14, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీ సాయి నాథుని సర్వదేవతా సత్తాక మూర్తి మత్వం


శేష నగము జేరి చెలు వార కొలువైన

వేంకటేశ్వరుడవు వెలయ మాకు

కలల పంటవైన యిల వేల్పు నీవెరా

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

తిరుమ లేశు నెదను దీటు గా కొలువైన

అమ్మ- త్రిభువనాల కండ దండ

పరమ సాధ్వి యైన పద్మావతియె నీవు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

తాను విశ్వ మందు తన యందు విశ్వమ్ము

" తామరాకు నీరు " తనరు భంగి

వెలయు విష్ణు రూప ! విశ్వావనీ నాధ !

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

పసిడికి నిలువెల్ల భాసురంబగు కొల్వు

శ్రీకరముల నెలవు చిత్త మెల్ల

సిరులు రూపు దాల్చు శ్రీలక్ష్మి యే నీవు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

సకల శుభము లిచ్చి సాయుజ్యముల నిచ్చి

సగము తనువునిచ్చి సత్కరించు

భక్త సులభు డైన పరమేశ్వరుడ వీవు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

అరయ ప్రాణికోటి కాహార మిచ్చేటి

అమ్మ త్రిభువనముల కన్న పూర్ణ

సర్వ మంగళ , శుభ , శర్వాణి యే నీవు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

విశ్వ స్రస్ట తాను విశ్వమ్ము సృజియించి

మొదలి జన్మలరసి విధి లిఖించె

బ్రహ్మ నీవె పరమ బ్రహ్మమ్ము నీవెరా

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

వరలు దేహమెల్ల వాగర్ధ విభవమ్ము

భావ సంపదల ప్రభావ మయము

ఎరుక రూపు దాల్చు పర శారదే నీవు

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

రామ నామ మధుర రస ధార సేవనా

నంద మహిమ లెన్న నాతరంబె

సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

శ్రీ రాము పత్ని , జనకజ ,

గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా

వారాశి , సీత నీవయి

కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !

 

శ్రీరాము బంటు , అంజని

గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా

కారాధ్యు డైన మారుతి

నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !

 

పూర్వాద్రి రూప ! పశ్చిమ

పర్వత రూపాయ ! తే నమామి యటంచున్

సర్వేశుడవగు దినకరు

సర్వోన్నత మూర్తి ! నీకు సన్నుతి సాయీ !

 

తివిరి భూజనులకు దేదీప్య మానమై

వెలుగునిచ్చి బ్రోచు వేద వేద్య !

తిమిర సంహరణకు దీప్తి నీవేనురా !

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

చలన రధము నీవు సారధి యును నీవు

కొదమ గుర్రములును రధియు నీవు

చరమ పధము నీవు చైతన్యమే నీవు

శ్రీని వాస సాయి ! శిరిడిరాజ !

 

మదిని నిన్ను బెట్టి మొదలిడి నట్టి యే

కార్య మైన సఫల కారియగును

యింత కన్న జనులు యేమి కోరేరు రా

శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

 

 

16, జనవరి 2013, బుధవారం

..... బతుకు బండి


చెవి నిల్లు గట్టుక  సెల్ ఫోను విడువదు
నిద్దుర చెఱుపక  నెట్టు విడదు
శ్రీవారు దిట్టక  టీవీలు విడువరు
పది యడుగుల కైన బండి విడదు
పన్నెండు దాటినా పడకలు   పిలువవు
పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
సంతృప్తి యన్నది సుంత లేదు
 
పనికి రాని ఇగో లతో బతుకు నిండి
మనసు , దేహము కృతకమై మారి మనిషి
సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .

2, జనవరి 2013, బుధవారం

వచ్చె నవ వత్సరమ్ము .....


 
 
 
 
వచ్చె నవ వత్సరమ్ము , కావచ్చు నిజము

కాల గణనమ్ము దీనిలో ఘనత యేమి ?

పేద శ్రీమంతు డగున ? దీపించి యెగసి

బడుగు బతుకుల వెన్నెలల్ పరుగులిడున ?



మనిషి స్వార్ధాన్ని కొంతైన మాను కొనున ?

మనిషి మనిషిని దోచుట మాను కొనున ?

మనిషి దుర్మార్గ వర్తన మాను కొనున ?

మనిషి మనిషిని చంపుట మాను కొనున ?



నేతలు వినీతులై తలరాత మారి

దేశ ప్రజలకు శాంతి సందేశ మిడున ?

చదువు పూర్తయి యుద్యోగ విధులు లేని

వారి బతుకులు కొలువుల చేరు వగున ?



కోత లేని పవరు సమ కూరునా ?

లమ్ము పారి రైతన్న పొలాలు పండి

భారతావని కాకలి తీరునా ? ప్ర

భుత్వ పథకాల తీరు ప్రమోద మిడున ?



అగును కారణ మవినీతి యన్నిటికిని

ఓటరులు నీతి మంతులై ఓటు వేసి

నీతి మంతుల నేతల నెన్ను కొనిన

నాటి నవ వత్సరమ్ములు వేడు కగును

1, జనవరి 2013, మంగళవారం

బ్లాగరులకు -2013- క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు


             హిత సమాజ నిర్మాణ బాథ్యత వహించి

                జనుల చైతన్య పరచు - విజ్ఞాన దాయ

                పోస్టులను వ్రాయు 'బ్లాగర్లు' మోదమంద

                నవ వసంత శుభాకాంక్ష లంద జేతు .

 

                                                                      ----- సుజన-సృజన

 

 



 

 

 

 

23, డిసెంబర్ 2012, ఆదివారం

ముక్కోటి దేవతా మూర్తీ ! శ్రీ సాయి నాథా !

శేష నగము జేరి చెలు వార కొలువైన
వేంకటేశ్వరుడవు వెలయ మాకు
కలల పంటవైన యిల వేల్పు నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తిరుమ లేశు నెదను దీటు గా కొలువైన
అమ్మ- త్రిభువనాల కండ దండ
పరమ సాధ్వి యైన పద్మావతియె నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తాను విశ్వ మందు తన యందు విశ్వమ్ము
" తామరాకు నీరు " తనరు భంగి
వెలయు విష్ణు రూప ! విశ్వావనీ నాధ !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

పసిడికి నిలువెల్ల భాసురంబగు కొల్వు
శ్రీకరముల నెలవు చిత్త మెల్ల
సిరులు రూపు దాల్చు శ్రీలక్ష్మి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

సకల శుభము లిచ్చి సాయుజ్యముల నిచ్చి
సగము తనువునిచ్చి సత్కరించు
భక్త సులభు డైన పరమేశ్వరుడ వీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

అరయ ప్రాణికోటి కాహార మిచ్చేటి
అమ్మ – త్రిభువనముల కన్న పూర్ణ
సర్వ మంగళ , శుభ , శర్వాణి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

విశ్వ స్రస్ట తాను విశ్వమ్ము సృజియించి
మొదలి జన్మలరసి విధి లిఖించె
బ్రహ్మ నీవె పరమ బ్రహ్మమ్ము నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

వరలు దేహమెల్ల వాగర్ధ విభవమ్ము
భావ సంపదల ప్రభావ మయము
ఎరుక రూపు దాల్చు పర శారదే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

రామ నామ మధుర రస ధార సేవనా
నంద మహిమ లెన్న నాతరంబె
సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

శ్రీ రాము పత్ని , జనకజ ,
గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా
వారాశి , సీత నీవయి
కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !

శ్రీరాము బంటు , అంజని
గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా
కారాధ్యు డైన మారుతి
నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !

పూర్వాద్రి రూప ! పశ్చిమ
పర్వత రూపాయ ! తే నమామి – యటంచున్
సర్వేశుడవగు దినకరు
సర్వోన్నత మూర్తి ! నీకు సన్నుతి సాయీ !

తివిరి భూజనులకు దేదీప్య మానమై
వెలుగునిచ్చి బ్రోచు వేద వేద్య !
తిమిర సంహరణకు దీప్తి నీవేనురా !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

చలన రధము నీవు సారధి యును నీవు
కొదమ గుర్రములును రధియు నీవు
చరమ పధము నీవు చైతన్యమే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడిరాజ !

మదిని నిన్ను బెట్టి మొదలిడి నట్టి యే
కార్య మైన సఫల కారియగును
యింత కన్న జనులు యేమి కోరేరు రా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

15, డిసెంబర్ 2012, శనివారం

తెలుగు - వెలుగు


                          నలు చెఱంగుల తెలుగుల నాల్క లందు

                          తెలుగు వెలుగులు వెల్లువై – తెలుగు బాష

                          తేజ రిల్లును గాత  !  సందియము లేదు ,

                          మాతృ భాషకు వందన మాచ రింతు .

 

          దక్షిణ భారతీయ భాషలలో తెలుగు మథురమైన భాష . సంస్కృతంతో మిక్కుటముగా మమేకమై తెలుగు

దక్షిణాది భాషల కంటే విలక్షణమై భాసిల్లుతూ ఉంది .

          పద , వాక్య నిర్మాణాది భాషా లక్షణాలలో తన సహజ సౌరభాన్ని నిల్పుకుంటూనే సంస్కృతం , ఉర్దూ ,

ఆంగ్ల పదజాలంతో పరి పుష్టమై వికసిస్తూ , నిరంతరం భాషా స్రవంతిగా కొన సాగుతూనే ఉంది .

          పద నిర్మాణంలో తనకు మాత్రమే సొంతమైన అజంత మాథుర్యాన్ని తనలో కలగలసిన పరభాషా పదజాలానికి కూడా అద్ది , సుమథుర రుచిరం గావిస్తున్న తెలుగు భాష సహజ సౌందర్యం కొనియాడ దగినది .

         తెలుగు బ్రష్టు పట్టి పోతోంది . కను మరు గయ్యే ప్రమాదం ఉంది . ఉధ్ధరించ వలసి ఉంది . “ – ఇలాంటి మాటలు ఈమథ్య తరచుగా విన వస్తున్నవి .  ఈ నెల ఇరవయ్యొకటిన ప్రపంచం అంత మవుతుందన్న అసంబధ్ధ

జ్యోతిషాలలో వాస్తవం లేనట్లే పై మాటలలో కూడా నిజం లేదు .

            తల్లి భాషలో భావ వ్యక్తీ కరణ సుళువుగానూ విస్పష్టంగానూ ఉంటుందనడంలో సందేహం లేదు . నేడు

మనం మాటాడే తెలుగులో సంస్కృత పదజాలం ఎక్కువ . తెలుగేదో సంస్కృత మేదో గుర్తించ లేనంతగా కలగలసి

తెలుగు భాష కొన సాగుతూ ఉంది .

             సంస్కృత భాషా ప్రభావం మన భాషపై ఎక్కువ . ఒక విథంగా తెలుగు పరి పుష్టం గావడానికి ఈ ప్రభావం దోహదం చేసింది . ఐనా , ఇప్పుడు మనం మాటాడే సంస్కృత పదానికి అర్థంలో సరి తూగే తొలి తెలుగు

పదాలు ఈ ప్రభావం వల్ల వాడుక నుండి తప్పుకున్నవి . కారణం , మన పండితులకూ కవులకూ పండిత – కవి పోషకులకూ సంస్కృతం మీద ఉన్న మక్కువ . ఈ మక్కువ వల్ల తుదకు తెలుగు పేర్లు కూడా సంస్కృతీకరింప బడి , అసలేదో కొసరేదో గుర్తించ లేని స్థితి ఏర్పడింది . ఇది కొంత వరకు తెలుగు భాషకు ఇబ్బంది తెచ్చింది .

              తెలుగు కవులలో తిక్కన , వేమన , గురజాడ లాంటి కవులు కొంత మంది – కృష్ణ రాయలు , రఘునాథ – విజయ రాఘవ నాయకుల లాంటి కొంత మంది కవి పోషకులు తెలుగుపై మమకారంతో ఆనాటి

వాడుక లోని తెలుగు మాటలను తమ రచనలలో సింహ భాగం వాడి తెలుగు వెలుగులు విర జిమ్మినారు .

వారికి తెలుగు జాతి సదా ఋణ పడి ఉంటుంది .

               గ్రామీణుల నోళ్ళలో  నేటికీ తొలినాటి తెలుగు పదాలు వాడుకలో ఉన్నవి . పుట్టుకకు దగ్గరగా , ఎక్కువ మార్పులకు లోనుగాకుండా , పరిపూర్ణ భావ వ్యక్తీ కరణ సమర్థత గల్గి జాన పదుల నోళ్ళలో నేటికీ

ప్రాచీన తెలుగు పదజాలం అలరారుతూ ఉంది .

                కానీ , మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పండితులూ కవులూ వీటిని గ్రామ్యాలంటారు . అసాథువు లని పేరు పెడుతారు . వ్యాకరణ విరుధ్ధాలని కొట్టి పారేస్తారు . మాటాడుటకు తప్ప రచనలో వినియోగించుట నేర మంటారు .

                దరిమిలా , మనకు గ్రాంథికం – వ్యావహారికం అనే రెండు సమాంతర భాషలు ఏర్పడ్డవి . ఏమిటో  మరి ! సహజ సౌందర్యం ఉట్టి పడే గ్రామీణ తెలుగు పదాలు పండితులకు పంటి కింద రాయిలా బాధిస్తుండడం చూస్తే మన నెత్తిన సంస్కృత ప్రభావం ఎంత ఎక్కు పడిందో తెలుస్తోంది కదా !  

                  ఇంతకీ నేను విన్న వించు కునే దేమిటంటే ,  తెలుగా , సంస్కృతమా , ఉర్దూనా , ఇంగ్లీషా తదితరమా  అనే తేడా మానుకొని  తెలుగు మాటాడే టప్పుడు గాని , వ్రాసే టప్పుడు గాని  -

భావాన్ని విస్పష్టంగా వ్యక్తీకరించడానికి  తెలుగు వాడుకలో కలగలసి పోయిన  అత్యంత సమర్థ మంతమైన  

ఏ పదాన్నయినా వాడండి . తెలుగు భాషను పరి పుష్టం చేయండి .

                భాష పరిణామ శీలి . నిరంతర శ్రోతస్విని . దీన్ని గుర్తించిన వారు భాషా వికాసానికి తోడ్పడి నట్లే .

మడి కట్టు కున్న వారు తెలుగు చెడిపోతుందన్న బ్రమలో పడి భాషకు తామెంత నష్టం చేస్తున్నారో ఎన్నటికీ గ్రహించ లేరు .

                 జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు .

                 పిడికెడు మంది పండితుల వ్యవహారంలోని భాష లెప్పుడూ మనుగడ సాగించిన దాఖలాలు లేవు .