చినుకు తాకి నంత చెలికాని చేస్పర్శ
మోహనాలు విరిసె మోము పైన ,
వలపు విరుల వోలు వాన చినుకు మురువు
కడు మనోఙ్ఞ ప్రకృతి గద ! పుడమిని .
చినుకు తాకి నంత చెలికాని చేస్పర్శ
మోహనాలు విరిసె మోము పైన ,
వలపు విరుల వోలు వాన చినుకు మురువు
కడు మనోఙ్ఞ ప్రకృతి గద ! పుడమిని .
తినుట తాగుట కేన ఈ మనుజ జన్మ ?
చేయ ఘనకార్య మింకేమి చేత నవద ?
పడిన తదనంతరమ్మును బ్రతుకు గలదు ,
దేహ మున్నప్పుడే దాన్ని సాధింప వలెను .
తుమ్మెద పిండు రెక్కలను దోచిన తీరు కురుల్ ,వినీల పూ
లమ్ములు దూసి , మన్మధుడు ఆయువు పట్టుల కేసి కొట్టిన
ట్లమ్మడు తేనెతుట్టివలె లాలస వెట్టెడు , జూచితే ! ,యిలన్
నమ్మరుగాని నల్పు లలనల్ మరుతూపులు , గుండె చీల్చెడిన్ .
మోమొక కొంత పైకి , అర మూతలు వడ్డవి కళ్ళు , చేతిలో
మో మటు లైన ఛత్రమున , మోహన యోర్తు , తనంత వానలో
గోముగ నెత్తి దడ్వ , చినుకుల్ దిగజారి , మనోఙ్ఞ సీమలన్
పాముచు కిందికిన్ దిగెడు , భాగ్యము ఆమెద ? వానచిన్కుదా ?
వద్దనెనా మనోఙ్ఞ సుమవల్లరి మేనధరించ బూనగా
వద్దనెనా సురా మధుర పానమొకించుక సేయ బూనగా
వద్దనెనా సుధాధర భవాంగజ పూజన లంద బూనగా
వద్దనెనా వరూధిని ప్రవర్తిత స్వర్గ సుఖాలవాలమున్ .
అందాల మోహనా ! అర
విందాక్షా ! కృష్ణ ! వినతి వింటున్నావా ?
తొందరపెడుతోంది మనసు ,
కందొవ అరమోడ్పులయ్యె , కరుణే రాదా !
అలసితివా , శ్రీ కృష్ణా !
తులసీదళ పారిజాత తోమాలిదిగో !
గళమున వేసితి , నేనున్
అలరులతో పాటు , హృదయమందు నిలిచితిన్ .
అరుగో , రాధా కృష్ణులు ,
చెరిసగమయి పొదలమాటు చేరిరి , కంటే ,
సరి సరి , ఈ యమునా తటి
పరిసరములు మధువు లొలికె , వారిరువురితో .
అడుగో , మురళీ మోహను ,
డడుగడుగు మనోహరాలు , అడుగులు వడ , ఆ
రడుగుల మన్మథ రూపము ,
పడుచు టెడద , దడ దడ మన , పర్వుచు నుండెన్ .
మదిలో అలజడి రేగెడు ,
మదనుని పేరురము జూడ , మరుమల్లె విరుల్
పొదివిన జడ అల్లాడెడు ,
కుదు రుండదు నీళ్ళకడవ , కోమలి ! నాకున్ .
పది జన్మలైన , కృష్ణుని
పదముల గెడన , పడియుండు బతుకె బతుకు , ఆ
పెదవుల రుచి , రుచి చూచెడు
వెదురుదె గద జన్మ , మనది వేదన సఖియా !
వగలొదవెడు , సెగలొదవెడు ,
మగటిమి మూర్తీభవించి మనముం దడుగో ,
అగుపడు , వగకాని గనగ
భిగి సడలెడు నీవి సఖియ , బేలయితి గదే !
కడవలు తేలిక లయ్యెను ,
కడుకొని బరువయ్యె యెదలు , కాంతుని కృష్ణున్
కడకంట గనిన కాంతల
నిడు మేనులు వణక సాగె , నెంతందంబో !
అర చిరునవ్వు మోమపయి అబ్బురమై మెరయంగ నింతిరో !
కరములు సాచి , విల్దొడిగి , కంజపు టమ్మును కంతుడేసి న ,
ట్లరయగ చూడ్కులన్ బరపుటల్ గననయ్యెడి , నింక నెవ్వడో
ఉరము పెటిల్లునన్ బగిలి , ఊపిరి గోల్పడుటల్ ధ్వనించెడిన్ .
విజయోస్తు గణనాధ ! విఘ్నేశ ! సురవంద్య !
విజయోస్తు శివుడ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు కుల్లూర వెలసిన పోలేరు !
విజయోస్తు రామ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు అచ్యుతా ! విశ్వ జన వినుతా !
విజయోస్తు హనుమ ! దిగ్విజయమస్తు ,
విజయోస్తు వెంకయ్య ! వినుతింతు , వినుతింతు
విజయోస్తు సాయి ! దిగ్విజయమస్తు ,
దిగ్విజయమగు గాక ! మా దివ్య , మాతృ
భువికి , అచటి ప్రజలకు , ఈ పుడమి వెలయు
సకల జనులకు , విజయదశమి యొసంగు
సకల సన్మంగళములు , ప్రశాంతతలును .
బండి కాపు దొరను నిండుగా గాంచితి
విజయవాడ లోన వేడుక పడి
స్నేహ భాషణాలు చేసిన విందులు
మధురమై తనిసెను మది మరిమరి .
అరమోడ్పు కనుల , రుక్మిణి
వరుని గనును , అంతలోనె వరదుడు కనగా ,
మరుని పువుబంతి దవిలిన
పరువపు మొగ్గయె , మనోఙ్ఞ పద చిత్ర మహా !
దక్కెను రుక్మిణి యని హరి ,
చిక్కె మనోహరు డని యా చికురాననయున్ ,
ఒక్కెడ బిగి కౌగిళులన్
జిక్కిరి , విడదీయ బ్రహ్మచేతగున తగన్ ?
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
పాదాంబుజములపై యొరగుట ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
దరిసి కరముల మ్రొక్కి ప్రదక్షిణ మిడ ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
నతులతో ముంచి సంస్తుతులు సేయ ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
అకలంక భక్తి డోలికల నూచ ,
అన్నిటికి మించి , ప్రియమార , గిన్నె లోన
వెన్న నైవేద్య మిడి , తినిపించు సేవ
యన్న , కృష్ణయ్య కిష్టము , కన్ను గవకు
భాష్పములు గ్రమ్ము , కృష్ణయ్య పటము గాంచ .
బధ్ధకముగ లేచి , పడకపై కసిరిన ,
సతికి నెస్ కాఫి చేసాచి యొసగి ,
బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,
స్నానాదికముల వేసట ముగించి ,
వంట జేసి , పొసగ వడ్డించి బాక్సులన్ ,
పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,
సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,
మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,
చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,
అచటనూ తిట్లతో చంపు ఆడబాసు
వద్దురా మోడరన్ మగవాళ్ళ వెతలు
మహిళ 'మహరాణి' నేటి రామాయణమున .
( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )
కృష్ణపరమాత్మ శోభనకృత మనోఙ్ఞ
రూపలావణ్యములుగాంచి రుక్మిణిసతి
అచ్చెరువు జెంది నిచ్చేష్టయయ్యె , పోత
నకును కట్టెదుట గన్పట్టి నటులె దోచు .
కృష్ణపరమాత్మతోడి మమేకమంద ,
భక్తురాలెంతగా కోరి పరితపించు
నో , దెలియ , పోతనకు మించి , యొరులెరుగరు ,
భాగవతము తెలుగులకు భాగ్య పేటి .
ఈ పూబంతి విహారపు
టూపులు చూడంగ , మదను డుధ్ధతుడై , పూ
దూపులు సంధించె ననగ
బో ! పైనా కింద మొత్తమూ పూదండల్ .
పరమాత్మ ' కృష్ణుడే ' సరి జగద్గురుం
డిల భగవద్గీత వెలయ జెప్పె ,
వేద పురాణాలు వెలయించి గురుడయ్యె
' వ్యాసుండు ' భువిని సేవలు గడించి ,
శ్రధ్ధా సబూరి యాచరణగా బోధించి
' సాయి ' సద్గురుడయ్యె సకల జగతి ,
తగ నుపాధ్యాయులై తనరు ' యొజ్జలు ' గూడ
గురువులు జగతికి గురుతుగాను ,
నేడు గురుపౌర్ణమి , వ్యాసమునీశ్వరుని జ
యంతి , పరమేశ్వరాకారు లైన మేటి
గురువు లందరి భజియింతు , తరిమి చీక
టులను , వెలుగులు తెచ్చిరి యిలకు గనుక .
రాముండుండెను - ఊ , తదీయ సతి పేరా సీత - ఊ , తండ్రి యా
ఙ్ఞామూర్ధన్యుడు వోయి తా మడవులన్ దాటంగ- ఊ , రావణుం
డామెన్ మోసముతో హరించెను - ఉ , నిద్రార్థ మాతల్లి శ్రీ
రామున్ గాధను విన్చ నూయనుచు , నిద్రన్ , లక్ష్మణా విల్లు వి
ల్లీమంచున్ పలవించు కృష్ణుడు సదా యిచ్చున్ మహార్థంబులన్ .
*****
రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం,తౌ పితుః
వాచా పంచవటీ తటే విహరతః తామాహర ద్రావణ:l
నిద్రార్ధం జననీ కధామితి హరే:హుంకారతః శ్రుణ్వతః
"సౌమిత్రే!క్వధను ర్ధను ర్ధను" రితి వ్యగ్రాః గిరః పాతు నః ll
ఇది 'రామకర్ణామృతం'లో ప్రస్తావించబడిన శ్లోకం.
అకలంక సాయినాధుని
సకలానిమిషస్వరూపు సద్గురుని సదా
ప్రకటిత భక్తి ప్రపత్తుల
ముకులితకరకమల 🙏 స్తోత్రములసేవింతున్ .
రుద్దేది గుండు మీదా ,
అద్దుచు కాల్చేది చూడు డైరన్ మీదా ,
అద్దిర ఇల్లాల్లంటే ,
బుధ్ధులు మరి కొత్త కొత్త పోకడలు గదా !
నిన్ను దర్శించక నీలమోహనరూప !
కన్నులున్నందున ఘనత యేమి ?
నిన్ను సేవించక నీరజాత నయన !
చేతులున్నందున శ్రేయ మేమి ?
నిన్ను భజించక నిగమ శుభగరూప !
నోరు గల్గుట వల్ల సౌరదేమి ?
నిన్ను వినక మహనీయ ఘనచరిత !
చెవులు గల్గుట వల్ల స్థితి యదేమి ?
మాధవా ! నిను విడి మరిమరి బతికినా
బతుకుకు పరమార్థ పరత యేమి ?
కృష్ణ ! నిన్ను జేర కెన్ని బొందినగాని
ఘనత యే మిహ పరముల కాంక్షదీర .
ఆ యరమూతవడ్డకను , లా నవమోహన నాసికా శిరో
లాయకభూష , కర్ణకమలాలు , మనోఙ్ఞపుభ్రూలతల్ , ముఖ
శ్శ్రేయముగాగబొట్టు, నడుచెక్కిలినొక్కును - నందమంత నా
రాయణు బొట్టి ,గుట్టయిడి, రమ్యముగా నినుజేసె నింతిరో !
నేడు మా కుల్లూరులో శ్రీదేవీభూదేవీ సమేత
శ్రీఅచ్యుతప్ప తిరుకళ్యాణం .
------------------------------------
తిరువాభరణములు దీసి పక్కనబెట్టి
ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి
పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి
లలితంపు రొమ్ము తల మొలజుట్టి
తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి
శిరసాది పచ్చ కప్పురము నలది
కన మల్లె పూవల్లె కన్నుల కింపైన
స్వామికి పునుగు జవ్వాది పట్టి
శుక్రవారాన , నేడు , అచ్యుతుని , పెండ్లి
కొడుకుగా గయిసేసిరి , నడిచి వచ్చె
వేదికకు , ముద్దుసతులతో , వేడ్క మీర
చూడ రారండు , కళ్యాణ శోభనములు .