13, నవంబర్ 2020, శుక్రవారం

ఎలా జీవిస్తే , జీవితం సార్థకమౌతుందో .....

 


గుడి అవసరం లేని దేవుళ్ళు !!!!!!🙏

-------------------------

కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు , పేదలగుండెలే గర్భగుడులు.

వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా? 

కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి. 

వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD ,  ఆమె  MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి. 

1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర ,  MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే '' అని మనకు వివేకానందుడు చెప్పలేదా ? '' వివేకానంద , గాంధీ , వినోబా భావేల జీవితాలు , ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.


ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో '' నేను మారుమూల పల్లెల్లోని పేదలను డాక్టరు గా సేవించేందుకు వెళతాను.'' తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర,  మహరాష్ట్ర లో అత్యంత వెనుకబడిన  అయిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు. అదే ఎందుకు ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు  Where There Is No Doctor.  వ్రాసినది David Werner. ఆపుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూవుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా  Hospital 30 kms away అని వ్రాసివుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించివుంటూంది. అలా వైద్య సౌకర్యాలు ఏవీ లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన అనుకొన్నాడు. తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ. జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి : 1.) Sonography or Blood Transfusion  లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం , 2.) X-ray లేకుండా న్యుమోనియా కు వైద్యం చేయడం , 3.) డైయోరియా కు వైద్యం చేయడం. 


ఆరు నెలలు ముంబాయి లోవుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర. వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. అమరావతి [ మహరాష్ట్ర] నుండి 40 కి.మి. నడచివెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిశె వేసుకొని అక్కడి రోగులకు వైద్యం చేసేవాడు. ఆ పల్లె పేదరికం , నిరక్షరాస్యత ,  వ్యాధులతో నిండివుంది. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరు అయిన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకొన్న యువతినే తాను పెళ్ళిచేసుకొంటాను అని. 1.)40 కి.మీ. నడవగలగాలి. 2.)5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. [ 1989 లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అట అది ] 3.)కేవలం 400 వందరూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. [ ఎందుకంటే డా. రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి తీసుకొంటాడు ] 4)అవసరమైతే  ప్రజలకోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి.  100 సంబంధాలు వచ్చినా , ఈ షరతులు చూసాక 99 మంది వెళ్ళిపోయారు. ఒక యువతి సరేనంది. ఆమె పేరు డా. స్మిత [ ఫోటో లో వున్న వ్యక్తి]  

1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర. కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ' మీ ఇష్టం ' అంది. '' ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే , ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు '' అని పల్లెప్రజలకు చెప్పాడు. డా. స్మిత '' మీరే నాకు వైద్యం చేయండి , నగరం వద్దు , '' అనింది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు  ఆది దంపతుల్లాగా లాగా కనిపించారు. 

నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు. ఏడాది లో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పనివుండదు. కాబట్టి ఆహారం కొరత , డబ్బు కొరత ,  దాని కారణంగా రకరకాల వ్యాధులు.  ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు , అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ ఆలోచించి , ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండిగింజలు వీళ్ళే పండించుకోవాలి. అందుకోసమని డా. రవీంద్ర నగరంలోవుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడితో సలహాలు తీసుకొని , విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా  క్రిమి , కీటకాలను ఎదుర్కొనగలిగే కొత్త , ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు. దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును '' నీవు నగరం లో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ? '' అని అడిగితే '' అలాగే , మీరు ఎలా అంటే అలా, '' అన్నాడు కొడుకు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట భూమి దున్నితాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి , చక్కటి పంట తీసి పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డా. రవీంద్ర. ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు.ఇపుడు తిండికి లోటుండదు , రెండుపూటలా తిండి  కారణంగా , ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే  ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లె లో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండిన యువతీ యువకులు ఏడాది కి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది. 

ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లె లో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి [ గతంలో - ఇపుడు కాదు ] ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర , డా. స్మిత , వాళ్ళ కుమారుడు రోహిత్ లు చేస్తున్న పని చూసి చాలా సంతోషించి , '' మీరున్న ఈ చిన్న గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను '' అంటే అందుకు వాళ్ళు అన్నారు : '' మాకు ఇదే చాలు , కానీ ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసేవిధంగాను , పల్లె లోపలానూ రోడ్లు వేయించండి.'' సరే అన్నాడు మంత్రి. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి , ఆ పల్లె ఆధారంగా నడిచే 6 పాఠశాలున్నాయి , 12 వైద్యకేంద్రాలున్నాయి. కానీ సర్జరీ లు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డా. రవీంద్ర తన రెండవకొడుకు రాం ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తీ చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.

మన ఇళ్ళలో , పాఠశాలల్లో , కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పాలి. మామూలుగా కాదు , హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు.వీరి గురించి వెలుగులోకి తెచ్చిన మహానుభావులకు నా హృదయ పూర్వక అభినందనలు .సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేస్తే అందరూ తెలుసుకుంటారన్న చిరు ఆశ నాది .

డా .వసుంధర

🙏

దీపావళి శుభాకాంక్షలు




పార్వతీ పరమశి వానందలహరిలో
తడిసిన నానేల ధన్యతమము
సీతా రఘుపతీ విశిష్ట పాదాంబుజ
ముద్రితం నానేల మోక్ష పథము
రాధికాకృష్ణుల రాగహేళల ప్రేమ
లొలికిన నానేల యోగభూమి
సాయి శ్రధ్ధాసబూరీయ మార్గాలలో
నడచిన నానేల నందమయము

తీరుతీరుల నానేల దివ్యమయము
నాదు భరత భూమాతృపుణ్యాలు జేసి
ఆయు రారోగ్య సౌభాగ్య శ్రీయుతమయి
పుడమి దీపావళీపర్వ ముదిత యగుత !

12, నవంబర్ 2020, గురువారం

పాదపూజ .....

 

ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే

పరమేశ్వరున కిడు పాద పూజ

ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే

పాలిచ్చు తల్లికి పాద పూజ

సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే

భాషా మతల్లికి పాద పూజ

తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే

పంతులు గారికి పాద పూజ


మమ్మి డాడీలు కాదురా అమ్మ నాన్న ,

తెలుగు మాటాడ రాయంగ దివురు నాన్న!

తల్లిభాషను నేర్చి జోతలు ఘటిల్లి

పాడుటే నేలతల్లికి  పాదపూజ 🙏 .

11, నవంబర్ 2020, బుధవారం

జడ యల్లాడెడు .....

 


జడ యల్లాడెడు,జాజిపూతురుముతో ,జాల్వారు కుచ్చుల్లతో,

నడు మల్లాడెడు,మాయురే!పిడికెడై ,నాజూకు యొడ్డాణపుం

గుడుసై,ముందుకువెన్కకై యొడలు,సోకుల్ మాడ , చెంచెక్కలా

డెడు ఊపుల్,చెఱుకుంగడల్ బలెను,చేడెల్ ,చూడ కన్విందగున్ .

25, అక్టోబర్ 2020, ఆదివారం

మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి

 మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి

దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి




తొలిరోజు ' శైలసుత ' యై

యలరారును దుర్గ , మా మహా పోలేర

మ్మ , లలిత , శాంకరి , శుభకరి ,

అలివేణికి 🙏 ప్రణతులిడుదు నమృతాంభసికిన్ .


రెండవ రోజున దుర్గా

చండిక పోలేరు ' బ్రహ్మచారిణి ' యనగా

దండ కమండల మాలా

మండిత తపమాచరించు మాతకు ప్రణతుల్ 🙏 .


మూడవరోజున ' అమ్మ ' ను

వేడుకగా ' చంద్రఘంట ' వేషధారి యనన్

వేడుకొని మ్రొక్కుకొందును ,

నీడగ పోలేరుతల్లి ! నిలుమమ్మ ! మదిన్ 🙏 .


నిండుగ మా తల్లియె బ్ర

హ్మాండము సృజియించుగాన , మరి చవితిని , ' కూ

ష్మాండాదుర్గ ' యనగ భూ

మండలమందువెలుగున్ , నమస్సులు 🙏 తల్లీ !


అయిదో రోజున దుర్గ  వి

జయంబగును  ' స్కందమాత ' సన్నుతనామా

భయహస్త మాతృమూర్తిగ ,

దయగల  పోలేరు  తల్లి ! దండాలమ్మా🙏  !


ఆరో రోజున దుర్గా

కారుణ్యామృతహృదయిని ' కాత్యాయని 'యై ,

చేరి వ్రతమాచరించిన

వారికి పోలేరుతల్లి వరముల నొసగున్ 🙏 .


' కాళరాత్రి ' దుర్గ  గాఢాంధకార వపుష ,

దుష్టసంహరణ , ప్రదోష శుభద ,

కడుభయంకర , శుభకర , సప్తమిని తల్లి ,

పుడమి తలను మోపి మ్రొక్కులిడుదు 🙏 .


అష్టమిని ' మహాగౌరి ' యై యలరు దుర్గ 

అమ్మలను గన్న మాయమ్మ అమృతవల్లి

తల్లి కుల్లూరుపోలేరు తరతరాల

మమ్ము కాపాడు , శిరసా నమామి 🙏 తల్లి !


' సిధ్ధిదాత్రి ' దుర్గ శ్రీమహాపోలేరు ,

సకల సిద్ధులనిడు శాంకరి , అమృ

తమయి , తొమ్మిదవ దిన మనోఙ్ఞరూపసి ,

తల్లి పదములంటి 🙏 తనియువాడ .

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

తస్మై శ్రీ గురవే నమః

 తస్మై శ్రీ గురవే నమః

~~~~~~~~~~~


అది 1971 జూలై 29 .

సమయం సాయంత్రం నాలుగ్గంటలు .

జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ గది .

కుర్చీలో తథేక ధ్యానంతో పనిలో నిమగ్నమై

ఒక ప్రసన్న గంభీర మూర్తి .

గుమ్మంలో ఇరవైయ్యేళ్ళ నూనూగు మీసాల

కుర్రాడు , రాజారావు – చేతిలో ఎప్పాయింట్ మెంట్

ఆర్డర్ తో

మే ఐ కమిన్ సార్

ప్రిన్స్పల్ సార్ తల కూడా పైకెత్తలేదు

కాస్తంత బిగ్గరగా మళ్ళీ మే ఐ కమిన్ సార్

ఈసారి సారు తల పైకెత్తేడు , ప్రశ్నార్థకంగా

నమస్తే సార్ , విష్ చేసి రాజారావు ఎప్పాయింట్ మెంట్

లెటరు టేబిల్ మీదుంచేడు

మాకూ వచ్చింది , ఏం చదువుకున్నావ్

చెప్పేడు రాజారావు

ఎక్కడ

చెప్పేడు

ఓహో , తమరు అక్కడి సరుకా

.......... మౌనం

సబ్జెక్టేమైనా వచ్చా

.......... మళ్ళీ మౌనం

ఒకటి , రెండు , మూడు .....సబ్జెక్టుకు సంబందించిన

ప్రశ్నలు , శర పరంపరలుగా

ధాటిగా రాజారావు సమాధానాలు

ప్రిన్స్ పాల్ గారిలోని చులకన భావం కొంత తగ్గినట్లని

పిస్తోంది . ముఖం కాస్తంత ప్రసన్నంగా మారింది .

కాస్త సరుకుందనీ , పనికొస్తాడనీ భావించి నట్లుంది

అదే , ఆనాటి పెద్దల గొప్ప గుణం .

చిటికెలో పాలూ , నీళ్ళూ వేరు చేసేస్తారు

          ----------------

కాలింగ్ బెల్ మోగింది , అటెండర్ వచ్చాడు

సీనియర్ అసిస్టెంట్ ని పిలవమని ఆర్డర్

సీనియర్ అసిస్టెంట్ హాజరు

ఎప్పాయింట్ మెంట్ ఆర్డరిచ్చి  , రాజారావును జాయిన్

చేస్కోవలసిందిగా ఉత్తర్వు  

సీనియర్ అసిస్టెంట్ రాజారావును ఆఫీస్ రూం లోకి తీసుకెళ్ళేడు

మీ ఒరిజినల్స్ ఇవ్వండి

సార్ , ఈనెలలోనే రిజల్ట్సొచ్చాయి , ఒరిజినల్స్ త్వరలోనే అందజేస్తాను

సీనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ రూంలోకెళ్లేడు , రాజారావు ఫాలో అయ్యాడు

విషయం ప్రిన్సిపల్ కు విన్నవించ బడింది .

అలాగా , పర్లేదులే , జాయిన్ చేసుకోండి . యూనివర్సిటీకి

నేను రాసి తెప్పిస్తానులే .

సీనియర్ అసిస్టెంట్ మారు మాటాడకుండా జాయిన్ చేసుకున్నాడు

సదరు జూనియర్ కళాశాల అనుబంధ ఉన్నత పాఠశాలలో

రాజారావు ఉపాథ్యాయ వృత్తి మొదలయ్యింది .

             -------------

అప్పటి విద్యాలయాల మహోపాథ్యాయుల , ప్రథానోపాధ్యాయుల

వ్యక్తిత్వాలు మహోన్నతాలు . వారి నిర్వహణ సామర్థ్యం అద్భుతం .

వాళ్ళు రాగ ద్వేషాల కతీతులు . ఎవ్వరిలో ఏచిన్న సుగుణం కన్పించినా

మెచ్చుకుని ప్రోత్సహించే ఆ తత్త్వం ఇప్పటి వాళ్లలో మచ్చుకుకూడా కన్పించదు .

సమర్థతను గుర్తించడం , నిబధ్ధతకు పెద్ద పీట వెయ్యడం , తద్వారా

సంస్థను ముందుకు తీసుకెళ్లడం అప్పటి వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య .

ఇప్పుడు భజన పరులకు ప్రాధాన్యతనిస్తూ , సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు .


                ---------------

రాజారావుకు మొదట్నుంచీ అలాంటి మహోన్నత మూర్తుల సాహచర్యం ,

మార్గదర్శనం లభించింది . ఉపాథ్యాయ వృత్తిలో నిబధ్ధత , సబ్జెక్ట్ లో ప్రావీణ్యత

అలవడ్డవి . ప్రధానోపాధ్యాయులుగా సక్సెస్ సాధించడానికి బాటలు పడ్డవి .

తస్మై శ్రీ గురవే నమః

29, ఆగస్టు 2020, శనివారం

నేడు తెలుగుభాషాదినోత్సవం


 తిక్కనకున్ వేమనకున్
మ్రొక్కెద గురజాడ గిడుగు మొనగాళ్ళకు, నా
చక్కని తెనుగుకు మీగడ
చిక్కని రుచులద్ది సేవ జేసినవార్కిన్ .

జనబాహుళ్యపు నుడులకు
ఘన హిత మొహరించి నట్టి ఘనుడా ! గిడుగూ!
అనయము మిము స్మరియింతుము
ఘనముగ  , నీసంప్రదాయఘనులు వడంకన్ .

28, ఆగస్టు 2020, శుక్రవారం

తిప్పతీగ

 

Add caption

కణుపు కొక్క ఆకు కనువిందు సేయును

లేత పచ్చదనము లిగురులొత్తు

కంచెలందు పెరుగు ఘనభిషగ్వర్యులు

అమృతవల్లియండ్రు అది యిదియట .


రోగనిరోధకశక్తిని

బాగుగ సమకూర్చునంట పరగడుపుననే

తీగలరససేవనమున

వేగముగా శక్తివచ్చు వివరము దెలిసెన్ .


నెట్టు దెఱచిచూడ నిండుగా గలదందు

దీనిగూర్చి చదివి తెలుసుకొనుడు ,

తెలుగువారు దీన్ని తిప్పతీగ యనిరి

తెలిసిన విబుధులు తెలుపనగును .

21, ఆగస్టు 2020, శుక్రవారం

వినాయక చవితి శుభాకాంక్షలు

 

కొలిచిన వారికి కొండంత వేలుపై

సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి

పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి

కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి

ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి

ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి

కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై

మనసార దీవించు మహిత మూర్తి


మూడు గుంజీలు దీసినా మోదమంది

నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు

భక్త సులభుండు  సకల సంపద ప్రదాత

శ్రీ గణేశుడు  మన  కిచ్చు  సిధ్ధి , బుధ్ధి .



16, ఆగస్టు 2020, ఆదివారం

నీయెదపై తలనానిచి .....


 మాయెదలో కొలువుంటివి

రేయింబవళులు శుభాంగ ! కృష్ణా ! యిటులే ...

నీయెదపై తలనానిచి

హాయిగ నిదురోవుభాగ్య మడిగితి తండ్రీ !


15, ఆగస్టు 2020, శనివారం

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

 


పద్మాక్షి పద్మిని పద్మాసనాసీన

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఐశ్వర్యదాయిని అమృతప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఙ్ఞానప్రదాయిని కరుణాంతరంగిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ

ఆరోగ్యదాయిని అభయప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ


ఎల్లవేళల మమ్ముల నుల్లమలర

కడుపులో దాచి కాపాడు కనకదుర్గ  

ఏలు పోలేరు పరమేశ్వరీ లలితకు         

పరమ బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ.

13, ఆగస్టు 2020, గురువారం

తిరగేసి చూచినా .....

 

తిరగేసి చూచినా చి
త్తరువున మార్పేమి లేదు తస్సాదయ్యా !
చిరుబురులాడే కైకయు ,
వర ధుఃఖిత దశరథుల ' వపా ' చిత్రమిదీ .

12, ఆగస్టు 2020, బుధవారం

ముందు చూపు .....

 

వారం క్రితం మా అమ్మగుడిలో నాటిన ఈవేపమొక్క దట్టంగా చిగురించింది

ఈ యనంతసృష్టి నెక్కడా కనరాదు
మొక్క , జీవమేది? పుడమి దక్క,
ఎంతదయ హరికి తనంత మనకొసగె
నంతటి యపురూప మైన కాన్క .

మొక్క లేని నాడు పుడమియు వ్యర్ధమే
మట్టి రాళ్ళతో సమాన మగుచు
కోట్ల కొలది విశ్వగోళాల విధమౌను
జీవ మంతరించి చేవ తొలుగు .

మొక్క నాటు మొకటి ముందుచూపు గలిగి
భూమి తరతరాలు క్షేమ మగును
పచ్చని తరు లమృత మిచ్చి పుడమి శాశ్వ
తముగ జీవములను దాల్చు కొఱకు .

11, ఆగస్టు 2020, మంగళవారం

మాధవుడే మాయగాడు

 


వెన్నకుండ ముందుబెట్టి , యశోదమ్మ

మన్ను తిన్నవ ? యని వెన్నునడిగె ,

ఏమి చెప్పు నీత డిందువదనకని

మాధవుండు వినగ మాటువేసె .


నోరు దెఱిచి చూప నీరేడు లోకాలు

గని యశోద పడియె కళ్ళుదిరిగి

మాధవు డిత డింత మాయగాడా యని ...

తనను తాను దెలిసి తప్పుకొనెను .

మన్నించు మాధవా ! .....

 


పన్నుగ మదిలో నున్నను

కన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !

మన్నించు మాధవా ! నిను

నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !

తులసీదళ మంగళ గళ !

 


తులసీదళ మంగళ గళ !

విలసిత హేమాంబరధర ! విష్ణువిలాసా !

అలరుల పరిమళ మలదిన

కలవపుషా ! కృష్ణ ! మమ్ము గావర తండ్రీ !

అడుగో ! పరమాత్మ .....

 


అడుగులు తడబడ బుడుతం

డడుగో, పరమాత్మ యతడె , అడుగిడెడి, మహా

త్ముడు కృష్ణుండు, యశోదసు

తుడు , జగతి కేడుగడగ , దొరికెను దొరయై .

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

 

ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని

రచియించు నప్పుడు రమణ మీర

అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని

కాచి రక్షించు ప్రకరణ మందు

సంకర్షణు డితడు సకల సృష్టి హరించు

పట్టున ప్రళయ తాపములయందు

వాసుదేవు డితడు వర పరమాత్మయై

సర్వము తానయి పర్వునపుడు


విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు

వేద వేద్యు లరసి వేడు నపుడు

చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను

ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .

9, ఆగస్టు 2020, ఆదివారం

అవును , ఆరోజొస్తే ..... ఎంతబావుణ్ణు !

 ఆ రోజొస్తే ..... ఎంత బాగుణ్ణు !


సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,


ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే ,


ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,


విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,


పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,


లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే ,


మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే ,


పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే ,


మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,


స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,


ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే ,


రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే ,


అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే


రచయితలూ, కవులూ, కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,


మెరుగైన జీవనం కోసం


మేలైన సమాజం ఏర్పడితే ...... ,


ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు 

                                                  -  వెంకట రాజారావు. లక్కాకుల

రాధికాకృష్ణ !

 మీ జంట ప్రేమైక తేజోవిరాజిత

రాశియై వెలుగొందు రాగ విజిత

మీ జంట ఆనంద మిళితారవిందాల

అందాల సరసికి ఆనుపాను

మీ జంట మదన తేజీ మనోలాలస

రమణీయతలకు శ్రీరంగ సీమ

మీ జంట జగతికి మిథున రథము మీద

మోక్షమున్ దరలించు పుణ్యపేటి 


ఇద్దరొక్కరె , పరమాత్మ శుధ్ధ మోహ

న శుభగ మనోఙ్ఞ రూపము , నయన యుగళి

భాగ్యమిది రాధికాకృష్ణ ! పరవశముగ

కాంతు మానంద దృక్కుల కమలనయన !

5, ఆగస్టు 2020, బుధవారం

తన్నిన నీవూ డుబుంగు .....




ఉన్నది బేలెన్సుపయిన ,
తన్నిన నీవూ డుబుంగు , తగువువడక, నీ
మన్నన మర్యాద దెలిపి ,
పన్నుగ నిరువురును బయటపడగా వలెరా !

చెయ్యకూడని పనులు .....


3, ఆగస్టు 2020, సోమవారం

అయోధ్యలో భూమిపూజ ఆగష్ట్ 5న.....


Add caption

ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
పావనమయ్యె సౌభాగ్యయగుచు
ఏ మహాత్మునిపాద మీమహీతలమున
తాకగా పుణ్యాల తతులు విరిసె
ఏ మహాత్ముని నామ మిరవొంద రామా య
నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె
ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
మై యిచ్చటి జనులు హాయి వడిరి

అట్టి లోకైక ప్రభు డయోధ్యాధిపతికి
రామజన్మభూమి యయోధ్యలో మహిత
రామమందిరనిర్మాణ భూమిపూజ
జరుగు శుభముహూర్తంబు లాసన్న మయ్యె .

2, ఆగస్టు 2020, ఆదివారం

సుదాముడూ , కృష్ణుడూ .....


రా రా సుదామ! రారా ,
రా రా చిననాటి వూసు లాడగ రారా ,
రారా సుగుణాల సరసి !
రారా కౌగిలికి చేర రా రా హితుడా !

మొక్క నాటు మొక్కటి హితుడా !



సేయగా నెన్నియోగలవు , ఆశించు నర్థు
లెందరోగలరు , మనీషు లెందరో వి
శేషఘనకార్యములు కడు సేయు చుండి
రి, బుధ! మొక్కనాటు , మిది తేలిక, పనిగద !

మొక్కనాటుమొకటి, నేల మోదమందు,
నీవు చచ్చినా, బ్రతికియుంటావు వంద
లేళ్ళు దానిలో , మందికి పళ్ళు నీడ
లిడెద , వింతకంటెను ఘనతేది? హితుడ !

గట్టి మేలొక్కటీ చేయగా గదలరు
గొప్పలను చాటుకుందురు గోడలెక్కి
ఒట్టిమాటల ఘనకార్య ముట్టి కెక్క ,
దదిగొ! మృత్యువు తరుముచుగదియుచుండె .