హద్దే లేదీ ఘనతకు
తద్దయు మన శిల్పకళ గత విభవము గనన్ ,
ఎద్దును గననగు నొకవై
పద్దెస నేనుంగు గనగవచ్చు చతురతల్ .
హద్దే లేదీ ఘనతకు
తద్దయు మన శిల్పకళ గత విభవము గనన్ ,
ఎద్దును గననగు నొకవై
పద్దెస నేనుంగు గనగవచ్చు చతురతల్ .
ఆండాళ్ - శ్రీరంగనాధుల
కళ్యాణ వైభోగమే భోగిపండుగ
---------------------------------------
తనపూలవనములో దొరి
కిన పాపకు, విష్ణుచిత్త కేశవదాసుం
డొనరగ ' కోదై ' నామం
బును, పూమాలయను, నర్థమున పేరిడియెన్ .
కోదై గోదాయయ్యెను
గోదా శ్రీరంగనాధు కూరిమి బొందెన్
శ్రీదామ మామె ముడువగ ,
మోదముతో తానుదాల్చె మురహరి ప్రీతిన్ .
గోదా కొప్పున ముడిచి , ప్ర
మోదముతో విడిచి పంపు, పూమాలలె , నా
మోదింతుననుచు, కలలో
శ్రీదాముడు వలుక , కూతురిన్ వేనోళ్ళన్
వొగుడుచు,' నాండాళ్ ఆండాళ్ '
తగ బిలిచెను, మురిసి తండ్రి , 'తల్లీ' యనుచున్,
జగ మంత, టామె నాండాళ్
యని బిలువగబట్టి గోద, ఆండాళ్ అయ్యెన్.
రోజూ వొకపాశురమున
రాజీవాక్షుని నెలంత రాగసుధలతో
పూజించ మెచ్చి యామెను
మోజున శ్రీరంగనాధమూర్తి వరించెన్
తుది , భోగి రోజు , రంగడు
ముదితను కళ్యాణమాడె ముచ్చటవడి, ఇ
వ్విధ వైభోగపు కళ్యా
ణ ధగధగకు ' భోగి ' యనగ నాదిన మొప్పెన్ .
కన్ను లరమోడ్పు లయ్యెను
పన్నుగ హృదయాలు తనిసి పరవశమయ్యెన్
వెన్నుని రాధిక తనువులు
మన్ననతో పెనసి ప్రేమ మధువులు పండెన్ .
గుట్టుగ నొకచో నిలువడు ,
నెట్టన పొరుగిండ్ల దూరు నితడని తాడున్
గట్టెను సత్యాసతి, చే
పట్టి కరంబుల, నితండు పట్టుంబడునా ?
తనసంపద, అధికారము,
ఘనవైదుష్యములవల్ల గౌరవమొనగూ
డున ? రా , దితరుల కందిం
చిన మేలొకటే , మనుజు విజితునిగ నిల్పున్ .
కోటలు దాటే మాటల
చాటింపులవల్ల మేలు జరుగదు జగతిన్,
దీటుగ మేల్ తలపెట్టి, న
దాటుగ సేయంగ నొరుగు, ధార్మిక కృతులన్ .
ఓ నీలా ! నీలాలక !
రానీవా మేనువిడిచి రాజీవాక్షున్ ,
శ్రీనాధుగొలువ నిదిగో !
మానినులము వచ్చినాము మంజులవాణీ !
' దేశభాషలయందు తెలుగు లెస్స' ని వల్కె,
రాయలు కర్ణాట రాజరాజు,
' సుందర తెలుగ ' ని చొక్కి వచించె, సు
బ్రహ్మణ్యభారతిరా , తమిళుడు ,
అరయ ' ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ ' అంచు, ని
కోలకోంటి ఒక ఇటాలి మెచ్చె,
' అద్భుత ' భాషని అరచి చెప్పెను, బ్రౌను
ఇంగ్లీషుదొర గణియించి ఘనత,
దేశ దేశాల పండితుల్ తెలుగు మెచ్చి
వొగిడినా , రిదిగొ ! నిచటి 'వోగు దగిడి
గాళ్ళు' తామె బుధులవోలె, గ్రామ్యమనుచు
తెలుగు నుడులను నిరసింత్రు తులువ లగుచు .
సద్దు సేయంగవద్దు విశ్వంబ నీవు,
సరసములదేలుచున్నారు, సరసజగతి
నేలు రాధికాకృష్ణులు, హృదయ
సీమలొక్కటిగ, రసానుగామినులయి .
సాయంసంధ్యాసమయము ,
హాయిగ మా ఊరిలోని అభవునిగుడిలో ,
తీయగ ఫోటో , ఇదిగో !
తోయజమిత్రుండు తీగతో ముడివడియెన్ .
ఆంగ్లసంవత్సరాది ' 2021 ' శుభాకాంక్షలు
-----------------------------------------------------
కవి వ్యాఘ్ర మొక్కండు ఘాండ్రించి కవితలన్
పాఠకుల్ గగురొంద పట్టి బిలిచె
కవివృషభ మొక రంకె గావించి పద్యాన
చదువరుల్ బెదరంగ జరిచి బిలిచె
కవిగండభేరుండ ఘనుడొకండు ఝటిల
కుటిల సమస్యిచ్చి కోరిబిలిచె
కవి కాలభైరవ ఘనుడొక్క కీర్తనన్
యందరన్ దిట్టి నిన్నార్తి బిలిచె
ఇలను నంతట నిన్నె లెక్కించు చుందు ,
రైన నొక కవిగబ్బిలం బటకకెక్కి
నిన్ను బిల్వంగ దూరు, పొద్దున్నె జెప్పు
'విష్ యు హ్యాపి న్యూఇయర్ ' - వింత జూడు .
ఇరవై అంతా వైరస్
వెరవున గడగడ వణికి , భువి వెతల బడియెన్
సురనదివై నీవైనను
ఇరవయ్యొకటీ ! మము పరికించుము తల్లీ !
భక్తి వలవేసి గెలిచి యా పద్మనాభు
వక్షము నలంకరించి సేవించి మించి
చెలువమున రంగనాధుని చేడెవయితి
వమ్మరో మమ్ము కాపాడు వరదహస్త .
ఆముక్తమాల్యదా ! ఆ
స్వామికి , నీయెదను తాకి , పరిమళ భరితం
బోమిన మాలలు కావలె ,
ఏమీ ! మీ ప్రేమకావ్య మెంత మధురమో !
అడుగొ ! కుల్లూరు పురమున నద్భుతముగ ,
అచ్యుతుం డుత్తరద్వార మందు , కొలువు
దీరె , ముక్కోటి దేవతాధీశు డగుచు ,
భాగ్య మిదిగదా ! దర్శించ భక్తులార !
నేడు ముక్కోటి , దేవతల్ భువికి తరళి
వచ్చి , దేవదేవునిగొల్చు పర్వదినము ,
మనము కూడ వైకుంఠవాసుని గొలుతము
రండి ఉత్తరద్వార దర్శనము సేయ .
తల్లి ఆదిలక్ష్మి , ధైర్యలక్ష్మియె అక్క
చెల్లి విజయలక్ష్మి చెనటి ! వినుము ,
సకల శుభద భార్య సంతానలక్ష్మిరా
కూతురు ధనలక్ష్మి రాతమార్చు .
అరయర! గజలక్ష్మి అత్తయ్యయని , మరి
వదిన ధాన్యలక్ష్మి వరుస గనిన ,
మరదలు మనయింట వరలు విద్యాలక్ష్మి
అష్టలక్ష్ము లింట నలరు చుంద్రు .
వారికి గౌరవ మిచ్చిన
వారే నీజీవితాన వరదులగుదు , రా
నీరేజాసనులు కినుక
బారిర , కష్టాలు మొదులు , భావించు సఖా !
కన్నయ్యా ! అబ్బా ! ఏ
మున్నావయ్యా ! యెడదకు మోహనమయ్యెన్ ,
కన్నుల్ చాలవు రెండూ ,
నిన్నే చూస్తూ , ఇటువలె నిలువడి వోతిన్ .
నీవేనా ప్రతిబింబం ?
నీవే నేనా ? అసలిక , నేనే లేనా ?
నీవే నేనను విషయము
దేవా ! నేటికి దెలిసెను , తెలివిడి కలిగెన్ .
ఈ చిత్రం చూశారా !
ఓ 'చిత్రవిచిత్ర' ముంది , ఓహో! యని, శిరసుల్
ఊచక మానరు తెలిసిన,
యోచించగ చిత్రకారు డుధ్ధతుడు కడున్ .
ఇందెవరు మహాభాగులు?
నందిత శ్రీరంగనిలయనాధుడ? , గోదా
సుందరియ , విష్ణుచిత్తుడ ?
అందున గల భక్తజనుల? అందరికి నమో 🙏 .
శ్రీరంగ రంగ ! గోదా
శ్రీరమణీ ముక్తమాలలే కోరితివా?
నారీ హృదయము లెరిగిన
నారాయణ! నిన్నుగొలుతు నానా నుతులన్ .
*డిసెంబరు 17- 'పెన్షనర్స్ డే'* శుభాకాంక్షలతో....
1983 నుండి ఏటా డిసెంబరు 17న 'పెన్షనర్స్ డే'గా జరుపుకొంటున్నాం. పెన్షన్‌కు భారతదేశంలో దగ్గర దగ్గరగా 160 ఏళ్ళ చరిత్ర వుంది.
రిటైర్మెంట్ అనంతర జీవనం కోసం తమ రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలసప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా భారత పెన్షన్ చట్టం, 1871 ద్వారా ఈ వ్యవస్థ రూపుదిద్దుకొంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్‌ను అప్పుడప్పుడు పెంచుతూ బ్రిటీష్ ప్రభుత్వం పరిహారం కల్పించేది.
రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తున్నప్పటికీ 1922, జనవరి 1నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్ రూల్స్‌లో వాటిని పొందుపర్చలేదు. *రక్షణ మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారుగా వున్న డి ఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆడిట్ అండ్ అక్కౌంట్స్‌లో ఒక ఆఫీసర్‌గా 1972లో రిటైరయ్యారు. మిగతా పెన్షనర్లలాగే ఆయనకూడా పెన్షన్ పొందటంలో అనేక ఇబ్బందుల నెదుర్కొన్నాడు. అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్ ఫిర్యాదుదారు, ప్రభుత్వ వాదనలను విన్నారు. ''పెన్షన్'' అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు. తన ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు 1982 డిసెంబరు 17న వెలువడింది. ఆ కారణం గానే డిసెంబరు 17న నేడు దేశమంతటా ' పెన్షనర్స్‌డే'*
*(పింఛనుదార్ల దినోత్సవం)గా పాటిస్తున్నారు.*
*సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం పెన్షన్‌ను పెన్షనర్ హక్కుగా పరిగణించ బడింది.మరియు పెన్షనర్ గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అది సరిపడు నంతగా వుండాలి.*
'నకారా కేసు' లో సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనల ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం *''పెన్షన్ అన్నది బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్‌ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుంద''ని పేర్కొంది.*
భారతదేశంలో ఇటీవల చోటు చేసుకొంటున్న పెన్షన్ సంస్కరణలు, *పిఎఫ్ ఆర్డి ఎ* (పెన్షన్ ఫండ్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్, పోలెండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాన్ వంటి దేశాలున్నాయి. భారత ప్రభుత్వం ప్రధానంగా చిలీ పెన్షన్ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది.
2004, జనవరి 1నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతన ఉద్యోగులకు పిఎఫ్ఆర్డిఎ బిల్లు ద్వారా నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్న కంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్ బెనిఫిట్ పథకానికి బదులు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పిఎఫ్ఆర్డిఎ) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎపై 10శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.
బ్యాంకులలో 2010 ఏప్రిల్ 1న, ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయ బడుతోంది. కొత్త ఉద్యోగులకు వేరేగా మరెలాంటి ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్ ఫండ్ బిల్లు (పిఎఫ్ఆర్డిఎ)ను పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం లాక్కొన్నట్లైంది. ఈ కొత్త పెన్షన్ పథకంలో ఉన్నవారి పెన్షన్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రైవేటు మదుపుదార్ల, సట్టా మార్కెట్ ప్రయోజనాలను కాపాడడానికే తప్పఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.
నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు 1.57 లక్షల మంది వున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 264 మందికి పైగా చనిపోయిన వారు వుంటారు. ఈ కుటుంబాలకు మాత్రం పెన్షన్ రావటం లేదు. ప్రతి నెలా వేతనం, కరువు భత్యం నుండి 10 శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్ ఫండ్ నుండి సీపీఎస్ రూల్ ప్రకారం క్లైమ్ చేసుకోవాల్సిన 60 శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక అవస్థల పాలవుతున్నాయి. పాత పెన్షన్ పథకం వారికి గ్రాట్యుటీ సదుపాయం వుండటం వలన చనిపోయిన లేదా రిటైరైన ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.15 లక్షల వరకు లభించేది. సీపీఎస్‌లో గ్రాట్యుటీ అవకాశం లేకపోవటం వలన ఆ కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంది. పెన్షన్ కాదది వంచనగా రుజువైంది. పాత పెన్షన్ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే లాభదాయకంగా వుంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింది.
*సీపీఎస్ ప్రమాదం తేటతెల్లమవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అభద్రత, ఆందోళన పెరుగుతోంది. దానితో సీపీఎస్‌కి వ్యతిరేక ఉద్యమాలు ఊపందు కుంటున్నాయి. సీపీఎస్ చందా దారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా సమైక్యమై నిరంతర పోరాటాలు చేస్తున్నారు. సీపీఎస్‌తో అపాయింట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరగటంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఎన్జీఓ సంఘాలు జాతీయ సమాఖ్యలతో కలిసి దేశవ్యాపిత ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయడం మంచి పరిణామం.అధికారంలోకి వచ్చిన 7రోజులలో మన రాష్ట్రంలో సి పి యస్ రద్దు చేస్తామని చెప్పి అధికాంలోకి వచ్చి దాదాపు 2సంవత్సరాల యినా కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం తీవ్ర అసంతృప్తి గా ఉంది.*
*సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు.* తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ. రెండేళ్ల్ల నుండి సీపీఎస్‌పై పోరాటాలు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఏమార్చలేవు. ఉద్యోగుల జీతభత్యాలు, సెలవులు, పెన్షన్ తదితర కొన్ని ముఖ్యమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించే ధోరణి గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది. అందువలన సీపీఎస్ విషయంలో కూడా అదే ధోరణి వ్యక్తమవుతోంది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అనుమతించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పరిణామాలు సీపీఎస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయరక్షణలో పడుతున్నట్టు కనిపిస్తోంది. పోరాడి విజయం సాధించాలి.
*భారతదేశంలో ప్రస్తుతం 60ఏళ్ళ పైబడినవారు 8శాతానికి మించివున్నారు. అంటే సుమారు 10కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి - వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ము కొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారలు కావచ్చు - ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధిం చాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడిన వారే.* అంటే *ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్‌ను పరిరక్షించడం, పెన్షన్ లేనివారికి పెన్షన్ కల్పించడమే మనముందున్న బృహత్తర కర్తవ్యం. ఆ కర్తవ్యానికి పునరంకితులు కావడమే ఈ పెన్షనర్ల దినోత్సవ సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ.*
వెలయగ సత్కార్యాచర
ణల వలననె కర్మబంధనలుదొలగు , వృథా
పలుకులతో గాదు , బుధులు
చెలువుగ కడు మంచిపనులు సేయుదు రెలమిన్ .
నాలుకనుజాపి పొడవుగ మేలుగలుగ
కుడికి యెడమకు పదిమార్లు కుదిపి కదుప
ముదిమిలో మతిమరుపుజబ్బు తొలగునట !
దోస్తి నాల్కకున్ మెదడుకు జాస్తియంట !
భారతాంధ్రీకరణ మహాభాగుడును , హ
రిహరనాధదేవుని రూపురేఖలు రచించి ,
శైవ వైష్ణవుల కొఱకు , సామరస్య
తెఱగు జూపిన సంస్కర్త , తిక్కయజ్వ .
రామా ! రఘువీర ! పరం
ధామా ! నీ డెంద మెంత దావానలమై
భూమిసుత కోస మేడ్చెనొ !
స్వామీ ! నిన్ జూడ , కండ్లు భాష్పము రాల్చెన్ .
విలపించు జగన్నాధుని
అలసట బాపంగ శాఖ లల్లనవీచెన్
అలరుల పరిమళ మద్దుచు
మలయపవన సేవజేసి మ్రాను తరించెన్ .
శ్రీరామ పరిష్వంగం
బారయ సీతమ్మకున్ను పవనసుతునికిన్
నేరుగ లభించె , చెట్టిది
కోరినదో లేదొగాని గొప్పగ దొరికెన్ .
మాధవుని పాదదర్శన
సాధన భాగ్యంబుగోరు సకలర్షులకున్
శోధనకందని కౌగిలి
శ్రీధవు డీ తరువు కొసగె శ్రీభాగ్యంబుల్ .