ఈ చిత్రం చూశారా !
ఓ 'చిత్రవిచిత్ర' ముంది , ఓహో! యని, శిరసుల్
ఊచక మానరు తెలిసిన,
యోచించగ చిత్రకారు డుధ్ధతుడు కడున్ .
ఈ చిత్రం చూశారా !
ఓ 'చిత్రవిచిత్ర' ముంది , ఓహో! యని, శిరసుల్
ఊచక మానరు తెలిసిన,
యోచించగ చిత్రకారు డుధ్ధతుడు కడున్ .
ఇందెవరు మహాభాగులు?
నందిత శ్రీరంగనిలయనాధుడ? , గోదా
సుందరియ , విష్ణుచిత్తుడ ?
అందున గల భక్తజనుల? అందరికి నమో 🙏 .
శ్రీరంగ రంగ ! గోదా
శ్రీరమణీ ముక్తమాలలే కోరితివా?
నారీ హృదయము లెరిగిన
నారాయణ! నిన్నుగొలుతు నానా నుతులన్ .
*డిసెంబరు 17- 'పెన్షనర్స్ డే'* శుభాకాంక్షలతో....
1983 నుండి ఏటా డిసెంబరు 17న 'పెన్షనర్స్ డే'గా జరుపుకొంటున్నాం. పెన్షన్‌కు భారతదేశంలో దగ్గర దగ్గరగా 160 ఏళ్ళ చరిత్ర వుంది.
రిటైర్మెంట్ అనంతర జీవనం కోసం తమ రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలసప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా భారత పెన్షన్ చట్టం, 1871 ద్వారా ఈ వ్యవస్థ రూపుదిద్దుకొంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్‌ను అప్పుడప్పుడు పెంచుతూ బ్రిటీష్ ప్రభుత్వం పరిహారం కల్పించేది.
రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తున్నప్పటికీ 1922, జనవరి 1నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్ రూల్స్‌లో వాటిని పొందుపర్చలేదు. *రక్షణ మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారుగా వున్న డి ఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆడిట్ అండ్ అక్కౌంట్స్‌లో ఒక ఆఫీసర్‌గా 1972లో రిటైరయ్యారు. మిగతా పెన్షనర్లలాగే ఆయనకూడా పెన్షన్ పొందటంలో అనేక ఇబ్బందుల నెదుర్కొన్నాడు. అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్ ఫిర్యాదుదారు, ప్రభుత్వ వాదనలను విన్నారు. ''పెన్షన్'' అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు. తన ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు 1982 డిసెంబరు 17న వెలువడింది. ఆ కారణం గానే డిసెంబరు 17న నేడు దేశమంతటా ' పెన్షనర్స్‌డే'*
*(పింఛనుదార్ల దినోత్సవం)గా పాటిస్తున్నారు.*
*సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం పెన్షన్‌ను పెన్షనర్ హక్కుగా పరిగణించ బడింది.మరియు పెన్షనర్ గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అది సరిపడు నంతగా వుండాలి.*
'నకారా కేసు' లో సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనల ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం *''పెన్షన్ అన్నది బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్‌ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుంద''ని పేర్కొంది.*
భారతదేశంలో ఇటీవల చోటు చేసుకొంటున్న పెన్షన్ సంస్కరణలు, *పిఎఫ్ ఆర్డి ఎ* (పెన్షన్ ఫండ్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్, పోలెండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాన్ వంటి దేశాలున్నాయి. భారత ప్రభుత్వం ప్రధానంగా చిలీ పెన్షన్ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది.
2004, జనవరి 1నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతన ఉద్యోగులకు పిఎఫ్ఆర్డిఎ బిల్లు ద్వారా నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్న కంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్ బెనిఫిట్ పథకానికి బదులు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పిఎఫ్ఆర్డిఎ) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎపై 10శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.
బ్యాంకులలో 2010 ఏప్రిల్ 1న, ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయ బడుతోంది. కొత్త ఉద్యోగులకు వేరేగా మరెలాంటి ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్ ఫండ్ బిల్లు (పిఎఫ్ఆర్డిఎ)ను పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం లాక్కొన్నట్లైంది. ఈ కొత్త పెన్షన్ పథకంలో ఉన్నవారి పెన్షన్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రైవేటు మదుపుదార్ల, సట్టా మార్కెట్ ప్రయోజనాలను కాపాడడానికే తప్పఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.
నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు 1.57 లక్షల మంది వున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 264 మందికి పైగా చనిపోయిన వారు వుంటారు. ఈ కుటుంబాలకు మాత్రం పెన్షన్ రావటం లేదు. ప్రతి నెలా వేతనం, కరువు భత్యం నుండి 10 శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్ ఫండ్ నుండి సీపీఎస్ రూల్ ప్రకారం క్లైమ్ చేసుకోవాల్సిన 60 శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక అవస్థల పాలవుతున్నాయి. పాత పెన్షన్ పథకం వారికి గ్రాట్యుటీ సదుపాయం వుండటం వలన చనిపోయిన లేదా రిటైరైన ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.15 లక్షల వరకు లభించేది. సీపీఎస్‌లో గ్రాట్యుటీ అవకాశం లేకపోవటం వలన ఆ కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంది. పెన్షన్ కాదది వంచనగా రుజువైంది. పాత పెన్షన్ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే లాభదాయకంగా వుంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింది.
*సీపీఎస్ ప్రమాదం తేటతెల్లమవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అభద్రత, ఆందోళన పెరుగుతోంది. దానితో సీపీఎస్‌కి వ్యతిరేక ఉద్యమాలు ఊపందు కుంటున్నాయి. సీపీఎస్ చందా దారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా సమైక్యమై నిరంతర పోరాటాలు చేస్తున్నారు. సీపీఎస్‌తో అపాయింట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరగటంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఎన్జీఓ సంఘాలు జాతీయ సమాఖ్యలతో కలిసి దేశవ్యాపిత ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయడం మంచి పరిణామం.అధికారంలోకి వచ్చిన 7రోజులలో మన రాష్ట్రంలో సి పి యస్ రద్దు చేస్తామని చెప్పి అధికాంలోకి వచ్చి దాదాపు 2సంవత్సరాల యినా కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం తీవ్ర అసంతృప్తి గా ఉంది.*
*సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు.* తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ. రెండేళ్ల్ల నుండి సీపీఎస్‌పై పోరాటాలు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఏమార్చలేవు. ఉద్యోగుల జీతభత్యాలు, సెలవులు, పెన్షన్ తదితర కొన్ని ముఖ్యమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించే ధోరణి గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది. అందువలన సీపీఎస్ విషయంలో కూడా అదే ధోరణి వ్యక్తమవుతోంది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అనుమతించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పరిణామాలు సీపీఎస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయరక్షణలో పడుతున్నట్టు కనిపిస్తోంది. పోరాడి విజయం సాధించాలి.
*భారతదేశంలో ప్రస్తుతం 60ఏళ్ళ పైబడినవారు 8శాతానికి మించివున్నారు. అంటే సుమారు 10కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి - వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ము కొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారలు కావచ్చు - ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధిం చాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడిన వారే.* అంటే *ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్‌ను పరిరక్షించడం, పెన్షన్ లేనివారికి పెన్షన్ కల్పించడమే మనముందున్న బృహత్తర కర్తవ్యం. ఆ కర్తవ్యానికి పునరంకితులు కావడమే ఈ పెన్షనర్ల దినోత్సవ సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ.*
వెలయగ సత్కార్యాచర
ణల వలననె కర్మబంధనలుదొలగు , వృథా
పలుకులతో గాదు , బుధులు
చెలువుగ కడు మంచిపనులు సేయుదు రెలమిన్ .
నాలుకనుజాపి పొడవుగ మేలుగలుగ
కుడికి యెడమకు పదిమార్లు కుదిపి కదుప
ముదిమిలో మతిమరుపుజబ్బు తొలగునట !
దోస్తి నాల్కకున్ మెదడుకు జాస్తియంట !
భారతాంధ్రీకరణ మహాభాగుడును , హ
రిహరనాధదేవుని రూపురేఖలు రచించి ,
శైవ వైష్ణవుల కొఱకు , సామరస్య
తెఱగు జూపిన సంస్కర్త , తిక్కయజ్వ .
రామా ! రఘువీర ! పరం
ధామా ! నీ డెంద మెంత దావానలమై
భూమిసుత కోస మేడ్చెనొ !
స్వామీ ! నిన్ జూడ , కండ్లు భాష్పము రాల్చెన్ .
విలపించు జగన్నాధుని
అలసట బాపంగ శాఖ లల్లనవీచెన్
అలరుల పరిమళ మద్దుచు
మలయపవన సేవజేసి మ్రాను తరించెన్ .
శ్రీరామ పరిష్వంగం
బారయ సీతమ్మకున్ను పవనసుతునికిన్
నేరుగ లభించె , చెట్టిది
కోరినదో లేదొగాని గొప్పగ దొరికెన్ .
మాధవుని పాదదర్శన
సాధన భాగ్యంబుగోరు సకలర్షులకున్
శోధనకందని కౌగిలి
శ్రీధవు డీ తరువు కొసగె శ్రీభాగ్యంబుల్ .
అమ్మా యని నోరారా
ఇమ్ముగ భజియించిన , మన ఈప్సితముల నా
యమ్మ యొసంగును , మనపయి
అమ్మకు వాత్సల్యమధిక , మమ్మకు ప్రణతుల్ 🙏 .
చెన్నుందామెరలోని స్వఛ్ఛతలు ఈస్త్రీయందు గన్పట్టు , సం
పన్నుల్ బంగరు భూషణాలు ధరియింపన్ రాని విణ్ణానపున్
వన్నెల్ , ఆ ప్రకృతీ సమీపగత జీవావాసులందుండుటల్
ఎన్నంగానగు , నీమెకున్ గొలనుకు న్నేవో దోచు సాపత్యముల్ .
ఈ మహానటి సాటి రా నెవరు గలరు
హేమ మకుటమ్మ దొడిగె కళామతల్లి
తెలుగుల సినీజగత్తు వో వెలుగు వెలిగె
అరయ సావిత్రివల్లనే ననగ జెల్లు .
బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా
మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.
సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు. అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.
*అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).*
*ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు - ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).*
*చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.*
*అందుకే:*
*మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.*
*ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.*
*ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ* *కాపలాదారుగా మారిపోయి*
*వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ, కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.*
*ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.*
*"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".*
*మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.*
ఘనముగ భూమికి బుట్టెను ,
జనకుని గారాలపట్టి స్థానము గనియెన్ ,
యినకుల తిలకుని బొందెను ,
జనజగతికి తల్లియయ్యె , జననికి ప్రణతుల్ 🙏 .
ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?
వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.
ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.
.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
.
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”
.
పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.
తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,
నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.
ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,
ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.
అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.
పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.
చూపు దిప్పుకోనగున ఈశోభనంపు
మాధురీ మనోఙ్ఞతలకు , మదను డలిగి
పుడమి సరసుల డెందాల కడిది జీల్చ
వింటి కెక్కుబెట్టిన వాడి విశిఖ మేమొ !
నడుము వంచలేక నయగారములువోవ
పాదపూజ సేయు భార్య ఘనమ ?
స్టూలు నెక్కి పదము లాలి కందించుచు
పాదపూజ లందు భర్త ఘనమ ?
మేమంతా ఉన్నతులం
భూమినిగల తక్కినోళ్ళు పోలరు మాతో
ఈ మాది రహంకారులు
ధీమంతులుకారు , తీరు తీరుల నీచుల్ .
రాయంచ అందచందము
గాయని కోకిలకు లేదుగానీ, గళమం
దాయమ తీయందనములు
రాయంచకు రావు తాను రాయిడివడినన్ .
కోకిల గళ మాధుర్యము
కాకికి లే , దైన కాకి ఘనమాతృత్వం
కోకిలకు రాదు , ఘనతల్
లోకంబున వివిధగతులు , లోకువ లేలా ?
రమణీయ మోహన రాజీవలోచనల్
శ్రీకృష్ణ వ్రతమాచరించ జనిరి
ముద్దుగుమ్మలు కాస్త ప్రొద్దుండగా లేచి
రందర బిలుచుక మందగమన
ఘన తనూభారాలస నడల బెడగున
యమునకు జనిరి సోయగము మెరయ
డెందాల నిండార అందాల పరమాత్మ
నిలిపి గ్రుంకులిడిరి నెలతులెల్ల
పరమ పురుష ! కృష్ణ ! తిరుమంగళాకార !
జన్మ జన్మ లందు జలజనేత్ర !
వలపులు గురిపించు చెలిమికాడవు గాగ
వరము నిమ్మ టంచు ప్రణతు లిడిరి .
ఈలావణ్య తనూవిభావరులనెందే గంటిమా? రంగు- రూ
పీ లాగెట్లు మిళిందమై యొనరె ! తన్వీ ! రా యిటన్, మోహనా
లేలా?నీ వరచాటు చేసెద , వహో! ఈ తాటి చెట్టెట్టి పు
ణ్యాలన్ జేసెనొ నీదు పొందు గనె , కన్యాలింగనా జేతయై .
చూడ చిత్రంబు చిత్రము , దూడ యొకట ,
కృష్ణుడొక్కట , గోవుచన్ కేసి కుడుచు ,
ఆల పాలన్న పరమాత్మ కమృతము గద !
చూడవమ్మ! యశోదమ్మ! సుతుని విథము .
పదపడి కళ్ళెముంభిగిచి పళ్ళకు మధ్యన , రెండుచేతులన్
బొదివి మహోగ్ర ఖడ్గములు , మూపుకు బిడ్డడి గట్టి , స్వారియై
పది పదునైదు రక్షకులు ప్రక్కగమించగ , రౌద్రమూర్తియై
కదిలెను ఝాన్సిలక్ష్మి యలుకన్ దునుమాడగ నాంగ్లసేనలన్ .
కత్తుల రెండుచేతులను కంఠములన్ తెగగోసె శత్రులన్
బిత్తరచూపులన్ రిపులు భీతిలి రాయమ వీరవిక్రమో
న్మత్తత జూచి , మోసపు సమాయతనంబున నొంటె సైన్యమున్
క్రొత్తగ దింపి వెన్క కడ కూడి తటాలున దాడిసేయగా
కలవరపాటునంద , వెనుకన్ ఛురకత్తియ వీపులోదిగెన్
నెలతకు , వెంటవెంటనె ఘణిల్లున గుండుదిగెన్ , హయమ్ము వె
ల్వెలవడె , నింతలో గదిసి పెల్లుగ శత్రులు కత్తివ్రేటులన్
దలగిరి శీర్షమున్, చివరిదాకను పోరెను నెత్తురోడుచున్ .
ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామ యోధురాలు
రాణి ఝాన్సిలక్ష్మీయె , చిరస్మరణగ
భరత భూమి దలచు దేశభక్తురాలు
భక్తి కైమోడ్చి ప్రణమిల్లి 🙏 ప్రణతు లిడుదు .
ఈరోజు అంతర్జాతీయ 'పురుష' దినోత్సవం అట !
ఐనా ,
అమ్మే తొలిప్రాధాన్యత ,
ఇమ్ముగ పరమేశ్వరుడు మహేశ్వరి పిదపే ,
నమ్మిన నిజమిది జగతిన్ ,
అమ్మకె పాదాభివందనము 🙏 లు యెపుడున్ .
తిరుచానూరున పద్మసారసభవా,దేవీ,మహాలక్ష్మి, మం
గ,రమావల్లభువేంకటేశ్వరుని తాన్కంజోత్పలత్పూజలన్
వరమాలల్ దిగవైచి కోరివలచెన్ వామాక్షి , నే డా పరే
శ్వరి జన్మించినరోజు మ్రొక్కులిడుచున్ ప్రార్ధింతు 🙏 కైమోడ్పులన్ .
మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి
ఆవు నెయ్యి వోసి అభవు నెదుట
వత్తి వేసి శివుని వాకిట ప్రతి రోజు
దీప మిడుడు , జన్మ తేజరిల్లు .
మట్టి ప్రమిద లోన మరి కాను పించడు
నూనె లోన గనగ నోప మతని
ప్రత్తి లోను దాని వత్తిలో గనరాని
శివుడు దివ్వె లోన చేరియుండు
పండరి పురంలో శివాజీ సమర్పించిన అరుదైన
ఆభరణాలతో రుక్మిణీ అమ్మవారి అపురూప వైభవం
-----
కాసులపేరులు కంఠహారాలతో
మెరయు విఠ్ఠలుని రుక్మిణిని గనుడు
మరకత మణిమయ మంగళాభరణాల
కాంతమత్ మూర్తి శ్రీకాంత గనుడు
కటివలయ విలాస కమనీయ రత్నాభ
రణ హేలల వెలుంగు రమణి గనుడు
పసిడిపచ్చల భూషణసిరుల కరపాద
కమనీయమూర్తి శ్రీకమల గనుడు
ఛత్రపతి శివాజి సభక్తి సమధికముగ
తగ సమర్పించినవి యరుదైన నగలు
కనులు చాలవు రుక్మిణీ ఘనవిభవము
చూడ సర్వాంగభూషిత శోభనములు .
ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై
పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా
కలితు ల్భోగములన్ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే?
----- కవికోకిల దువ్వూరు . రామిరెడ్డి
కృషీవలుడు నుండి