15, ఆగస్టు 2020, శనివారం

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

 


పద్మాక్షి పద్మిని పద్మాసనాసీన

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఐశ్వర్యదాయిని అమృతప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ

ఙ్ఞానప్రదాయిని కరుణాంతరంగిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ

ఆరోగ్యదాయిని అభయప్రదాయిని

బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ


ఎల్లవేళల మమ్ముల నుల్లమలర

కడుపులో దాచి కాపాడు కనకదుర్గ  

ఏలు పోలేరు పరమేశ్వరీ లలితకు         

పరమ బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ.

13, ఆగస్టు 2020, గురువారం

తిరగేసి చూచినా .....

 

తిరగేసి చూచినా చి
త్తరువున మార్పేమి లేదు తస్సాదయ్యా !
చిరుబురులాడే కైకయు ,
వర ధుఃఖిత దశరథుల ' వపా ' చిత్రమిదీ .

12, ఆగస్టు 2020, బుధవారం

ముందు చూపు .....

 

వారం క్రితం మా అమ్మగుడిలో నాటిన ఈవేపమొక్క దట్టంగా చిగురించింది

ఈ యనంతసృష్టి నెక్కడా కనరాదు
మొక్క , జీవమేది? పుడమి దక్క,
ఎంతదయ హరికి తనంత మనకొసగె
నంతటి యపురూప మైన కాన్క .

మొక్క లేని నాడు పుడమియు వ్యర్ధమే
మట్టి రాళ్ళతో సమాన మగుచు
కోట్ల కొలది విశ్వగోళాల విధమౌను
జీవ మంతరించి చేవ తొలుగు .

మొక్క నాటు మొకటి ముందుచూపు గలిగి
భూమి తరతరాలు క్షేమ మగును
పచ్చని తరు లమృత మిచ్చి పుడమి శాశ్వ
తముగ జీవములను దాల్చు కొఱకు .

11, ఆగస్టు 2020, మంగళవారం

మాధవుడే మాయగాడు

 


వెన్నకుండ ముందుబెట్టి , యశోదమ్మ

మన్ను తిన్నవ ? యని వెన్నునడిగె ,

ఏమి చెప్పు నీత డిందువదనకని

మాధవుండు వినగ మాటువేసె .


నోరు దెఱిచి చూప నీరేడు లోకాలు

గని యశోద పడియె కళ్ళుదిరిగి

మాధవు డిత డింత మాయగాడా యని ...

తనను తాను దెలిసి తప్పుకొనెను .

మన్నించు మాధవా ! .....

 


పన్నుగ మదిలో నున్నను

కన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !

మన్నించు మాధవా ! నిను

నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !

తులసీదళ మంగళ గళ !

 


తులసీదళ మంగళ గళ !

విలసిత హేమాంబరధర ! విష్ణువిలాసా !

అలరుల పరిమళ మలదిన

కలవపుషా ! కృష్ణ ! మమ్ము గావర తండ్రీ !

అడుగో ! పరమాత్మ .....

 


అడుగులు తడబడ బుడుతం

డడుగో, పరమాత్మ యతడె , అడుగిడెడి, మహా

త్ముడు కృష్ణుండు, యశోదసు

తుడు , జగతి కేడుగడగ , దొరికెను దొరయై .

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

 

ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని

రచియించు నప్పుడు రమణ మీర

అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని

కాచి రక్షించు ప్రకరణ మందు

సంకర్షణు డితడు సకల సృష్టి హరించు

పట్టున ప్రళయ తాపములయందు

వాసుదేవు డితడు వర పరమాత్మయై

సర్వము తానయి పర్వునపుడు


విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు

వేద వేద్యు లరసి వేడు నపుడు

చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను

ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .

9, ఆగస్టు 2020, ఆదివారం

అవును , ఆరోజొస్తే ..... ఎంతబావుణ్ణు !

 ఆ రోజొస్తే ..... ఎంత బాగుణ్ణు !


సమాజంలోని ప్రతి వ్యక్తీ విధిగా నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి ఏర్పడి , నడుచుకో గలిగితే ,


ఆర్థిక-సామాజికాంశాలో  సమ సమాజం ఏర్పడితే ,


ఆహారం-నీరు-ఇంధనం వినియోగంలో ప్రతి వ్యక్తీ వృథాను నివారించి క్రమశిక్షణ పాటించ గలిగితే ,


విద్యనూ-వైద్యాన్నీ అమ్ముకొనే సంస్థలు మూతపడే రోజొస్తే ,


పిల్లల్ని సక్రమంగా పెంచని తల్లి-దండ్రులను శిక్షించే రోజొస్తే ,


లంచం అడిగితే ఉద్యోగం ఊడుతుందని భయపడే రోజొస్తే ,


మార్కెట్ మాయాజాలాన్నిరూపుమాపే వ్యవస్థ రూపొందితే ,


పూర్తవ్వగానే ఉపాథి లభించే విద్యా విథానం వస్తే ,


మానసిక-శారీరక దుర్బలులను , వృధ్ధులనూ గౌరవించి ఆదరించే సంస్కృతి అలవడితే ,


స్త్రీలనూ , పిల్లలనూ హింసించే రాక్షసత్వం లేని పరిణత సమాజం ఏర్పడితే ,


ప్రజా సేవ పేరుతో ప్రజాధనం దోచుకోవడం వీలు పడని ప్రజాతంత్రం ఏర్పడితే ,


రాజనీతికీ-అవినీతికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతే ,


అనేక సామాజిక రుగ్మతలను అదుపు చేయాలంటే సంపూర్ణ మద్యనిషేథ మొక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించే రోజొస్తే


రచయితలూ, కవులూ, కళాకారులూ – సమాజం సజావుగా నడవడానికి అవసరమైన చైతన్యస్ఫూర్తినందించ గలిగితే ,


మెరుగైన జీవనం కోసం


మేలైన సమాజం ఏర్పడితే ...... ,


ఆ రోజొస్తే ....... ఎంత బాగుణ్ణు 

                                                  -  వెంకట రాజారావు. లక్కాకుల

రాధికాకృష్ణ !

 మీ జంట ప్రేమైక తేజోవిరాజిత

రాశియై వెలుగొందు రాగ విజిత

మీ జంట ఆనంద మిళితారవిందాల

అందాల సరసికి ఆనుపాను

మీ జంట మదన తేజీ మనోలాలస

రమణీయతలకు శ్రీరంగ సీమ

మీ జంట జగతికి మిథున రథము మీద

మోక్షమున్ దరలించు పుణ్యపేటి 


ఇద్దరొక్కరె , పరమాత్మ శుధ్ధ మోహ

న శుభగ మనోఙ్ఞ రూపము , నయన యుగళి

భాగ్యమిది రాధికాకృష్ణ ! పరవశముగ

కాంతు మానంద దృక్కుల కమలనయన !

5, ఆగస్టు 2020, బుధవారం

తన్నిన నీవూ డుబుంగు .....




ఉన్నది బేలెన్సుపయిన ,
తన్నిన నీవూ డుబుంగు , తగువువడక, నీ
మన్నన మర్యాద దెలిపి ,
పన్నుగ నిరువురును బయటపడగా వలెరా !

చెయ్యకూడని పనులు .....


3, ఆగస్టు 2020, సోమవారం

అయోధ్యలో భూమిపూజ ఆగష్ట్ 5న.....


Add caption

ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
పావనమయ్యె సౌభాగ్యయగుచు
ఏ మహాత్మునిపాద మీమహీతలమున
తాకగా పుణ్యాల తతులు విరిసె
ఏ మహాత్ముని నామ మిరవొంద రామా య
నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె
ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
మై యిచ్చటి జనులు హాయి వడిరి

అట్టి లోకైక ప్రభు డయోధ్యాధిపతికి
రామజన్మభూమి యయోధ్యలో మహిత
రామమందిరనిర్మాణ భూమిపూజ
జరుగు శుభముహూర్తంబు లాసన్న మయ్యె .

2, ఆగస్టు 2020, ఆదివారం

సుదాముడూ , కృష్ణుడూ .....


రా రా సుదామ! రారా ,
రా రా చిననాటి వూసు లాడగ రారా ,
రారా సుగుణాల సరసి !
రారా కౌగిలికి చేర రా రా హితుడా !

మొక్క నాటు మొక్కటి హితుడా !



సేయగా నెన్నియోగలవు , ఆశించు నర్థు
లెందరోగలరు , మనీషు లెందరో వి
శేషఘనకార్యములు కడు సేయు చుండి
రి, బుధ! మొక్కనాటు , మిది తేలిక, పనిగద !

మొక్కనాటుమొకటి, నేల మోదమందు,
నీవు చచ్చినా, బ్రతికియుంటావు వంద
లేళ్ళు దానిలో , మందికి పళ్ళు నీడ
లిడెద , వింతకంటెను ఘనతేది? హితుడ !

గట్టి మేలొక్కటీ చేయగా గదలరు
గొప్పలను చాటుకుందురు గోడలెక్కి
ఒట్టిమాటల ఘనకార్య ముట్టి కెక్క ,
దదిగొ! మృత్యువు తరుముచుగదియుచుండె .

1, ఆగస్టు 2020, శనివారం

ఎంతసొగసుగాడివి .....




ఎంత సొగసుగాడివి ! తను
వంతయు భూషణచయమ్మె యలరెడు కృష్ణా !
సుంతయు చూపులు మరలవు
సాంతము నిను జూచుచుండు జగదీశ ! హరీ !

31, జులై 2020, శుక్రవారం

ఇదిగదా ! స్నేహమన్న .....




ఇదిగదా ! స్నేహ మన్న , సారించి చూడ
నొకరు పరమాత్మ , నిరుపేద యొకడు చూడ ,
సరస కూర్చుని యొండొరుల్ చదురులాడు
చు , ఫలములు మెక్కుచున్నారు , చూడ తరమ ?

30, జులై 2020, గురువారం

ఆదిపురుష ! నాకమందు లేవ.....




అమ్మపాలు ద్రావి , ఆలపాలును ద్రావి
నెమ్మది తనిసేవు నీరజాక్ష !
వెన్నమీగడలన సన్నుతింతువు కృష్ణ !
ఆదిపురుష ! నాక మందు లేవ ?

కృష్ణా ! ఇవిగో ! నవపారిజాతాలు .....



ప్రతిదిన శుభప్రభా విక
సిత సిత నవపారిజాత శ్రీవిరులు హరీ !
బ్రతిమాలె నీదు పదముల
జతచేరగ నివిగొ కృష్ణ ! శరణము తండ్రీ !

29, జులై 2020, బుధవారం

కొమ్మ కొమ్మకూ బొమ్ముంది ....


కొమ్మ కొమ్మకూ బొమ్ముంది , నిమ్మళముగ
చూడ నందరూ ఘన మనీషులె గణింప
ఎందరున్నారొ గమనింపు డెవ్వరెవరొ
అందరిని దెల్పు వారికి అందలములు .


చిత్రకారునికి కృతఙ్ఞతలు

27, జులై 2020, సోమవారం

లయకారకా ! హరా !


జలనిధులు గగనతలములు
వెలుగులు వాయువులు పుడమి వివిధాయువులన్
కలగాపులగము జేసి స
కలసృష్టి హరించి విలయకాలయముడవై ,

అంతా ఐపోవగ , యే
కాంత నిశీధీ దిశాంత కాంతి మయూఖా
ధ్వాంత సుఖాసీనుడవయి
శాంత శుభాకారతపము శాయగ హితమా ?

తులసీ రాముడు .....


పరమభక్తుడుతులసిదాస్ పరవశించి
ఎదుట పాడంగసీతాసమేతుడగుచు
లక్ష్మణస్వామి మారుతు లాలకింప
రాముడే వచ్చి విన బట్టె రామచరిత

26, జులై 2020, ఆదివారం

వైద్యనారాయణులకు పాదాభివందనాలు


ఈ యిద్దరూ , కరోనా
గాయింబడి , ప్రక్క ప్రక్క గాసిలు , నందొ
క్కాయన డాక్టరు , కని , ప్ర
ప్రక్కాయన బా , ధపుడును , వైద్యము సేసెన్ 🙏.

(కార్టూనిష్ట్ కు ధన్యవాదములు ,కృతఙ్ఞతలతో)

24, జులై 2020, శుక్రవారం

పాశ్చాత్యంలో భగవద్గీత


ఈ చిన్నారుల చేతిలో వెలుగు సాహిత్యమ్ము పేరేమిటో ?
ఈ చిన్నారుల దేశమేదొ ? మరి యాచిన్నారు లెంచేత ఈ
రోచుల్ గుల్కెడు గ్రంధరాజమును దాల్తుర్ మహానిష్టగా ?
రేచున్ చిత్తమునన్ గుతూహలము ఆవృత్తాంతమున్ జెప్పెదన్ .

అది భగవద్గీత , నిసుగు
లదియు నెదర్లాండ్ , ప్రభుత్వ మచ్చట విధిగా
జదివింతురు , పాఠ్యాంశం
బిది , పాశ్చాత్యుల ప్రదేశ , మెంతో మనసై .

ఇదేందయ్యా ! కిట్టయ్యా !


ఏందిర ? ఓసోసి ! మొగము
పందిరిపై జుట్టుచెదిరె, పరవశమా?ఆ
ముందరి పలుసందులపై
చిందు నగవు ముత్యములను చేకొందు హరీ !