కన్ను లానంద భాష్పముల్ గ్రమ్మె , నీదు
దివ్యమంగళ మూర్తి దేదీప్యమాన
మయి గనంగ , రామా ! కమల దళాక్ష !
జన్మ ధన్యత గాంచెను , జన జగతికి .
కన్ను లానంద భాష్పముల్ గ్రమ్మె , నీదు
దివ్యమంగళ మూర్తి దేదీప్యమాన
మయి గనంగ , రామా ! కమల దళాక్ష !
జన్మ ధన్యత గాంచెను , జన జగతికి .
అదిగో ! అయోధ్య రాముడు ,
గదిసి మందిరములో , సుఖాసీనుడవన్
ముదితంబగు సమయము , స
మ్ముదితం సయ్యెన్ , నమోస్తు 🙏 మోహన రామా !
రాముని యవతారము , ఈ
భూమికి రక్షా కవచము , పూని వెలిసె , సం
క్షేమము లొసగగ , భారత
భూమి , నయోధ్యను , పున్నెపు ప్రోవై .
స్పందించుచు చెట్టుమధ్య భానుండుండెన్ ,
ఎందుకు మ్రోడయె భూజము ?!
ఎందున ఖర్మ సరిలేదొ , ఇటు తగులవడున్ .
ఐదేళ్ళప్పటి రాముని ,
మోదపు చిరునవ్వురూపు , మోహనమై , ఆ
పాద శిఖము , జనముల కా
మోదంబై నిలిచె , నెంత ముగ్ధత్వంబో !
అతడి నుదుటి చిచ్చు , అనితర సాధ్యమ్ము
తగుల బెట్టును , విశ్వజగతి నెల్ల
అతడి గళమున గల , ఆ కాలనాగులు
కాల గమనమును కాటువేయు ,
అతడి తోడ నడచు , నతుల త్రిశూలమ్ము
పుడమి నడయాడెడు , చెడును బొలియు
అతడి చే దిరుగాడు , నరిది డమరుకము
నరుల నడతల , హెచ్చరిక సేయు
హరు డతండు , విశ్వగురు డతండు , కడు సం
హరు డతండు , కలడు , నరుడ ! ' నేనె
శక్తిమంతుడ ' నన జనకు , ఈ విశ్వమ్ము
ఈ శ్వరుని తలపున , నేల బడెడు .
ఆ యెదలో , కొలువై హరి ,
తీయని కలలోకి జారె , తెరువదు , తెర వీ
హాయిని పాయని , పరవశ
సాయుజ్యము చెందె , నెంత సరస హృదయ యో !
జడ తడిచె , నొడలు తడిచెను
ఒడలికి ముడిబడిన కట్టు టుడుపులు తడిచెన్
కడదాకా ఉడుపుల బడు
మడత మడత లోని సొగసు మరిమరి తడిచెన్ .
పడగలువిప్పి, నాలుకలు పైపయిచాచి, మహోజ్జ్వలాకృతిన్,
గడపల ముందు, మంటలు సెగల్ వెలిగ్రక్కుచు, భోగి పర్వముల్
నిడు గన నౌను, తెల్గు కమనీయ మనోఙ్ఞత, పల్లెటూర్లలో,
సడులబెడంగునన్, మకరసంక్రమణానికి ముందు సందడుల్ .
వైకుంఠవాస కృష్ణా !
రాకా శశి వాసుదేవ ! రారా భువికిన్
ఏకాదశి శుభ దినమున
నీ కాళ్ళను తాకి మ్రొక్కి నెమ్మి తరింతున్ .
వెల్లుల్లి దంచి , పలుచటి
తెల్లని చిరు వలువలోకి , తీర్చిన మూటన్ ,
అల్లన వాసన జూచిన ,
మెల్లగ కఫమెల్ల దొలగు , మేలగు కృష్ణా !
బంగారు పేటంచు పట్టుపుట్టము గట్టి ,
రత్నాల హార సరాలు దొడిగి ,
మణికిరీట ప్రభామయ , మయూఖ రుచిర ,
దివ్యమంగళ రూపు తేజరిల్ల ,
వజ్రాలు పొదిగిన వడ్డాణము మెరయ ,
కాలి యందెలు ఘల్లు ఘల్లురనగ ,
పసుపు గంధపు పూతపై , కుంకుమంబద్ది
ఫాలభాగమ్ము శోభనము గూర్చ ,
లేచి , ననుజూచి , వచ్చి , పోలేరు తల్లి
బిడ్డడా ! రార , యని బిల్చు ప్రేమతోడ ,
బ్రమయొ , పిచ్చియొ గానిండు , ప్రతిదినంబు
అమ్మవాకిట జేరి ప్రణామ మిడగ .
అరయ నిమిష నిమిష , మాయుష్షు తరిగేను ,
దేహ ముండు వరకె దేనినైన ,
చేసి , ఘనత పొందు , చిరకీర్తి సాధించ ,
బతుకు గలదు చావు పైన , కృష్ణ !
ఘనులము ధిషణగల కవిపండితుల మంచు
మనల మనము వొగిడి మనుట కాదు
అరసి జనుల కొఱకు అవసర మగుపనుల్
ఒక్క టైన జేసి యొనర వలయు .
నిదుర లేవంగనే నిలువడి పరమాత్మ
యెదుట చేతులు జోడించు హితుడ !
భక్తిపాటల ననురక్తిగా చెవుల క
మంద సుఖానందమందజేయి ,
స్నానాదికాల ప్రస్తానములు ముగించి
దేవదేవుని గొలుము తీరినంత ,
పనికి వెళ్ళి పనిని భగవదత్తముగాగ
కష్టపడి యొనర్చు మిష్ట మొదవ ,
ఆలుబిడ్డలె తొలి ప్రాధాన్యతలుగ
ప్రేమలను పంచు మదియె శ్రీరామ రక్ష !
తల్లి దండ్రుల మరువకు , ధర్మ మరసి
సమ సమాజ హితము గోరి సాగు మిత్ర !
వందేళ్ళాయెను అమ్మకోవెలకు , సేవాదృక్పథంబుండుటన్,
ముందేపూని , గుడిన్ వినూత్నముగ , సొంపుల్గుల్క నిర్మించ నా
నందంబయ్యెడు , ఊరివారి తగు సాహాయ్యంబు లభ్యంబయెన్ ,
బంధం బివ్విధి తల్లితో తనర ప్రాప్తంబయ్యె నీ జన్మకున్ .
అంగజుడు ఖంగుతినవలె ,
శృంగారపు భంగు ' ఇటుల ' సిరు లొలికించెన్ ,
హంగుగ కొబ్బరి నీరము ,
రంగార సతీముఖీన , రమణుని జేరెన్ .
మగడా ! మల్లెల కంటే ,
సిగలో ఈ మిర్చి మాల సింగారము , నీ
మగసిరి సెగ రగిలించును
అగణితముగ రాగ బంధ మతిశయమొందున్ .
ముల్లు గనంగ, లేదె , నవమోహన! ముగ్ధవయోగభస్తి రా
జిల్లెడు మోహనాలు , వికసించెడు మేని నిగారు సౌరులన్
విల్లున దొడ్గి నల్దెసల వేయ, గమించెడు లాగు దోచెడిన్
కల్లరి మన్మధుండు మొనగాడుగదే! నిను తూపుగాగొనెన్ .
కురు లారబోసి , చూపుల
మరుతూపుల మోహనాలు , మదిలోతులలో
సొద దెలుపగ , ' మదన విశిఖ ' ,
పెదవులతో పైట చాటు పిలుపులు బంపెన్ .
చెంపకు చేయిసేర్చి ,అతసీ కుసుమాభ ముఖీ మనోఙ్ఞ , రా
గంపు పెదాల వంపుల నిగారము మోహనమై సెలంగగన్,
సొంపుగ బుట్ట కమ్మలొకచో తనసోయగముల్ వెలార్చగన్
ఇంపులుగుల్కుచున్ కనులొకించుక దేనినొగాంచు తన్వియున్ .
చినుకు తాకి నంత చెలికాని చేస్పర్శ
మోహనాలు విరిసె మోము పైన ,
వలపు విరుల వోలు వాన చినుకు మురువు
కడు మనోఙ్ఞ ప్రకృతి గద ! పుడమిని .
తినుట తాగుట కేన ఈ మనుజ జన్మ ?
చేయ ఘనకార్య మింకేమి చేత నవద ?
పడిన తదనంతరమ్మును బ్రతుకు గలదు ,
దేహ మున్నప్పుడే దాన్ని సాధింప వలెను .