21, జనవరి 2016, గురువారం

తులసి వనాలా ..... ?



కోమల జల స్రోతస్విని
గ్రామీణ తెలుంగు , సదరు లలిత పదాలన్
ధీమమ్మున వెలయించిరి
వేమన్నయు అన్నమయ్య వేడుక కల్గన్ .

పిడికెడు మంది ప్రబుధ్ధులు
పడి పడి తలలూచు కొఱక పద్యపుశోభల్ ?
నడయాడ వలద , తెలుగుల
నడివీధుల , నాల్గుదెసల నాట్యపు హేలల్ .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
బ్లాగు తనదటంచు పలికి , యొకడు
తెలుగు గ్రామీణుల తేట పదాలున్న
పద్యము ప్రకటించ  వద్దనియెను .

తనది తులసి వనము , తాకరాదనెనొక్క
యాచకుండు , భజన మేచకుండు
వారు వీరు జేరి వర్థిల్ల జేతురా ?
స్వార్థపరులు తెలుగుభాష నకట !

మహితాత్ములు పూర్వకవులు
మహనీయ గుణాలవాల మాన్యులు , వీరో ?
బహు నీచ మనో లాలస
మహితాత్ములు విడువరెపుడు మాలిన్యములన్ .

15, జనవరి 2016, శుక్రవారం

ఆనాటి పెద్ద పండుగ ....



భూమి హేమంత ఋతు రాజ్ఞి ప్రేమ బంధ
నాలు వీడి , సూర్యుని కవోష్ణ రుచిర పరి
ష్వంగ సుఖము కోరంగ ప్రయాణ మిద్ది ,
పుడమికి మకర సంక్రాంతి పుణ్యదినము .

గతము కళ్ళ ముందు కదిలాడు చున్నది ,
నిన్న జరిగినట్లు నేటికిన్ని ,
పెద్ద పండుగన్న పెద్దపండుగె మరి ,
పొంగు పొంగలి హృదయంగమమ్ము .

అన్నదమ్ముళ్ళు , భార్యలు , అమ్మ నాన్న ,
పిల్లలు , ముసలోళ్లు మరియు పెళ్ళికాని
తమ్ములును చిన్నచెల్లెల్లు , తడవ తడవ
కలిసి జీవించు చుట్టపక్కాలు గలుగ ,

నిండు పెద్ద కుటుంబాలు , పండుగలకు
తడిసి మోపెడు ఖర్చులు , దారి లేదు ,
తలకొక జతైన బట్టలు తప్పని సరి ,
పిండి వంటలు మస్తుగా నుండవలయు .

భూమిని నమ్మిన రోజులు ,
రామునిపై నమ్మకమున రాజిలు రోజుల్ ,
తామింత దిని ఘనమ్ముగ
ప్రేమమ్మున నొకరికింత పెట్టెడు రోజుల్ .

31, డిసెంబర్ 2015, గురువారం

క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె

క్రీస్తు శకము నందు ప్రస్తుత మ్మింకొక్క
క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె ,
మనిషి బ్రతుకు నందు  మార్పులేవైపుకో ?
మంచివైపు కగున  ఇంచుకైన ?

భూమికావల నెక్కడో పుడమి బోలు
పుడమి కోసము గాలించు బుధులు !  సగము
కూటి కేడ్చెద రిచట   ఆకొన్న జనుల
గూర్చి బాగోగు లరయరా ?  కొంచమేని .

గతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
మయ్యె గాని  , సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె  అన్నింట మాన్యత గద !

తెలుగు రాష్ట్రాలు రెండయ్యె , చెలగి యందు
ఒకటి స్వర్ణాంధ్ర యయ్యె , ఇంకొకటి యిదిగొ !
కనుడు! బంగారు మయమయ్యె , కరువు బట్టి
రైతు చచ్చెను మృత్యు కోరలకు జిక్కి .

ధరవరలు పెరిగి బతుకు దారుణమయి
సగటు జీవులు కడగండ్ల బొగులుచుండ ,
పట్ట వేలిన వారికి ప్రజల పాట్లు
ఏటి కేడాది మారిన నేమి యొరుగు ?
  





24, డిసెంబర్ 2015, గురువారం

మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి

చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                                             ****************
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                                                   ****************
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                                                     ****************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .


13, డిసెంబర్ 2015, ఆదివారం

ఆనాటి పారవశ్యం .....

2012 మార్చి22 న ఆనాటి తెలుగు బ్లాగుల ,
బ్లాగరుల మనో మనోజ్ఞతలు పరవశింప జేయగా , 
ఆపారవశ్యంలో పడి వ్రాసుకున్న ఆనందమయ 
పోష్టు ..... (తెలుగు బ్లాగుల తోటలో బ్లాగరు
పూమొల్కలార !) ..... అంటూ ___
                   *****
పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన
రచయితలు  క్రొత్తవారు ‘  తారస పడంగ
జూచితిమి గాని నేడహో !    చూడచక్క
నైన ‘  రచయిత లెందరో గాన నయ్యె

తెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి
వ్రాయు  బ్లాగరు పూమొల్క లార  మీ ర
చనల సౌగంధి కాలతో తెనుగు దోట
నేడదిగొ  గుభాళించి పన్నీరు చిలికె 

ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,
కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి
వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,
బ్లాగు భారతి తెలుగున పరవశించె

ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు
తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి
యొకట స్పందించు భావుకత గలదు
రచయితల కుండ దగ్గ వీ లక్షణములె

ఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి
కోరి గొంతెత్తి పాడు చున్నారు  చేరి
అందరికి శుభాకాంక్ష లంద జేతు
 నందనోగాది ‘  కానంద మంద గోరి  







11, డిసెంబర్ 2015, శుక్రవారం

తెలుగు పద్య సఖియ .....

తెలుగు పద్యమెంత తీపు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలిమి కంటె ,
తేనెలో నిగిరిన తియ్యమామిడి కంటె
పల్లె సీమ లోని బ్రతుకు కంటె .

పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కృతులలో .

తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల .

తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్ .