1, మే 2020, శుక్రవారం

ఏమిచ్చి తీర్చుకునే మాత్మబంధూ !

                   
             🙏🙏🙏🙏🙏

ఏమిచ్చి తీర్చుకునే మాత్మబంధూ ! స
ఫాయన్న ! నీ సేవ పావనమ్ము
ఏమిచ్చి తీర్చుకునే మాత్మబంధూ ! హ
రీ ! వైద్యనారాయణా ! విజయుడ !
ఏమిచ్చి తీర్చుకునే మాత్మబంధూ ! వి
విధవైద్య సేవికా ! విమల మతివి
ఏమిచ్చి తీర్చుకునే మాత్మబంధూ ! పు
లీసయ్య ! నీ విధు లెంతొ ఘనము

ఈ సమాజపు బతుకుల కోస , మిటుల
మీ యసువులు ఫణము బెట్టి చేయు విధుల ,
కీ సమాజము మీకేమి యిచ్చి , తీర్చు
కో గలదు  , చేతు లెత్తి 🙏 మ్రొక్కుటలు దప్ప .

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

నోరార భజింతు పద్యముల .....



శ్రీరమణీ వినోద ! సరసీరుహ లోచన ! కృష్ణ ! రుక్మిణీ
శ్రీరమణా! శుభాంగ! మురళీమృదుగాన మనోహరా ! హరీ !
కోరిన పాలువెన్నలును కూర్మి నివేదనసేతు రార , నో
రార భజింతు పద్యముల , రార శుభంకర ! మోహనాకృతా !

12, ఏప్రిల్ 2020, ఆదివారం

తరుణగోపికల్ హరికి .....


మురళి చేకొని రాధ మోవికి తాకించె
వీణ వాయించె ప్రవీణ యొకతె
పృదు మృదంగము విన్చె మదవతి యొక్కతె
పటుతర వాద్యాన పాడె నొకతె
కస్తూరికా చర్చ గావించె నొక్కతె
గంధ లేపనము నలందె నొకతె
పూర్ణకుంభము బట్టె పూబోడి యొక్కతె
హారతిచ్చె నొక్క నీరజ ముఖి

దండ కైసేసె గళసీమ తరుణి యొకతె
భువళమోహను కృష్ణుని పొంత మూగి
తమ యదృష్టపు భాగ్యము దలచి తలచి
తరుణ గోపికల్  హరికి బృందావనమున

సరసమైన ....


సరసమయిన విరసమయిన
సరసీరుహనేత్ర ! నీదు సరసనె నుండన్
పరమాత్మా ! మాకిష్టము
తరియింతుము దేవ ! నీదు తలపులయందే .

11, ఏప్రిల్ 2020, శనివారం

నిను ధ్యానించిరి .....


నిను ధ్యానించిరి యెందరో బుధులు , కానీ వారిలో పోతరా
జును , త్యాగయ్యయు తెల్గువారిని సుధాస్తోకాంబుధిన్ ముంచి , నీ
ఘనతల్ బాడిరి , పద్యకీర్తనములన్  , కైవల్యమున్ బొందినా
రనఘుల్ , రామ ! దయాబ్ధిసోమ ! మము చేరన్ దీయరా ! మాధవా !

తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె .....

            వెంకట రాజారావు . లక్కాకుల

చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !

నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .

నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .

తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .

నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , నా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .

ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె

నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో  జన్మమ్ము  ధన్య మయ్యె .

9, ఏప్రిల్ 2020, గురువారం

మము రక్షింపగ .....



మమురక్షింపగ వింటినీశరమునూ మంత్రించిసంధించుచున్
సమకట్టంగ గనంబడెన్ , జగతి రక్షాదక్ష  , రామ ప్రభో !
క్షమ యీ ధాత్రి , రుజోరగానన విషస్థావస్థయై , స్వస్థతా
క్రమముల్ గోల్పడె , మాకు స్వాస్త్యముల రాకన్ గూర్చుమా , రాఘవా !

8, ఏప్రిల్ 2020, బుధవారం

కంటిన్ కాముని తండ్రి .....


కంటిన్ కాముని తండ్రి మాధవుని రాకాకాశ చంద్రోజ్జ్వలున్
జంటన్ రాధిక వెంటరాన్ మురళి గానాలాపనానందితున్
మంటిన్ మింటను నెల్ల ప్రాకృతుల క్షేమస్తోమ సంరక్షకున్
గంటిన్ కృష్ణహరిన్ జగద్గురుని నా కన్నుల్ కుతుల్ దీరగన్ .

పూలుకోయంగ .....


పూలు కోయంగ వచ్చి , ఓ పుణ్యపురుష !
నీవు  తరుశాఖ నిదురోవ , నీరజ ముఖి
రాధ పట్టి యూపెడు గంటివా ? పట్టు విడిన ,
పట్టుకొను నాశ ,  దొరికితి విట్టులైన .

కేశవా ! .....


కేశవా ! గుట్ట నెత్తితివని కీర్తిగాన
మున మునిగెదేల రా? లోకముల భరించు
నిన్ను చూచుకముల నెత్తు నన్ను వొగడ
రేమిర ? యవునులే , నాకదృష్ట మేది ?

7, ఏప్రిల్ 2020, మంగళవారం

నిద్దురోయెడు పరమాత్మ .....



నిద్దురోయెడు పరమాత్మ , సద్దు బడకు ,
ముద్దుమోమున చిరునవ్వు మోహనములు
మొనసి హృదయాంతరంగంపు మురువు సెలగ
గదిసిన యశోద ఆనంద సుధల మునుగ .

5, ఏప్రిల్ 2020, ఆదివారం

ప్రద్యుమ్ను డీతడు .....


ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని

రచియించు నప్పుడు రమణ మీర

అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని

కాచి రక్షించు ప్రకరణ మందు

సంకర్షణు డితడు సకల సృష్టి హరించు

పట్టున ప్రళయ తాపములయందు

వాసుదేవు డితడు వర పరమాత్మయై

సర్వము తానయి పర్వునపుడు

విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు

వేద వేద్యు లరసి వేడు నపుడు

చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను

ముప్పు తిప్పలిడుచు మొరగు నపుడు .


4, ఏప్రిల్ 2020, శనివారం

పొగడనా కృష్ణయ్య .....


పొగడనా కృష్ణయ్య ! పొలుపైన పద్యాల

తేనెలా తియ్యని తెనుగులోన

కీర్తించనా హరీ ! ఆర్తితో గూడిన

సుమధుర హృదయ సంస్తుతులతోన

పాడనా కన్నయ్య ! పవళింపు సేవలో

పాల్గొని నిద్దుర పట్టు దాక

పాదము లొత్తనా పలు లోగిళుల్ చన్న

యలసటల్ తీరంగ నంబుజాక్ష !


ఏమి సేయ మందువుర , నాకేమి పాలు

బోదు , పరమాత్మ ! నినుజేరు మోక్ష పథము

నే యుపాయము చేత బన్నింప నగునొ !

దారి జూపుము మాధవా ! చేరి కొలుతు .

2, ఏప్రిల్ 2020, గురువారం

రఘువీరా ! పాహి , సీతాపతే !


శ్రీకళ్యాణగుణాలవాల , భువనశ్రేయోశుభాకార , రామా! కారుణ్యరమాలలామ,సుభగా,మాంగళ్యరత్నాకరా
పాకారిప్రముఖశ్శిరోమకుట దీవ్యన్రత్న పాదాంబుజా ,
రాకేందూజ్వలమోహనాంగ,రఘువీరా !పాహి ,సీతాపతే !

1, ఏప్రిల్ 2020, బుధవారం

సీతారాముల కళ్యాణం చూతము రారండి


ఘన సరోజ నేత్ర ! కళ్యాణ శుభగాత్ర !
ధరణిజ పతి ! సత్య ధర్మ మూర్తి !
బహ్మ వినుత రామ ! భద్రాద్రి శుభ ధామ !
భరత భూ విరాజ పరమ తేజ !

భువి కళ్యాణపు వేదికై , దివియె సంపూర్ణంబుగా
పందిరై ,
రవి విద్యుఛ్ఛవి గూర్చి వెల్గులిడగా , బ్రహ్మాది పౌరోహితుల్
వివిధామ్నాయ విధీ విధానములతో విన్పించ కళ్యాణమున్
అవనీ పుత్రిని పెండ్లియాడె నినవంశాధీశు డారాముడున్ .

రాముండొక్కడె రాజు , తక్కొరులు పేరా యూర ? భూమిన్ ప్రజల్
క్షేమస్తోమము , పాడి పంటలు , సుఖశ్రీలున్ , శుభారోగ్యముల్ ,
ధీమంబుల్ , ఘన ధర్మ  , మెల్లెడల పృధ్విన్ మొల్లమై బర్వగా
నీమం బొప్పగ రామరాజ్యమని నెన్నేనేండ్లు కీర్తింగనెన్ .

శ్రీరామ నవమి శుభాకాంక్షలు


ఆపదనెదిరించు బలిమి
యోపని తఱి నైన , దైవ మొక్కటి గలదం ,
చాపన్న ప్రసన్నుని కొలి
చే పని పూనుండు , ' వాడు ' చేకొని బ్రోచున్ .

ఎక్కడికీ బయటకు వె
ళ్ళక్కర్లే , యింటిలోనె , రామ జపంబున్
చక్కగ సేయుము , హితుడా !
గ్రక్కున దాశరధి మనల గాచు నిజముగా .

రామా యని నోరారా ,
భూమిజ పతి దలచి , పిలువు , మో హితుడా !  ఆ
రామజపమె , కవచంబయి ,
సేమము లొనగూర్చి , మనకు శ్రీకరము లిడున్ .

కోదండరాము చరణము
మోదంబుగ బట్టు బంటు మ్రొక్కులు వడడే !
రోదనము లేల రాముని
పాదములే దిక్కు మనకు భాగ్యము లొదవున్ .

రామా ! దశరధ తనయా !
కోమలి సీతా సనాధ ! కోదండ ధరా !
నామామృతాభిసేచన
భూమీభారతి విలసన పుణ్యా ! సోమా !

27, మార్చి 2020, శుక్రవారం

రాధా మాధవం


చూడు మో చెలి ! యమునకు రాడు , వాడు
మాట తప్పంగ బోలు , నేమాత్రమైన
ప్రేమ గనలేడు , మన్నింప లేను నేను ,
ఏడ నున్నాడొ మాధవు ,  డింతుల కడ .

కాదులే , రాధ ! కృష్ణయ్య కనగ నయ్యె
నాకు మోదుగ పూబొద , నదిగొ వచ్చె ,
మూతి విరుపులు మానుము మోహనాంగి !
వాడు నీవాడు వగకాడు కూడి యాడు .

యమునకు వచ్చెద , రమ్మని ,
కమనీయముగా వచించి , కాంతుడు , పొదలో
రమణిన్ యెవతిన్ గూడగ
చమరించుచు నున్నవాడొ చానా ! గనవే !

అయ్యో ! పాపమె ! కృష్ణుడు
చయ్యన వచ్చేని , నడుమ సంగడి కాం డ్లే
తియ్యములు మాటలాడుచు
కయ్యములకు దిగిరొ ! కాస్త కరుణించగదే !

చెలి వేషములో కృష్ణుడు
చెలి నుడికించె నిటుల , తెలిసి , తుద కతని యా
చిలిపి తనమున కలరె , చెలి ,
కలలో నైనను మరువడు గద ! తను రాధన్ .

20, మార్చి 2020, శుక్రవారం

పాదాబ్జములు బట్టె పడతి యా రుక్మిణి .....


పాదాబ్జములు బట్టె పడతి యా రుక్మిణి ,

కైసేసె సత్య మంగళ కరముగ ,

చందన మైపూత జమిరె జాంబవతి , నా

గ్నజితియు వెలయించె కౌస్తభమును ,

తగ కిరీటము వెట్టె తరుణి యా లక్షణ ,

ఫలములు తినిపించె భద్ర కొసరి ,

తాంబూల మందించె తమకించి కాళింది ,

మెఱయ ముద్దొకటిచ్చె మిత్రవింద ,


అష్ట సఖులిట్లు పరమాత్మ కిష్టులగుచు

పరగ ననుకూల దాంపత్య పరత దేల్చి

అంద రొకరయి శుధ్ధాంత మందిరమున

నంది , నందించి శ్రీకృష్ణు నొంది రొకట .

చేతులు గట్టి యింకెవరు .....



చేతులు గట్టి యింకెవరు శ్రీహరి నిట్లు తనంత తానుగా
రాతిరి వేళ లాగి యనురాగ సమాగమ మందిరానికిన్
భీతియొకింత లేక నడిపింతురు ?,సత్యయె ,కృష్ణదేవ ! ఆ
నాతితపంబులెంతటిఘనమ్ములొ,యిట్టివిసాధ్యమా,హరీ!

శ్రీ మహలక్ష్మీదేవీ ! నమోన్నమః


బంగారు ధగధగల్ రంగారు తనులత
రత్న కిరీట   విరాజిత   శిఖ
కలిమికి నెలవైన కళలతో నెమ్మోము
సంపదల్ గురియంగ జాలు కనులు           
వరద హస్తమొకట వరశంఖ మొకచేత
కలపద్మ మొకచేత కలశి యొకట
ఇరు గెడ గజరాజు లిరవొంద కరములు
పైకెత్తి నవనిధుల్   పైన జల్ల

పద్మజాత కమల పద్మాసనాసీన
పద్మనయన లక్ష్మి పద్మ వదన
పద్మసదనవసన పద్మాక్షు నిల్లాలు
కొలువు దీరె మనకు కొదువ గలదె ?

15, మార్చి 2020, ఆదివారం

శరణు శరణు పరమాత్మా ! .....


కైవల్య మెవ్వాని సేవింప దిగివచ్చు
కామితార్థము లెవ్వ డోమి యిచ్చు
మోము జూడంగనే ముద్దొచ్చు నెవ్వాడు
మోహాలు రగిలించి ముంచు నెవడు
భక్తితో కట్టంగ పట్టువడు నెవడు
తను వినా నేది లేదను నెవండు
ఆనందమున దేల్చి యాడించు నెవ్వాడు
ముదమున దరిజేర్చు మూర్తి యెవడు

యెవడు కరుణాంతరంగుండు యెవడు యోగి
యెవడు త్రిభువన మోహను డెవడు కర్త
యెవడు భర్త జగద్గురు డెవ్వ డతని
పరమ పాదాబ్జ రజముకు శరణు శరణు .

యశోదా కృష్ణ .....


ముత్యాల జలతారు ముందుకు దిగజార్చి
తలమీద నెమలీక  వెలయ నిలిపి
పీతాంబరము గట్టి ప్రియమార కటివస్త్ర
మును ,  పైన మొలనూలు మురియ దీర్చి
పచ్చని పటము పైపంచగా వైచి
పొగడ దండలు మెడను దిగ నొనర్చి
నుదిటిపై కస్తూరి నును తిలకము దిద్ది
మురిసి బుగ్గలపైన ముద్దు లిచ్చి

 కొంత యలసి యాతల్లి యీ కొడుకు గనుచు
ఎంత  కైసేసినను నితడి కేదొ కొదువ
యౌ , నిదె ! మురళి , మరచితి నౌ....యశోద
దెంతదృష్టమొ కృష్ణ ! నీ దెంత కృపయొ !

12, మార్చి 2020, గురువారం

ముద్దుగొల్పేటి మోహనాకారులు



బహు వర్ణ శోభిత పటముపై తీర్చిన
ముత్యాల తలపాగ మురువు జూడ
తిరుమణి తిరుచూర్ణ తేజో విరాజిత
భువన మోహన ప్రభన్ ముఖముజూడ
మెరయు నానాపుష్పపరిమళశోభిత
నిడువైన దండల యెడద చూడ
వెండి బంగారాలు విలసిల్లు నగిషీల
జాలరీ పట్టు దట్టీలు చూడ

కనులు చాలవు మోహనాకారుల గన
ఇద్దరొకచోట కూడిరి పెద్దరికపు
పోకడలువోవ చర్చించబూని యిటుల
శ్రీకరంబుగ బలరామ కృష్ణు లిచట .

11, మార్చి 2020, బుధవారం

శ్రీరామచంద్ర మూర్తి ఠీవి


ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .

శ్రీకృష్ణ పరమాత్మ .....


కైవల్య మెవ్వాని సేవింప దిగివచ్చు

కామితార్థము లెవ్వ డోమి యిచ్చు

మోము జూడంగనే ముద్దొచ్చు నెవ్వాడు

మోహాలు రగిలించి ముంచు నెవడు

భక్తితో కట్టంగ పట్టువడు నెవడు

తను వినా నేది లేదను నెవండు

ఆనందమున దేల్చి యాడించు నెవ్వాడు

ముదమున దరిజేర్చు మూర్తి యెవడు


యెవడు కరుణాంతరంగుండు యెవడు యోగి

యెవడు త్రిభువన మోహను డెవడు కర్త

యెవడు భర్త జగద్గురు డెవ్వ డతని

పరమ పాదాబ్జ రజముకు శరణు శరణు .