4, జనవరి 2014, శనివారం

చతికిలబడిన సంక్రాంతి లక్ష్మి



        ఏంటీ అలా ఉన్నావు . వొంట్లో బాలేదా    అడిగేడు రాజారావు .
ఇంకా ఏంబాగు , ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం ? తొందరగా పోతే బావుణ్ణు   అంది నిర్వేదంగా సుభాషిణమ్మ.

        రాజారావుకు 63 ,  సుభాషిణమ్మకు 58 . ఇద్దరికీ బీపీ , షుగరూ వగైరా వగైరా చాలా మంది ఆత్మీయులు బాసటగా నిలిచేరు . ముసలి తనానికీ – అనారోగ్యానికీ ఆత్మీయత కాస్త అధికమే మరి !

       రాజారావు రిటైరై ఐదేళ్ళయ్యింది . కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యు . ఎస్ లో . కూతురూ అల్లుడూ హైద్రబాదులో . కొడుక్కి మగ , ఆడా ఇద్దరు పిల్లలు . కూతురికి ఇద్దరూ మగ పిల్లలు .

       పెద్దపండుగ రాబోతోంది . కొడుకూ కూతురూ కోడలూ అల్లుడూ మనవళ్ళూ మనవరాళ్ళ తో కళ కళ లాడుతూ ఉండాల్సిన యిల్లు . పెళ్ళిళ్లయి ఎవరికి వాళ్ళు దూర తీరాలలో ఉంటున్నారు . అందుకే దిగులు . సుభాషిణమ్మ బైట పడుతోంది . రాజారావు బయట పడడంలేదు . అంతే తేడా .

        రాజారావు మనోగతం బాల్యంలోకి మళ్ళింది . పల్లెటూరి నేపథ్యం వాళ్ళది . సంక్రాంతి వస్తుందంటే
పిల్లలంతా కొన్నిరోజుల ముందు నుంచే భోగి మంట కోసం తాటి మట్టలూ ఈత బరిగెలూ వగైరా ప్రోది చేసి పెట్టుకునే వారు . భోగి రోజు అర్థ రాత్రి దాటంగనే పోటీలు పడి మరీ భోగి మంటలు మొదలయ్యేవి .

       పది రోజుల ముందు నుంచే పిండి వంటలు తయ్యారు చేసేవారు . ముఖ్యంగా నేతి అరిసెలు – బెల్లంతోనూ పంచదారతోనూ రెండు రకాలు చేసేవారు . ఇక లడ్లూ వగైరాలు నాలుగైదు రకాలు స్వీట్లూ , నాలుగైదు రకాలు కారా తప్పనిసరి .

       ఇంటి నిండా జనం . పెద్దల పండుగ కావడం వల్ల స్వర్గస్తులైన వారికి  కొత్త బట్టలూ  నైవేద్యాలూ  పెట్టి  వాళ్లను స్మరించుకొని ధూపం వేసి  పూజాదికాలు నిర్వర్తించే వారు .  ఆ సందడే వేరు .

       పెండ్లయిన తరువాత అత్తవారింట సంక్రాంతికి అల్లుడి మర్యాదలు , ఆ ఆదరణ , ఆ వేడుకలు రాజారావు మదిలో తళుక్కున ఒక్క క్షణం మెరిసినవి .

       గతాల స్మృతి పథం నుండి బయట పడి నిట్టూర్చేడు . చివరకు ఇధ్దరు మిగిలేరు . ఏముంది పండుగ . నిర్వేదం తప్ప . ఈ వయస్సులో బిడ్డలు తోడుగా – మనవళ్లూ మనవరాళ్లతో ఆనందంగా సంక్రాంతి గడపడం – ప్చ్- అత్యాశే మరి .

        అవును నిజమే . అప్పటికీ ఇప్పటికీ  జీవన స్థితి గతులలో  ,  వసతులలో  అభివృధ్ధి కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంది . ఇప్పుడున్నన్ని వసతు లప్పుడు లేవు . ఇప్పుడున్నంత స్థితి గతు లప్పుడు లేవు . 

       గ్రామీణ భారతంలో అప్పుడు వ్యవసాయం  పాడి తప్ప వేరే ఆదాయ వనరులు లేవు .  కలిసుండడం ,
కష్టించి పని చెయ్యడం , కష్ట సుఖాలు పంచు కుంటూ , ఆప్యాయతలు పెంచుకుంటూ తృప్తి కరమైన కుటుంబ జీవన మాధుర్యాన్ని అనుభవించేవారు .

       ఇప్పుడు తల్లి దండ్రుల – బిడ్డల  ఎవరి బ్రతుకు వారిది . ఒంటరి జీవితాలు . బంధాలు తెగిన జీవితాలు . భద్రత కొఱవడిన జీవితాలు . తృప్తి చెందని మనస్సులు . మనోవేదనలు .

      కాలానుగుణంగా మార్పు సహజమే . కుటుంబ జీవన మాధుర్యం లేని మార్పు అంగీకారం కాదు .  


                       

31, డిసెంబర్ 2013, మంగళవారం

ఆశిద్దాం - స్వాగతిద్దాం



ఆర్థిక-సామాజికాంశాలతో కూడిన సమ సమాజం ఏర్పడాలని ఆశిద్దాం .
సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడాలని ఆశిద్దాం .
ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించాలని ఆశిద్దాం .
విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడాలని ఆశిద్దాం .
పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజు రావాలని ఆశిద్దాం .
లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తుందని ఆశిద్దాం .
మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రావాలని ఆశిద్దాం .
పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం రావాలని ఆశిద్దాం .
మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడాలని ఆశిద్దాం .
స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడాలని ఆశిద్దాం .
ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడాలని ఆశిద్దాం .
రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోవాలని ఆశిద్దాం .
అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తుందని ఆశిద్దాం .
రచయితలూ,కవులూ,కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందిస్తారని ఆశిద్దాం .
మేలైన సమాజం కోసం
మెరుగైన జీవనం కోసం
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం
శుభాకాంక్షల నందిద్దాం

22, జులై 2013, సోమవారం

జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్

జయ మంగళ శుభ కరునికి

జయతు జయతు నిఖిల లోక జగదీశునకున్

జయ పావన శుభ చరితుకు

జయతు జయతు సాయి నాధు చరణ యుగళికిన్


జయ రంజిత నామమునకు

జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నకున్

జయ జగతీ జన వరదుకు

జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్


జయ సర్వాంతర్యామికి

జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్

జయ విశ్వ జనావరుణికి

జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్


జయ యోగీశ్వర వరునికి

జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్

జయ గీతా చార్యునికిని

జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్


జయ జగదా ధారునికిని

జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్

జయ దీన జనావనునికి

జయతు జయతు లోక ప్రభు చరణ యుగళికిన్


జయ బ్రహ్మార్చిత మూర్తికి

జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్

జయ చిన్మయ సందీప్తికి

జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్


జయ సర్వ వ్యాపనునికి

జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్

జయ నారాయణ విభునికి

జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్


జయ నిత్య పరం జ్యోతికి

జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్

జయ ఘన సాయి ప్రభునికి

జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్

గురుపూర్ణిమ శుభాకాంక్షలు




పరమ గురుడగు శ్రీ సాయి ప్రభుని కృపను

కలలు పండంగ సకల సౌఖ్యాలు కలుగు ,

తెలుగు బ్లాగర్ల కీశుభ దినమునందు

అతులితముగ శుభాకాంక్ష లందజేతు .



గురు పూర్ణిమ శుభ దినమున

గురురాట్ శ్రీ సాయి నాధు గొలిచిన జగతిన్

గురుతెరిగి సాయి నాథుడు

తిరముగ దు:ఖములు బాపి తీరము జేర్చున్ .

 

 

 

 

18, జులై 2013, గురువారం

' ఇరు వర్గాలు - రెండు పంచాంగాలు '


ఇరు వర్గాలు – రెండుపంచాంగాలు                                                                                                                                                                      నాటి తిథి , నక్షత్రాల ప్రవేశ విషయంలోవాదోప వాదాలు - సామరస్యం కొరవడిన అతిశయాలు -
సందర్భమా - ఆందోళన కరం       

అసలు విషయంలోకి వద్దాం . ఆ రోజు వైద్యం కోసం మా ఆవిడని హాస్పిటల్

కు తీసుకెళ్ళడం జరిగింది . అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .

రిసెప్షన్ హాల్లో నలుగురైదుగురు ఆడవాళ్ళూ , నలుగురైదుగురు మగవాళ్ళూ

పంచాంగాలు తెచ్చుకొని మరీ సప్రమాణంగా వాదించు కుంటున్నారు .

       అమ్మాయికి నెలలు నిండినట్లుంది . సిజేరియన్ అవసరమైన పరిస్థితిలా

కనబడుతోంది . తొలి కాన్పేమో .  అమ్మాయిలో ఆందోళన కనబడుతూఉంది.

హైపర్టెన్షన్కు  గురై ఉండవచ్చు . అందువల్ల నార్మల్ డెలివరీ వరకూ వెయిట్

చెయ్యడం కుదరక పోవచ్చు . డాక్టర్ సిజేరియన్కు సిధ్ధం చేస్తున్నట్టున్నారు .

థియేటరు వద్ద ఆ హడావిడి కన్పిస్తూ ఉంది . ఇదీ సీను .

      అయినా అమ్మాయి ఉన్న ఈ పరిస్థితిలో అసలు వీళ్ళకు తిథులూ నక్షత్రా 

ల కోసం వాదులాడు కోవడానికి నిలకడెలా వచ్చిందో నాకైతే అంతు పట్టలేదు .

ఈ కథనంలో కాస్తంత కూడా అవాస్తవంలేదు . తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా

ప్రమాదం జరిగితేనో –

     ఇరువైపుల వాళ్ళల్లో- ఆడవాళ్ళైతే కట్టూ బొట్టూతో ఆర్భాటంగానూ , మగ

వాళ్ళైతే సూటూ బూటూతో అతిశయంగానూ, బాగా చదువుకున్నవాళ్ళ

లాగా కన్పిస్తున్నారు .

      ఆధ్యాత్మికత , దైవం మీద నమ్మకం – ఈ రెండు భావనలూ – వీటిలోని

సత్యాసత్యాలు పక్కన పెడితే – మనిషికి పరిణతినిచ్చి , కట్టడి చేసి ,

సమాజం కొంతవరకు సజావుగా నడవడానికి దోహద పడ్డవి .

      అడుగడుగునా భ్రమలతో , భయాలతో భద్రతలేని జీవన యానంలో

సతమత మయ్యే మనిషి – తనకంటే శక్తి మంతమైన ఉనికిని గుర్తించి,

ఆ శక్తిని దైవంగా భావించి , ఆపదలో తనకు ఆసరా కోసం నమ్మి ,

ఆరాధించడం మొదలై ఉండవచ్చు .

      కానీ , జరుగబోయే పరిణామాలను ముందే గ్రహించగలగడం – తదను  గుణంగా భవష్యత్తును తన అజమాయిషీలోకి తెచ్చుకో జూడడం          దురాశే కాదు , అసాధ్యం కూడాను .

      మరణించేదాకా హాయిగా బతకాలని కోరుకుంటాము . సాధ్యమయ్యే నా?                       

 భవిష్యజ్జీవితంలో జరిగే పరిణామాలేమిటో తెలుసుకో గల్గితే ?

ఎవరైనా చెప్పగల్గితే ? ఈ ఊహే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది .

ఈ బలహీనత లో నుంచే , ఈ దురాశలోనుంచే ఏర్పడినఒక సంప్రదాయం  భారతీయ జీవన విధానంలో భాగమై , శాస్త్ర మనే భ్రమ కల్పించింది .

నేటికీ వెర్రితలలు వేస్తున్న ఈ జాతక చక్రాల మాయ వీడే దెన్నడో ?

మన సమాజాన్ని బ్రమలలో ముంచే ఇలాంటి దుర్మార్గాలు నశించే దెన్నడో ?

 

 

15, జులై 2013, సోమవారం

" స్థానిక సమరం " - లో ఇదొక " విజయమ్మ" కథ ?


ఏమి విజయమ్మా ఈరోజు పిల్లలకు ఏమి వండి పెడుతున్నావు

ఏముంది సారూ అన్నమూ , సాంబారూ , రసమూను

అవును ,  ఈ రోజు మంగళ వారం కదా

అర్థమయ్యింది సారూ , మంగళవారం గుడ్లు వండాలని కదా మీరనేది

మరి ! “

ఒక్కొక్క పిలగాడికి రూపాయి పావలా ఇస్తున్నారు .  గుడ్డు రొండు రూపాయలు . వారానికి

రెండు సార్లు ఏడ దెచ్చేది . మీకు దెలవందేముంది సారూ .  అదికూడా నాలుగు నెలలకోసారి                            బిల్లు లిస్తున్నారు . బతుకు దెరువు లేక బడి పిల్లలకు వండి పెట్టడానికి ఒప్పు కుంటిని .

ఏమి చేసేది .

     నేను గవర్ణమెంటు హైస్కూలు ప్రథానోపాధ్యాయులుగా  నా స్కూల్ కాంప్లెక్సు పరిధిలోని

కొన్ని ప్రాథమిక పాఠశాలలు సందర్శించిన సందర్భమిది . ఇది నాలుగేళ్ళ నాటి సంభాషణం .

                                         -----

     పదేళ్ళ క్రితం విజయమ్మ ఆ మండలానికి మండలాథ్యక్షురాలు . ఆ వూరి యం.పి.టి.సి

యస్.సి మహిళకు రీజర్వు కావడం వల్లా , ఊరి రాజకీయ నాయకుడు ఎంపిక చేయడం వల్లా

విజయమ్మ యం.పి.టి.సి అయ్యింది .

      మండలాథ్యక్ష పదవి  ఆనాడు జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది . మండలంలో

గెలిచిన యం.పి.టి.సి లలో విజయమ్మ ఒక్కరే మహిళ కావడం వల్ల అనూహ్యంగా మండలా

థ్యక్ష పదవి ఆమెను వరించింది .

        అంతకు క్రితం ఆ మండలానికి మండలాథ్యక్షుడుగా ఉన్న ఉన్నత సామాజిక వర్గానికి

చెందిన రాజకీయ నాయకుడు బలాఢ్యుడు . అంగ , అర్థ బలంతో ఆ మండలంలో ఆయన హవానే                      నడుస్తూ ఉంది .

        ఇక షరా మామూలే . మండలాథ్యక్షురాలు విజయమ్మ ప్రతిరోజూ పొద్దున్నే సదరు శ్రీవారి

ఇంటికి వెళ్ళడం , సాయంత్రం వరకూ ఆయింటి యజమానురాలు చెప్పిన పనులు చేయడం ,                           రాత్రికి ఇల్లు చేరడం – ఇదీ విజయమ్మ దిన చర్య .

        విజయమ్మకు పొడి పొడిగా సంతకం చేయడం నేర్పించినారు . చెక్కులూ , ఉత్తర్వులూ ,

తదితరాల మీద అయ్యగారి ఇష్టాయిష్ఠాల మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం ,

అప్పుడప్పుడు జరిగే సమావేశాలలో ఒక అనామకురాలి లాగా బిక్కు బిక్కుమంటూ కూర్చోడం .

        అధికారులూ , అనధి కారులూ ఆమెనసలు మండలాథ్యక్షురాలిగా భావించిన దాఖలాలు

కనబడవు . అధికారమూ . ఆర్భాటమూ అంతా ఆ పెద్దాయనదే మరి . విజయమ్మ నామ మా

త్రం గానే మిగిలి పోయింది . పదవి పోయిన తర్వాత బతుకు తెరువు కోసం నానా పాట్లూ పడుతున్న

ఇలాంటి విజయమ్మలను చూస్తున్నప్పుడు మనస్సు చివుక్కు మంటోంది . ఇది పదేళ్ళ నాటి

సంగతి . ఐనా , మార్పు కోసం ఆసించడం తప్ప ఎక్కడా ఆ ధాఖలాలు సుదూరంగా కూడా                        కనిపించడం లేదు .

                                        -----  

         ఉన్నత సామాజిక వర్గాల మహిళలతో సహా స్త్రీలు , బడుగు – బలహీన వర్గాలూ స్థానిక

రిజర్వేషన్ల ద్వారా అందిన పదవులను అనుభవించే పరిస్థితులే లేవు . అధికారమంతా రాజకీయ ,

సామాజిక , ఆర్థిక బలాఢ్యుల చేతుల్లోకి బదిలీ అవుతున్నప్పుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్న

తి ప్రశ్నార్థకమే .

         ఈ సామాజిక దురవస్థకు కారణం మనకు తెలుసు . నిరోధించడానికి మన బాధ్యతగా ఈ సమాజానికి మనమేమి చెప్పాలో యోచించండి .