాలు తెచ్చుకొని మరీ సప్రమాణంగా వాదించు కుంటున్నారు .
       అమ్మాయికి నెలలు నిండినట్లుంది . సిజేరియన్ అవసరమైన పరిస్థితిలా
కనబడుతోంది . తొలి కాన్పేమో .  అమ్మాయిలో ఆందోళన కనబడుతూఉంది.
హైపర్టెన్షన్కు  గురై ఉండవచ్చు . అందువల్ల నార్మల్ డెలివరీ వరకూ వెయిట్
చెయ్యడం కుదరక పోవచ్చు . డాక్టర్ సిజేరియన్కు సిధ్ధం చేస్తున్నట్టున్నారు .
థియేటరు వద్ద ఆ హడావిడి కన్పిస్తూ ఉంది . ఇదీ సీను .
      అయినా అమ్మాయి ఉన్న ఈ పరిస్థితిలో అసలు వీళ్ళకు తిథులూ నక్షత్రా
ల కోసం వాదులాడు కోవడానికి నిలకడెలా వచ్చిందో నాకైతే అంతు పట్టలేదు .
ఈ కథనంలో కాస్తంత కూడా అవాస్తవంలేదు . తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా
ప్రమాదం జరిగితేనో –
     ఇరువైపుల వాళ్ళల్లో- ఆడవాళ్ళైతే కట్టూ బొట్టూతో ఆర్భాటంగానూ , మగ
వాళ్ళైతే సూటూ బూటూతో అతిశయంగానూ, బాగా చదువుకున్నవాళ్ళ
లాగా కన్పిస్తున్నారు .
      ఆధ్యాత్మికత , దైవం మీద నమ్మకం – ఈ రెండు భావనలూ – వీటిలోని
సత్యాసత్యాలు పక్కన పెడితే – మనిషికి పరిణతినిచ్చి , కట్టడి చేసి ,
సమాజం కొంతవరకు సజావుగా నడవడానికి దోహద పడ్డవి .
      అడుగడుగునా భ్రమలతో , భయాలతో భద్రతలేని జీవన యానంలో
సతమత మయ్యే మనిషి – తనకంటే శక్తి మంతమైన ఉనికిని గుర్తించి,
ఆ శక్తిని దైవంగా భావించి , ఆపదలో తనకు ఆసరా కోసం నమ్మి ,
ఆరాధించడం మొదలై ఉండవచ్చు .
      కానీ , జరుగబోయే పరిణామాలను ముందే గ్రహించగలగడం – తదను  గుణంగా భవష్యత్తును తన అజమాయిషీలోకి తెచ్చుకో జూడడం          దురాశే కాదు , అసాధ్యం కూడాను .
      మరణించేదాకా హాయిగా బతకాలని కోరుకుంటాము . సాధ్యమయ్యే నా?                      
 భవిష్యజ్జీవితంలో జరిగే పరిణామాలేమిటో తెలుసుకో గల్గితే ?
ఎవరైనా చెప్పగల్గితే ? ఈ ఊహే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది .
ఈ బలహీనత లో నుంచే , ఈ దురాశలోనుంచే ఏర్పడిన ’ ఒక సంప్రదాయం’  భారతీయ జీవన విధానంలో భాగమై , శాస్త్ర మనే భ్రమ కల్పించింది .
నేటికీ వెర్రితలలు వేస్తున్న ఈ జాతక చక్రాల మాయ వీడే దెన్నడో ?
మన సమాజాన్ని బ్రమలలో ముంచే ఇలాంటి దుర్మార్గాలు నశించే దెన్నడో ?






12, నవంబర్ 2017, ఆదివారం

పద్యం - పరమార్థం

పద్యం - పరమార్థం
                     *****************
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .

11, నవంబర్ 2017, శనివారం

మన తెలుగు వర్థిల్లాలి .

పద్యమైన , వచనమైన పాఠకులకు
అర్థ మవని యెడల పరమార్థమేమి ?
పండితుల కిది ఫేషనా ? బాగు , బాగు !!
వారి దారులు వారివి వదులుకోరు .

పదిమందికి తెలిసిన తగు
పదజాలము పద్యమందు వాడి , సరసమౌ
విధమున పద్యము వ్రాయుట
కుదరని వారెందుకయ్య గొప్పలువోవన్ ?

పద్యములు వ్రాసి , అందులో పదము , లాంధ్ర
భారతిలో జూపి , సూచన వ్రాయు ఖర్మ
తెలుగు భాషకు పట్టెను , ధీ మతు లట !!
డిక్ష్ణరీల భాష లిట పాటింతు రకట !

వాడుకన లేని , తెలియని పదము వాడి
గొప్పఘా ఫీలగుట మన కోవిదులకు
గొప్ప గాబోలు ! నిదియేమి గొప్ప బాబు !
మూగ-చెవిటి వారి విధము ముచ్చట గద !

ప్రజల నోళ్ళయందు పరిఢ విల్లిన భాష
శాశ్వితముగ బ్రతుకు విశ్వమందు ,
పేరు గొప్ప కొఱకు  పిడికెడు పండితుల్
వాడు భాష మనదు  ,  వాస్తవ మిది .

10, నవంబర్ 2017, శుక్రవారం

పొద్దు వాటాలె .....

ఏ వ్రేలు పట్టి తా నిలను నడిపించెనో
ఆ వ్రేలు తన కూత మగునొ లేదొ
ఏ బాల్యమునకు తా నింత ఙ్ఞాన మిడెనొ
ఆబాల్య మండయై ఆదు కొనున
ఏ తీగె సాగుట కెండు కట్టెయి నిల్చి
పెంచిన పొదరిల్లు ప్రియ మొసగున
కౌలు రైతిట వచ్చి  నిలువు కట్టెకు నీడ
నొనర నిచ్చున  పెద్ద మనసు గదుర

షష్టి సప్తతియు నశీతి చని  సహస్ర
పున్నములు జూచె నీ వృధ్ధ మూర్తి , యితని
సాదుకుందురొ లేదొ , ఈ స్వాదు ఫలము
రాలు నందాక బిడ్డలు మేలు దలచి .

9, నవంబర్ 2017, గురువారం

కందాక్రందనము .....

జొట జొట కన్నీ రొలుకగ
కట కటబడి కందబాల కళదప్పి కడున్
అట మటముల నిటుల వలికె
కట కట డగ్గుత్తిక వడ కలలో నాతో .

అన్నా ! నీ వెరుగవె ! నే
నన్నిట సుకుమారినిగద ! నన్నొక బామ్మా
తన్నిన తన్నులు తన్నక
తన్నుచు నున్నది పదాల తాడనములతో .

మీ నెల్లూరున తిక్కన ,
మానుగ వేమన్న - కడప మారాజు  ననున్
మేనెల్ల హేమ పరిమళ
మానితముగ దీర్చినారు , మన్నన గలిగెన్ .

ఛిన్నా భిన్నం బైతిని
నిన్నటి విభవంబు వోయె , నే డిట్టుల సం
ఖిన్న వదన రదన మహా
పన్న విరూప విపరీత ప్రకృతిన్ బడితిన్ .

నరసన్న , భాస్కరన్నలు ,
మరియును మన బండిరావు మాన్యులు , మీరున్
కరుణింతు రనుచు బొగిలితి ,
పర పీడన నుండి నన్ను  బైట బడేయన్ .

                             .....jk......

19, అక్టోబర్ 2017, గురువారం

హోదా టపాసు - టపాసు ప్యాకేజి

చిచ్చుబుడ్లకు బదుల్   చచ్చు బుడ్లిచ్చిరి
కాకర పూగుత్తి కాలదయ్యె
విరి మతాబుల బదుల్   సురసురాలిచ్చిరి
డాంటపాసుల వొత్తు లంట వయ్యె
భూచక్రములు కాస్త బూజు పట్ఠె తడిసి
విష్ణు చక్రమ్ములు వెలుగ వయ్యె
తారజువ్వ లరచి తడబడి తడబడి
నింగి కెగుర లేక నీల్గుచుండె

ఆంధ్ర కిచ్చిరి ' టపాసులు ' కేంద్ర మిదిగొ !
రాదు ప్రత్యేక హోదా , పరాయి మనము ,
చాలు ' ప్యాకేజి ' మన్ను , యెంచక్క మనకు
సర్దుకొనిపోవు నలవాటు చాల గలదు .

అమర పురాధిపు లందరు
సమరము శాయంగలేక శాంతియు , క్షమయున్
సమపాళ్ళ గలిపి త్రాగుచు
బ్రమ లందున ముంచి ప్రజల , బ్రతుకుదు రెలమిన్ .

18, అక్టోబర్ 2017, బుధవారం

చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .....


గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి
కోపానల జ్వాల కోల జేసి
వింటి నారికి జేర్చి మంటికి మింటికి
కణ కణ విస్ఫులింగాలు రాల
నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ
గరుడుండు గువ్వయి కానుపింప
జడిసి సురాసుర లుడిగి భువి బడంగ
బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర

కదన రంగాన గల నరకాసురుండు
నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు
ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .

చెడును శిక్షించు పట్టున పుడమి తల్లి
యే వివక్షను చూపలేదే ! విడువక ,
రావణుని చావు పట్టున రమణి సీత
తల్లి పుడమిని తలపించె తాను కూడ .