24, జూన్ 2020, బుధవారం

సొగసు జూడ తరమా .....


నగుమోము నిగనిగల్ ధగధగా మెరయు నీ

సొగసుజూడ తరమా జగ దధీశ !

ఆడు తుమ్మెద రెక్క నడచు వినీల నీ

సొగసుజూడ తరమా జగ దధీశ !

మగశిఖి పింఛంపు మౌళి జిలుగుల నీ

సొగసు జూడ తరమా జగ దధీశ !

రమణుల మధ్య చేర నవ మోహనము నీ

సొగసు జూడ తరమా జగ దధీశ !


నంద గోపబాల! నగధర !గోవింద!

కృష్ణ! హరి! ముకుంద! కేశ !వాచ్యు

త! మురళీధరా! జిత మదన రూప! నీ

సొగసు జూడ తరమ జగ దధీశ !

23, జూన్ 2020, మంగళవారం

భాగ్యప్రదాతా! నమో🙏.


హే ధాత్రీధరధారి!కృష్ణ!శుభగా!హేదివ్యసన్మంగళా!
రాధామాధవరూపమోహనవపూరాగామృతశ్శోభితా!
గాధాభాగవతా! జగద్గురు! శుభాంగా! అర్థనారీశ్వరా!
భాధాతప్తజనావనా! హరి!నమో🙏భాగ్యప్రదాతా! నమో🙏.

22, జూన్ 2020, సోమవారం

ఏమా పారవశ్యము ?


ఆ నీల మోహన తనూ
ధ్యాన పరవశయయి, సీత, యాతని మెడలో
పూని వరమాల వేయదు ,
ఊని చెలియ తాకుదాక, నూహాంతరయై .

21, జూన్ 2020, ఆదివారం

నమో🙏సూర్యనారాయణా !


నమో🙏సూర్యనారాయణా !
.....................................

ఇనుడు చంద్రుండు పుడమి ఒకే వరుసకు
వచ్చిన ఖగోల అద్భుతం బదిగొ కనుడు ,
పుడమిపై సూర్యకిరణాలు పడు విధమ్ము
నడ్డుకొని యడ్డునిల్చు చంద్రగ్రహమ్ము .

ఇందువలన మరే మార్పు చెంద దవని ,
ఇది ఖగోళ సహజ చర్య , ఎవ్వియును న
నూహ్య కష్ట నష్టాలు వినూత్నములును
సంభవించ వాందోళన జనగ వలదు .

ఆరాశివారు చెడుదురు ,
ఈరాశులవారు లబ్ధి కెక్కుదు రనుచున్
నోరేసుక కార్తాంతికు
లూరక తెగవాగుచుందురు , వలదు వినగా .

సూర్యునికి గ్రహణ మేమిటి ?
ఆర్యా ! పరిపూర్ణ శక్తి కాద్యుండు , సదా
శౌర్యప్రతాప తాప సు
కార్యౌదార్యోజ్జ్వల ప్రకాశుడు మనకున్ .

19, జూన్ 2020, శుక్రవారం

వందే కృష్ణం పరాత్పరం .....


శిఖిపింఛ వలయిత శీర్ష కుంతలభార

విపినప్రసూనాక్ష వీక్షితుండు

గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ

వర రుచిర నిటల వర్ణితుండు

అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు

లావణ్య రూప విలాసితుండు

బాల తమాల వినీల మంగళ తనూ

ప్రభల చెలంగు పరాత్పరుండు


నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు

వాసుదేవుండు , గోగోప వర సఖుండు

గరిమ గీతోపదేశ జగద్గురుండు

మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .

18, జూన్ 2020, గురువారం

డాక్టర్లు ఆర్గురు .....


ఇనుడు, విశ్రాంతి, వ్యాయామ, మెంచు తిండి,
ఆత్మవిశ్వాసము , హితులు నరయ మనకు
వైద్యు లార్గురు పుడమిపై వరలు చుండ్రు
చేరగా వెళ్ళు వారికి దూర మవకు .

1. సూర్యరస్మి
2 . విశ్రాంతి
3 . వ్యాయామము
4 . ఎంచుకునే ఆహారము
5 . ఆత్మవిశ్వాసము
6 . స్నేహితులు
ఈ ఆర్గురూ మన ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించే
డాక్డర్లు . భగవంతుడు ప్రసాదించిన ఈ ఆరుగురికి సమీపంలో ఉన్నావంటే
నీవు జబ్బుపడవు .

15, జూన్ 2020, సోమవారం

మనభాగ్య మెట్లున్నదో ?.....


మనభాగ్య మెట్లున్నదో ?
        ----------------------------
     2020 యేడాది  భౌగోళిక ప్రమాదాల పుట్టగా
గోచరిస్తోంది . చైనాలో మొదలైన కోవిడ్ వైరస్
ప్రపంచాన్ని వణికిస్తోంది . ఇంకెంతకాలం ? అంటే ,
టీకామందు(వ్యాక్సిన్) కనుగొనబడి ,అది సమర్థంగా
పనిచేసేదాకా ఈవైరస్తో సహజీవనం తప్పదు . ఆర్థికంగా చితికిపోవడం , అస్తవ్యస్తం అనుభవించాల్సిందే . మరోదారి లేదు .
           ఇక , రెండో ప్రమాదాన్ని నాసా హెచ్చరించింది . మామూలుగా ఉల్కలూ , గ్రహశకలాలూ అత్యంత వేగంగా భూమికి సమీపం నుండి
దూసుకు వెళ్ళడం కద్దు . కానీ , ఒక భారీ గ్రహశకలం
భూమివైపుగా దూసుకు వస్తోందనీ , అదిగాని ,
భూమి గురుత్వాకర్షణ ప్రభావానికిలోనైతే , భూగోళం
పై వినాశనం తప్పదనీ ఊహిస్తున్నారు .
           మూడవది . కార్తాంతిక మహానుభావుల
ప్రిడిక్షన్ . వీళ్ళవద్ద నాసా సంస్థకున్న సశాస్త్రీయ సాంకేతిక సరంజామా లేకున్నా , పూర్వపు అనుభ
వాలనుబట్టి ముందస్తు తీర్మాణాలు చేస్తుంటారు .
కురుక్షేత్రయుధ్ధానికి పూర్వం - 14రోజుల వ్యవధిలో
చంద్ర , సూర్యగ్రహణాలు సంభవించడం ఉటంకించి ,
దరిమిలా పరిణామాలను ఉదహరించి ,
ఈ నెలలోకూడా 14రోజులవ్యవధిలో చంద్ర సూర్య
గ్రహణాలు ఏర్పడడం , పూర్వపు దుష్పరిణామాలు
పునరావృతమౌతాయనీ ఊదరగొట్టేస్తున్నారు .
జరుగనున్నది జరుగక మానదు కదా !
       ఐనా , మానవుడు మహామేధావి !? . అనేక
విపరిణామాలను తప మేథోబలంతో ఎదిరి పోరాడి
జీవనం కొనసాగస్తున్నాడు . మరి , మాధవు డనుకూ
లిస్తాడో , లేదో? . మనభాగ్య మెట్లున్నదో ?

10, జూన్ 2020, బుధవారం

హా!తెలిసెన్ .....


హా !తెలిసెన్ కళారహసి , అద్భుతసృష్టికి ' బాపు ' చిత్రముల్
ఖ్యాతివహించు టెందులకొ , యల్లదె రంగులపాత్ర సాచె తా
చేతుల , సీత చిత్రమును శ్రీరఘురాముడు గీయుచుండగా
నాతని శిష్యుడై , యరసె నందున కౌశల మంత నేర్పుతోన్ .

9, జూన్ 2020, మంగళవారం

రారా ! మాధవ ! .....


రారా! మాధవ ! రాధతో కలిసి , చేరన్  మా కుటీరానికిన్ ,
కోరన్ కోర్కెల , నచ్యుతా! మధురమౌ  గోవింద నామామృతం
బారంగ్రోలుటదక్క ,నాదొరవు, యీపళ్ళున్, పలారంబులున్ ,
క్షీరంబుల్ గొని  పోదుగాని , హరి ! రాశీభూత ప్రేమాంబుధీ !

8, జూన్ 2020, సోమవారం

అమ్మదొంగ ! నిన్ను నందందు వెదికేను .....


ముగ్ధ మోహన రూపు మునుపెన్న డెరుగను
కృష్ణయ్య! గోపెమ్మ కృపను గంటి
ఘనశ్యామ తనుఛాయ కమనీయ మెరుగను
కృష్ణయ్య! రాధమ్మ కృపను గంటి
మల్లెల సౌరులు – మధుపర్కములు గనన్
కృష్ణయ్య! రుక్మిణి కృపను గంటి
మోవిపై పిల్లన క్రోవి ముచ్చటెరుంగ
కృష్ణయ్య!  గోపన్న కృపను గంటి

అమ్మదొంగ ! నిన్ను నందందు వెదికేను
చిన్నగా మదిలోనె జేరినావ !
చిన్నికన్న ! నిన్ను గోపెమ్మతో జెప్పి
పద్య మందు కట్టి , పట్ట గలను .

తలపున గల 'గమ్య 'మందు....


కలమందున , గళమందున ,
కలలందున , కనుల యందు , కాంక్షల యందున్
పలు పలుకు లేల ? కృష్ణుడు
తలపున గల 'గమ్య 'మందు తానై యుండున్

6, జూన్ 2020, శనివారం

తల్లీ వందనం .....


భగవంతుని దర్శించగ
మగువా ! నీకన్న ఙ్ఞాని మహి నున్నాడా ?
తగలేయన పలువిద్యలు ?
జగమంతా నీ పదాల సాగిలబడదా ?

ఏదీ వైకల్య ? మువిద
కాదు , దురితకార్యరతులు ఘన వైకల్యుల్ ,
వేదిక లెక్కి ప్రవచనాల్
కాదు వచింప , నొక ధర్మ కార్యము వలయున్ .

పోలేరు పరంజ్యోతి పరమేశ్వరి .


మల్లీశ్వరి ! వరదాయిని
యెల్లన్ లోకములనేలు హేమాంబరి ! శ్రీ
కుల్లూరికి పరదేవత ! ,
తల్లీ ! పోలేరు ! నీకు దండాలమ్మా !





5, జూన్ 2020, శుక్రవారం

జన్మదినం .....


(జూన్ 5 నాజన్మదినం)
పుట్టిన రోజిది యని .....
------------------------
ఎందుకు జనించితినొ స్వామి ! యెవ్వియును ఘ
నతలు లేవు , కనీసము వెతలు లేని
బతుకు బతికితినా యన్న  - వెతుక - నట్టి
బాట సుతరాము కనరాదు  భాగ్య ధాత !

పుట్టినరో జిదియని యి
ప్పట్టున క్యాలండరు నను పదె పదె గాసిం
బెట్టుచు హసించె , స్వామీ !
పుట్టువునకు సార్థకత్వ పూర్ణత లేమిన్ .

ఒజ్జదన మొక కొంత మేలుజ్జగించి
కాస్త యూరట దొరికెను కమల నయన !
మండు టెండన బడి వచ్చు మనిషి కొకట
చల్ల దొరికిన వడువున జలజనాభ !

ఎంద రీ భూమి బుట్టి సాధించిరి , పురు
షార్థములు , సంశయమె , యైన , నంద రిటువ
లె వగతుర ? సందియమె స్వామి ! , చివరిమజిలి
యైన భయద రహితము శాయంగ రాద !

అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
కడవ బెట్టంగ నావయై గానుపించు
జరను రుజలను దాటంగ , పరమ పురుష !

4, జూన్ 2020, గురువారం

మూతివిరుపు .....


చేతికి గాజుల గలగల ,
మూతివిరుపు , ముద్దుమోము , ముడిచిన మల్లెల్,
ఛాతీపై వాల్జడయున్,
నాతుల కందమ్ము - కులుకు, నయగారములున్ .

29, మే 2020, శుక్రవారం

అమృతఫలాలు .....


అమృత ఫలాలు
--------------------
అమృతఫలాలివి , వీటిని
సుమశరు డింద్రుని వనమున చూచి , పుడమికిన్
రమణి రతీదేవి కొఱకు ,
శ్రమపడి కొనితెచ్చె రాగ రంజితు డగుచున్ .

రుచికి పడి , రతీ దేవి వ
లచి తన వనమున యమృతఫలమ్మును విత్తెన్ ,
సచిపతి కిష్ట ఫలదమగు
యచలము మదనాలి యింట నమరెను తరువై

వలరేని చెలిమికాడగు
వలపు వసంతుం డచటికి వచ్చెను , రాగా ,
కలయో మాయో తెలియదు ,
విలసిల్లెను చెట్టు పూప పిందె ఫలాలన్ .

మావి పండు తిన్న మన్మథ పతిసతుల్
మదన మోహ ఝరుల మరులు గొనిరి ,
మధుర ఫలము మహిమ మదనాయితమ్మను
నిజము తెలిసె , దివిజ రుజయు దెలిసె .

భూలోక మంత మావుల
జాలము నాటించి చిత్తజాతుడు , మిథునా
లోల సరాగాలాలస
లీలల పండించె , సృష్టి లీల లివేగా .

27, మే 2020, బుధవారం

ఎందాకా ఈ రోగపు .....

ఎందాకా ఈరోగపు
కుందున బతుకంగ వలయు కువలయ మంతా ?
ఎందాకా వ్యాక్సిన్ మన
కందునొ నందాక , తప్ప దందురు విఙ్ఞుల్ .

మా మా పరాక్రమమ్ములు
ధీమమ్ములు తేలిపోయె , తిరుమల వాసా !
నేమమ్మున నిను గొలుచుటె
భూమి జనుల బాధ తీరబోవు పథమ్మౌ .

గూడొదిలి , కూటికోసము
వేడుచు , పరదేశ మొచ్చి , వేసట పడి , పో
రాడిన పక్షుల కిప్పుడు
గూడే దిక్కను నిజంబు గొప్పగ దెలిసెన్ .

చేతులకు శానిటైజర్ ,
మూతికి మాస్కున్ ధరించు , పూస్కో రాస్కో
బోతివ , జనాల వెంబడి ,
గోతికి చేరువ యగుటయె , గూడే భద్రమ్ .

అల్లో లక్ష్మణ .....

వోటేసిన వారి నడుగు ,
వోటు గొనిన వారు గెలిచి పొడిచిన దేమో ?
నేటి రహదార్లు నుడువును ,
ఏటికి ఈ చేతగాని యేలికల పనుల్ ?

అల్లో ! లక్ష్మణ ! యనుచున్
పిల్లల పెండ్లాము తోటి , వేలాదిగ , రో
డ్లల్ల నడుచు ఓ సోదర !
ఇల్లిదె ' పేకేజి ' కాటి కెల్లే కిత్తుమ్ .

ఇవి కనపడ వే నేతకు ,
ఇవి వినపడ వే ప్రభుత్వ యేలికలకు , లే
నివి , యున్నవి పేకేజిలు ,
వివిధ గణాంకాలు చెప్పి వేధింపు బలే .

భూలోకము తన సొత్తని .....



భూగోళము తన సొత్తని
రేగి మనిషి ప్రకృతి నిట్టిరీతిని చెరుచన్
పోగాల మెదురు నిలిచెను
రోగాలకు జడిసి ఇంటిలో పడవలసెన్ .

రోడ్లు పట్టణాలు లోలాక్షులు పసుల్
గుంపులు చరియించు సొంపు జూడ
మనిషి అడ్డు తొలిగె నని మహదానంద
పడెడు లాగ దెలియు పసుల తీరు .

26, మే 2020, మంగళవారం

కేశవా ! .....


కేశవా ! గుట్ట నెత్తితివని కీర్తిగాన
మున మునిగెదేల రా? లోకముల భరించు
నిన్ను చూచుకముల నెత్తు నన్ను వొగడ
రేమిర ? యవునులే , నాకదృష్ట మేది ?

అనురాగ రాగ రంజిత .....


అనురాగ రాగ రంజిత
ఘనులీ పరమాత్మ జంట , కమనీయ ఘనం
ఘన రమణీయము చిత్రము ,
కనులకు విందై చరించు కామిత మిచ్చున్ .

పురుషోత్తమ ! కృష్ణ ! నమో 🙏 .....


పురుషోత్తమ కృష్ణ ! నమో 🙏 ,
పరమాత్మా కృష్ణ ! శుభద భాగవత! నమో🙏 ,
వరదాయక కృష్ణ! నమో 🙏 ,
సరసీరుహ నేత్ర కృష్ణ జగదీశ ! నమో 🙏 .

25, మే 2020, సోమవారం

యోగీంద్రచంద్ర కృష్ణా ! .....


యోగీంద్ర చంద్ర కృష్ణా !
రాగజలధి దేలు రసిక ! రాధిక కృష్ణా !
భోగీంద్రశయన కృష్ణా !
శ్రీ గానామృత విహరణ చిత్తా ! కృష్ణా  !

త్రిభువన మోహన కృష్ణా !
అభవాది నిలింప సేవ నావన కృష్ణా !
శుభకర ! రుక్మిణి కృష్ణా !
అభయప్రద ! వాసుదేవ ! హరి ! శ్రీ కృష్ణా !

బృందావన మధుబనిలో
నందిత గోపాల ! కృష్ణ ! నారాయణ ! నీ
మందిర మీ హృన్మందిర ,
మిందుండుము , కృష్ణ ! నీదు మేలు భజింతున్ .

శ్రీ మధురాధిప ! కృష్ణా !
మా మనసులు గెలిచినట్టి మాధవ ! కృష్ణా !
హేమాంబర ధర ! కృష్ణా !
ప్రేమాగమ సృష్టికర్త ! ప్రియ ! శ్రీకృష్ణా !

ఈ లలితాంగి మేని విరు .....


ఈ లలితాంగి మేని విరు పిక్షు శరాసన పొంకమున్ బలెన్ ,
ఈ లలితాంగిసోయగ సకృత్ రతిరూపవిలాస భాసమై
ఈ లలితాంగి చెంగుభిగి హెచ్చులు మెచ్చులు దెచ్చు నంచు శ్రీ
లోలుడె చేష్టితాలుడిగి లో చకితాననుడైతపించెడిన్ .

ఏమా మోహన రూపము .....


ఏమా మోహన రూపము !
ఏమా మోహన మనోఙ్ఞ హేమాంబరమున్ !
ఏమా మోహన గానము !
శ్రీమాధవ ! నిన్నుబొంది  సిరినైతి నెదన్ .